మోదీజీ.. బుల్లెట్స్ కాదు, బుక్స్ కొంటాం!
మానవ పరిణామక్రమంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. కేవలం ఆకృతిలోనే కాదు.. ఆలోచనల్లోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న పిల్లల మెదళ్లు సైతం పెద్దపెద్ద విషయాలు ఆలోచిస్తున్నాయి. ఇతరులనూ ఆలోచింపజేస్తూ ఎంతో పరిణితితో వ్యవహరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు కయ్యానికి కాలుదువ్వుతుంటే ఆ దేశాల్లోని చిన్నారులు మాత్రం శాంతిని కోరుకుంటున్నారు. మొన్న బనా అలబెద్ అనే సిరియా చిన్నారి.. తమ దేశానికి యుద్ధం నుంచి విముక్తి కల్పించాలంటూ ట్విట్‌లు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించగా తాజాగా మరో పాక్ బాలిక వార్తల్లో నిలిచింది.
అకిదత్ నవీద్... పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఈ బాలికది కూడా మీ అందరిలాగే ఆడుకునే వయసే. కానీ చిన్న వయసులోనే ఎంతో పరిణితితో వ్యవహరిస్తోంది. ప్రపంచంలోని ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటోంది. ముఖ్యంగా దాయాదులైన భారత్–పాక్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తోంది. అదేముంది.. అందరూ అలాగే కోరుకుంటారు కదా..? అందులో గొప్పేముంది..? అనుకుంటున్నారు కదూ.. కానీ అకిదత్ అందరిలాగా కోరుకుంటూ కూర్చోలేదు.. మనదేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలు నెలకొనేలా చొరవ తీసుకొని పాక్ ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలని లేఖలో పేర్కొంది.
లేఖలో అకిదత్ ఏం రాసిందంటే...
’’ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఓ అద్భుత విషయమని ఒకసారి మా నాన్న నాకు చెప్పారు. మీరిప్పుడు అదే అద్భుతాన్ని సాధించారు. యూపీ ఎన్నికల్లో విజయం సాధించి భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ మరింతమంది హృదయాలను గెలుచుకోవాలంటే.. ముఖ్యంగా భారత్, పాకిస్తానీల హృదయాలను గెలుచుకోవాలంటే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక, శాంతి సంబంధాలను నెలకొల్పేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడం ఎంతో అవసరం. ఇక నుంచి బుల్లెట్స్ కొనకూడదని, బుక్సే కొనాలని మేం నిర్ణయించుకున్నాం. ఇరు దేశాల మధ్య సంబంధాలపై మనం నిర్ణయం తీసుకోవాలి. శాంతియుత మార్గమా..? లేక సమస్యాత్మక మార్గమా..? చాయిస్ మనదే..!
గతంలో సుష్మాస్వరాజ్‌కు కూడా...
లాహోర్ కు చెందిన ఈ బాలిక గతంలో కూడా విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కూడా లేఖ రాసింది. ఆ లేఖలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి సంబంధాలు అవసరమని పేర్కొంది. స్నేహ సంబంధాలు పెంపొం దేందుకు విదేశాంగశాఖ మంత్రిగా చొరవ తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. –స్కూల్ ఎడిషన్