సీఎంకు కాదు మాజీ సీఎంకే విధేయుణ్ని
పట్నా: నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయినా తన నాయకుడు మాత్రం లాలు ప్రసాదేనని, ఆయనకు మాత్రమే తాను విధేయుడినని ఆర్జేడీ మాజీ ఎంపీ, డాన్ మొహమ్మద్ షహబుద్దీన్ అన్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న షహబుద్దీన్ 11 ఏళ్ల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. తాను జైలుకు వెళ్లాక ఆర్జేడీలో పలు మార్పులు జరిగాయని చెప్పాడు.
లాలు కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గురించి షహబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజలు ఆయన్ను నాయకుడిగా ఆమోదించినా, తనకు మాత్రం పిల్లాడేనని, తేజస్వి తండ్రే తనకు నాయకుడని స్పష్టం చేశాడు. 2005లో నితీష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షహబుద్దీన్ జైలుకు వెళ్లాడు. ఆర్జేడీ మద్దతుతో నితీష్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన విడుదలకావడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. జంగల్ రాజ్ మళ్లీ వచ్చిందనడానికి షహబుద్దీన్ విడుదలే నిదర్శనమని నితీష్పై విమర్శలు చేశారు. కాగా కోర్టు తనను జైలుకు పంపిందని, ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని షహబుద్దీన్ విమర్శలను కొట్టిపారేశాడు. తాను జైలులో ఉన్నప్పుడు హత్యలు జరిగాయని, అన్నిటికీ తననే ఎందుకు నిందిస్తారని అన్నాడు.