మునగాకు సాగు మేలు | Good, of drumstick cultivation | Sakshi
Sakshi News home page

మునగాకు సాగు మేలు

Published Mon, Jun 30 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

మునగాకు సాగు మేలు

మునగాకు సాగు మేలు

ఈ రైతన్న దారే వేరన్నా..
     
మునగాకు సాగుతో ఎకరానికి రూ. లక్షన్నర వరకు ఆదాయం
20 రకాల పశుగ్రాసాల నర్సరీ, విత్తన నిధి ఏర్పాటు
సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై చిన్న రైతులకు ఉచిత సేవలు
కొత్త పంటలతో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న విద్యాధిక రైతు రాజేంద్రరెడ్డి

 
 ఉన్నత వ్యవసాయ విద్యను అభ్యసించి..వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వాళ్లేమి చేయాలి? ఆ ప్రాంతంలో సాధారణ రైతుల ఊహకు కూడా అందని కొత్త దారి తొక్కాలి.. విభిన్నమైన పంటలు పండించాలి.. తక్కువ ఖర్చుతో అధికాదాయం వచ్చే పంటల సాగు చేయాలి.. పర్యావరణహితమైన, అత్యాధునికమైన సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు లోకానికి అన్ని విధాలా మార్గదర్శకులుగా నిలవాలి.. అప్పుడే వారి చదువుకు సార్థకత చేకూరుతుంది.. జన్మనిచ్చిన గడ్డ రుణం కొంతైనా తీరుతుంది! ఎమ్మెస్సీ  పట్టాపొంది.. సేంద్రియ వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన సన్నాడి రాజేంద్రరెడ్డి సరిగ్గా ఇదే చేస్తున్నారు!! అందరూ పండించే పంటల జోలికిపోకుండా.. విలక్షణమైన పంటలతో కొత్త బాటలు వేస్తున్నారు..
 
రాజేంద్రరెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని రౌతుసూరవూల. తాతల కాలం నుంచి వారిది వ్యవసాయ కుటుంబం. ఢిల్లీలో ఏజీ ఎమ్మెస్సీ చదివి పదేళ్ల పాటు సుస్థిర వ్యవసాయ సలహాదారుగా వివిధ సంస్థల్లో పనిచేశారు. ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్‌లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రెండేసి వారాల పాటు అక్కడి రైతులకు శిక్షణనిచ్చిన అనుభవం ఆయన సొంతం. తండ్రి సురేంద్రనాథ్‌రెడ్డి మరణంతో స్వగ్రామానికి చేరుకొని 20 ఎకరాల సొంత పొలంలో ఎనిమిదేళ్లుగా ఆదర్శప్రాయమైన వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు ఖర్చును సగానికి సగం తగ్గించుకుంటూనే చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

మునగాకు సాగు ఇలా..

 మునగ ఆకును పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ.. ఎకరానికి ఏడాదికి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి 160 మొక్కలు చొప్పున ఐదెకరాల్లో మామిడి, ఎకరంన్నరలో సపోటా, అరెకరంలో జామ తోటలు వేసిన రాజేంద్రరెడ్డి.. మరో మూడున్నర ఎకరాల్లో మునగ తోటను కాయల కోసం కాకుండా కేవలం ఆకు కోసమే సాగు చేస్తున్నారు. అడుగుకొకటి చొప్పున ఎకరానికి 43,000 మునగ మొక్కలు(పీకేఎం, కరుంబు మునుంగ రకాలు) వేస్తున్నారు.  6 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేసిన మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పిచికారీ చేయడంతో ఆకులపై దుమ్ము, పురుగుల గుడ్లు ఎప్పటికప్పుడు కడిగినట్లయి నాణ్యమైన దిగుబడి వస్తోంది. ఎకరానికి టన్ను- టన్నున్నర వర్మీ కంపోస్టు, టన్ను వేప పిండి వేస్తున్నారు. ఆవు మూత్రం, పేడ, మజ్జిగ, లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా తదితరాలను కలిపి తయారు చేసుకున్న ‘బయో బూస్టర్’ను 10-15 రోజులకోసారి.. 1:9 పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. గొంగళి పురుగు నివారణకు వావిలాకు కషాయాన్ని పిచికారీ చల్లుతున్నారు. 45 రోజులకోసారి మునగ కొమ్మలు నరికి ఆకును ఎండబెడతారు. ఎకరంలో ఏడాదికి టన్ను- టన్నున్నర బరువైన ఎండు మునగాకు దిగుబడి వస్తుంది. ఎకరానికి రూ. 30 వేల వరకు ఖర్చవుతున్నదని రాజేంద్రరెడ్డి చెప్పారు. ముందస్తు ఒప్పందం మేరకు ‘ఆర్గానిక్ ఇండియా’కు ఎండు మునగాకును కిలో రూ. వంద ధరకు అమ్ముతున్నారు. ఆ సంస్థ మునగాకును అమెరికాకు ఎగుమతి చేస్తోంది. క్యాల్షియం లోపాన్ని తీర్చి, 350-400 వ్యాధులను అరికట్టే సేంద్రియ మునగాకుకు అమెరికాలో గిరాకీ ఉందంటూ.. అయితే ‘పేదలు తినే ఆహారం’గా భావిస్తూ మునగాకును మన వాళ్లు దీన్ని విస్మరిస్తున్నారని రాజేంద్రరెడ్డి అన్నారు.  వుునగాకుతో తయూరు చేసిన తేనీరును తాగితే రోగనిరోధకశక్తి పెంపొందడమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు కూడా దూరవువుతాయుని శాస్త్రీయుంగా రుజువైనట్లు ఆయన చెప్పారు.

గడ్డి మొక్కల నర్సరీ, విత్తన నిధి!

 డెయిరీలు నెలకొల్పుతున్న పాడి రైతులు మేలైన వివిధ గడ్డి జాతుల పిలకలు, విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ అవసరాన్ని గుర్తించిన రాజేంద్రరెడ్డి వుధ్యప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర  రాష్ట్రాల నుంచి సేకరించి.. బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఐదెకరాల్లో 20 రకాల మేలైన గడ్డి జాతుల నర్సరీని, విత్తన నిధిని ఏర్పాటు చేశారు. కో-4 వంటి అధిక దిగుబడినిచ్చే గడ్డి జాతి నుంచి బెట్టను తట్టుకునే జాతులు, గొర్రెలు, మేకల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన గడ్డి జాతులను ఆయన సాగు చేస్తూ రైతాంగానికి అందుబాటులో ఉంచారు. 45 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది.  ఎకరంలో ఏడాదికి 160 టన్నుల గడ్డి దిగుబడిని  పొందుతున్నారు. పిలకలు లేదా విత్తనంతో నిరంతరాయంగా పదేళ్ల వరకు గడ్డిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.

గొర్రెలు, మేకలు, ఆవులు..

 వ్యవసాయుక్షేత్రంలో పంటలతో పాటు ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే 60 నారీ సువర్ణ రకపు గొర్రెలను పెంచుతున్నారు. ఇవి రెండేళ్లలో మూడు సార్లు ఈనుతాయి. 20 తలచూర్ మేకలతోపాటు.. టీటీడీ సౌజన్యంతో గోశాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. సువూరు 50 వరకు ఒంగోలు, నాటు ఆవులు ఉన్నాయి. కబేళాకు తరలించే వాటిని రక్షించి తెచ్చి పెంచుతున్నానని, వీటిని ఆప్యాయుంగా నివుురుతుంటే గొప్ప ఆత్మానందం కలుగుతుందని రాజేంద్రరెడ్డి అంటున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయు నిపుణులు, రైతులు సందర్శించి స్ఫూర్తి పొందుతుంటారు. వుహారాష్ట్రలోని నివ్కుర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ చందానివ్కుర్, ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయుం(తిరుపతి) వీసీ డాక్టర్ ప్రభాకర్ రావు సందర్శించి ఆయన కృషిని అభినందించారు. వుదనపల్లిలోని రిషివ్యాలీ స్కూల్ విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించి సాగు విజ్ఞానాన్ని వుదినిండా పదిలపరుచుకొని వెళ్లారు. అందరూ పండించే సాధారణ పంటలు కాకుండా.. తనకు మంచి ఆదాయాన్నివ్వడంతోపాటు ఇతర రైతులకూ ఉపయోగపడే పంటలను పండిస్తూ.. తక్కువ ఖర్చుతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం దిశగా దృఢ చిత్తంతో అడుగులు వేస్తున్న రాజేంద్ర రెడ్డి రైతాంగం మదిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు. వ్యవసాయాన్ని కొత్త ఆలోచనలతో సుస్థిరం చేసే సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తున్నారు.    

 - చెంచురెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
 
సేంద్రియ సాగుతో ఖర్చు తగ్గుతుంది!
 
అన్ని పనులూ స్వయంగా చేసుకోగలిగిన రైతులకు సేంద్రియ వ్యవసాయం ఎంతో ఉపయోగం. ఖర్చు 50% తగ్గుతుంది.  అన్ని పనులకూ కూలీలపై ఆధారపడితే మాత్రం ఖర్చు తగ్గదు. సేంద్రియ ఫలసాయానికి 25% వరకు అధిక ధర వస్తుంది. ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పించగలిగితే రైతు సులభంగా సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గుతాడు. ఎరువులు, పురుగుమందుల దుకాణదారుల మాటలపై ఆధారపడుతున్న రైతులకు సకాలంలో సరైన సలహా ఇవ్వగలిగితే వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి రైతునూ సేంద్రియ రైతుగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చిన్న రైతులకు ఉచితంగానే సలహాలు సూచనలు ఇస్తున్నా. గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ సలహాదారులుగా తీర్చిదిద్దాలి.

 - సన్నాడి రాజేంద్రరెడ్డి(9347021752),
 సేంద్రియ రైతు,  సుస్థిర వ్యవసాయ నిపుణుడు,
 రౌతుసూరవూల, తొట్టంబేడు మండలం, చితూరు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement