మెదక్ నా గుండెల్లో ఉంది..
నేను ఈ మట్టి బిడ్డను... రుణం తీర్చుకుంటా..
- రెండు రోజులు పర్యటించి సమస్యలు పరిష్కరిస్తా
- స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
- అందుకే కరెంటు, నీళ్లు, ప్రోత్సాహకాలిస్తున్నాం
-పరిశ్రమల యాజమాన్యాలకు సీఎం కేసీఆర్ సూచన
సాక్షి, సంగారెడ్డి: ‘నేను ఈ మట్టిలో పుట్టిన... ఈ జిల్లా బిడ్డనే... నా గుండెల్లో మెదక్ జిల్లా ఎప్పుడూ ఉంటుంది.
ఈ ప్రాంత ప్రజలే నన్ను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేశారు. అలాంటి నా సొంత జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా’నని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధిలో ఈ జిల్లా అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ‘తెలంగాణ చాలా గాయపడ్డది..
అనేకమంది ప్రాణాలు అర్పించారు... కష్టపడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రోత్సాహకాలు ఇవ్వటంతోపాటు నీళ్లు, విద్యుత్ అందజేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నందున యాజమాన్యాలు తమ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని సూచించారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో రాజీపడేది లేదన్నారు. జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి విషయంలో పశ్చిమ మెదక్ జిల్లా చాలా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.
తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐదు నెలలపాటు సంగారెడ్డిలోనే ఉండి కష్టపడి అభివృద్ధి పనులు చేయించినట్టు చెప్పారు. నాడు ఈ ప్రాంతంలో కొద్దో గొప్పో వెలుగు తెచ్చే ప్రయత్నం చేశానని తెలిపారు. వెనకబడిన పశ్చిమ మెదక్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందుకోసం తాను త్వరలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో రాష్ర్టస్థాయి అధికారులతో కలిసి రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు. నూతన పారిశ్రామిక పాలసీతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
త్వరలో ఎంఆర్‌ఎఫ్ విస్తరణ..
సదాశివపేటలోని ఎంఆర్‌ఎఫ్ రూ.980 కోట్లతో త్వరలో విస్తరణ పనులు చేపట్టనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. విస్తరణ పనులు పూర్తయితే సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతానికి చెందిన 1,500 మందికిపైగా యువకులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, మాజీ ఎమ్మెల్యే బాగన్న, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.