సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై ఒత్తిడిని తగ్గించేందుకు శివారు ప్రాంత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేలా హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో తగు జాగ్రత్తలు తీసుకుంది. పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు వేగంగా చేరుకొనే విధంగా 193 చ.కి.మీ. పరిధిలో కొత్త రహదారులకు రూపకల్పన చేసింది. సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు, శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్స్ విస్తరణను ప్రతిపాదించింది.
నగరం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరేందుకు రేడియల్ రోడ్లు ఉన్నట్లే రీజినల్ రింగ్ రోడ్డుకు చేరుకునేలా భవిష్యత్తు రోడ్లను ప్లాన్ చేసింది. ఒక అర్బన్ నోడ్ నుంచి మరో అర్బన్ నోడ్‌కు వేగంగా రాకపోకలు సాగించేందుకు 18, 30, 45 మీటర్ల వెడల్పుతో రోడ్లను విస్తరించాలని సూచించింది. శివారు ప్రాంతాలను రవాణా హబ్‌గా మార్చేందుకు బృహత్ ప్రణాళికలో సరుకు రవాణా కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. భారీ వాహనాలకు పార్కింగ్ ఇతర సదుపాయాల కోసం 12 లాజిస్టిక్ హబ్‌లు, 5 రైల్వే టెర్మినల్స్‌ను ప్రతిపాదించింది.