Bar Council of India
-
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
International Lawyers Conference 2023: భారతీయ భాషల్లో భారత చట్టాలు
న్యూఢిల్లీ: దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాలన్నీ చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం బలమైన, నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. రెండు రూపాల్లో చట్టాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో న్యాయ ప్రక్రియ, చట్టాలను రాసేందుకు ఉపయోగించిన భాష కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చట్టాలు రెండు రూపాల్లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. న్యాయ నిపుణులు ఉపయోగించే భాషలో, సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో చట్టాలు ఉండాలన్నారు. ప్రజల భాషలో చట్టాలు ఉన్నప్పుడు వారు వాటిని సొంతం చేసుకుంటారని తెలిపారు. చట్టాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభతరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ చట్టంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షిదారులకు తీర్పు కాపీలను వారి మాతృభాషలో అందజేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో జ్యుడీíÙయరీ, బార్ కౌన్సిల్ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది న్యాయవాదులు ముందంజలో నిలిచారని గుర్తుచేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, యూకే న్యాయ సహాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్ కె.సి., భారత అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ చైర్మన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల పాత్ర మారాలి: జస్టిస్ చంద్రచూడ్ నేటి ప్రపంచీకరణ శకంలో అంతర్జాతీయంగా న్యాయరంగంలో సవాళ్లను ఎదుర్కొనే దిశగా న్యాయవాదుల పాత్ర మార్పు చెందాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని లాయర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి అంశాల్లో సాంకేతికపరమైన మార్పులను కక్షిదారులు, ప్రభుత్వాలు అందిపుచ్చుకొనేలా లాయర్లు కృషి చేయాలని సీజేఐ తెలిపారు. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
బార్ కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: బార్ కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుకు బాంబే హైకోర్టు మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. అడ్వొకేట్స్ చట్టం–1961ను సవరించాలని కోరారు. లీగల్ ప్రొఫెషన్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ... నిర్ణయాత్మక స్థానాల్లో మహిళాలాయర్లకు స్థానం దక్కడం లేదని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా... సుప్రీంకోర్టులో 416 సీనియర్ న్యాయవాదుల్లో కేవలం 8 మంది మాత్రమే మహిళలున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలో ఒక్కో మహిళ ఉన్నారని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర–గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, కర్ణాటక, కేరళ తదితర బార్ కౌన్సిళ్లలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరని పేర్కొన్నారు. -
65 శాతం సీట్లు గిరిజనులకే.. మంత్రి హర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గిరిజన గురుకులంలో కో ఎడ్యుకేషన్ లా కాలేజీ (రెసిడెన్షియల్) ఏర్పాటుకు గతేడాది గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలు పంపింది. కోవిడ్–19 నేపథ్యంలో అనుమతులకు ఆలస్యం అవుతుందని అధికారులు భావించారు. కానీ లాసెట్ పరీక్ష, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం అడ్మిషన్ల ప్రక్రియకు కలసివచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం లాసెట్–20 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గిరిజన న్యాయ కళాశాలకు వచ్చిన అనుమతులను ఉన్నత విద్యా మండలి, సెట్ కన్వీనర్లకు సమరి్పంచడంతో ఈ కాలేజీలో సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 65 శాతం సీట్లు గిరిజనులకే.. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న న్యాయ కళాశాలలో 65 శాతం సీట్లు గిరిజనులకే కేటాయిస్తారు, గిరిజన విద్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇందులో గిరిజనులకు 39, ఎస్సీలకు 6, బీసీలకు 7, అగ్రవర్ణాలకు 2, స్పోర్ట్స్ కోటా 2, ఎన్సీసీ 2, ఎక్స్ సరీ్వస్ మెన్ 1, వికలాంగులకు 1 కేటాయిస్తారు. శుభ పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రారంభించడం శుభ పరిణామం. కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇటీవలే నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభించాం. బీఈడీ, మరో రెండు పీజీ కోర్సులకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–20 వల్ల అనుమతులు రావడంలో ఆలస్యం అవుతోంది. -
'వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం'
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగు ప్రజలు ఐక్యత కోసం కర్నూలు రాజధానిని సీమ ప్రజలు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అభివృద్ది విషయాలపైనే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ చేయాలన్న చంద్రబాబు డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని 90 రోజులు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేశారని, హైకోర్టు కావాలని కోరిన వారిని ఆనాడు చంద్రబాబు అవమానించారని తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆలూరి రామిరెడ్డి వెల్లడించారు. -
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
-
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
న్యూఢిల్లీ : కారు పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో లాయర్లు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఒకర్నొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక లాయర్‌కు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్తులకు నష్టం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి కారణాలు చూపుతూ పలువురు లాయర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, పార్కింగ్ స్థలం విషయంలో గొడవ జరిగిందా.. మరైదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కేసులు కూడా పెట్టారని ఆరోపిస్తూ.. కింది కోర్టుల న్యాయవాదులు ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్, హోంశాఖకు మెమోరాండమ్ సమర్పిస్తామని తెలిపారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేసీ మిట్టల్ లాయర్లపై దాడిని ఖండించారు. ఈదాడిలో ఒక లాయర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగితే గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఊరికే వదిలేయదని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కోరామని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని లాయర్లకు సూచించారు. గొడవను కవర్ చేసే క్రమంలో ఓ కెమెరామెన్‌పై లాయర్లు దాడి చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. -
డిసెంబర్ 3న ‘వైఎస్సార్ లా నేస్తం’ ప్రారంభం
-
మరో హామీ అమలుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్రోల్ అవుతున్నారు. దరఖాస్తు... https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయాలి. స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో జమ కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలు అందజేయాలి. పరిశీలన.. మంజూరు వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ కమిషనర్లు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ/వార్డు వలంటీర్లకు పంపుతారు. వీరి పరిశీలనలో దరఖాస్తు సరైనదేనని తేలిన తరువాత, జిల్లా కలెక్టర్ ఆమోదం తీసుకుని ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తారు. సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ప్రదర్శిస్తారు. అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్‌ను జమ చేస్తారు. రశీదును వార్డు వలంటీర్ ఇంటికి తెచ్చి ఇస్తాడు. అర్హతలు.. దరఖాస్తుదారు న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. 2016, ఆ తరువాత ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే స్టైఫండ్ కు అర్హులు. న్యాయవాద చట్టం సెక్షన్ 22 కింద ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ జారీ చేసిన నాటి నుంచి తొలి మూడేళ్ల ప్రాక్టీస్‌ను లెక్కిస్తారు. ఈ జీవో జారీ అయ్యే నాటికి ప్రాక్టీస్ ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులవుతారు. దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్‌లో కొనసాగుతున్నానని 15 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాది, లేదా సంబంధిత బార్ అసోసియేషన్, లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్ సమర్పించాలి. న్యాయవాదిగా నమోదైన తరువాత, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్‌ను సమర్పించాలి. దరఖాస్తుదారు న్యాయవాద వృత్తిని విడిచి వెళ్లినా, మరో ఉద్యోగం సంపాదించినా, ఆ విషయాన్ని ఆన్లైన్ ద్వారా రిజిస్టరింగ్ అథారిటీకి తెలియచేయాలి. ఒకే కుటుంబం.. ఒకే ప్రయోజనం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్టైఫండ్‌ను అందచేస్తారు. ప్రతీ దరఖాస్తుదారు కూడా ఆధార్‌కార్డు కలిగి ఉండాలి. అనర్హతలు.. ఈ జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాది వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉన్న జూనియర్ న్యాయవాది స్టైఫండ్‌కు అనర్హుడు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులే. బార్ కౌన్సిల్ హర్షం... జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ చెల్లించేలా ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల తరఫున ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్తగా లా కాలేజీలకు అనుమతులు లేవు
సాక్షి, అమరావతి: కొత్తగా లా కాలేజీలకు అనుమతులను నిషేధిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, వర్సిటీలకు సూచించింది. ఈనెల 11న జరిగిన బార్ కౌన్సిల్ సమావేశంలో కొత్త కాలేజీలకు అనుమతులపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే దేశంలో పుట్టగొడుగుల్లా లా కాలేజీలు ఏర్పాటయ్యాయని, పరిమితికి మించి లా పట్టభద్రులున్నందున కొత్త కాలేజీల ఏర్పాటును మూడేళ్ల పాటు నిలిపివేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటికి అనుమతులు ఇవ్వవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్ల పాటు కొత్త కాలేజీల ఏర్పాటుపై మారటోరియం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం 2017–18తో ముగిసింది. మళ్లీ కొత్త కాలేజీలకు అనుమతులకోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు పలు దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. కొత్తగా లా కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించబోరు. రాష్ట్రంలో కాలేజీల వివరాలు.. మూడేళ్ల లా కోర్సు నిర్వహిస్తున్న కాలేజీలు రాష్ట్రంలో 31 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 4 ఉండగా తక్కినవన్నీ ప్రైవేటు కాలేజీలే. వర్సిటీ కాలేజీల్లో 300 సీట్లుండగా ప్రైవేటు కాలేజీల్లో 5,360 సీట్లున్నాయి. ఇక అయిదేళ్ల లా కోర్సు నిర్వహించే కాలేజీలు 27 ఉన్నాయి. వీటిలో వర్సిటీ కాలేజీలు 3 కాగా తక్కినవి ప్రైవేటు కాలేజీలు. వర్సిటీ కాలేజీల్లో 200 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 2660 సీట్లు ఉన్నాయి. -
ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఘంటా రామారావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సీనియర్ న్యాయవాది ఘంటా రామారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.రామజోగేశ్వరరావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రతినిధిగా ఆలూరు రామిరెడ్డి విజయం సాధించారు. బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్టుకు చివరి వరకూ కృష్ణారెడ్డి, ఘంటా రామారావులు పోటీపడ్డారు. మొత్తం 26 ఓట్లకుగాను కృష్ణారెడ్డికి 11 ఓట్లు రాగా, ఘంటా రామారావుకు 15 ఓట్లు వచ్చాయి. దీంతో ఘంటా రామారావు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక వైస్ చైర్మన్‌గా రామజోగేశ్వరరావు టాస్‌లో నెగ్గారు. మొదటి రెండున్నర ఏళ్లు రామజోగేశ్వరరావు, మిగిలిన రెండున్నర ఏళ్లు పోటీపడిన కృష్ణమోహన్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బీసీఐలో ఏపీ బార్ కౌన్సిల్ ప్రతినిధి పోస్టుకు సీనియర్ సభ్యులు ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం పోటీపడ్డారు. రామిరెడ్డికి 16 ఓట్లు రాగా, చిదంబరం 10 ఓట్లతో సరిపెట్టుకున్నారు. -
బార్ కౌన్సిళ్ల ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు ఇరు రాష్ట్రాల తరఫున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు ప్రాతినిధ్యం వహించే సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎంపిక కోసం 24న, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక కోసం 25న ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ విషయానికొస్తే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి పోస్టు కోసం నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అదే రోజున నామినేషన్లను పరిశీలించి, సాయంత్రం 4.15 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీ ఉదయం 11 గంటల్లోపు నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. 12 గంటలకు తుది జాబితా ప్రకటించి, 12.30కు ఎన్నిక నిర్వహించి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక ప్రక్రియ 23వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, ఎన్నిక, ఫలితాల వెల్లడి 25వ తేదీన ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు వీరిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడిగా ఒక్కరి చొప్పున ఎన్నుకుంటారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికను గెజిట్ ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు గెజిట్ విడుదల కాలేదు. సాంకేతికంగా గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదు. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అన్న దానిపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
లాయర్లపై నిషేధం ఎత్తివేతకు సీజేఐ నో
న్యూఢిల్లీ: సమ్మెకు దిగిన న్యాయవాదులపై ఉన్న నిషేధం తొలగించాలన్న సూచనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అసలు సమ్మె ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు. నూతన సీజేఐ గౌరవార్థం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. ‘అసలు ఇది ఒక సమస్యే కాదు. అలాంటప్పుడు చట్ట బద్ధమా కాదా అన్న విషయం ఎందుకు? సమ్మె ఎందుకు చేశారు? ఆ అవసరమే లేదని నా నమ్మకం’ అని అన్నారు. లాయర్లు లేకుంటే కోర్టులు పనిచేయవు.. సమ్మె వల్ల ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు భంగం వాటిల్లినట్లే అని అన్నారు. ఆయన అభిప్రాయంతో కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఏకీభవించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడటం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే సమ్మెకు బార్ అసోసియేషన్ మద్దతివ్వాలన్నారు. సమ్మెలో పాల్గొన్న లాయర్లపై ఉన్న 16 ఏళ్ల నిషేధాన్ని ఎత్తి వేయాలని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చేసిన సూచనపై వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కూడా పాల్గొన్నారు. -
‘ఖమ్మం బార్’ ను ఎప్పటికీ మరువను
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాతో, ఖమ్మం బార్‌తో తనకు విడదీయలేని బంధం ఉందని, ఖమ్మం బార్‌ను ఎన్నటికీ మరువనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులని, ప్రతి క్షణం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను విశేషంగా ఆదరించి.. తన విజయానికి సహకరించారని పేర్కొన్నారు. బార్, గ్రంథాలయ అభివృద్ధి కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి రూ.లక్ష మంజూరు చేయించడమే కాకుండా చెక్కును బార్‌కు అందజేసినట్లు తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎన్.రామచందర్రావును బార్ అసోసియేషన్ ఈపీ, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, ప్రధాన కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, పూసా కిరణ్, మర్రి ప్రకాష్, పబ్బతి రామబ్రహ్మం, సీనియర్ న్యాయవాదులు జి.సత్యప్రసాద్, మలీదు నాగేశ్వరరావు, వెంకట్‌గుప్తా, తల్లాకుల రమేశ్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
బార్ కౌన్సిళ్లలో ఓట్ల తొలగింపుపై వ్యాజ్యాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగించారని, దాంతో కౌన్సిల్ సభ్యత్వ పదవి కోసం దాఖలు చేసిన నామినేషన్లను స్వీకరించకపోవడం అన్యాయమని దాఖలైన వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బార్ కౌన్సిళ్ల సభ్యత్వ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేస్తే తమ పేర్లను కౌన్సిళ్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పి ప్రాథమిక దశలోనే తిరస్కరించడం చెల్లదని రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయవాదులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ గురువారం విచారించి బార్ కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తాము 2010 నుంచి న్యాయవాదులుగా పనిచేస్తున్నామని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్ష ఉత్తీర్ణత సాధించలేదని చెప్పి తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి తీరాలనే నిబంధన ఏమీ లేదన్నారు. దీనిపై బార్ కౌన్సిళ్ల న్యాయవాది.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రొవిజినల్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరమని, బార్ కౌన్సిళ్ల నిబంధన మేరకే వారి నామినేషన్లను తిరస్కరించామని, పిటిషనర్లు పోటీకి అనర్హులని వాదించారు. వాదనల అనంతరం బార్ కౌన్సిళ్లు పిటిషనర్ల నామినేషన్లు స్వీకరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రెండు బార్ కౌన్సిళ్లు తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు జూన్ 29న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 26తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. -
బార్ కౌన్సిళ్లకు జూన్ 29న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు విడివిడిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిపాదనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో రెండు బార్ కౌన్సిళ్లకు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి 26 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 29న తుది జాబితా విడుదల చేస్తారు. జూన్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి హైకోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ భవనంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో విడివిడిగా పోలింగ్ జరగనుంది. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యుల చొప్పున ఎన్నుకుంటారు. ఎన్నికైన సభ్యులు బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. -
‘సుప్రీం’ సంక్షోభం ముగిసింది
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తాత్కాలిక తెరపడింది. సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సోమవారం లోపు సమస్యను పరిష్కరిస్తామని ఇది వరకే ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇక అధికారికంగా ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా ఎదుట ప్రకటించనుంది. న్యాయ నిపుణులు, బార్ అసోషియేషన్ సభ్యులు విడివిడిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, అసంతృప్త న్యాయమూర్తులతో దఫాలుగా భేటీ అయ్యారు. చివరకి వారి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని ముగించేందుకు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులంతా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ వ్యాఖ్యానిస్తూ... న్యాయమూర్తుల మధ్య సఖ్యత ఏర్పడిందని, దీన్ని మరింత పొడిగించాలని వారు కూడా అనుకోవడం లేదు. ఇప్పుడంతా ఓకే అని పేర్కొన్నారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రా పనితీరుపై సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో పాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదని, వాటిని సరిదిద్దేలా సీజేఐని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. -
త్వరలోనే సర్దుకుంటుంది!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. వివాదం నేపథ్యంలో తనను కలిసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఏడుగురు సభ్యుల కమిటీకి సీజేఐ ఈవిధమైన భరోసా ఇచ్చారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం వివాదం 2–3 రోజుల్లో సమసిపోతుందనే భరోసా కలిగిందని బీసీఐ కమిటీ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ కమిటీ... తిరుగుబాటు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతోనూ సమావేశమైంది. వారు కూడా వివాదం తొందరగానే పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా సీజేఐని కలిశారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలు కూడా సీజేఐ, జస్టిస్ చలమేశ్వర్లతో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టులో కేసుల పంపకం రోస్టర్ విధానంలో జరగటం లేదంటూ సీజేఐ తీరుకు నిరసనగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో: బీసీఐ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ చలమేశ్వర్, ఇతర న్యాయమూర్తులతో బీసీఐ కమిటీ ఆదివారం వేర్వేరుగా భేటీ అయింది. ఈ సమావేశాల అనంతరం బీసీఐ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎలాంటి సంక్షోభం లేదు. ఇది కేవలం అంతర్గత విషయమే. ఈ సమావేశాల అనంతరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందనే నమ్మకం కుదిరింది. సీజేఐతో 50 నిమిషాల సేపు సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ఇది తీవ్రమైన సమస్యేమీ కాదు. అంతా సర్దుకుంటుంది. ఈ వివాద పరిష్కారంలో బీసీఐ పాత్ర పరిమితమే. న్యాయమూర్తులు కూడా సమస్యేమీ లేదని పేర్కొన్నారు. 2–3 రోజుల్లో అంతా సర్దుకుంటుంది’ అని పేర్కొన్నారు. కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీకి దూరంగా ఉన్నందున రెండ్రోజుల్లో వీరందరితోనూ భేటీ అవుతామన్నారు. అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రాతో సమావేశమైన బీసీఐ కమిటీ.. ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన పిల్‌పై విచారణ జరపాలని కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రాకు లోయా కేసును బదిలీ చేయటాన్నీ తిరుగుబాటు జడ్జీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి ప్రెస్‌మీట్ దురదృష్టకరం న్యాయమూర్తులు, సీజేఐ మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఢిల్లీ బార్ అసోసియేషన్స్ (ఢిల్లీలోని ఆరు జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాలు) సమన్వయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపిన కమిటీ.. ఈ వివాదం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కాస్త తగ్గిందని అభిప్రాయపడింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయపరమైన క్రమశిక్షణను కొనసాగించాలని పేర్కొంది. 10 రోజుల్లో అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోలేని పక్షంలో మిగిలిన నగరాల్లో ఉన్న బార్ అసోసియేషన్లతో చర్చించి.. దేశవ్యాప్తంగా వీధుల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని హెచ్చరించింది. ‘అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి వివాదాలను నిరోధించేందుకు జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లును తీసుకురావాలి. సీజేఐ సభను ఆర్డర్లో పెట్టుకోవాలి. సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలను తక్షణమే పరిష్కరించాలి’ అని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీజేఐతో ఎస్సీబీఏ అధ్యక్షుడి భేటీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆదివారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో సమావేశమయ్యారు. సంక్షోభ పరిష్కారం కోసం ఎస్సీబీఏ రూపొందించిన తీర్మానాన్ని సీజేఐకి అందజేశారు. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులు ఈ తీర్మానానికి సమ్మతించారని.. వికాస్ సింగ్ పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్), పెండింగ్ పిల్లను సీజేఐ నేరుగా విచారించాలని, లేదంటే కొలీజియం వ్యవస్థలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని ఎస్సీబీఏ శనివారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందించారని వికాస్ వెల్లడించారు. సమంజసమే: మాజీ జడ్జీల లేఖ ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఐదుగురు రిటైర్డ్ న్యాయమూర్తులు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. నలుగురు తిరుగుబాటు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు సమంజసమేనని.. వీటిని త్వరలోనే పరిష్కరించుకోవాలని ఆ లేఖలో కోరారు. మాజీ సుప్రీం న్యాయమూర్తి పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. చంద్రు, బాంబే హైకోర్టు మాజీ జడ్జి హెచ్ సురేశ్ ఈ లేఖను రాశారు. ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు ముఖ్యమైన కేసులను ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు. ‘రోస్టర్, కేసుల పంపకంలో సీజేఐ నిర్ణయమే అంతిమం. కానీ.. సున్నితమైన, ముఖ్యమైన కేసులను జూనియర్ న్యాయమూర్తులున్న ధర్మాసనాలకు ఇవ్వటం సరికాదు. వివాదాన్ని వెంటనే పరిష్కరించుకుని.. కేసుల పంపకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. గెలవలేమని తెలిసే... ‘ఈ నలుగురు న్యాయమూర్తులు తాము లేవనెత్తిన అంశాలను నెగ్గించుకోవాలంటే.. ఫుల్‌కోర్టు (అందరు న్యాయమూర్తులతో సమావేశం)లో విషయాలను లేవనెత్తి ఓటింగ్ నిర్వహించవచ్చు. కానీ సీజేఐకే మెజారిటీ న్యాయమూర్తుల మద్దతుందని ముందే గుర్తించినందుకే ఫుల్‌కోర్టుకు పోకుండా.. తమ ఆవేదనను పంచుకునేందుకే మీడియాతో సమావేశమయ్యారు’ అని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో సీజేఐ కావాలనుకుంటున్న ఓ న్యాయమూర్తి ఈ నలుగురితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి. -
‘సుప్రీం విశ్వసనీయతకు విఘాతం’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ విమర్శలతో సర్వోన్నత న్యాయస్ధానం విశ్వసనీయత దెబ్బతిందని మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి ఆందోళన వ్యక్తం చేశారు. ‘సీనియర్ న్యాయమూర్తుల వ్యాఖ్యలతో సుప్రీం కోర్టు విశ్వసనీయత కోల్పోయింది..అది ఎంతవరకూ అన్నది అందరికీ తెలుసు..న్యాయవ్యావస్థ పట్ల ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని పాదురొల్పాల్సిన అవసరం ఉంద’ ని సోధి అన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రజల్లో చులకన చేసేలా నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలున్నాయని చెప్పారు. మరోవైపు ఆదివారం ఉదయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ మిశ్రా జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బార్ కౌన్సిల్ బృందం మరో ముగ్గురు జడ్జీలు రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తితోనూ భేటీ అయి న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభంపై చర్చించనున్నారు. -
సమస్య పరిష్కారానికి ఏడుగురు సభ్యుల కమిటీ
సాక్షి, ఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం ముగిసింది. జడ్జీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంఓపిని త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. అయితే ఇది ప్రజల ముందు పెట్టేంత పెద్ద సమస్య కాదన్నారు. రాహుల్ గాంధీ సహా రాజకీయ పార్టీలకు న్యాయవ్యవస్థపై మాట్లాడే అవకాశం ఇవ్వడం బాధాకరమని అంటూ ఈ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోమన్న ప్రధాని, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. -
‘పొలిటీషియన్’ లాయర్లకు షాక్..!
