కోలుకుంటున్న ఫ్లోరిడా
మియామి: ఇర్మా తుపాను తీరం దాటిపోవడంతో ఊపిరిపీల్చుకున్న ఫ్లోరిడావాసులు తమకు అందుతున్న సహాయాన్ని అందుకునేందుకు ఆవాసాల నుంచి బయటికి వస్తున్నారు. ఫ్లోరిడా కీస్ దీవుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ సమాచార వ్యవస్థ పనిచేయడం లేదు. తాగునీరు దొరకడం లేదు. మరోవైపు ఇంధన కొరత సమస్య తలెత్తింది. అధికార బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి.
కాగా ఇర్మా తుపాను ప్రభావం కారణంగా ఫ్లోరిడాలోని లక్షలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రిపూట ప్రజలు నానాఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఫ్లోరిడాకీస్ దీవులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ఇక్కడ ఉన్న మూడు ఆస్పత్రులు మూతపడ్డాయి. తుపాను ప్రభావిత కరేబియా దీవుల్లో మృతుల సంఖ్య 40కి, క్యూబాలో 10కి చేరుకుంది. ఉత్తర దిశగా సాగిపోయిన ఇర్మా తుపాను ఎట్టకేలకు బలహీనపడింది. తుపాను పీడిత కరేబియన్ దీవుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా దేశాలు సహాయక చర్యలను ముమ్మురం చేశాయి. దీంతో అక్కడి ప్రజలకు ఎంతో ఊరట లభిస్తోంది.