మా శరీరాలపై మీ పెత్తనం ఏమిటీ? | Why isn't marital rape a criminal offence in India | Sakshi
Sakshi News home page

మా శరీరాలపై మీ పెత్తనం ఏమిటీ?

Published Wed, Aug 30 2017 5:57 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

మా శరీరాలపై మీ పెత్తనం ఏమిటీ? - Sakshi

మా శరీరాలపై మీ పెత్తనం ఏమిటీ?

సాక్షి, న్యూఢిల్లీ: మారిటల్‌ రేప్, అంటే భార్య అనుమతి లేకుండా ఆమెపై భర్త లైంగిక దాడి జరపడం. దీన్ని భారత్‌లో కూడా నేరంగా పరిగణించాలని పలు మహిళా సంఘాలు, జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే దీన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తేల్చి చెప్పింది.
భారత్‌కున్న విభిన్న సంస్కతి, సంప్రదాయాలను, సామాజిక దక్పథాన్ని, ముఖ్యంగా పెళ్లనే పవిత్ర బంధాన్ని సాకులుగా చూపించింది. అలాగే విద్యాçపరంగా, ఆర్థికంగా మహిళలు వెనకబడి పోవడం వల్ల మారిటల్‌ రేప్‌ను వారు ఎక్కువగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

వరకట్నం కేసులను అరికట్టేందుకు తీసుకొచ్చిన భారతీయ శిక్షాస్మతిలోని 498 ఏ సెక్షన్‌ను మహిళలు దుర్వినియోగం చేయడం లేదా? మరి ఆ సెక్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు. ‘నా శరీరంపై సర్వహక్కులు నావే’ అనే నారీ నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న నేటి ఆధునిక యుగంలో మారిటల్‌ రేప్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం తప్పా? మహిళలపై జరిపే హింసల్లో మారిటల్‌ రేప్‌ను కూడా చేరుస్తూ 1993లో ఐక్యరాజ్య సమితి ‘ఎలిమినేషన్‌ ఆఫ్‌ వాయలెన్స్‌ అగనెస్ట్‌ వుమెన్‌’ డిక్లరేషన్‌ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐరోపా మానవ హక్కుల సంఘం కూడా మారిటల్‌ రేప్‌ను హింసగా పరిగణించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. దీంతో పలు పాశ్చాత్య దేశాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. భారత్‌లో కూడా దీన్ని నేరంగా పరిగణించాలంటూ పలు మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లో మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించాలంటూ జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ 2013, జనవరి నెలలో సిఫార్సు చేసింది. దీన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015, ఏప్రిల్‌ నెలలో ఈ అంశం పార్లమెంట్‌లో ప్రస్థావనకు వచ్చింది. అప్పుడు పెళ్లి ఒక పవిత్ర బంధంగా గుర్తిస్తున్న భారత్‌ లాంటి సమాజంలో, బలమైన సామాజిక కట్టుబాట్లు, దారిద్య్రం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మన దేశంలో మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌధరి స్పష్టం చేశారు. కొన్ని మాటలు అటు, ఇటుగా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కూడా అదే చెప్పింది.

2015, జూన్‌ నెలలో ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, చౌధరి అభిప్రాయంతో విభేదించారు. మగవాడి ఆధిపత్యానికి, అహంకారానికి, మహిళల అణచివేతకు మారిటల్‌ రేప్‌ ఓ చిహ్నంగా మారిందని, దాన్ని నేరంగా పరిగణించాల్సిందేనని ఆ ఇంటర్వ్యూలో మేనకా గాంధీ మాట్లాడారు. ఇప్పుడు మాటమార్చి ప్రభుత్వ వైఖరికి వంతపాడారు. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించడం పాశ్చాత్య దేశాల్లో చెల్లుబాటు అవుతుందిగానీ, భారత్‌ లాంటి దేశాల్లో కాదని అన్నారు.

ఎందుకు కాదు?
సాధారణ రేప్‌ కేసుల్లోలాగానే మారిటల్‌ రేప్‌లను పరిగణించి భర్తలను కఠినంగా శిక్షించాలని ఏ భార్య, ఏ మహిళా సంఘం కోరుకోవడం లేదు. సెక్స్‌ అనేది పరస్పర అంగీకారంతో కొనసాగాలిగానీ, ఇంటి పనులు, బయటి పనులతో అలసి సొలసి వచ్చే భార్యల శారీరక, మానసిక పరిస్థితులను పట్టించుకోకుండా తప్పతాగో లేదా మగవాడి హక్కనో దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకునేందుకే నేరంగా పరిగణించాలని వారు కోరుతున్నారు. ముందుగా చిన్న శిక్షలతో మొదలు పెట్టి, పదే పదే నేరం చేసినట్లయితేనే కఠిన శిక్షలు వేయాలంటున్నారు. ముఖ్యంగా తమ శరీరాలపై మగవాడి పెత్తనం ఏమిటీ? అని ప్రశ్నిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement