హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి నిరుద్యోగ ప్రతినిధుల సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం వల్ల పాలన సామర్థ్యం దెబ్బతిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, 25 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.