మిగిలినవి పునాదిరాళ్లే!
- గత పాలకులతో మోసపోయాం
- తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నారు
- పైసలివ్వలే, ప్రాజెక్టులు కట్టలే
- మెదక్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ప్రజల జీవితాలతో ఆంధ్రా ప్రాంత పాలకులు ఇంతకాలం ఆడుకున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణకు పైసలివ్వకుండా.. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకుండా మోసం చేశారన్నారు. నాటి పాలకులు తెలంగాణ ప్రాంతంలో వేసిన పునాదిరాళ్లను సగం గోదావరి, సగం కృష్ణానదిలో పారేసినా అదే ఒక ప్రాజెక్టు అయ్యేదని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేదికపై ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి చెప్పిన మాటలను ఉటంకిస్తూ.. జహీరాబాద్ ప్రాంతంలో గత పాలకులు ఐటీఐ, నారింజవాగు ప్రాజెక్టు, 220 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని సీఎం గుర్తు చేశారు.
ఇదివరకు అంత గొప్ప పాలన సాగిందంటూ చురకలు వేశారు. గతంలో తెలంగాణ నాయకులు ఎంతసేపూ నాటి ఆంధ్రా పాలకుల మోచేతికి బెల్లంపెట్టి నాకారే తప్ప ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒక్క ప్రాజెక్టు ఇవ్వలే.. స్కీంలు ఇవ్వలే.. పైసలు ఇవ్వలేదంటూ గత ప్రభుత్వాల తీరును కేసీఆర్ తూర్పారబట్టారు. ఈ సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే గీతారెడ్డి నిలబడి ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా సీఎం ఆమెను వారించారు. ‘అమ్మా, నేను మీ జహీరాబాద్ గురించి కాదు.. యావత్ తెలంగాణ బతుకు గురించి చెబుతున్నా’ అని కేసీఆర్ పేర్కొనడంతో ఆమె మిన్నకుండిపోయారు. గత పాలకులు ఎన్నికలకు ముందే పథకాలు ప్రకటించి పునాదిరాళ్లు వేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక మాట చెబితే వంద శాతం జరగాల్సిందేనన్నారు. ‘నేను మాట చెబితే తలకాయ తెగిపడినా తప్పేది లేదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
పరిశ్రమలకు నిరంత ర కరెంటు..
తమ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని కేసీఆర్ తెలిపారు. వేసవిలోసైతం పరిశ్రమలకు విద్యుత్ కోతలను విధించలేదన్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలకు నిరంతర కరెంట్ సరఫరా ఉంటుందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా మరిన్ని కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు. జహీరాబాద్‌ను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు విధిగా స్థానికులకు ఉద్యోగా లు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి పాల్గొన్నారు.