సాక్షి, వికారాబాద్/కొడంగల్: టీడీపీ తెలంగాణ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలతో జిల్లాలో కలకలం రేగింది. దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. ఆ పార్టీలో జరుగుతున్న విపరీత పోక డల వల్ల కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ఆయన మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు ఓ వార్త ప్రచార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీడీపీకి చెందిన కీలక నేతలంతా ఒక్కొక్కరుగా టీడీపీని వీడినా.. రేవంత్ ఒక్కడే ఆ పార్టీకి వెన్నెముకగా మారారు. ఇప్పుడు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న రేవంత్ కూడా టీడీపీని వీడడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.
టీడీపీ.. టీఆర్‌ఎస్‌తో జతకట్టడమే కారణమా?
ఇటీవల వరకు టీడీపీ తరఫున అధికార పార్టీపై తీవ్రస్థాయిలో తనదైన శైలిలో దుమ్మెత్తి పోస్తూ వచ్చిన రేవంత్.. ఒక్కసారిగా కాంగ్రెస్ గూటికి వెళతారనే సంకేతాలు ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. అయితే టీడీపీ తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు రావటం.. టీడీపీ అధినాయకత్వం కూడా ఆ కోణంలో సంకేతాలు ఇవ్వడంతోనే రేవంత్ టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డి.. తమ అధినాయకత్వమే కేసీఆర్‌తో జతకట్టాలనుకోవటం జీర్ణించుకోలేక పోయారని సమాచారం. అందుకే ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కురువృద్ధుడు.. మాజీ కేంద్ర మంత్రి అయిన జైపాల్‌రెడ్డి సైతం దగ్గరి బంధువు కావడంతో అతడి ద్వారా సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ గూటికి వెళుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో భవిష్యత్ శూన్యమని భావించడం కూడా ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకోవటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
పార్టీయే ఊపిరిగా..
రాష్ట్రంలో 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో సొంత బలంతో విపత్కర పరిస్థితుల నడుమ టీడీపీ అభ్యర్థిగా విజయం సాదించారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కలత చెందిన రేవంత్.. పార్టీ వీడటానికి ఓ కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, టీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందని మీడియాలో ప్రచారం వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించకపోవడం కూడా రేవంత్‌రెడ్డి కలత చెందినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరించే సత్తా ఉన్న నాయకుడిగా పేరొందిన ఆయనకు పొత్తు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మారనున్న రాజకీయ సమీకరణలు..
టీడీపీ కీలక నేత రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరనుండటంతో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అంపశయ్యపై ఉన్న టీడీపీ పూర్తిగా బలహీనపడనుంది. జిల్లాలో కాంగ్రెస్‌కు బలం పెరిగే అవాశం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు సీనియర్‌లతో ఎలా పొసుగుతారనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అయితే ఆయన సొంత జిల్లా మహబూనగర్ అయినప్పటికీ ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొనసాగుతున్నారు. అయితే కొగంగ్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ లేకపోవడంతో ఆయనకు జిల్లాలో మరో స్థానం వెతుక్కోవాల్సిన పనిలేదు.
Comments
Please login to add a commentAdd a comment