సమ్మె పరిష్కారానికి టీ-సర్కారు యత్నాలు
గడిచిన ఆరు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రాంతంలో విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్తో మంత్రుల బృందం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మీదనే చర్చలు ఉంటాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర హామీలు ఇచ్చి సమ్మెను విరమింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున హామీల అమలుకు కొంతకాలం వేచి చూడాలని తెలంగాణ సర్కారు కార్మిక సంఘాలను కోరనుంది. ఎలాగైనా ఈ ప్రాంతంలో సమ్మెను విరమింపజేయాలనే తెలంగాణ సర్కారు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14వ తేదీన తెలంగాణలో ఎంసెట్ ఉన్నందున అప్పటిలోపే ఆర్టీసీ సమ్మె విరమణ కుదరితే అంతా సజావుగా సాగుతుందనే యోచనలో మంత్రులు కూడా ఉన్నారు.