విపక్షమే లక్ష్యమా? | Opposition targets? | Sakshi
Sakshi News home page

విపక్షమే లక్ష్యమా?

Published Sun, Jan 3 2016 2:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

విపక్షమే లక్ష్యమా? - Sakshi

విపక్షమే లక్ష్యమా?

ఏకపక్షంగా విచారణా కమిటీ.. ముగ్గురు అధికారపక్ష సభ్యులే

♦ అధికారపక్షం చేసిన ఆరోపణలపైనే విచారణ
♦ డిసెంబర్ 22నాటి జీరో అవర్‌పై విచారణ అర్థం అదే..
♦ వైఎస్సార్‌సీపీకి అందిన వీడియోల్లో కనిపించని రోజా వ్యాఖ్యలు
♦ టీడీపీ విడుదల చేసిన వీడియోల్లో ప్రతిపక్ష సభ్యుల వ్యాఖ్యలు..
♦ పాత ఫుటేజీలను కొత్త వీడియోలకు కలిపిందెవరు?
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీని అప్రతిష్ట పాలు చేసేందుకు అసెంబ్లీ వేదికగా కుట్ర జరుగుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలలోనూ, ఆ తర్వాతా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతున్న ఈ కుట్రలో అసెంబ్లీ సచివాలయం, సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసార హక్కులు పొందిన సంస్థ, టీడీపీ అనుకూల చానళ్లు, పత్రికలు భాగం పంచుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియమించిన కమిటీ, అది చేపట్టనున్న విచారణాంశాలు పరిశీలిస్తే ఈ విషయం మరింత రూఢీ అవుతుందని వారు పేర్కొంటున్నారు.

 ఈ కమిటీ ఏకపక్షమే... ఎలాగంటే..
 ‘చైర్మన్‌తో సహా నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో ముగ్గురు అధికారపక్షమే. ఒక్కరే ప్రతిపక్ష సభ్యుడు. దాన్ని బట్టే చెప్పవచ్చు ఈ కమిటీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో..’ అని వైఎస్సార్‌కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. డిసెంబర్ 18న సభా వ్యవహారాల వాస్తవ ఫుటేజీని పరిశీలించి దోషులెవరో తేల్చాలని ప్రతిపక్షం అడుగుతుంటే డిసెంబర్ 22నాటి జీరో అవర్‌లో ప్రస్తావనకు వచ్చిన అంశాలను విచారించాల్సిందిగా ఈ కమిటీకి నిర్దేశించడంలోనే అసలు విషయం దాగి ఉందని పరిశీలకులంటున్నారు. ఎందుకంటే 22న జీరో అవర్ సమయంలో సభలో అసలు ప్రతిపక్షమే లేదు. అధికారపార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై అనేక ఆరోపణలు చేస్తూ జీరో అవర్ సాగింది.

ఇక వివాదాస్పదంగా మారిన శీతాకాల సమావేశాలలో అంశాలను పరిశీలించాల్సి ఉండగా వాటితో పాటు అంతకుముందు సమావేశాలను (అంటే అసెంబ్లీ ఐదవ సమావేశాలు) విచారణాంశాలలో చేర్చడంలో మరో కుట్ర దాగి ఉందని అంటున్నారు. మొత్తం ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవాలంటే ఈ సమావేశాలు మాత్రమే సరిపోవని, గత సమావేశాలను కూడా కలిపితే మరి కొంత మంది ప్రతిపక్ష సభ్యులపై వేటు వేసే అవకాశముంటుందన్నది అధికారపక్షం ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసం ఈ కమిటీ ఇచ్చే నివేదికను అధికారపక్షం ఉపయోగించుకునే అవకాశముందని విమర్శకులంటున్నారు.

 ప్రతిపక్షం ఫుటేజీ అడిగితే ‘నో’
 ప్రతిపక్షం కోరిన రికార్డులను ఇచ్చేందుకు నిబంధనలు సహకరించవని, స్పీకర్  అనుమతించలేదని చెప్పిన శాసనసభ సచివాలయ అధికారులు  అధికారపక్షానికి మాత్రం రికార్డులన్నింటినీ ఆగమేఘాల మీద అందించారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు సంబంధించి 18న సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ వీడియో టేపులు కావాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష  ఉపనేత జ్యోతుల నెహ్రూ, సుజయ్‌కృష్ణ రంగారావు శాసనసభ సచివాలయ కార్యదర్శిని డిసెంబర్ 22న లిఖితపూర్వకంగా కోరారు. 18 నాటి వీడియో ఫుటేజిని ఎవరికీ ఇవ్వట్లేదని అధికారులు చెప్పారు.  ఆ తరువాత కొద్దిసేపటికే వీడియో టేపుల్లోని కొంత భాగం బైటకు వచ్చింది. ఇందులో రోజా చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యలు మాత్రమే ఉన్నాయి.

 టీడీపీ వీడియోల్లోనే రోజా వ్యాఖ్యలు.. ఎలా..?
 అదే రోజు సాయంత్రం చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు రోజా హావభావాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లు బహిర్గతం చేయడంతో తమ పార్టీ ఎమ్మెల్యేల వీడియోలు మాత్రమే బహిర్గతం అయ్యాయని, వాటిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, కార్యదర్శి రావు సుజయకృష్ణ రంగారావు తదితరులు అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణను కోరారు. తర్వాత కొది గంటలకే అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం నుంచి వైఎస్సార్సీఎల్‌పీ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. మీరు కోరినట్లు 18నాటి వివరాలతో డీవీడీలు అందిస్తున్నామని చెప్పారు. అయితే ఆ డీవీడీల్లో రోజా వ్యాఖ్యలేవీ లేవు. మరి రోజా వ్యాఖ్యలతో కూడిన వీడియోలు టీడీపీకి ఎలా వచ్చాయి? అంటే టీడీపీకి, వైఎస్సార్సీపీకి స్పీకర్ కార్యాలయం వేర్వేరు డీవీడీలు ఇచ్చిందా?
 
 ఆధారాలుంటే ఇవ్వాలని స్పీకర్ అడగడమేమిటి
  ప్రతిపక్షంపై అధికారపక్షం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు సీడీల్లో పొందుపరచలేదు. అధికారపక్షం అనుచిత వ్యాఖ్యలపై ఆధారాలు అందిస్తే చర్య తీసుకుంటామని స్పీకర్ అంటున్నారు.  అధికారపక్ష సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు లేదా సభలో ఏ క్షణంలో ఏం జరిగింది అనే వివరాలు  స్పీకర్ అధీనంలో ఉంటాయి, అలాంటపుడు వాటిని తాము ప్రత్యేకంగా ఆధారాల రూపంలో  అందించాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

తమ పార్టీ సభ్యులపై చర్య తీసుకునే సమయంలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకుండా, ఆధారాలేమీ గమనించకుండానే స్పందించిన స్పీకర్ ఇపుడు  ఆధారాలు ఇవ్వమనటంలోని ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘సెల్‌ఫోన్‌లలోనో, ట్యాబ్‌లలోనో రికార్డు చేసి ఉంటారని వినిపిస్తున్న వాదన పూర్తిగా అసంబద్ధం. అసెంబ్లీ లాంటి హైసెక్యూరిటీ జోన్‌లోనే ఇలా జరిగి ఉంటుందని చెబుతున్నారంటే మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు’ అని ప్రతిపక్ష సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ఎడిట్ చేసి... పాత ఫుటేజీలు కలిపి..
 డిసెంబర్ 18 నాటి ఫుటేజీని అన్ని పార్టీలకు ఇచ్చామని, వాటిని విడుదల చేయాలా వద్దా అనేది వారికే వదిలేశామని 24న స్పీకర్ చెప్పారు. రెండు పార్టీలకు వేర్వేరు డీవీడీలు ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారా లేక అసెంబ్లీ కార్యదర్శి అలా చేశారా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తమకు అందిన డీవీడీలు ఎడిట్ చేసి ఉన్నాయని, అందులో ఫుటేజీ కూడా పాతవి కలిపారని వారు పేర్కొంటున్నారు.

 1. రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతున్న 18న ఆమె పసుపుపచ్చ రంగు చీర ధరించారు. కానీ డీవీడీల్లో గులాబీ రంగు చీర ధరించినట్లుగా ఉంది. అది 17 నాటిది.
 2. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్యాంట్ షర్ట్ ధరించినట్లుగా ఉంది. కానీ చెవిరెడ్డి గోవిందమాల ధరించి హాజరయ్యారు.
 3. జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చేశారని చెబుతున్న సమయంలో సభ వాయిదా పడింది. స్పీకర్ తన స్థానంలో లేరు.
 సభ వాయిదా పడిన తర్వాత  కార్యకలాపాలను రికార్డు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇలా రికార్డు చేయడమే కాక వాటిని బహిర్గతం చేయడం కుట్ర కాక మరేమిటి? అని వైఎస్సార్సీపీ సభ్యులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement