అంధకారంలో ఫ్లోరిడా
► 62 లక్షల మందికి నిలిచిన విద్యుత్ సరఫరా
► కేటగిరీ–1 స్థాయికి తగ్గి జార్జియా వైపుగా హరికేన్ ఇర్మా
► నాలుగుకు చేరిన మృతులు.. క్యూబాలో 10 మంది మృతి
► ఇర్మా నష్టం రూ.4 నుంచి 5.9 లక్షల కోట్లు: మూడీస్
మయామి: అమెరికాలోని ఫ్లోరిడా తూర్పు తీరాన్ని వణికించిన హరికేన్ ఇర్మా సోమవా రం సాయంత్రానికి బలహీనపడి కేటగిరీ 1 స్థాయికి చేరింది. హరికేన్ ధాటికి ఫ్లోరిడాలో మృతుల సంఖ్య నాలుగుకు చేరగా.. దాదాపు 62 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కొన్ని వారా లు పట్టవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.
సోమవారం టాంప నగరంతో పాటు ఇతర పట్టణాల్లో ఇర్మా భారీ ఆస్తి నష్టం కలి గించగా.. ఇంకా హరికేన్ స్థాయిలోనే గాలులు కొనసాగుతాయని, భారీ వర్షం నమోదుకావచ్చని, తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదముందని అమెరికా హరికేన్ కేంద్రం హెచ్చరించింది.
తీవ్రతను హరికేన్ నుంచి ఉష్టమండల తుపాను స్థాయికి, గాలుల గరిష్ట వేగాన్ని 112 కి.మీ.లకు తగ్గిం చింది. అమెరికా కంటే ముందు కరీబియన్ దీవుల్లో పెను విధ్వంసం సృష్టించిన ఇర్మా అక్కడ 38 మంది ప్రాణాల్ని బలితీసుకుంది. క్యూబాలో సృష్టించిన విధ్వంసంలో 10 మంది మరణించారని ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు.
పెద్ద ఎత్తున అలలు ఎగసిపడొచ్చు
ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపుగా ముందుకు కదులుతూ మరింత బలహీనపడి జార్జియా, అలబామా, మిస్సిసిపీ, టెన్నెసీ రాష్ట్రాల వైపునకు ఇర్మా తరలిపోనుందని హరికేన్ కేంద్రం తెలిపింది. ముందుకు కదు లుతున్న కొద్దీ సముద్ర తీరంలో భారీ అలలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మంగళవారానికి అల్పపీడనంగా బలహీనపడవచ్చని వెల్లడించింది.
ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, పల్లపు ప్రాంతాలను 6 అంగుళాల మేర నీరు ముంచెత్తవచ్చని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ట్వీటర్‌లో హెచ్చరించారు. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో నష్టం వివరాలు పూర్తిగా తెలియలేదు. పరిస్థితి ఊహించినంత ప్రమాదకరంగా లేదని, అలలు ఎగసిపడవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని టాంప మేయర్ బాబ్ బక్‌హర్న్ చెప్పారు. హరికేన్ బాహ్య వలయం జార్జియా వైపుగా కదలడంతో ఆ రాష్ట్రంపై ఇర్మా ప్రభా వం చూపుతోంది. జార్జియాలో లక్ష మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రెండింటి నష్టం 12.8 లక్షల కోట్లు
హరికేన్ ఇర్మా, హార్వీల నష్టం మొత్తం 150– 200 బిలియన్ డాలర్లు(రూ.9.6 –12.8 లక్షల కోట్లు)గా ఉండొచ్చని మూడీస్ సంస్థ ఆర్థిక విశ్లేషకుడు మార్క్ జందీ ప్రాథమికంగా అంచనావేశారు. పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే లెక్కల్లో కొంతమేర మార్పులు ఉండొచ్చన్నారు. ఈ రెండు హరికేన్లతో అమెరికా ఉత్పత్తి రంగానికి 20– 30 బిలియన్ డాలర్లు(రూ.1.28 –1.98 లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ రెండు హరికేన్ల నష్టం కలిపితే హరికేన్ కత్రినా నష్టంతో దాదాపు సమానంగా ఉండొచ్చని చెప్పారు. ఇర్మా నష్టాన్ని ప్రాథమికంగా 64–92 బిలియన్ డాలర్లు (రూ.4–5.9 లక్షల కోట్లు)గా మూడీస్ నిర్ధారించింది.
మేం అదృష్టవంతులం: ట్రంప్
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఫ్లోరిడా పశ్చిమ తీరం వైపున కాకుండా తూర్పు తీరం వైపు ఇర్మా మళ్లడంతో ‘మనం కొంతమేర అదృష్టవంతులం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇర్మా భారీ నష్టం మిగిల్చిందని, అయితే ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
బాధితులకు అండగా ‘ఆటా’
రాయికల్(జగిత్యాల): ఇర్మా బాధితులకు తెలంగాణ అసోసియేషన్ (ఆటా) సభ్యులు చేయూతగా నిలుస్తున్నారు. మిల్‌వుడ్, కేటీ ప్రాంతాల్లో ఆటా అధ్యక్షుడు కడిమల్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సాయంచేస్తున్నారు. ప్రవాస తెలంగాణ వారితోపాటు అమెరికన్లకూ భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి ఫోన్‌లో చెప్పారు. ముఖ్యంగా కేటీ ప్రాంతంలో తెలంగాణకు చెందిన ప్రవాసులు ఇక్కడ అధికంగా ఉంటారని, అందరు క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కార్యక్రమాల్లో ఆటా మాధవరం కరుణాకర్, చీమర్ల నరేందర్, మర్రిపల్లి రఘువీర్, చాడ శ్రీనివాస్, కంచెలకుంట్ల శ్రీధర్ పాల్గొన్నారు.