సీసీఎస్ అదుపులో ‘చీటింగ్’ అకౌంటెంట్
సీఏ సాయిబాబు చంద్రబాబు, రామోజీలకు సన్నిహితుడు!
లక్ష్మణ్ పేపర్ మిల్స్ ఫోర్జరీ కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు
కెనరా బ్యాంక్ పేరుతో ఎస్బీహెచ్‌కు నకిలీ ఎన్‌వోసీ సృష్టించిన సంస్థ
నకిలీ ఎన్‌వోసీ జిరాక్సుతో ఏకంగా రూ.12 కోట్ల రుణం తీసుకున్న వైనం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులకు అత్యంత సన్నిహితుడు, వారి సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా చెప్పుకునే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) వైఎస్‌ఎస్ సాయిబాబును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీ పత్రాలతో లక్ష్మణ్ పేపర్ మిల్స్ సంస్థ చేసిన రూ.12 కోట్ల మోసం కేసులో ఆ సంస్థ డెరైక్టర్ అయిన సాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భారీ స్కామ్‌కు సాయి సూత్రధారనే అనుమానాలున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్‌గా తనకున్న అనుభవం, పెద్దస్థాయిలో ఉన్న పరిచయాలను వినియోగించుకుని ఈ స్కాముకు పథక రచన చేసి ఉంటాడనే ఆరోపణలున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడి సమీపంలోని మేడపాడులో బలగంరెడ్డి కొన్నేళ్ల క్రితం లక్ష్మణ్ పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు దీని విస్తరణ కోసం భారీగా అప్పులు తీసుకురావడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో సంస్థను వేరే వ్యక్తులకు అమ్మేశారు.
వారూ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కోవడంతో మూడేళ్ల క్రితం లక్ష్మణ్ పేపర్ మిల్స్‌ను ఉద్యోగాలకు రాజీనామా చేసిన కొందరు బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్లు కలిసి కొనుగోలు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్‌ఎమ్‌డీసీ ఎదురు గా ఉన్న ఆఫియా ప్లాజాలో లక్ష్మణ్ మిల్స్ కార్పొరేట్ కార్యాలయం ప్రారంభమైంది. దీని బోర్డు చైర్మన్‌గా మద్దిపోటి వెంకట సత్య రాము, మరికొందరు డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో నర్సరావుపేట నుంచి వచ్చి అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో స్థిరపడిన చార్టర్డ్ అకౌంటెంట్ వైఎస్‌ఎస్ సాయిబాబు కూడా ఒకరు. సైఫాబాద్‌లోని కెనరా బ్యాంక్ శాఖ నుంచి లక్ష్మణ్ పేపర్ మిల్స్ సంస్థ 2010లో రూ.8.5 కోట్లకు పైగా రుణానికి దరఖాస్తు చేసుకోగా ఇందులో కొంత మొత్తం విడుదల య్యింది. అప్పట్లో కంపెనీకి చెందిన కరెంట్ అసెట్స్‌ను బ్యాంకుకు ష్యూరిటీగా ఉంచింది. అయితే ఆ తర్వాత సంస్థ యాజమాన్య బదలాయింపు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వో సీ) నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం జరగలేదని గుర్తించి న కెనరా బ్యాంక్ మిగిలిన రుణాన్ని నిలిపేసింది. సంస్థ కార్యకలాపాలను విస్తరించే పేరిట లక్ష్మణ్ మిల్స్ 2011లో మరోసారి రుణం కోసం అనేక బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంది.
కెనరా బ్యాంక్ పేరుతో నకిలీ ఎన్‌ఓసీ...
వీటిలో గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీహెచ్ ఒకటి. అప్పటికే కెనరా బ్యాంకులో రుణం ఉండటంతో ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఆ బ్యాంకు అంగీకరించదని తెలిసిన లక్ష్మణ్ మిల్స్ యాజమాన్యం ఫోర్జరీ ఎన్‌వోసీ సృష్టించింది. తాము రూపొందించిన ఫోర్జరీ ఎన్‌ఓసీ అసలు ప్రతి ఇస్తే ఎస్‌బీహెచ్ అధికారులు గుర్తించే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే దాన్ని జిరాక్సు తీసి ఆ ప్రతిని ఇచ్చింది. అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరం చెప్పని ఎస్బీహెచ్ ఏకంగా రూ.12 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక్కడ కూడా లక్ష్మణ్ సంస్థ కెనరా బ్యాంకునకు మార్ట్‌గేజ్ చేసిన కరెంట్ అసెట్స్‌నే ష్యూరిటీగా పెట్టింది. అయితే కేవలం ఎన్‌ఓసీ జిరాక్సు ప్రతితోనూ ఇంత పెద్ద మొత్తం రుణంగా మంజూరు కావడానికి ‘పెద్దల’ మద్దతే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొద్దికాలానికే తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న లక్ష్మణ్ పేపర్ మిల్స్ సంస్థ బ్యాంకులకు రుణాలు చెల్లింపులు ఆపేసింది. దీంతో కెనరా బ్యాంకు తమకు మార్ట్‌గేజ్ చేసిన లక్ష్మణ్ సంస్థ కరెంట్ అసెట్స్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే అవి అప్పటికే ఎస్బీహెచ్ ఆధీనంలోకి వెళ్లిపోయినట్లు తెలియడంతో అవాక్కై ఆరా తీయగా ఫోర్జరీ ఎన్‌ఓసీ విషయం వెలుగులోకి వచ్చింది.
సీసీఎస్ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు: తమ బ్యాంకు పేరుతో లక్ష్మణ్ సంస్థ ఫోర్జరీ ఎన్‌ఓసీ సృష్టించి తమను మోసం చేసిందంటూ కెనరా బ్యాంక్ అధికారులు గత ఏడాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా మద్దిపోటి వెంకట సత్య రాము సహా ఆరుగురు డెరైక్టర్లను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదయ్యింది. వీరిలో కొందరు న్యాయస్థానంలో లొంగిపోయి బెయిల్ కూడా పొందారు. లోతుగా సాగిన దర్యాప్తు నేపథ్యంలో సీసీఎస్ అధికారులు లక్ష్మణ్ పేపర్ మిల్స్‌లో కీలక డెరైక్టర్‌గా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ వైఎస్‌ఎస్ సాయిబాబు పాత్రను అనుమానించారు. దీంతో నార్త్‌జోన్ టీమ్ ఇన్‌స్పెక్టర్ ఎం.శంకర్ నేతృత్వంలోని బృందం సాయిబాబును అదుపులోకి తీసుకుంది. సాయిబాబును అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆయన్ను వదిలిపెట్టాలంటూ పోలీసులపై పెద్దస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది.
సాయిబాబుతో సంబంధాల్లేవు: ఎన్టీఆర్ ట్రస్ట్
వైఎస్‌ఎస్ సాయిబాబును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ మంగళవారం మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ సాయిబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది. దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న విషయాల్లో వాస్తవం లేదని ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్ మొటపర్తి పేర్కొన్నారు.