పల్లెకు పోదాం.. చలో చలో! | maruti focusing on village peoples | Sakshi
Sakshi News home page

పల్లెకు పోదాం.. చలో చలో!

Published Wed, Dec 25 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

పల్లెకు పోదాం.. చలో చలో!

పల్లెకు పోదాం.. చలో చలో!


 గ్రామీణ మార్కెట్లపై మారుతీ కన్ను
   అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యం
 
 న్యూఢిల్లీ: అమ్మకాలు పెంచుకునేందుకు మారుతీ సుజుకి కంపెనీ గ్రామీణ మార్కెట్లపై కన్నేసింది. వచ్చే ఏడాది మార్చి కల్లా లక్ష గ్రామాలకు విస్తరించాలని యోచిస్తున్నామని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు.  ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలానికి  అన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు 4-5% క్షీణించాయని పేర్కొన్నారు. అయితే మొత్తం అమ్మకాల్లో 30 శాతంగా ఉండే గ్రామీణ ప్రాంత విక్రయాలు మాత్రం 18% పెరిగాయని వివరించారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ 5-6% క్షీణించిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నామని భార్గవ వివరించారు. ఐదేళ్ల క్రితమే గ్రామీణ మార్కెట్లకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. గత ఏడాది 44 వేల గ్రామాలకు చేరువ అయ్యామని, ఈ ఏడాది నవంబర్ వరకూ 60 వేల గ్రామాలకు విస్తరించామని పేర్కొన్నారు.
 
 భారత్‌లో లక్ష గ్రామాలకు వచ్చే ఏడాది మార్చికల్లా చేరనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీ 700 గ్రామీణ అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోందని వివరించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంత వినియోగదారుల కార్ల సర్వీసింగ్ కోసం 650 మొబైల్ వ్యాన్లను కూడా ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొబైల్ వర్క్‌షాప్‌ల సంఖ్యను వెయ్యికి పెంచనున్నామని పేర్కొన్నారు. ఈ మొబైల్ వర్క్‌షాపుల సంఖ్యను పెంచడం, గ్రామీణ అవుట్‌లెట్ల సంఖ్యను అధికం చేయడం తదితర మార్గాల ద్వారా లక్ష గ్రామాలకు చేరువకావాలన్నది కంపెనీ ఉద్దేశం.
 
 అమ్మకాలు మరింత తగ్గుతాయ్
 ప్రస్తుత మార్కెట్, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చూస్తే అమ్మకాలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని భార్గవ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా గత ఆర్థిక సంవత్సరం నాటి విక్రయాలనే సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 1.2 లక్షల వాహనాలు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. డిమాండ్ లేదని, అందుకని ఉత్పత్తి  గుజరాత్‌లో ప్లాంట్ ప్రతిపాదనను విరమించుకున్నట్లు  భార్గవ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
 2016కల్లా ఎల్‌సీవీ...
 ఒక్కో కారుకు సగటున రూ.17,000 డిస్కౌంట్‌నిస్తున్నామని, ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లనందిస్తున్నామని వీటన్నింటి దృష్ట్యా డిసెంబర్, జనవరిలో అమ్మకాలు పుంజుకోగలవని మారుతీ సుజుకి సీవోవో(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు. తేలిక రకం వాణిజ్య వాహనాన్ని(ఎల్‌సీవీ) 2016కల్లా అందించనున్నామని.. దీన్ని పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో కూడా అందిస్తామని పేర్కొన్నారు. రోహ్‌తక్‌లో నిర్మిస్తోన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రం(ఆర్‌అండ్‌డీ) 2016 కల్లా సిద్ధమవుతుందని చెప్పారు. ఇది మారుతీ మాతృసంస్థ సుజుకీకి నాలుగో ఆర్‌అండ్‌డీ కేంద్రం. మిగిలిన మూడూ జపాన్‌లోనే ఉన్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement