► అనంతపురం జిల్లాలో రైతుల పాలిట కల్పతరువు కినోవా
► డా. చోహన్‌క్యూ పద్ధతితో రెట్టింపయిన దిగుబడులు
► రబీలో ఆరుతడి సాగు
► ఎకరానికి 1012 క్వింటాళ్ల దిగుబడి
► ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం
సంప్రదాయ పంటల సాగుతో కుదేలై వలసలు వెళుతున్న చోట కినోవాను సాగు చేసి చక్కని నికరాదాయాన్ని కళ్ల చూస్తున్నారా రైతులు. నీటి వసతి ఉన్న రైతులు రబీ పంటగా సాగు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన చోహాన్‌క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి రెట్టింపు దిగుబడులు సాధించటమే కాదు.. ఒప్పంద సాగుతో అధిక నికరాదాయం ఆర్జనకు కొంగొత్త బాటలు వేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం కరవుకు మరో పేరు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వ్యవసాయం గిట్టుబాటు కాక పొరుగు రాష్ట్రాలకు, పట్టణాలకు ప్రజల వలసలు నిత్యకృత్యంగా మారాయి.
అలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ప్రకృతి సేద్య పద్ధతిలో కొత్త పంట కినోవా సాగుతో సేద్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు కొందరు రైతులు. కదిరి ప్రాంతంలో రైతులు ఏటా సజ్జ, విత్తనం మొక్కజొన్న పంటలను సాగు చేసేవారు. శ్రమ, ఖర్చు ఎక్కువగా ఆదాయం తక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యాపార సంస్థతో కొనుగోలు ఒప్పందం చేసుకున్న కొందరు రైతులు 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కినోవా సాగును చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి బోరు నీటితోనే రైతులు కినోవాను ఆరుతడి పంటగా సాగు చేసి మంచి ఆదాయం పొందుతుండడం విశేషం.
చోహన్‌క్యు పద్ధతిలో కినోవా సాగు..
చోహన్‌క్యు దక్షిణ కొరియాకు చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త. రసాయనిక వ్యవసాయం మున్ముందు చేయబోయే విధ్వంసాన్ని గుర్తించి ఏభయ్యేళ్ల క్రితమే ఎలుగెత్తి చాటడంతోపాటు.. రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగల దేశీయ సూక్ష్మజీవుల (ఐ.ఎం.ఓ.ల) ద్వారా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయొచ్చో చెప్పిన దార్శనికుడు చోహాన్‌క్యు. అనంతపురం జిల్లా రైతులు కొందరు కలసికట్టుగా ఈ ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం సంతోషదాయకం. ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని ఎకరాకు 150 కిలోల బొగ్గు పొడి లేదా బూడిద లేదా కాల్చిన వరిపొట్టు, 50 కిలోల అడవి మట్టి, 50 కిలోల వేపపిండి, పశువుల ఎరువు వేసుకున్నారు. అక్టోబరు 10న పంటను విత్తుకున్నారు. సాళ్ల మధ్య అడుగున్నర, మొక్కల మధ్య అడుగు దూరం ఉంచారు. ఎకరాకు ముప్పావు కిలో తెల్ల కినోవా విత్తనం ఉపయోగించారు. పాదుకు మూడు, నాలుగు విత్తనాలు చొప్పున విత్తుకున్నారు. మొలిచిన ఒకట్రెండు బలమైన మొక్కలను ఉంచి, మిగిలిన వాటిని తొలగించారు.
ప్రతి 10 రోజులకోసారి పిచికారీ
పైరుకు పోషకాలను అందించేందుకు పలు రకాల పండ్లు, ఆకులు, ఎముకలతో తయారు చేసిన రసాలను వాడారు. పైరు 20 రోజుల దశ నుంచి ప్రతి 10 రోజులకోసారి రసాలను పిచికారీ చేశారు. వీటితో పాటు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఐఎంవోను తయారు చేసుకొని పంటలకు ఇచ్చారు. నెల రోజులకు కూలీలతో కలుపు తీయించారు. పంటను విత్తుకున్న 15 రోజుల వరకు ప్రతి మూడు రోజులకోసారి.. తరువాత వారానికోసారి నీటి తడులు ఇచ్చారు.
చోహన్‌క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రైతులకు పరిచయం చేసి ప్రోత్సహించే ఉద్దేశంతో ఓరిలెంట్ సంస్థే వీటిని తయారు చేసి ఎప్పటికప్పుడు అందించడం.. సూచనలు, సలహాలను క్రమం తప్పకుండా అందించడంతో రైతులకు ఈ కొత్త సాగు పద్ధతిలోనూ ఇబ్బందులు ఎదురుకాలేదు. 85 రోజులకు పంట కోతకొచ్చింది. పైరు నుంచి కినోవా కంకులను కోసి 4 రోజులు ఎండబెట్టి, యంత్రంలో వేసి మిల్లు పట్టారు. తర్వాత గింజలను మరోసారి పట్టాలపై వేసి ట్రాక్టర్‌తో తొక్కించి మళ్లీ మిల్లు పట్టారు. దీనివల్ల కినోవా గింజలపైన ఉండే చేదు పొర తొలగిపోతుంది. కోత కోశాక పంట మోళ్లను రోటావీటర్‌తో పొలంలో కలియదున్నారు.
డా. చో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కినోవా సాగు రైతులకు పలు విధాలుగా లాభదాయకంగా ఉందని ఓరిలెట్ సంస్థ వ్యవసాయ పర్యవేక్షకుడు కె. ఎల్. ఎన్. సత్యనారాయణ(87907 56653) అన్నారు. ద్రావణాలు, రసాల ద్వారానే పంటకు అవసరమైన పోషకాలను అందిస్తున్నామన్నారు. భూమిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరగడంతో భూసారం పెరుగుతోందన్నారు. ప్రభుత్వాలు కినోవా సాగును ప్రోత్సహిస్తే, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఓరిలెట్ సంస్థ యజమాని పరుచూరి శేషాంజనేయులు(99597 95286) అంటున్నారు.
ఎకరానికి 1012 క్వింటాళ్ల దిగుబడి
ట్రాక్టర్, అరక కిరాయిలు, కలుపు తీత, నూర్పిడి, మిల్లింగ్ సహా ఎకరా కినోవా సాగుకు రూ. 10 వేలు ఖర్చయింది. గతంలో రసాయనిక పద్ధతుల్లో సాగు చేసిన రైతులకు ఎకరాకు 57 క్వింటాళ్ల దిగుబడి రాగా.. చోహన్‌క్యు పద్ధతుల్లో సాగు చేసిన రైతులకు 1012 క్వింటాళ్ల దిగుబడి రావడం చెప్పుకోదగ్గ విషయం. ఖర్చులు పోను ఎకరాకు రూ. 50 వేల వరకు నికరాదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు. ఇది మూడు నెలల్లోనే లభించిన ఆదాయం కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. చెరువు శ్రీనివాస రెడ్డి, సాక్షి, కదిరి, అనంతపురం జిల్లా
కినోవా సాగుతో వలసలను ఆపొచ్చు
తొలిసారిగా మూడెకరాల్లో కినోవాను సాగు చేశాను. ఇదేం పంట అని తోటి రైతులు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత అభినందిస్తున్నారు. 30 క్వింటాళ్లకు పైగా కినోవా దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కినోవా సాగుపై రైతులకు అవగాహన కల్పించి.. మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. వలసలు ఆగుతాయి. -- రొద్దం రఘునాథరెడ్డి (94918 63710), కినోవా రైతు, కదిరి, అనంతపురం జిల్లా
రెండెకరాల్లో 22 క్వింటాళ్ల దిగుబడి
నేను 2 ఎకరాల్లో కినోవా పంట పండించాను. ఓరిలెట్ ఫుడ్స్ వారి సూచనలు పాటించి, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేశాను. 2 ఎకరాలకు 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట కూడా 75 రోజుల్లో పూర్తయింది. ఖర్చు ఎకరాకు రూ.10 వేలు పోను రూ. 1.30 లక్షల దాకా చేతికి రావచ్చు. -- సానె లోక్‌నాథ్‌రెడ్డి ( 77308 02662), కినోవా రైతు, నల్లగుట్లపల్లి, ఓడి చెరువు మండలం, అనంతపురం జిల్లా
కినోవా సాగు మేలు..
నేను 1.75 ఎకరాల్లో కినోవా పంట బోరు బావి కింద సాగు చేశాను. ఓరిలెట్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కొనుగోలు ఒప్పందం చేసుకొని పంట పండించాను. ఎకరాకు అన్నీ కలిపి రూ.10 వేల ఖర్చు వచ్చింది. 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే కినోవా సాగుతో మంచి లాభాలు కళ్ల జూడొచ్చు. -- ఎరగొండ రమణారెడ్డి (90007 14150), కినోవా రైతు, తెల్లగుట్లపల్లి, నల్లచెరువు మండలం, అనంతపురం జిల్లా
సాగు ఖర్చు తక్కువ..
90 సెంట్లలో 9 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. ఖర్చు రూ. 12 వేలు కాగా, రూ. 60 వేల ఆదాయం వచ్చింది. మిగతా పంటలతో పోలిస్తే కినోవా సాగుతో రైతుకు మేలే జరుగుతుంది. -- జెన్నే రవిచంద్ర (80089 36127), కినోవా రైతు, మలయ్యగారిపల్లి, కదిరి మండలం, అనంతపురం జిల్లా
పందులు, కోతుల బెడద లేని పంట!
కూలీల కొరత, అడవి పందుల బెడద, సాగు నీటి కొరత, అధిక ఖర్చులు, మార్కెట్ ధరల పతనం వంటివి అందరు రైతుల లాగానే వారు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఇబ్బందులకు కినోవా సాగును సమర్థవంతమైన పరిష్కారంగా భావించారు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలానికి చెందిన ఔత్సాహిక రైతులు. లక్ష్మణచాంద, తిర్పెల్లి గ్రామాలకు చెందిన రైతులు మొదటి సారిగా 20 ఎకరాల్లో కినోవాను సాగు చేశారు. పంట పెరుగుదల ఆశాజనకంగా ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబరు 10 నుంచి రైతులు ఈ ప్రాంతంలో కినోవాను విత్తుకున్నారు. ఎర్ర గరప భూముల్లో ఎక్కువ సాగు చేశారు. ఐదు తడులతో పంట చేతికొచ్చింది. ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ఇది వరకు మొక్కజొన్నను సాగు చేస్తే కూలీల కొరత ఉండేది. మరోవైపు అడవి పందులు, కోతులు, పిట్టల బెడద ఉండేది. కినోవా సాగుతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎకరాకు 67 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని రైతులు భావిస్తున్నారు. -- జడ్డి శ్రీనివాస్, సాక్షి, లక్ష్మణ చాంద, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఖర్చు, శ్రమ తక్కువ..
నీరు తక్కువగా ఉండటంతో కినోవాను ఎకరంలో సాగు చేశాను. ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నా. ఖర్చు తక్కువ. కినోవా సాగు లాభదాయకమే. -- సురుకుంటి ముత్యంరెడ్డి (95050 21613), లక్ష్మణ్‌చాంద మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ
గిరాకీ ఉందని సాగు చేశా..
మంచి పోషకాలు ఉండటం వల్ల పట్టణాల్లో బాగా గిరాకీ ఉందని తెలిసి అరెకరంలో సాగు చేస్తున్నా. ఎకరాకు 6 కింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. ఇంట్లోకి కొంత ఉంచుకొని మిగిలినది అమ్ముతాను. -- ఐండ్ల శ్రీధర్ రెడ్డి (98494 33448), ధర్మారం, లక్ష్మణ్ చాంద మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