ashwathama reddy
-
ఆర్టీసీలో మళ్లీ కార్మిక సంఘాల ఉద్యమబాట
సాక్షి, హైదరాబాద్: ‘దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ కార్మికులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. కార్మిక సంఘాల అస్థిత్వం ఆర్టీసీలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. సంఘాలు లేవని కార్మికులపై పనిభారం పెంచి వేధిస్తున్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబీకులకు కారుణ్య నియామక వెసులుబాటు వర్తించకుండా చేస్తున్నారు. ఇక ఈ నిర్లక్ష్యాన్ని సహించం. రోడ్డెక్కి ఉద్యమిస్తాం’ అని ఆర్టీసీ సంఘాలు హెచ్చరించాయి. దాదాపు రెండున్నరేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్లీ రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమానికి సిద్ధమయ్యాయి. గతంలో గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉండి సీఎం ఆగ్రహానికి గురై ఆర్టీసీకి దూరమైన అశ్వత్థామరెడ్డి మళ్లీ టీఎంయూ గూటికి చేరారు. ఆదివారం టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన్ను సంఘం గౌరవాధ్యక్షుడిగా తిరిగి ఎంపిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో సంఘం ఉద్యమబాట పట్టనుందని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. బాండ్ల తాలూకు చెల్లింపులేమాయె? గతంలో జరిగిన వేతన సవరణ బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించేందుకు జరిగిన ఒప్పందం అమలు కాలేదు. 2020 అక్టోబర్‌తో గడువు ముగిసి నా బాండ్ల తాలూకు చెల్లింపులు జరగకపోవటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కొక్కరికి రూ. లక్షన్నరకు తగ్గకుండా లబ్ధి చేకూరాల్సి ఉన్నా అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019 నుంచి అందాల్సిన 6 డీఏలనుకూడా వర్తింప చేయ కపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. 1,200 కుటుంబాలకు కారుణ్య నియామకాల రూ పంలో ఉద్యోగావకాశాలు రావాల్సి ఉన్నా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలను మనుగడలో లే కుండా చేసినందుకే ఉద్యోగులకు అన్యా యం జరుగుతోందని ఆరోపిస్తూ ఇప్పుడు అన్ని సంఘాలు సంయుక్తంగా ఉద్యమబా ట పడుతున్నాయి. అన్ని ప్రధాన సంఘాల తో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీక్ష జర గాల్సి ఉన్నా పోలీసు అనుమతి రాక వాయి దా పడింది. త్వరలో డిపోల ముందు నిరసన ప్రదర్శనలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు వరుసగా చేయాలని నిర్ణయించారు. ఇటీవల బల్క్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడాన్నీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మునుపటి ధరలకే డీజిల్ అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. -
‘అశ్వద్ధామ రెడ్డిని టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: అశ్వద్ధామ రెడ్డి బయట ఉంటే ఆయన అవినీతికి జైల్లో పెడతారని భయపడి... మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారు. ఆయనను టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం అంటూ థామస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర నుంచి అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. దాంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. టీఎంయూలో అశ్వద్ధామ రెడ్డిని నామినేట్ చేసింది నేనే. నన్ను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసింది ఆయనే’’ అన్నారు. (చదవండి: రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!) అంతేకాక ‘‘థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్ఫర్ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. థామస్ రెడ్డి వల్ల కార్మికులు కష్టాలు తీరతాయని సీఎం చెప్పారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్నా మాకు జీతాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా మాకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయి.. 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నాం.. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
తీవ్ర విభేదాలు.. రెండుగా చీలిన టీఎంయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్ రెడ్డి నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. (చదవండి: అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండు చీలిపోయింది. -
అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిపై ఆ సంఘం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ మేరకు చర్చించారు. అశ్వత్థామరెడ్డి సంఘం నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానం లో మరొకరు ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. కోవిడ్ నిబంధనల్లో మినహాయింపులు ఇస్తూ వంద మందితో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రావటంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి సరిగా లేని తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. ఇలాంటి పరిస్థితిలో సంఘం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు అశ్వత్థామరెడ్డి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ అశ్వత్థామరెడ్డి తప్పుకోవాలని నిర్ణయిస్తే, కార్మిక సంఘాలు పునరుత్తేజం పొందేవరకు అదే స్థానంలో ఉండాలని పేర్కొనటం విశేషం. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
అశ్వద్ధామ రెడ్డికి షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె తర్వాత లాంగ్ లీవ్‌లో ఉన్న అశ్వద్ధామ రెడ్డి నెలలు గడుస్తున్నా విధులకు హాజరు కాకపోవటంతో ఆర్టీసీ యాజమాన్యం ఈ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ, దీర్ఘకాల సెలవుల అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. అయినప్పటికి మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం ఆయన దరఖాస్తు చేయగా రెండోసారి కూడా యాజమాన్యం తిరస్కరించింది. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. అయినప్పటికి ఆయన విధుల్లో చేరకపోవటంతో షోకాజ్ నోటీస్ జారీచేశారు. -
అశ్వత్థామరెడ్డికి చుక్కెదురు...
సాక్షి, హైదరాబాద్: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. చదవండి: కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి -
కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి
చంపాపేట: కార్మికుల సంక్షేమం కోసం సంఘాలు, యూనియన్ల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కని, వాటిని కాలరాయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్‌లో మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి ఏర్పాటు చేసిన కేంద్రకమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళన బాట పట్టక తప్పదన్నారు. బస్సుల సంఖ్యను కుదించటం వల్ల కార్మికులు డ్యూటీల కోసం బస్‌డిపోల ముందు పడిగాపులు కాయటమే కాకుండా ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. -
ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదు
-
సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు. ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు. -
హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అన్నారు. హైకోర్టు సూచన మేరకే తాము సమ్మె విరమించామని అన్నారు. శుక్రవారం వీఎస్టీలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తాము అడిగిన 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఆర్టీసీలో భవిష్యత్‌లో యూనియన్లు ఉండవని సీఎం చెబుతున్నారని, వ్యవస్థ ఉన్నంత కాలం ట్రేడ్ యూనియన్లు ఉంటాయని చెప్పారు. డిపోలకు ఇద్దరు చొప్పున కార్మికులను నియమిస్తామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. కార్మికుల ద్వారా ఓటింగ్ పెట్టి నిర్ణయించాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సమ్మెలు ఎన్నడూ జరగలేదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మెలు జరిగాయన్నారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మరోవైపు ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాలని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6.00 నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులంతా రేపు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని తెలిపిన ఆయన.. ఇందులో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపు విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప.. విధులను విడిచిపెట్టడానికి కాదని స్పష్టం చేశారు. సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. కాగా, అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరసటి రోజే సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు. -
ఆ ప్రాంతాల్లో రేపు ‘సేవ్ ఆర్టీసీ’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. గత 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుందని వెల్లడించారు. జేఏసీ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇవాళ అన్ని బస్ డిపోల ముందు మానవహారాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. రేపు డిపోలు, బస్టాండ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో ‘సేవ్ ఆర్టీసీ’పేరుతో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. -
సమ్మె కొనసాగిస్తాం..
అఫ్జల్‌గంజ్: ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మరోసారి జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎంజీబీఎస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నేడు ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో మానవహారం, మౌన దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అన్ని డిపోల ముందు ప్రొఫెస ర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి మానవహారాలుగా ఏర్పడి నిరస న తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల దీక్ష 50వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోకి కార్మికులు, అఖిల పక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీశేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్ నుంచి ప్రారంభించగా బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లాలో బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు. -
ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. (చదవండి: ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే) కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రస్తుతం కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు.. సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కొందరు అలా.. మరికొందరు ఇలా 46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి. అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
సమ్మె విరమణపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి జేఏసీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం వాదనల అనంతరం ధర్మాసనం పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల ప్రతి వెంటనే అందనందున సమ్మె విషయంలో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిని పరిశీలించిన మీదట మంగళవారం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి, మూడు రోజులు దీక్ష కొనసాగించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు సోమవారం సాయంత్రం దీక్ష విరమించారు. వీరిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో కీలక పరిణామాల నేపథ్యంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మె కొనసాగుతుందని, మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని, సాయంత్రం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 72.49 శాతం బస్సులు తిప్పాం – ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 72.49 శాతం బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1,912 అద్దె బస్సులు సహా 6,487 బస్సులను తిప్పినట్లు పేర్కొంది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,487 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని వెల్లడించింది. 44వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె అక్టోబర్ ఐదోతేదీన మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతూ సోమవారంతో 44 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మె విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం మూడు దఫాలు చేసిన సూచనలను కూడా కార్మికులు బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలకు సంఘీభావంగా అన్ని బస్ డిపోల వద్ద కార్మికులు సంఘీభావ దీక్షలు కొనసాగించారు. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆదివారం సాయం త్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డి దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ తలుపులు గడియవేసి ఉండటంతో లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లు వచ్చారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని కోరారు. మరోసారి రాజిరెడ్డి అరెస్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయన రెడ్డి కాలనీలోని తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డి ఇంటికి వచ్చి తిరిగి దీక్షలోనే ఉన్నారు. దీంతో ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు దీక్షను విరమించాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. తలుపు గడియ పెట్టి ఉండటంతో బలప్రయోగంతో రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తోటి కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యాన్‌లో నినాదాలు చేసే క్రమంలో రాజిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వీరిద్దరి అరెస్టులను ఖండిస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద సంఘీభావ దీక్షలు కొనసాగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 68.32 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 1,924 అద్దె బస్సులుసహా 6,114 బస్సులను తిప్పినట్టు వెల్లడించారు. 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని చెప్పారు. 5,864 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 174 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో ట్రే టికెట్లు జారీ చేశామన్నారు. ఉస్మానియాలో కొనసాగుతున్న దీక్ష నిన్నటి నుండి తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఆశ్వత్థామరెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. బీపీ, షుగర్ ఉన్నందున వైద్యానికి సహకరించాలని వైద్యులు కోరుతున్నా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, యూరిన్‌లో కీటోన్స్ వచ్చాయని, అవి పెరిగితే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని డ్యూటీ డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు.