ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తోనే అవకాశాల వెల్లువ..
గురుగ్రామ్: క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలుచేసి వార్తల్లో నిలిచిన టాప్ మోడల్ ఆకాంక్ష శర్మ తన కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షోతోపాటు ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ షోలోనూ తన ప్రతిభచాటుకున్న ఆమె.. తాను పుట్టింది బాలీవుడ్ తారగా వెలిగిపోడానికేనని చెప్పింది.
మిగతా మోడల్స్ లాగా తాను ఏజెన్సీల చుట్టూ తిరగలేదని, ఫేస్ బుక్ ఫ్రొఫైల్ చూసి వాళ్లే(ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ నిర్వాహకులు) తనను సంప్రదించారని ఆకాంక్ష తెలిపారు. ఆ షోలో భాగంగా టూపీస్ బికినీతో షూటింగ్ చేసినప్పుడూ పేరెంట్స్ తనతోనే ఉన్నారని, ఆ దుస్తులు ధరించడంపట్ల తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె చెప్పారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో కరికులర్ యాక్టివిటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్నని, ఇప్పుడు మోడల్ గా ఎదగడానికి కూడా వాళ్లు తోడ్పడుతున్నారని ఆకాంక్ష పేర్కొన్నారు.
ప్రస్తుతం గురుగ్రామ్(ఢిల్లీ)లో ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్నానని, ముంబై నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా చదువు పూర్తయ్యేదాక సొంత ఊరిని విడిచిపెట్టనని ఆకాంక్ష అన్నారు. చాలా మంది అబ్బాయిలు ‘మీరు నాకు తెలుసు’అని అంటూటారని, నిజానికి టీవీ షోలో చూడటం తప్ప నా గురించి వాళ్లకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. నెల రోజుల కిందట బిగ్ బాస్ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ తో పెళ్లి పెటాకులు కావడానికి కారణం అతని తల్లేనని ఆరోపించారు. విడిపోయిన తర్వాత భరణంగా నెలకు రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ యువరాజ్ తల్లి శబ్నం ఏకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మొదటి పెళ్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మోడలింగ్, బాలివుడ్ చుట్టూ తిరుగుతున్నాయని ఆకాంక్ష చెప్పారు.