5 కోట్లు దోచిన దొంగలు
Published Tue, Aug 9 2016 7:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
-రూ.5.75 కోట్ల ఆర్‌బీఐ సొమ్ము చోరీ
-రైలు బోగీలో రూ.342 కోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై
దొంగా- దొంగ సినిమా చూశారా.. ఆర్బీఐ మింట్ నుంచి వచ్చిన కంటైనర్ ను దోచేందుకు ప్లాన్ తో నడుస్తుంది సినిమా.. అచ్చంగా ఆలాంటి దోపిడీనే జరిగింది తమిళనాడులో.. ఆర్బీఐ నుంచి వచ్చిన రైలు బోగీకి కన్నం వేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు దొంగలు. రైలుకే కన్నం వేశారు. రూ.342 కోట్లతో ప్రయాణిస్తున్న రైలులోని ఒక బోగీకి కన్నం వేసి రూ.5.75 కోట్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి సేకరించిన రూ.342 కోట్ల పాత, చిరిగిన కరెన్సీని 228 చెక్కపెట్టెల్లో అమర్చి సేలం-ఎగ్మూరు (చెన్నై) ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ప్రత్యేక బోగీలో పెట్టారు. ఈ సొమ్మును చెన్నైలోని ఆర్‌బీఐ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సేలంలో సోమవారం రాత్రి 9 గంటలకు సాధారణ ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలు మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఉదయం 11 గంటలకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆర్‌బీఐ అధికారులు బోగీ పైభాగంలో మనిషి దూరేంత కన్నం వేసి ఉండడాన్ని గుర్తించారు. 16 చెక్కపెట్టెలు పగులగొట్టి కొంత కరెన్సీని దోచుకున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమికంగా రూ.5.75 కోట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement