హైదరాబాద్: ఆరోగ్య శాఖలో అక్రమార్కులపై వేటు పడింది. డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సాంబశివరావుతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపైనా వేటు పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గత జనవరిలో ఆ శాఖా మంత్రినే తప్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆదే శాఖలో ముగ్గురిపై సస్పెన్షన్ విధించడంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సుమారు 1,500 మంది పారామెడికల్ సిబ్బంది, 1,000 మంది వైద్యుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం గత నవంబర్‌లో నిర్ణయించింది.
వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో నియమించాల్సి ఉండగా అధికారులు ఔట్ సోర్సింగ్‌లో భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. వైద్యుల నియామకానికి సుమారు రూ.5 లక్షలు, పారామెడికల్ సిబ్బందికి రూ.2 లక్షలకు బేరం పెట్టినట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించింది. దీంతో వీరి వ్యవహారం బయటపడింది. వెంటనే అందుకు బాధ్యులుగా ఉన్న చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌లను బాధ్యతల నుంచి తప్పించింది. దీనిపై కమిషనర్ బుద్ధప్రకాశ్ విచారణ నిర్వహించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో మరో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆరోగ్య శాఖలో అక్రమార్కులపై వేటు
Published Fri, Mar 6 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement