బాధితురాలు దార్య యురీవా
న్యూఢిల్లీ: వారణాసిలో యాసిడ్ దాడికి గురైన రష్యా యువతి దార్య యురీవా(23) స్వదేశానికి వెళ్లిపోయింది. బాధితురాలు మాస్కోకు వెళ్లిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రష్యాలో ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు భారత్ భరిస్తుందని బాధితురాలికి హామీయిచ్చినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షలు ప్రకటించిందని తెలిపారు.
బాధితురాలిని తల్లిని రష్యాలోని తమ రాయబారి కలిశారని, అవసరమైన సాయం భారత ప్రభుత్వం అందిస్తుందని భరోసాయిచ్చారని చెప్పారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని సుష్మ ఆకాంక్షించారు.
వారణాసిలో శుక్రవారం యురీవాపై యాసిడ్ దాడి జరిగింది. పెయింగ్ గెస్ట్ గా దిగిన ఇంటి యజమాని మనవడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో బాధితురాలికి 45 శాతం గాయాలయ్యాయి. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.