astrazeneca
-
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది. -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!
లండన్: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అన్నారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ బూస్టర్ డోసులు అత్యవసరం కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లతో పాటు కొంత విరామంలో బూస్టర్ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్ స్పెక్టర్ అన్నారు. -
తగ్గుతున్న టీకా యాంటీబాడీలు
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో.. వ్యాక్సినేషన్ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. కోవిషీల్డ్ 93 శాతం రక్షిస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు. -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
రెండు వేర్వేరు టీకాలు తీసుకోనున్న ఏంజెలా
బెర్లిన్: రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం ఇలా రెండు వేర్వేరు టీకాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలో అక్కడక్కడా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. అయితే వీరంతా వైద్య సిబ్బంది తప్పిదం వల్ల ఇలా రెండు వేర్వేరు కంపెనీలు వ్యాక్సిన్లు తీసుకున్నారు కానీ.. కావాలని కాదు. ఈ క్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సాహసం చేయడానికి ముందుకు వచ్చారు. ఏంజెలా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా తీసుకున్న ఏంజెలా రెండో డోసులో భాగంగా మోడర్న టీకా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఏంజెలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆమెకు ఉన్నట్లుండి కళ్లు తిరగడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె తిరిగి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 16ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్ ఈ ఏడాది పదవీవిరమణ చేయనున్నారు. ఇక గత రెండు వారాల నుంచి జర్మనీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగతుంది. చదవండి: రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..! -
వ్యాక్సిన్‌లో ఎందుకింత గ్యాప్..!
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది? ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది. ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నదేంటి! కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు? మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది. వివాదం ఎందుకు మొదలైంది? కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్ -
Vaccination: రానున్నది వ్యాక్సిన్ల కాలం
కోవాగ్జిన్, కోవిషీల్డ్, ఈమధ్యే స్పుత్నిక్.. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ల పేర్లే ఎక్కువగా వింటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్నా.. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీల రాకతో ఆ సమస్య తీరబోతోంది. రకరకాల వ్యాక్సిన్లు మన మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వెబ్‌డెస్క్: అవును.. వ్యాక్సినేషన్ కోసం కంగారుపడాల్సిన అవసరం లేదని కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త వ్యాక్సిన్ రకాలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికారిక ఆమోదంతో కొన్ని మార్కెట్లోకి అడుగుపెట్టగా, ఇంకొన్ని ట్రయల్ ఫేజ్‌లో.. ఉత్పత్తి దిశగా, మరికొన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ధరల విషయంలో స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై భారం తగ్గించడంతో పాటు ఎక్కువ మందికి వ్యాక్సిన్ డోసుల్ని త్వరగా అందించేందుకు వీలు పడనుంది. బయోలాజికల్ ఈ టెక్సాస్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ దీనిని అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్ ప్రొటీన్ వ్యాక్సిన్ ఇది. 28 రోజుల గ్యాప్‌తో రెండో డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది హ్యూమన్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉంది. జులై ఆగష్టు మధ్యలో ఇది మార్కెట్లోకి రావొచ్చని అంచనా. నెలకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా భావిస్తున్నారు. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ దీనిని డెవలప్ చేస్తోంది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్(వైరస్..రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపేది). ఒకే డోసుతో రానున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం జంతువులపై అధ్యయనంలోనే ఉంది. దీంతో కమర్షియల్ మార్కెట్లోకి ఇది రావడానికి ఏడాదిపైనే టైం పట్టొచ్చు. బీఎన్టీ162 ఫైజర్ జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ ఎస్ఈ రూపొందించిన వ్యాక్సిన్. రెండో డోసుల ఎంఆర్ఎన్ఎ బేస్డ్ వ్యాక్సిన్ ఇది. ఇది ఇప్పటికే 85 దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. అమెరికాలోనూ 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఈమధ్యే అనుమతి దొరికింది. ప్రస్తుతం మనదేశంతో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. జులై నాటికి ఇది మన మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. జైకోవ్ డీ అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిల్లా రూపొందిస్తున్న వ్యాక్సిన్. ఇది మూడు డోసుల(మొదటిరోజు, 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్ఎ వ్యాక్సిన్. ఫేస్ 3 హ్యూమన్ ట్రయల్స్‌లో ఉంది. జూన్ జులై మధ్య వినియోగానికి అప్రూవల్ దొరికే అవకాశం ఉంది. నెలకు కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది జైడస్ కాడిల్లా. అంతేకాదు ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లల మీద టెస్ట్ కోసం ప్రణాళిక వేసుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌నూ డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎడీ26.కోవ్2.ఎస్ యూఎస్ జాన్సన్ అండ్ జాన్సన్ వారి వ్యాక్సిన్. జులైలో మనదగ్గరికి వచ్చే అవకాశం. ఒకేడోస్. సింగిల్ షాట్ ఇంజెక్షన్ వ్యాక్సిన్. ఏడాదికి యాభై నుంచి 60 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని బయో ఈ వారి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యూ4 ప్రకటించుకుంది. స్పుత్నిక్ వీ రష్యన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో పంపిణీ అవుతున్న వ్యాక్సిన్. ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 వెక్టర్స్ ఉపయోగించే తయారు చేసిన అడినోవైరస్ వ్యాక్సిన్. కిందటి నెలలోనే ఈయూఎ కింద అనుమతి. మే 14న తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ద్వారా ప్రారంభించిన రెడ్డీస్ ల్యాబ్స్. లక్షన్నర డోసుల ఆర్ఎడీ26, ఆర్ఎడీ5 యాభై వేల డోసులు ఇదివరకే దిగుమతి. జూన్ రెండో వారం నుంచి వేగంగా ఉత్పత్తి. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌గా ఆర్ఎడీ26ను స్పుత్నిక్ లైట్ పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొవిషీల్డ్ ఇండియాలో కొవిడ్ కట్టడికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరో వ్యాక్సిన్. ఆక్స్‌ఫర్ట్, ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇండియా ఈ వ్యాక్సిన్‌ను తయారీ చేస్తోంది. పన్నెండు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాగా తీసుకోవాలి. చింపాజీ అడినోవైరస్ కారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీనికి కూడా జనవరిలోనే అనుమతి దొరికింది. ఇది కూడా పదికోట్ల డోసుల టార్గెట్‌నే పెట్టుకుంది. కోవాగ్జిన్ కొవిడ్-19 జబ్బు కట్టడికి తయారు చేసిన మొట్టమొదటి దేశీయ వాగ్జిన్. ఇన్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ రెండు డోసుల వ్యాక్సిన్.. ఈ జనవరిలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ) కింద వాడకంలోకి వచ్చింది. ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ నుంచి దీనిని డెవలప్ చేశారు. ఈ ఏడాది చివరివరకు నెలకు పదికోట్ల డోసుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్ బయోటెక్. ఇక అనుమతులతో రెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న పిల్లలపై జూన్ మొదటి వారం నుంచి ఫేజ్ 2,3 ట్రయల్స్ నిర్వహించనుంది. -
రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్నేప్ పేర్కొన్నారు. 830 మందిపై ప్రయోగాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది. వేర్వేరు టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.. ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలను మార్చి తీసుకోవద్దు.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల! -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాడ్ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్ బయోటెక్ ఫస్ట్ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్ వరల్డ్ సెట్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్ టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది. ఫైజర్-బయోటెక్ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్ నియంత్రణ మెరుగవుతుందని రియల్ వరల్డ్ సెట్టింగ్ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. (చదవండి: కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం) -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు.. కీలక విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్ బాధితులు ఒక్క డోస్ ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయించుకుంటే వారినుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని తేలింది. దాదాపు 50 శాతం వరకు ఈ రెండు వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) అనే జర్నల్ తన కథనంలో పేర్కొంది. ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) కథనం ప్రకారం.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల్లో ఏదైనా ఒక్కడోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు మూడు వారాల తర్వాత కోవిడ్ బారినపడితే.. ఈ రెండు వ్యాక్సిన్లు వేసుకున్న కారణంగా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి 38 నుంచి 49 శాతం మేర తక్కువగా ఉన్నట్లు పీహెచ్ఈ రీసెర్చ్ సైంటిస్ట్‌లు వెల్లడించారు. ‘ఇది అద్భుతం. ఇప్పటికే మేం చేసిన పరిశోధనల్లో వ్యాక్సిన్ ప్రాణాల్ని కాపాడుతుందని గుర్తించాం. తాజా పరిశోధనల్లో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మరోసారి నిరూపితమైంది’ అని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న 57 వేల మందికి చెందిన 24 వేల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులు, సంబంధిత డేటా ఆధారంగా తాము చేసిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చాయని మాట్ హాన్కాక్ చెప్పారు. అంతేకాదు ఒక్కడోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు నాలుగు వారాల తర్వాత వైరస్‌బారిన పడితే 65 శాతం వరకు వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుతుందని గతంలో తేలిందన్నారు. -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు లీగల్ నోటీస్
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్‌కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి
లండన్: యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని యూకే ఔషధ నియంత్రణ సంస్థ నిర్ధారించింది. మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమందిలో ఏదో ఒక దుష్ప్రభావం కనిపించడం సాధారణంగా జరిగేదేనని ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, నిర్భయంగా అందరూ టీకా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. రక్తం గడ్డ కట్టే సమస్య కేవలం ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చిందా లేదా వారిలో మరేమైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుపుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లోని పుణేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌తో భారత్‌లో ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు కనిపించలేదు. -
అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ షాక్
వాషింగ్టన్: ఉత్పత్తి సమయంలో చోటు చేసుకున్న తప్పిదం కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు వృథా అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడమే కాక వ్యాక్సిన్ డెలివరీ టార్గెట్‌ని రీచ్ అయినట్లు వారు తెలిపారు. ఈ సంఘటన బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది. కానీ దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక ఒక బ్యాచ్ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన చేసింది. ప్లాంట్‌లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కార్మికులు అనుకోకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు సంబంధించని ఔషధ పదార్థాలను ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్ టీకా కార్యక్రమం కోసం జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు ఫైజర్, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మినహాయించి మిగతా రెండు కంపెనీలు 120 మిలియన్, 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసి టార్గెట్ రీచ్ అయ్యాయి. ఈ తప్పిదం విషయాన్ని ఎమర్జెంట్‌తో పాటు ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులకు కూడా తెలిపామని జాన్సన్ అండ్ జాన్సన్ ఉద్యోగి ఒకరు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని ఎఫ్‌డీఏ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
ఆస్ట్రాజెనికా టీకాపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
జెనీవా: కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాపై వస్తోన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. పలు యూరోపియన్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు రావడంతో టీకా వినియోగాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిది ఒకరు మాట్లాడుతూ..‘‘మిగతా వాటితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా చాలా అద్భుతమైన టీకా. వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన పని లేదు. మా అడ్వైజరీ కమిటీ టీకాకు సంబంధించిన డాటాను పరిశీలించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు, రక్తం గడ్డకట్టడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. అంతేకాక మేం మృతులకు సంబంధించిన డాటాను కూడా పరిశీలించాం. వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోవడం వల్ల మరణించిన వారు ఒక్కరు కూడా లేరు’’ అని వెల్లడించారు. మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. చదవండి: ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్! -
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్‌లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్‌లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
‘ఆక్స్ఫర్డ్’ డోస్‌ల మధ్య 3నెలల గ్యాప్
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ డోసులకి మధ్య ఆరు వారాల వ్యవధి తీసుకున్నప్పటికన్నా, మూడు నెలల గ్యాప్‌తో వ్యాక్సిన్ తీసుకుంటే సత్ఫలితాలిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ రెండు డోసుల్లో తొలి డోసు వ్యాక్సిన్ 76 శాతం రక్షణనిస్తుందని వెల్లడించింది. లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వ్యాక్సిన్ డోసులకి మధ్య మూడు నెలల సమయం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదని, తొలి డోసు అందుకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది. కొందరికే రెండో డోసుని తొందరగా ఇచ్చే బదులు 3 నెలల కాలవ్యవధిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే వీలుంటుదని అ«ధ్యయనం వెల్లడించింది. ‘వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉండడం, అత్యధిక మంది జనాభాకి వ్యాక్సిన్ అందించేందుకు తక్కువ సమయం ఉండడంతో ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎటువంటి విధానం అవసరమో నిర్ణయించుకోవాలి’’అని ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ పోల్లార్డ్ అన్నారు. యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన ఈ అధ్యయనంలో. సుదీర్ఘకాలం వ్యవధితో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఒక డోసు తరువాత కరోనా యాంటీ బాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నట్టు గుర్తించారు. వారిలో రోగనిరోధక శక్తి రెట్టింపు స్థాయిలో పెరిగినట్టు అధ్యయనవేత్తలు గుర్తించారు. తొలి డోసు ఇచ్చిన తరువాత 22 ల నుంచి మూడు నెలల వరకు వ్యాక్సిన్ సమర్థత 76 శాతం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. -
జూన్ కల్లా మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు. 35 లక్షల మందికి కోవిడ్ టీకా ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది.