జెయింట్ వీల్ సెల్ఫీ ఎంత పనిచేసింది...
లక్నో: యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని భాగపత్ జిల్లాలో ఇలాంటి సెల్పీ ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. ఇలాగే మేళా ఉత్సవానికి హాజరైన ఓ బాలిక జెయింట్ వీల్ ఎక్కింది. ఈ ఉత్సాహంలో సెల్పీ తీసుకుంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా జరిగే ఉత్సవానికి హాజరైన ఓ 16 ఏళ్ల అమ్మాయి ఫెర్రీస్ వీల్ (జెయింట్ వీల్) సెల్పీ తీసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆమె ఏమరుపాటుతో ప్రాణాల మీదికి తెచ్చుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా ఫెర్రీస్ వీలు చక్రంలో జుట్టు చిక్కుకొంది. దీంతో జుట్టంతా ఊడి వచ్చి, మొఖమంతా రక్తమోడుతో విలవిల్లాడింది. దీంతో కంగారు పడిన జెయింట్ వీల్ నిర్వాహకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.