అది జాతిపై దాడే!
భావప్రకటన స్వేచ్ఛపై దాడి పట్ల మాజీ ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న అసహనపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించారు. భావప్రకటన స్వేచ్ఛపై దాడిని జాతిపై దాడిగా అభివర్ణించారు. దేశంలో భిన్నత్వానికి, లౌకికవాదానికి, బహుళత్వానికి భంగం వాటిల్లితే అది గణతంత్ర వ్యవస్థకే ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ‘దేశంలో ఇటీవల కొన్ని శక్తులు భావప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత ఆలోచన ధోరణి, నమ్మకాలపై దాడులకు తెగబడ్డాయి. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తినే తిండి, కులంపై భిన్నాభిప్రాయం వ్యక్తమైందన్న అసహనంతో దాడులకు తెగబడడం ఏ కోణంలో చూసినా సమర్థనీయం కాదు’ అని పేర్కొన్నారు.
శుక్రవారమిక్కడ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో మన్మోహన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న అసహన ఘటనలను మేధావులంతా తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు. భిన్నత్వం, లౌకికత్వం, బహుళత్వాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి ఉన్నప్పుడే గణతత్రం వర్ధిల్లుతుందని చెప్పారు. స్వేచ్ఛ లేని చోట శాంతి ఉండదని, శాంతియుత పరిస్థితులు మృగ్యమైతే అభివృద్ధి, ఆర్థిక, మేధోవికాసం కుంటుపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరి హృదయానికి స్వేచ్ఛ అవసరమైనట్టే ఆర్థికాభివృద్ధికి కూడా స్వేచ్ఛ అవసరమని అన్నారు.
దేశంలో అన్ని మతాలకు రాజ్యాంగం సమాన గౌరవం కల్పించిందన్నారు. మతం అనేది వ్యక్తిగతమని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. లౌకిక దేశంలో ఏ మతం కూడా ప్రభుత్వ విధానాలు, పాలనను నిర్దేశించజాలదన్నారు. కాగా, మన్మోహన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. ఆయన పేర్కొన్న ఘటనలు బీజేపీయేతర, కాంగ్రెస్ రాష్ట్రాల్లోనే జరిగిన సంగతిని గుర్తించాలంది.