ప్రాణంకోసం రూపాయి పోరాటం
ప్రాణంకోసం రూపాయి పోరాటం
Published Sun, Sep 8 2013 3:54 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్): ఆర్థిక వృద్ధిరేటు బలహీనపడటానికిప్రధాని మన్మోహన్‌సింగ్ కారణమని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ అయిన మన్మోహన్ ఉన్నా కూడా రూపాయి ఆస్పత్రి పాలైందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రూపాయి ప్రాణం కోసం ఆస్పత్రిలో పోరాడుతోందన్నారు. తెలంగాణ, పేదరికం వంటి సున్నిత అంశాలపై కాంగ్రెస్ పార్టీకీ, కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు. డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం అంబికాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ర్యాలీలో ప్రసంగించిన నరేంద్రమోడీ మన్మోహన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలపైనా విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో మన్మో హన్ సింగ్, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ పదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారని, అయితే ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలకు రమణ్‌సింగ్ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తే, మన్మోహన్‌సింగ్ రూపాయిని చావుబతులకు మధ్య ఊగిసలాడేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తోందని, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా రమణ్‌సింగ్‌ను గెలిపించి అభివృద్ధి కొనసాగేలా చూడాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం భావించే విధానం బట్టి పేదరికం ఆధారపడి ఉంటుందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన మోడీ.. ఆయన వ్యాఖ్యలు గరీబీ హఠావో అన్న ఇందిరా గాంధీకి కూడా బాధ కలిగిస్తాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 32 ఖర్చు చేస్తే వారు పేదలు కారన్న ప్రణాళికా సంఘం అంచానాలను మోడీ తీవ్రంగా ఆక్షేపించారు.
Advertisement