సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మే నెలకు వాణిజ్య పన్నుల కింద వసూలైన దాదాపు రూ. 4,600 కోట్లలో. తెలంగాణ రాష్ట్రానికి 42శాతం వాటా రావలసి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివరించారు. మే నెలాఖరువరకు వసూలైన వాణిజ్య పన్నుల ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతాలోకి జమ అయినందున, ఆ నిధుల్లో వాటా తెలంగాణ ఖజానాకు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులు ఈ నెల 24లోగా, తెలంగాణ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, వాణిజ్య పన్నుల ఆదాయం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను కోరినట్లు సమాచారం.
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అదనపు పన్నులు మోపకుండా.. లొసుగులను తొలగించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. చెక్‌పోస్టులవద్ద నిఘాను కట్టుదిట్టంచేయడం ద్వారా ఆదాయం పెంచడంపై దృష్టిని కేంద్రీకరించాలని సీఎం సూచించారు. కేంద్ర అమ్మకం పన్నులకు సంబంధించి లాభకరమైన విధానం అమలుకు తగిన ప్రణాళికను రూపొందించాలని ఆయన వాణిజ్య పన్నుల కమిషనర్‌కు సూచించారు.