ప్రముఖ నటి, ఎంపీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ (49) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెరిబ్రల్ ఎటాక్ రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆమెను వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం సాయంత్రం ఆమె తనకు తలనొప్పిగా ఉందని, కళ్లు కూడా సరిగా కనిపించడం లేదని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జాయ్ ప్రకాశ్ మజుందార్ తెలిపారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లోని ఏఎంఆర్ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్న విషయాన్ని వైద్యులు ఇంకా చెప్పలేదని ప్రకాశ్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకత్తాకు సమీపంలోని కళ్యాణిలో జన్మించిన రూపా గంగూలీ పలు చిత్రాల్లో బాలనటిగా తన కరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ పౌరాణిక టీవీ మెగా సీరియల్ 'మహాభారత్' ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ద్రౌపది పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు సినిమాల్లో నటించిన ఆమె 2015లో బీజేపీ చేరి మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమెను బీజేపీ అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేసింది.