సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికలు ముగియడంతో రాజకీయ నాయకులకు హడావుడి తగ్గి గుబులు మొదలైంది. ఫలితాల లెక్కింపునకు సమయం సమీపిస్తుండడంతో ఘడియ ఘడియకూ వారిలో ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా పురపాలక సంఘాలు, స్థానిక సంస్థలు ఆ తర్వాత సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా సోమవారం పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు, మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపోటములు ఎలా ఉంటాయనే అంశం అభ్యర్థుల్లో, పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది.
ధీమా ఉన్నా తగ్గని దడ..
సుదీర్ఘ విరామం తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడంతో రాజకీయ పార్టీలు సైతం ప్రత్యేక దృష్టి సారించి కుర్చీ దక్కించుకునేందుకు వ్యూహరచనలు చేశాయి. ఇంతలో సార్వత్రిక పోరు తరుముకురావడంతో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ స్థానిక ఎన్నికలనూ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తీరును పరిశీలించి ఇప్పటికే అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు.
పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని వివిధ పార్టీల అభ్యర్థులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చే స్తూ గాంభీర్యాన్ని చాటుతున్నారు. ఇంత ధీమాతో ఉన్న అభ్యర్థులకు కౌంటింగ్ సమయం ముంచుకొస్తుండడంతో వణుకు పుడుతోంది. తమ అంచనాలు నిజమవుతాయా.. లేక ప్రత్యర్థికి అవకాశాలు మెండుగా ఉన్నాయా అనే సందిగ్ధంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
బలం తగ్గితే..
స్థానిక సంస్థలకు చైర్మన్ ఎన్నికలు నేరుగా కాకుండా గెలుపొందిన సభ్యులే ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకీ ఎక్కువ మెజార్టీ వస్తుందో వారికే చైర్మన్‌గిరీ దక్కే అవకాశం ఉంది. అయితే మేజిక్ సంఖ్య రాకుంటే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో అవగాహణ కుదిరితే చైర్మన్ సీటు చేజిక్కుతుంది. కానీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల పోరులో నిలవడంతో బహిరంగ పొత్తులు ఎక్కడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన అనంతరం రంగంలోకి దిగేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. సంఖ్యాబలం తగ్గితే నేరుగా క్యాంపులు నడిపి చైర్మన్ సీటు కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
పైన గాంభీర్యం.. లోన భయం!
Published Sat, May 10 2014 11:34 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement