ప్రాణం పోయినా.. జెండా, ఎజెండా మార్చను | i will never change agenda says kcr in warangal public meeting | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయినా.. జెండా, ఎజెండా మార్చను

Published Wed, Nov 18 2015 2:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ప్రాణం పోయినా.. జెండా, ఎజెండా మార్చను - Sakshi

ప్రాణం పోయినా.. జెండా, ఎజెండా మార్చను

 గెలుపుతో బలమివ్వండి.. వరంగల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
* అరవై ఏళ్ల కష్టాలు ఆర్నెల్లలో తొలగించాం
* కోతల్లేని కరెంటిచ్చాం.. త్వరలో పేదలందరికీ కల్యాణ లక్ష్మి
* కిషన్‌రెడ్డి దద్దమ్మ.. రాజీనామా చెయ్యమంటే పారిపోయిండు
* తెలంగాణను అడ్డం పెట్టుకుని జానారెడ్డి మంత్రి అయిండు
* తెలంగాణ ఫోరం అంటూ దొంగ మీటింగులు పెట్టిండు
* జైపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవిని పట్టుకుని వేలాడిండు... ఇప్పుడు అందరూ కేసీఆర్ మీద అడ్డం పొడుగు విమర్శలు చేస్తున్నరు
* ఎవరో ఒకర్ని తోలి మంత్రుల సభలకు అడ్డం పడుతున్నరు
* టీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలని చూస్తున్నరు
* అలాంటి బద్మాష్ ప్రచారాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి
 
 సాక్షి, హన్మకొండ: ప్రాణం పోయినా జెండా, ఎజెండా మార్చనని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన మాటలు విని వదిలేయవద్దని, ఆలోచించి తప్పయితే శిక్షించాలని... జెండా, ఎజెండా మార్చితే రాళ్లతో కొట్టి చంపండని వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ దాదాపు 43 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. టీఆర్‌ఎస్‌కు ఎప్పుడు కష్టాలు వచ్చినా వరంగల్ ప్రజలు అండగా నిలబడ్డారని, అక్కడ 30 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి తనకు మరింత బలమివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


 మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం..
 వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 కల్లా కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 30 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని... రెండున్నరేళ్లలో ఈ పథకం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమన్నారు. దేశం మొత్తం మీద పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ, హామీలు నెరవేర్చకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి తానేనని కేసీఆర్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హోంగార్డులు, ట్రాఫిక్ పోలీసులకు జీతాలు పెంచామని... పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామన్నారు. రంజాన్ పండుగ తరహాలోనే క్రిస్మస్‌ను కూడా ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
 వ్యవసాయం పాడు చేసింది మేమా?
 58 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీ వాళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించారని, తామేదో ప్రాజెక్టులు కట్టించినట్లు, నీళ్లన్ని తెచ్చినట్లుగా... ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి పాడుచేసినట్లుగా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. సంస్కారం లేకుండా అడ్డదిడ్డమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని... ఎరువులు, విత్తనాలు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు. 17,000 కోట్ల రూపాయల భారమైనా రుణమాఫీ చేశామని.. ప్రతీ 2,500 ఎకరాలకు ఓ అధికారి ఉండేలా వ్యవసాయ శాఖలో పోస్టులు మంజూరు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నామని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇచ్చే వరకు నిద్రపోనని పేర్కొన్నారు.
 
 తెలంగాణ పేరుతో మంత్రి అయిన జానారెడ్డి
 'జానారెడ్డి అని ఓ పెద్దమనిషి ఉన్నడు. అడ్డం పొడుగు మాట్లాడిండు. ఆయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. 1992లో నేను టీడీపీల ఎమ్మెల్యేగా ఉన్న.. జానారెడ్డి కాంగ్రెస్‌ల ఎమ్మెల్యేగ ఉన్నడు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయనకు మంత్రి పదవి ఇయ్యలే. దాంతోటి తెలంగాణ ఫోరం దుకాణం మొదలు పెట్టిండు. నన్ను రమ్మన్నడు. నేను చెప్పిన 'జానారెడ్డి గారు మీ మంత్రి పదవి సాగించుకోవడానికి తెలంగాణ తప్ప మరొకటి దొరకదా, ఎన్నిమాట్ల తెలంగాణను అవమానిస్తారయ్యా.. నువ్వు పెట్టింది తెలంగాణ కోసం కాదు. మంత్రి పదవి కోసం. నీ దొంగ మీటింగుకు నేను రాను..' అని చెప్పిన. కరెక్టుగ ఇరవై రోజుల్లో విజయభాస్కర్‌రెడ్డి పిలిచి జానారెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇచ్చిండు. ఖతం.. తెలంగాణ గాలికి కొట్టుకపోయింది. ఇది జానారెడ్డి చరిత్ర. నేను చెప్పింది నిజామా, కాదా? ప్రజలు ఆలోచించుకోవాలే. నేను చెప్పింది అబద్ధమైతే నాకు శిక్ష విధించండి. నిజమే అయితే... ఏ పార్టీ తరఫున జానారెడ్డి మాట్లాడిండో ఆ పార్టీకి కర్రుకాచి వాత పెట్టాలే..'
 
మంత్రి పదవి వదలని జైపాల్‌రెడ్డి
 'జైపాల్‌రెడ్డి అని ఓ మహా నాయకుడు వచ్చిండు. సకల జనుల సమ్మె అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నడని అన్నడు. ఆ సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నడో జైపాల్‌కు తెల్వదట. ఏం చేయాలే నేను. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెను ఉర్రూతలూగించింది మీ బిడ్డ కేసీఆరే కాదా. కానీ 2004 నుంచి 2014 దాకా శానా పైలంగా కేంద్ర మంత్రి పదవిని పట్టుకుని నేను జాతీయవాదిని, ప్రాంతీయవాదిని కాదని మాట్లాడిన జైపాల్‌రెడ్డీ... నువ్వెక్కడున్నవో కూడా ప్రజలకు తెలుసు. కేసీఆర్ ఎక్కడున్నడో కూడా ప్రజలకు తెలుసు..'
 
 పారిపోయిన కిషన్‌రెడ్డి..
'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకాయన ఉన్నడు. ఆయన పెద్ద  పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతాండు. పదహారు నెలల్లో ఏం చేసినవ్, నీకు 36 క్వశ్చన్లు అని అడుగుతాండు. నేను ఒక్క మాట అడుగుత కిషన్‌రెడ్డి గారు.. మాతో పాటే మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఈ పదహారు నెలలలో రైతుల గురించి, పేదల గురించి, విద్యార్థుల గురించి, మహిళల గురించి చేసిన ఒక్క మంచి పని చెప్పండి.. మీకు నేను జై కొడతా. ఒక్కటంటే ఒక్క పనీ చేయలే. ఢిల్లీలో దెబ్బకు దిమ్మ తిరిగి నేలకు పడ్డరు మీరు. నిన్నగాక మొన్న మీ వైఖరి నచ్చక బిహార్‌లో బిత్తరగత్తర దెబ్బ కొట్టి ఇంటికి పంపించిండ్రు. పదహారు నెలల్లో రెండు రాష్ట్రాల్లో ప్రజలు భయంకరంగా మిమ్ములను తిరస్కరించిండ్రు. అటువంటి మీరు వచ్చి ఇన్ని పనులు చేసిన మాకు షాకు ఇయ్యల్నంటరా. ఇంకా హాస్యాస్పదం ఏందంటే ఈ నాయకులు కేసీఆర్ మీద మాట్లాడుతున్నరు. నేను నిరాహారదీక్ష చేపట్టిన, సావుకు తయారైన. దాంతోని కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. ఇదే చంద్రబాబు, ఇద్దరు నాయకులు మోసం చేస్తే కేంద్రం ఆ ప్రకటనను వాపస్ తీసుకున్నది.

ఆ సందర్భంల అన్ని పార్టీల మీటింగ్ పెట్టినం. కేంద్రం మీద ఒత్తిడి తేవాలంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయం చేసినం. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామ చేసిండ్రు, కాంగ్రెసోళ్లు, టీడీపోళ్లు వీపు జూపించి పారిపోయిండ్రు. బీజేపీకి ఉన్నదే ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకాయన రాజీనామ చేసిండు. ఈ కిషన్‌రెడ్డి పారిపోయిండు. ఇయ్యూల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు. ఇగ ఆ సమయంలనే ఉప ఎన్నికలు వచ్చినై. నిజామాబాద్ మీటింగ్‌ల బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని నేను మాట్లాడుతున్న. రాజీనామా చెయ్యిమంటే కొంత మంది దద్దమ్మలు పారిపోయిండ్రని చెప్పిన. నా ముందు రథం కింద ఉన్న ఓ పెద్దాయన... ‘సార్ ఓ దద్దమ్మ మీ పక్కనే ఉన్నడు సార్’ అన్నడు. ఎవరా అని చూస్తే పక్కన కిషన్‌రెడ్డి ఉన్నడు. తెలంగాణ కోసం రాజీనామా చెయ్యిమంటే పారిపోయిన దద్దమ్మ. ఇయాల వరంగల్‌కు వచ్చి వీరంగమేసి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నడు. ఇదంతా వాస్తవం కాదా, ఇయాల కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పనీ చేయకపోవడం నిజం కాదా, ఈ రోజు కేంద్రం పత్తి కొనకపోవడం, సీసీఐకి తగిన డబ్బులియ్యకపోవడం కేంద్రం చేస్తున్న తప్పు కాదా? ఎవరి మీద బద్నాం పెడతరు.

సోదరులారా నేను ఇంకో మాట మనవి చేస్తున్నా.. కొందరు కాంగ్రెస్ నాయకులు కొందరు రైతులకు ఎక్కువ డబ్బులిచ్చి పత్తి చేలు కాలబెట్టిచ్చి టీఆర్‌ఎస్‌ను బద్నాం చేస్తున్నరు. పంటలు తగులబెట్టిస్తున్నరు. కొంతమంది శిఖండిలు మంత్రుల సభలకు ఎవర్నో ఒకర్ని తోలించి, ఏదో ఒకటి అడిగిస్తరు. అట్ల బద్మాష్ ప్రచారం చేస్తరా? ఎన్నికల్లో నిలబడ్డవారు ప్రజలకు దండం పెట్టాలే, వాస్తవాలు చెప్పాలే. ప్రజలు దయతలచి గెలిపిస్తే గెలవాలే. అంతేకానీ ఓట్లకోసం ఇన్ని అబద్ధాలు, అసత్యాలు, పనికిమాలిన మాటలు మాట్లాడల్నా..? దయచేసి ప్రజలే నిర్ణయం చేయాలని కోరుతున్న..'అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement