'అలా చేయకుంటే న్యాయ వ్యవస్థ కుంటుపడుద్ది'
న్యూఢిల్లీ: న్యాయసంబంధమైన సంస్థలకు భారీ మొత్తంలో న్యాయ కోవిదులు అవసరం అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ న్యాయ సంస్థలకు, న్యాయ వ్యవస్థకు స్వచ్ఛమైన, మంచి మేథావులు అవసరం అని, న్యాయవాద వృత్తిలో కొనసాగేందుకు మరింత యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరారు. ఆధునిక సమాజానికి తగినట్లుగా పనిచేసే యువత న్యాయవ్యవస్థకు చాలా అవసరం అని తెలిపారు.
ప్రస్తుత తరుణంలో న్యాయపరమైన అవసరాలకు తగినట్లుగా సాంప్రదాయబద్ధమైన మేథస్సుగల వారు సేవలు అందించలేకపోతున్నారని చెప్పారు. కేవలం న్యాయ వ్యవస్థవైపు రావడంతోనే ఆగిపోకుండా ఉన్నత న్యాయస్థానం బెంచ్లకు చేరుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అంకితభావంతో, కచ్చితత్వంతో కృషి చేసినప్పుడు మాత్రమే అధిసాధ్యం అవుతుందని చెప్పారు. ఒక వేళ అలా చేయలేకపోతే మొత్తం న్యాయవ్యవస్థే కుంటుపడే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ రోహిణి కూడా హాజరయ్యారు.