మనుషుల అక్రమ రవాణా
* ఇరాక్, మలేషియాలో తెలుగు వారికి వెతలు
* నీచమైన పనులు చేయిస్తున్నారు..
* ఏజెంట్ల వలలో చిక్కి మోసపోతున్నారు
మోర్తాడ్ : ఉన్న ఊరిలో ఉపాధి లేక, కన్నవారికి, కట్టుకున్న వారికి తోడు ఉండకుండా దేశం కాని దేశంలో పని కోసం వెళుతున్న తెలుగువారికి కష్టాలు సర్వసాధారణంగా మారాయి. అడుగడుగునా ఏజెంట్ల మోసాలు దీనికి తోడు కంపెనీల యజమానుల నయ వంచనతో గల్ఫ్ బాట పట్టిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
తాజాగా గల్ఫ్ దేశాల నుం చి వచ్చినవారు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరాక్, మలేషియాలలో మన తెలుగువారి అక్రమరవాణా జోరుగా సాగుతోంది. ఏజెంట్ల వలలో చిక్కి బిక్కుబిక్కు మంటున్న తెలుగువారు ఇళ్లకు చేరుకోవడానికి కనిపించిన ప్రతివారిని కాళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. ఇరాక్, మలేషియాలో మనుషుల అక్రమ రవాణా పెద్ద మాఫియాగా తయారైంది.
మనుషుల అక్రమ రవాణాలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అనే క మంది పావులుగా మారారు. ఈ మాఫియాలో ఏజెంట్లు కీలకపాత్రదారులు కాగా దీనికి గల్ఫ్‌లోని షేక్‌లు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోం ది. దీనిపై అవగాహన లేక మన తెలుగువారు ఎదు రు డబ్బులు ఇచ్చి కష్టాలను కొని తెచ్చుకొంటున్నా రు. ఇరాక్, మలేషియాలో తెలుగువారిని కొంటున్న యజమానులు కార్మికులతో నీచమైన పనులు చేయిస్తున్నారు.
దుబాయ్, మస్కట్, కువైట్, సౌది అరేబియా తదితర దేశాల్లో పనులు సరిగా లేక పోవడం తో అనేక మంది ఇరాక్, మలేషియాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇరాక్, మలేషియాలో జోరుగా సాగుతున్న మనుషుల అక్రమ రవాణాలో సమిధలుగా మారిన తెలుగువారు దాదాపు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఇరాక్, మలేషియాలో మనుషుల అక్రమ రవాణా సాగుతోందని గల్ఫ్ ఏజెంట్లకు తెలిసినా వారు మాయమాటలతో కార్మికులను నట్టేట ముంచుతున్నారు.
ఇరాక్, మలేషియాలకు పని కోసం వెళ్లిన కార్మికులు సుమారు పది మంది చేతులు మారుతున్నారు. గల్ఫ్ ఏజెంట్లు చెప్పిన పనులకు విరుద్ధంగా అక్కడ నీచమైన పనులే కార్మికులు చేయాల్సివస్తోంది. ఇరాక్, మలేషియాలో కంపెనీ యజమానులు కార్మికులతో తమ కు అవసరం అయిన అన్ని పనులు చేయించుకుం టున్నారు. వీసా పొందిన మొదట్లో కార్మికుడు కోరిన పని ఉన్నట్లు ఏజెంట్లు కాగితాలను సృష్టిస్తున్నారు. చివరకు ఎలాంటి పనైనా కార్మికులతో చేయిస్తున్నారు.
వీసా కోసం మన వారు గల్ఫ్ ఏజెంటుకు రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అయితే తమకు అవసరం అయిన మనుషు ల కోసం ఇరాక్, మలేషియాలోని షేక్‌లు భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. షేక్‌లు పెట్టిన పెట్టుబడులను అందరు వాటాలుగా పంచుకుంటున్నా రు. ఒక్కో తెలుగు కార్మికుడు ఇరాక్‌లోనైతే నలుగురి చేతులు మారుతున్నాడు.
మలేషియాలో అయితే మాత్రం ఎనిమిది మంది చేతులు మారాల్సివస్తుంది. మనుషుల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న గల్ఫ్ ఏజెంట్లు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తునే షేక్‌లు ఇచ్చే ముడుపులను స్వీకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్ ఏజెంట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఇరాక్, మలేషియాకు సాగుతున్న మనుషుల అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పెట్టాలని పలువురు విన్నవిస్తున్నారు.