ఫ్రాన్సు స్కూల్లో కాల్పులు.. విద్యార్థి అరెస్టు
ఫ్రాన్సులోని గ్రేస్ పట్టణంలోని ఒక హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఒక నిందితుడు పరారీలో ఉండగా, మరొకరిని అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఇదే హైస్కూలుకు చెందిన ఓ విద్యార్థిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడు కాల్పులు జరిపినవారిలో ఉన్నాడా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు. టాక్‌విల్లె హైస్కూల్లో గురువారం జరిగిన ఈ కాల్పులలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పట్టణంలోని అన్ని స్కూళ్లు నైస్ నగరానికి పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర సోమ్ ప్రాంతానికి వెళ్లాల్సిన హోంశాఖ మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తన పర్యటనను రద్దుచేసుకున్నారు.
లెటర్ బాంబు కూడా...
ప్యారిస్ నగరంలో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) కార్యాలయానికి గురువారమే ఒక లెటర్ బాంబు వచ్చింది. అది పేలడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఒకేరోజు ఫ్రాన్స్‌లో రెండు ఘటనలు జరగడంతో అక్కడి ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు.