గజ్వేల్ లో హార్టికల్చర్ యూనివర్సిటీ
* అటవీ పరిశోధన సంస్థకూ ఏర్పాట్లు
* ములుగు అటవీ భూముల పరిశీలన
* త్వరలో శంకుస్థాపన : సీఎం కేసీఆర్ వెల్లడి
సాక్షి, గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వెయ్యికోట్లతో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాల, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ములుగు మండలంలోని అటవీ ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన సందర్శించారు. పరిశోధన కేంద్రానికి చెందిన భూములు వివరాలను తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాల్లో 500 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్సిటీ, మరో 450 ఎకరాల్లో అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు.
ముందుభాగంలో 175 ఎకరాల్లో ఆయా సంస్థల పరిపాలనా భవనాలను నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే ఈ పనులకు కేంద్రమంత్రితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా విస్తృతమైన పరిశోధనలు జరిగి...వాటి ఫలితాలతో ఈప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. గజ్వేల్ ప్రస్తుతం గణనీయమైన కూరగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించినందున ఈ సంస్థల ఏర్పాటుతో భారీ ప్రయోజనం కలగనుందన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీకి దీటుగా ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ మారనుందన్నారు. ఉపాధి అవకాశాలు కూడా భారీగా లభిస్తాయని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కూడా దక్షిణ భారత దేశంలోనే రెండో సంస్థగా ఖ్యాతి గడిస్తుందన్నారు.
తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో మెట్టుపాళ్యంలోని సంస్థ ప్రతిఏటా దేశానికి ఎంతోమంది ఐఎఫ్‌ఎస్‌లను అందిస్తుండగా... ఈ సంస్థ కూడా అదేస్థాయి ప్రమాణాలను కలిగివుంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐటీసీ లాంటి సంస్థలు కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనలో నిర్లక్ష్యం వహిస్తున్న సంస్థల భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక నర్గీస్, ఎస్పీ శేముషీ బాజ్‌పాయ్, అటవీశాఖ అధికారి సోనీబాల, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(గాడా) ఓఎస్‌డీ హన్మంతరావు, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.