న్యూఢిల్లీ : ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేదా కార్పొరేటర్లుగా ఉంటూ లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులకు మంగళవారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని న్యాయవాద వృత్తి చేపట్టకుండా బార్ కౌన్సిల్ ఎందుకు డీబార్ చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సమాధానాలను కౌన్సిల్‌కు గడువు ఇచ్చింది. ఈ విషయంపై నియమితమైన ముగ్గురు నిపుణుల కమిటీ.. దేశవ్యాప్తంగా 500 మందిపైగా ‘పొలిటీషియన్’ లాయర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఒకవేళ రాజకీయ నాయకులకు లాయర్లుగా కొనసాగే అర్హత లేదనే నిర్ణయం వెలువడితే, వారందరూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలకు దిగకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లీడర్, లాయర్ అశ్విని ఉపాధ్యాయ పొలిటీషియన్ లాయర్లను డిబార్ చేయాలంటూ గతంలో భారతీయ ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్లకు లేఖ రాశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో ఉదహరించిన అశ్విని.. ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న ఓ వ్యక్తి లేదా సంస్థ లేదా కార్పొరేషన్ ఓ కోర్టులో న్యాయవాదిగా వాదించలేదని పేర్కొన్నారు. కాగా, రాజకీయ నాయకులు న్యాయవాద వృత్తి ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై బార్ కౌన్సిల్ ఈ నెల 22న తుది విచారణ జరపనుంది. -
నేటి నుంచి లాసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 7,630 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వారంతా ఈ నెల 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. ఎట్టకేలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) లా కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడంతో వెబ్ ఆప్షన్లకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. మొత్తంగా 47 కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 4,358 సీట్లు అందుబాటులో ఉన్నట్లు రంగారావు వెల్లడించారు. అందులో మూడేళ్ల ఎల్ఎల్బీ కాలేజీలు 20 ఉండగా, వాటిల్లో 2,738 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సును నిర్వహించే 13 కాలేజీల్లో 1,064 సీట్లు, ఎల్ఎల్ఎం కోర్సు నిర్వహించే మరో 14 కాలేజీల్లో 556 సీట్లు ఉన్నట్లు వివరించారు. వెబ్ ఆప్షన్లు, కాలేజీల వివరాలను http://lawcetadm.tsche.ac.in/ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించారు. వెబ్ ఆప్షన్ల తర్వాత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. -
నేడు లాయర్ల దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: న్యాయవాదులు సమ్మెలు, నిరసనలు చేపట్టకుండా నియంత్రించేలా తీసుకురావాలని ప్రతిపాదించిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లాయర్లందరూ శుక్రవారం విధులకు గైర్హాజరై నిరసనలు చేపట్టనున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న లాయర్లకు పిలుపినిచ్చినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తెలిపింది. కాగా సుప్రీంకోర్టు లాయర్లు సంఘీభావం తెలుపుతూ చేతికి తెల్లని బ్యాండ్లు ధరించి విధులకు హాజరవుతారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. నిరసనల్లో తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు.. సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉన్న లా కమిషన్ సిఫారసులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని ఉమ్మడి బార్ కౌన్సిల్ తెలుగు రాష్ట్రాల్లోని న్యాయవాదులకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని చోట్ల కోర్టు విధులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను కోరింది. లా కమిషన్ సిఫారసులు న్యాయవాదుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఓ తీర్మానం చేసిందని, ఈ అంశంపై ఏప్రిల్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని న్యాయవాదుల సంఘాలను కోరినట్లు చెప్పారు.