అమియో డీజిల్ వేరియంట్... రేటెంతో తెలుసా?
Published Fri, Sep 30 2016 5:12 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
పండుగ సీజన్లో కస్టమర్లను మురిపించేందుకు యూరప్ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్వాగన్ అమియో డీజిల్ వేరియంట్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.6.27 లక్షలుగా కంపెనీ పేర్కొంది. టాప్ వేరియంట్ ధర రూ.9.32 లక్షలుగా(ఎక్స్ షోరూం ఢిల్లీలో) కంపెనీ వెల్లడించింది. హోండా అమేజ్, టాటా జిస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ అసెంట్లకు గట్టిపోటీగా వచ్చిన ఫోక్స్ వాగన్ అమియో పెట్రోల్ వెర్షన్కు.. తోబుట్టువుగా ఈ డీజిల్ వెర్షన్ ను ఫోక్స్వాగన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఈ డీజిల్ కారును కూడా మూడు వేరియంట్లలో ఫోక్స్వాగన్ ప్రవేశపెట్టింది.
ఈ ఏడాది వేసవిలో తీసుకొచ్చిన 'మేడ్ ఇన్ ఇండియా' పెట్రోల్ వెర్షన్ విజయవంతమైనదని ఫోక్స్ వాగన్ ప్యాసెంజర్ కార్ల ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ తెలిపారు. పండుగల సీజన్ కానుకగా ప్రస్తుతం ఈ డీజిల్ వేరియంట్ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. 5 స్పీడ్ మాన్యువల్తో దీన్ని రూపొందించారు. అదేవిధంగా ఎక్కువ ప్రజాదరణ కలిగిన 7-స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ని కూడా దీనిలో అమర్చినట్టు చెప్పారు.చాలా ఉత్తమమైన లక్షణాలతో, హై క్వాలిటీ క్యాబిన్ను ఈ కారు కలిగి ఉంది.
భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఫోక్స్ వాగన్ అమియో డీజిల్ను వెర్షన్ను ఆవిష్కరించారు. డ్రైవర్ సీటుతో పాటు ఆ పక్క సీటు వాళ్లకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ ఇందులో ఉన్నాయి. నేటి నుంచి అన్ని షోరూంలలో ఈ వేరియంట్ను బుక్ చేసుకునే సదుపాయం ఫోక్స్వాగన్ కల్పించింది. మార్కెట్లో లభ్యమౌతున్న అన్ని వేరియంట్లలో కన్నా స్టాండర్ట్ ఫింట్ మెంట్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ను ఏర్పాటుచేశారు.
Advertisement