మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల నియామకం
న్యూడిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..మానిటరీ పాలసీ కమిటీకి (ఎంపీసీ) సంబంధించిన ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నాలుగేళ్ళ కాలానికి ముగ్గురు ప్రముఖులును నియామకాల కేబినెట్ కమిటీకి (ఏసీసీ) ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ పామి దువా, ఐఐఎం అహ్మదాబాద్ కు చెందిన ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలకియాలను ద్రవ్య విధాన కమిటీ సభ్యులుగా ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యుల్లో హెడ్ గా ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ సహా మరో వ్యక్తి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ముగ్గురు ఆర్బీఐ సభ్యులతో పాటు, ప్రభుత్వం నేడు నియమించిన ఈ ముగ్గురు సభ్యులు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను నిర్ణయించనున్నారు . ప్రభుత్వం తరఫున బాధ్యత వహించే సభ్యులో ఒకరు మహిళా(పామి దువా)ఉండడం విశేషం.
కాగా ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ విశేష అధికారాలకు ముగింపు పలికిన కేంద్రం, మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్‌బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనున్న సంగతి తెలిసిందే.