- నిర్మానుష్యంగా మారిన ఫ్లోరిడా
- అమెరికా చరిత్రలోనే అత్యధికంగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు
- ఆదివారం ఫ్లోరిడా తీరం తాకే అవకాశం
మయామి: అటు కరేబియన్, ఇటు ఫ్లోరిడాల్లో హరికేన్ ఇర్మా విధ్వంసం కొనసాగిస్తోంది. లక్షల సంఖ్యల ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ హరికేన్ ధాటికి కరేబియన్ దీవుల్లో ఇప్పటివరకూ సుమారు 24 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం దాదాపు 3 కోట్లమందిపై తీవ్ర ప్రభావం చూపింది. కరేబియన్, ఫ్లోరిడా ప్రాంతాలను వణికిస్తున్న ఇర్మా హరికేన్ ఆదివారం తీరం తాకవచ్చని తెలుస్తోంది. తీరాన్ని తాకే సమయంలో 12 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని, గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అమెరికా చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం.. 2005లో హరికేన్ కత్రినా తర్వాత ఇదే మొదటిసారి. ఫ్లోరిడా నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం.. నగరం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. రహదారులు, భవనాలు, క్రీడా మైదానాలు, కార్యాలయాల్లో ఎక్కడా సంచారం లేకుండా పోయింది. ఇర్మా హరికేన్ వల్ల సుమారు 125 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రజలెవరూ.. ఇళ్లలో ఉండవద్దని ఫ్లోరిడా ప్రభుత్వం సూచనలు చేస్తోంది.
హరికేన్ తీరం దాటే సమయంలో సుమారు 250 కి.మీ. వేగంతో గాలులు వీచే వకాశం ఉండడంతో.. ప్రమాదస్థాయి తీవ్రంగా ఉంటుందని ఫ్లోరిడా రాష్ర్ట హరికేన్ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్రూ సెస్‌మన్ చెబుతున్నారు. అంతేకాక తుపాను తీరం దాటే సమయంలో 6 నుంచి 12 అడుగుల ఎత్తులో కెరటాలు ఎగిసిపడతాయని అధికారులు చెబుతున్నారు. తీపాను తీవ్రత, ఆసమయంలో వీచే భీకర గాలులు, ఆ సముద్రం నుంచి ఎగిసిపడే అలలతో ఫ్లోరిడా మొత్తం నీటితో మునిగిపోయే ప్రమాదముందని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మియామి దీవులకు ఆగ్నేయ దిశలో ఉన్న హరికేన్ ఇర్మా.. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమంగా కదులుతోంది.
హరికేన్ ఇర్మా చాలా ప్రమాదకరమైందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. ఇర్మా తుపాను గాలులు సగటున గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వందల్లో పునరావాస కేంద్రాలు
ఫ్లోరిడానుంచి లక్షల్లో వస్తున్న ప్రజలకు మియామిలోనూ, సమీప ప్రాంతాల్లోనూ వందల్లో పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రం సామర్థ్యం బట్టి.. కనీసం 5 వేల నుంచి 10 మందిని అనుమతిస్తున్నారు. ఒక్క శుక్రవారం రాత్రే ఫ్లోరిడా నుంచి లక్ష మంది వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.