రెండు లారీలు ఢీకొనడంతో ముగ్గురి దుర్మరణం
మరో లారీని ఢీకొన్న బైకు: ఇద్దరు యువకుల మృతి
ఐదుగురి మృతితో జిల్లా ఆస్పత్రిలో బంధువుల రోదనలు
తాండూరు/తాండూరు రూరల్ : రోడ్డు ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చే రుకుంది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ప్రమాద ఘటనతో వాహనాలు స్తంభించడంతో ఆగిఉన్న మరో లారీని బైకు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి బెంగళూరు లింకు రహదారిలో తాండూరు-చించోళి మార్గంలో ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న విషయం తెలిసిందే.
ప్రమాదం జరిగిందిలా..
తాండూరు మండల పరిధిలోని మిట్టబాస్పల్లికి చెందిన నాపరాతి కూలీలు ముజామీన్(20), బసప్ప, రామప్ప, జర్నప్ప నిత్యం తాండూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాలిషింగ్ యూనిట్లలో నాపరాతి బండలు అన్‌లోడింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు పనిచేసిన కూలీలు స్వగ్రామానికి చెందిన ఈడిగి శ్రీను లారీలో రాత్రి 10 గంటలకు గ్రామానికి బయలుదేరారు. మండలంలోని అల్లాపూర్ బ్రిడ్జి సమీపంలో ఆడ్కిచర్ల నుంచి ఎర్రమట్టి లోడ్‌తో కర్ణాటకకు చెందిన లారీ తాండూరు వైపు ఎదురుగా వచ్చింది.
ఈ లారీలు బ్రిడ్జి సమీపంలో ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తాపడింది. వాహనం టైర్లు ఊడిపోయాయి. రెండు లారీల ముందుభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కూలీలు ప్రయాణిస్తున్న లారీలో ఉన్న ముజామీన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎర్రమట్టి లారీ డ్రైవర్ కర్ణాటకకు చెందిన సుభాష్‌పాటిల్(32) చనిపోయాడు. ప్రమాదంలోరామప్ప, జర్నప్ప, బసప్పతో పాటు లారీ డ్రైవర్ ఈడిగి శ్రీను తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామానికి వెళ్తూ.. మృత్యుఒడికి..
మిట్టబాస్పల్లికి చెందిన కిష్టప్ప(35) తాండూరులో ఎల్రక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. బషీరాబాద్ మండలం కంసాన్‌పల్లికి చెందిన ఇతడు చిన్నప్పటి నుంచి మేనమామ ఊరు మిట్టబాస్పల్లిలో ఉంటూ ఆయన కూతురు యశోదను వివాహం చేసుకున్నాడు. దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో మిట్టబాస్పల్లికి వెళ్తున్న ఈడిగి శ్రీను లారీలో ఎక్కాడు. అనంతరం ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కిష్టప్ప మృతిచెందాడు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
చేతికొచ్చిన కొడుకు.. మృత్యు ఒడిలోకి...
చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో ముజామీన్ తల్లిదండ్రులు గుండెలుబాదకుంటూ రోదించారు. 7వ తరగతి వరకు చదివిన ముజామీన్ కూలీపనులతో కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆరేళ్ల క్రితం అతడి తండ్రి నిజాముద్దీన్ కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు.
కర్ణాటకవాసులు ఇద్దరు..
మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంతో తాం డూరు-చించొళి మార్గంలో వాహనాలు నిలి చిపోయాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని షాదీపూర్‌కు చెందిన వ్యాపారవేత్త శివరాజ్‌పాటిల్(32) తన మహదేవ్(23)తో కలిసి తెలి సిన వారిని సాగనంపేందుకు పల్సర్ బైకుపై తాండూరు రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపు వంద మీటర్ల దూరంలో బాలాజీ పెట్రోల్ బంక్ వద్ద ఆగిఉన్న ఓ లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో శివరాజ్‌పాటిల్, మహదేవ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా మృతులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదుగురి మృతితో బుధవారం జిల్లా ఆస్పత్రిలో మృతుల బం ధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
మిన్నంటిన విషాదం
Published Wed, Jul 29 2015 11:54 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement