BB nagar
-
రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య మూడో లైన్ కాగా భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్ పనులు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. -
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ‘ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు’
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అంకుషాపూర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 16 పైగా బోగిలతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరిందని, అందులోని ఆరో బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు. రైలులోని వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్ (040 27786666) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. Train No.12727 (Visakhapatnam - Secunderabad) Godavari Express got derailed btw Bibinagar - Ghatkesar. *6 coaches derailed:* S1 to S4, GS, SLR *No casualties/Injuries* Passengers are being cleared by the same train by detaching the derailed coaches. Helpline No: 040 27786666 pic.twitter.com/YuBIln1BgK — South Central Railway (@SCRailwayIndia) February 15, 2023 ‘గోదావరి ఎక్స్‌ప్రెస్ భోగిలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్మన్-బుష్) బోగిలే. ఒక ఎల్ఎహెచ్బీ కోచ్ కాలపరిమితి 35 ఏళ్లు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్‌తో కోచ్‌ల తయారీ అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్‌లను తయారు చేయిస్తున్నాం. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో, మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్‌లో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఆధునాతనంగా ఉంటుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగలుగుతుంది.’ అని తెలిపారు. -
బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
-
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ..
సాక్షి, నల్గొండ: అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంపాదనే ధ్యేయంగా తాగే నీటి నుంచి పాలు, అల్లం తదితర నిత్యావసరాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బీబీనగర్ మండలం హైదరాబాద్ దగ్గరగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాలను మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దీంతో బీబీనగర్ మండలం రోజురోజుకు కల్తీకి కేరాఫ్‌గా మారుతోంది. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో కల్తీ పాల తయారీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. గతంలో మండలంలోని బీబీనగర్, జైనపల్లి, కొండమడుగు గ్రామాల్లోని కొందరు అక్రమార్కులు పొలాల్లో చల్లే యూరియా వాడి పాలను కల్తీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మనుషుల శవాలను భద్రపరిచేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను కలుపుతుండటాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తాజాగా మండలంలోని మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌తో చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. కొండమడుగు గ్రామంలోని ఓ పాల వ్యాపారి తన పాల సేకరణ సెంటర్లో పాలు పగలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మార్చురీల్లో మృతదేహాలు కుళ్లిపోకుండా వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. దాంతో పాటు పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి అధికంగా పాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదవండి: మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే.. నెమురుగొముల పరిధిలో బయటపడిన కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ (ఫైల్) అల్లం, నీళ్ల బాటిళ్లు సైతం పాల కల్తీతో పాటు కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సైతం కల్తీ చేసి విక్రయించడాన్ని గతంలో నెమురగొముల గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, ఎల్లిగడ్డలను మిషన్లలో వేసి అది పాడవకుండా పేస్ట్‌లో కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే బీబీనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు విక్రయించే వాటర్ బాటిళ్ల విషయంలో చిరు వ్యాపారులు కల్తీకి పూనుకున్నారు. కిన్లీ, బిస్లరీ స్లిక్కర్లతో కూడిన వాటర్ బాటిళ్లను సేకరించి వాటిలో మామూలు వాటర్‌ను నింపి విక్రయించారు. ఈ విషయాన్ని పోలీసులు గతంలో వెలుగులోకి తెచ్చారు. ఇలా మండలంలో ఒకదాని తర్వాత మరొకటి కల్తీ వ్యాపారం బయటపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ జరగకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న బాటిళ్లలో మామూలు వాటర్‌ను నింపి అమ్ముతున్న అక్రమార్కులు (ఫైల్) తనిఖీలు ముమ్మరం చేస్తాం గ్రామాల్లో పాల కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ పాలు తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. పాలు, ఇతర ఫుడ్ తయారీకి సంబంధించిన విషయాల్లో అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జ్యోతిర్మయి, జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
కూతురిని పొట్టన పెట్టుకున్నాడని.. నిందితుడిని కాల్చి చంపి..
సాక్షి, జవహర్‌నగర్/బీబీ నగర్: ఓ యువకుడిని ఎక్కడో దారుణంగా హత్య చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ శివారులో కాల్చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పరిధిలోని డీజేఆర్ కాలనీ జోహర్‌నగర్ నివసిస్తున్న మోట రాము(35) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే కాలనీలో నివాసముంటున్న చీర వెంకటలక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్నాయి. కూతురు ఆత్మహత్యకు కారకుడయ్యాడని.. చీర వెంకటలక్ష్మి కూతురు భార్గవిని రాము కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాము వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు రాము వేధింపులే కారణమని వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు భరత్‌లు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామును సోమవారం మేడ్చల్ పరిధిలోనే దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బీబీనగర్ మండలం రాయరావుపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. అనంతరం వెంకటలక్ష్మి, భరత్ నేరుగా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రామును తామే హత్య చేసి కాల్చేశామని నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రాయరావుపేట శివారులో రాము మృతదేహాన్ని గుర్తించారు. ఘటన స్థలాన్ని భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే ఆ పని చేయాలి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను ప్రచారం చేయ డంలో రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పోటీ పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం, ట్విట్టర్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజ లకు క్షమాపణ చెప్పి హుందాతనం కాపాడుకోవాలని అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో.. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్ గుప్తా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పా టు, హైదరాబాద్‌లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు స్థలం అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత భవనంతో పాటు 201.24 ఎకరాల భూమిని అప్పగించిందని తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్‌కు గత ఏడాది మే 10న బీబీనగర్ తహసీల్దార్ ఈ మేరకు భూమి పత్రాలు కూడా అప్పగించారన్నారు. బీబీనగర్ మండలం కొండ మడుగులో 49.25 ఎకరాలు, రంగాపూర్‌లో 151.29 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించిన పత్రాలను మంత్రి విడుదల చేశారు. చదవండి: ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అసత్యాలా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రానికి అనేకమార్లు లేఖలు రాసి, విజ్ఞప్తి చేసినా.. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలవలేదని కిషన్‌రెడ్డి ప్రకటించడం బాధ్యతారాహిత్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2015 జూన్ 21న నాటి కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాను టీఆర్ఎస్ ఎంపీలతో పాటు అప్పటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కలిసి.. జిల్లా ఆసుపత్రులను ఆప్‌గ్రేడ్ చేసి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అర్హత కలిగిన ఆసుపత్రులు లేవనే సాకును అప్పట్లో కేంద్రం చూపిందన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా మెడికల్ కాలేజీలు ఇవ్వలేదన్నారు. ఇటీవల మం జూరు చేసిన 157 మెడికల్ కాలేజీల్లో సైతం తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా కేం ద్రం మొండిచేయి చూపిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, కేంద్రం మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం ఈ కాలేజీల సంఖ్య 21కి చేరిందన్నారు. రాష్ట్రానికి మరో 12 మెడికల్ కాలేజీలు అవసరమున్నాయని, కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి మంజూరు చేయిస్తే 40 శాతం నిధులు భరిం చేం దుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కిషన్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. తనకు సరైన సమాచారం ఇచ్చేలా కేంద్ర మంత్రి సరైన బృందాన్ని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. చదవండి: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ సమీక్ష.. కీలక నిర్ణయాలు విదేశాంగ విధానం మార్చండి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి కూడా ఇటీవల అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శిం చారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అనుమతిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు తెస్తే విమానాశ్రయానికే వచ్చి సన్మానం చేస్తామని ప్రకటించారు. పంజా బ్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలోనూ సేకరించాలన్నారు. బియ్యం ఎగుమతులకు వీలుగా విదేశాంగ విధానం మార్చాలని, పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతులకు కూడా సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనొద్దని ఓ వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తుండగా, మరోవైపు రాష్ట్ర బీజేపీ మాత్రం ధాన్యం కొనాలని ధర్నా చేస్తోందని విమర్శించారు. -
మారనున్న ఎయిమ్స్ రూపురేఖలు
బీబీనగర్ ఎయిమ్స్ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. వైద్య, విద్య పరిశోధన విభాగాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18 వైద్య కళాశాలల డైరెక్టర్లు,ఎంపీలతో కమిటీ వే శారు. అలాగే ఫైనాన్స్, హెచ్ఆర్, అకడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీ నికి సంబంధించి ఎయిమ్స్ డైరెక్టర్ ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీబీనగర్ (భువనగిరి) : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రం రంగాపురం పరిధిలో గల ఎయిమ్స్ కళాశాల రూపురేఖలను మార్చేందు కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్ కళా శాల నిర్మాణంతో పాటు ఓపీ సేవలకు బీజం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ని మ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చి కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. క ళాశాలలో ఒకవైపు ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 50విద్యార్థులు వి ద్యను అభ్యసిస్తున్నారు. ఓపీ సేవలను అందిస్తున్నా రు. కోవిడ్ కారణంగా ఎయిమ్స్ అధికారులు టెలీకన్సల్టింగ్ ఓపీ సేవలను అందుబాటులో ఉంచారు. ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా ఎయిమ్స్ కళాశాలను ప్రపంచ ఖ్యాతి స్థాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా రూప కల్పన చేసేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దీంతో వైద్య, విద్య పరిశోధన విభా గాలను ఏర్పాటు చేసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18మంది వైద్య కళాశాలలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన డైరెక్టర్లతో, ఎంపీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఫైనాన్స్, హెచ్ఆర్, ఆకాడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఎర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎయిమ్స్ ప్రఖ్యాతి చెందేలా ఐఐటీ సంస్థలతో భాగస్వామ్యంతో ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్‌గా మరింత అభివద్దికి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్టోబర్ నాటికి వసతుల ఏర్పాటుకు చర్యలు 2020 అక్టోబర్ నాటికి ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో నియామకాలతోపాటు వసతులు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియామకాలకు సంబంధించి 143పోస్టులకు ప్రకటన వేయగా ఇందులో ఫ్యాకల్టీతోపాటు నాన్‌టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని పోస్టులను జారీ చేయనున్న ట్లు సమాచారం. టీచింగ్ ఫ్యాకల్టీ కోసం ఇప్పటికే రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కళాశాలకు 161 ఎకరాల భూదాన్ భూమిని కేటాయించగా మరింత భూమి అవసరం కావడంతో 89 ఎకరా ల పట్టా భూములను సేకరించారు. కన్స్ట్రక్షన్ ఎజెన్సీ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. త్వరలో నిర్మాణాలు నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మారుస్తూ కేంద్రం గెజిటెడ్ విడుదల చేయడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమి సిద్ధంగా ఉండడంతో త్వరలో కళాశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. నిమ్స్ భవనంలో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తుండగా మూడేళ్లలో పూర్తిస్థాయిలో 240ఎకరాలకు పైగా స్థలంలో వసతి గహాలు, ప్రొఫెసర్లు, వైద్యుల గృహాలు, పరిశోధన కేంద్రాలు నిర్మించనున్నారు. అలాగే మైదానాలు, స్విమ్మింగ్‌పూల్స్, బృందావనాలు, రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. కమిటీలో ముగ్గురు ఎంపీలు ఎయిమ్స్‌ను ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చేందుకు వేసిన 18మంది డైరెక్టర్ల కమిటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు బండ ప్రకాశ్, బండి సంజయ్, అరవిందులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఎంపీ, ఎయిమ్స్ అడ్వయిజర్ సభ్యులు బండ ప్రకాశ్‌లు గురువారం ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి 17మంది సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా ఎయిమ్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని, 2021లోపు ఎయిమ్స్ రూపు రేఖలను మార్చనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. -
ఆరోగ్యానికి భరోసా.. ఎయిమ్స్‌తో కులాసా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీబీనగర్ ఎయిమ్స్‌లో వచ్చే డిసెంబర్ నుంచి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడ నిమ్స్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతుండగా, త్వరలో ఎయిమ్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ గల ప్రముఖవైద్యులు, ప్రొఫెసర్లు అక్కడ అందుబాటులో ఉంటారు. వారి సేవలు బీబీనగర్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అం దనున్నాయి. ఇప్పటికే నిమ్స్ ద్వారా రోజుకు 500 మంది వరకు ఓపీ రోగులు వస్తున్నా రని అంచనా. ఎయిమ్స్ సేవలు అందుబాటులోకి వస్తే రోజుకు 2వేల మంది వరకు వచ్చే అవకాశముందంటున్నారు. ఈ ఏడాది నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమ య్యాయి. పలు రాష్ట్రాలకు చెందిన 50మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి నుంచి ఇన్ పేషెంట్ సేవలు... వచ్చే మార్చి నుంచి ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనిక్ విభాగాల్లో ఇన్ పేషెంట్లకు ముందుగా వైద్య సేవలు ప్రారంభించి తదుపరి విడతల వారీగా ఇతర వైద్య సేవలన్నింటినీ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎయిమ్స్ వర్గాలు ముందుగా 750 పడకలతో అనుబంధ ఆస్పత్రి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకొని వెయ్యి పడకలకు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కేంద్ర ఎయిమ్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశాయి. అందుకు కేంద్ర వర్గాలు సుముఖత వ్యక్తంచేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి ఒకరు తెలిపారు. ఇన్‌పేషెంట్లు 2 వేల వరకు రోజూ ఉంటే, పడకల సంఖ్య తప్పనిసరిగా వెయ్యి ఉండాలని అంటున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతమున్న ఫీజుల మాదిరిగానే ఎయిమ్స్‌లో ఉంటాయని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి.. బీబీనగర్ ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 200 ఎకరాలు కేటాయించింది. అధికారులు పలుమార్లు దీనిపై ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ కోసం కృషిచేశారు.ఎట్టకేలకు ఇది సాకారం కావడంతో ఇక్కడి ప్రజలు సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ నిమ్స్ భవనాలు ఉండటంతో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తున్నారు. మూడేళ్లలోగా పూర్తిస్థాయిలో 200 ఎకరాల్లో హాస్టళ్లు, ప్రొఫెసర్లు, డాక్టర్ల వసతి గృహాలు పూర్తికానున్నాయి.అద్భుతమైన మైదానాలు, స్విమ్మింగ్ ఫూల్స్, బృందావనాలు కూడా రూపుదిద్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకోసం ఎయిమ్స్ ఇప్పటికే నిధులు కేటాయించింది. మున్ముందు పీజీ సీట్లు కూడా వచ్చాక ఎయిమ్స్ ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు మించి వైద్యం ఉంటుందని, అదే రాష్ట్రంలో వైద్యానికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేగాక అనేక పరిశోధనలు కూడా ఇక్కడ జరగనున్నాయి. -
కరెంటు ఇచ్చారు..లైన్ మరిచారు!
సాక్షి, హైదరాబాద్: అది దగ్గరి దారి.. ఆ మార్గం గుండా వెళ్తే దాదాపు 80 కి.మీ. దూరం తగ్గుతుంది. ఫలితంగా సమయంతోపాటు ఖర్చూ ఆదా అవుతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. గరిష్టంగా దాన్ని వినియోగించుకుని ఆదా చేసుకుంటారు. కానీ ఘనత వహించిన మన రైల్వే మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో నడికుడి మార్గం కీలకమైన వాటిల్లో ఒకటి. నగరం నుంచి వెళ్లేటప్పుడు బీబీ నగర్ దాటిన తర్వాత వచ్చే పగిడిపల్లి స్టేషన్ తర్వాత మార్గం రెండుగా విడిపోతుంది. ఎడమవైపు వెళ్తే వరంగల్, కుడివైపు వెళ్తే నడికుడి మార్గం వస్తుంది. వరంగల్ మార్గం డబుల్‌లైన్ కావటం, విద్యుదీకరణ ఉండటంతో ఇది ప్రధాన మార్గమైంది. కానీ నడికుడి మార్గం సింగిల్‌లైన్‌గా ఉండిపోవటంతో ఆ మార్గంలో కొన్ని రైళ్లే నడుస్తున్నాయి. పైగా ఇప్పటివరకు అది విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో డీజిల్ రైళ్లనే నడుపుతున్నారు. వరంగల్ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ గరిష్ట పరిమితి దాటిపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో దాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా నడికుడి మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. రెండో లైన్ వేయటంతోపాటు విద్యుదీకరణ చేపట్టి కొన్ని రైళ్లను ఈ మార్గంలో మళ్లించాలనేది ఆలోచన. గుంటూరుకు వరంగల్ మీదుగా కంటే ఈ మార్గంలో వెళ్తే దాదాపు 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. కరెంటు ఏర్పాటు చేసి తుస్సుమనిపించారు.. చేసిన ఆలోచనకు, చేపట్టిన కార్యాచరణకు పొంతన లేకపోవటంతో ఇప్పుడు ఈ మార్గంలో వింత పరిస్థితి ఎదురైంది. పగిడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు సమీపంలోని నల్లపహాడ్ వరకు తాజాగా విద్యుదీకరణ పూర్తి చేశారు. గుంటూరు నుంచి విజయవాడ మార్గంలో చాలా కాలం క్రితమే ఆ తంతు పూర్తయింది. గుంటూరు నుంచి అటు తెనాలి, ఇటు గుంతకల్ మార్గాల్లో కూడా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేశారు. వెరసి కరెంటు ఇంజిన్లతో రైళ్లు నడిపేందుకు ఈ మార్గం సిద్ధమైందన్నమాట. ఇప్పటివరకు ఈ మార్గంలో కేవలం డీజిల్ రైళ్లనే నడిపేవారు. హైదరాబాద్ నుంచి డీజిల్ ఇంజిన్ రైలును గుంటూరు/తెనాలి వరకు లాక్కెళ్లేది. అక్కడ దాన్ని మార్చి రైలుకు విద్యుత్తు ఇంజిన్ అమర్చి పంపేవారు. దీంతో దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు విద్యుదీకరణ పూర్తి కావటంతో ఆ సమస్య లేకుండా కరెంటు ఇంజిన్లు అమర్చి రైళ్లను నడిపే అవకాశం కలిగింది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఇది దగ్గరి దారిగా మారింది. ఇక వరంగల్ మార్గంపై భారం తగ్గించేందుకు కొన్ని రైళ్లను ఈ దారి గుండా నడపాల్సి ఉంది. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఈ మార్గాన్ని విద్యుదీకరించారు కానీ రెండో లైన్ (డబ్లింగ్) నిర్మించలేదు. ఫలితంగా పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు ఇది సింగిల్ లైన్‌గానే ఉంది. దీంతో ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. విద్యుదీకరించినా, ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కరెంటు ఇంజిన్ ఏర్పాటు చేయడం తప్ప ఒక్క రైలు కూడా అదనంగా నడిపే అవకాశం దక్కలేదు. వెరసి భారీ వ్యయంతో విద్యుదీకరించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గతంలోనే మంజూరు.. పనులే చేపట్టలేదు.. పగిడిపల్లి నుంచి నల్లపహాడ్ వరకు డబ్లింగ్ చేపట్టేందుకు రైల్వే శాఖ గతంలోనే అనుమతి మంజూరు చేసినా అది ముందుకు సాగలేదు. ఎంపీ నిలదీయంతో కొత్తగా మంజూరు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. కానీ దాని ఊసేలేకుండా పోయింది. దాదాపు 200కి.మీ. మార్గాన్ని డబ్లింగ్ చేయకపోవటం వల్ల, విద్యుదీకరణ జరిగినా అదనంగా రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. ఫలితం.. వరంగల్ మార్గంపై అదనపు భారం పడటం, 80 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావటం, అంతమేర కరెంటు ఖర్చు, సమయం వృథా.. ఇదీ పరిస్థితి. అటు విద్యుదీకరణ, ఇటు డబ్లింగ్ పనులు ఒకే సారి చేపట్టి ఉంటే.. రెండూ పూర్తయ్యేవి. రైల్వేకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరిగేది. -
తస్మాత్ జాగ్రత్త..!
అసలే వర్షాకాలం.. ఆపై అందరూ పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ బిజీబిజీగా గడుపుతారు. ఫలితంగా ఇళ్లు దాదాపుగా ఎవరూ లేకుండా ఉంటాయి! ఇదే అదునుగా భావించే చోరులు చోరీలకు ఎగబడుతారు. అందినంత దోచుకెళ్తారు. ఇలాంటి సమయాల్లో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని, టూర్లకు, ఇతర ఊళ్లకు వెళ్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా వర్షాకాలం రాగానే పొద్దున లేవగానే పల్లె ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. ఉదయం అనగానే చేన్లలోకి వెళ్లిన రైతులు చీకటి పడేదాక ఇంటి ముఖం చూడకుండా పంట పొలాల్లో పనులు చేస్తారు. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఎవరి పనికి వారు వెళ్లేదానిని అదునుగా భావించి దుండగులు చక్కగా ఇళ్లట్లోకి చొరబడి బంగారం, నగదు సొత్తుతో పారిపోతుంటారు. ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దుండగులు చెలరేగుతుంటారు. పోలీసులు కూడా ప్రతి ఇంటినీ గమనించలేరు. అందుకే ప్రజలు కూడా చైతన్యం కావాలంటున్నారు వారు. అందుకోసం భిక్నూర్ సీఐ రాజశేఖర్ ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలు తెలుపుతున్నారు. కొత్త వ్యక్తులు వస్తే తెలపాలి.. చోరీలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. దుండగులు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు, మూడు రోజులు ముందు పరిశీలిస్తారు. అంటే చెత్త కాగితాలు, భిక్షగాళ్లుగా, వస్తువులు అమ్మేవారిగా వచ్చి చుట్టూ పక్కల పరిశీలించిన అనంతరం ప్రణాళిక రచించి సులువుగా పని ముగించుకుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ⇔చోరీలకు వచ్చే దుండగులు ఒకరోజు ముందే పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ⇔ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోర్డులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడూ చూసుకోవాలి. ⇔ దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు తెలపాలి. ⇔ రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు సేకరించి పెట్టుకోవడం మంచిది. ⇔ దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే కాపాలదారున్ని ఏర్పాటు చేసుకోవాలి. ⇔ వ్యవసాయ పనులకు వెళ్లేవారు చుట్టుపక్కల వారికి తెలియజేయాలి. తాళం వేసి వాటి తాళాలను ఇంటి దగ్గర పెట్టకూడదు. ⇔ ప్రతి ఇంట్లో తాళాలు వేసి తాళాలను అక్కడే ఉంచడంతో దొంగలకు అవకాశాలు ఎక్కువగా ఉండి దోచుకునేందుకు వీలవుతుంది. వాటిని పెట్టకూడదు. ⇔ ఇంటికి ఒకటి, లేక రెండు తాళాలు వేసుకోవాలి. దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ⇔ బంగారు ఆభరణాలు ధరించి నిద్రించకూడదు. కిటికీలు తెరిచి ఉండేవైపు పడుకోరాదు. ⇔ ఇంట్లో బంగారం, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం. పోలీసు కంట్రోల్ రూం నం.100 ముందస్తు సమాచారమివ్వాలి.. గ్రామాల ప్రజలు ప్రస్తుతం వ్యవసాయ ప నుల్లో నిమగ్నమయ్యా రు. ఇంటికి తాళాలు వేసుకొని చేన్లలోకి వెళ్లే ముందు చుట్టు పక్కల వారికి తెలియజేయాలి. ముఖ్యంగా మహిళలు పొలం వద్దకు ఒంటరిగా పోవద్దు. ఒకవేళ యాత్రలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. ఊర్లకు వెళ్లేవారి ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే వాటిని బంద్ చేయకుండా ఉంచాలి. –సురేష్, ఎస్ఐ, బీబీపేట. జాగ్రత్తలు తీసుకోవాలి.. పట్టణాలు, వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పిల్లలకు సెలవులు ఉన్న సమయంలో తీర్థయాత్రలకు, టూర్లకు, సొంత గ్రామాలకు వెళ్లేవారు వారి పరిధిలోని పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ఏర్పాటు నిర్వహిస్తున్నారు. –రాజశేఖర్, సీఐ, భిక్కనూరు. -
బీబీనగర్‌లోనే ఎంబీబీఎస్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఎయిమ్స్ ఆస్పత్రి ఉనికిలోకి రావడానికి ముందు అక్కడ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతి గదులు, నిర్మాణాలు పూర్తికావన్న భావనతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ బీబీనగర్‌లోనే ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు భోపాల్ ఎయిమ్స్ బృందం సోమవారం బీబీనగర్‌ను సందర్శించింది. భోపాల్ ఎయిమ్స్‌కు బాధ్యతలు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు భోపాల్ ఎయిమ్స్‌కు కేంద్రం బాధ్యత అప్పగించింది. దాని ఆధ్వర్యంలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సర్మాన్ సింగ్‌ను బీబీనగర్ ఎయిమ్స్‌కు మెంటార్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోని బృందం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి జులై 15 నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని, అనంతరం ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని ఆ బృందం వెల్లడించినట్లు డీఎంఈ తెలిపారు. ముందుగా 50 ఎంబీబీఎస్ సీట్లతో ఎయిమ్స్ వైద్య విద్య ప్రారంభిస్తారు. అనంతరం 100 సీట్లకు పెంచుతారు. బీబీనగర్ క్యాంపస్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి అవసరమైన బ్లూప్రింట్‌ను తయారు చేశారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎయిమ్స్ ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి సంబంధించి అవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే భోపాల్ ఎయిమ్స్ నోటిఫికేషన్ జారీచేసింది. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియోలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లకు ఒక్కొక్క ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే అనాటమీలో మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్, బయో కెమిస్ట్రీలో నాలుగు, ఫిజియోలజీలో నాలుగు, కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్లలో నాలుగు పోస్టుల చొప్పున నోటిఫికేషన్ జారీచేశారు. ఇవే పోస్టులకు సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లుగా మరో 16 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని రమేశ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో భోపాల్ ఎయిమ్స్ డీన్ డాక్టర్ అర్నీత్ అరోరా, సూపరింటెండెంట్ ఇంజనీర్ జితేంద్రకుమార్ సక్సేనా, పీఎంఎస్ఎస్వై డైరెక్టర్ సంజయ్రాయ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, బీబీనగర్ నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
50 సీట్లతో బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ తొలుత 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభం కానుంది. వాస్తవానికి 100 సీట్లు రావాల్సి ఉన్నా.. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఎయిమ్స్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేందుకు మూడేళ్ల సమయం పడుతుండటంతో తక్కువ సీట్లతోనే ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూడు బ్యాచ్‌ల వరకు కూడా 50 ఎంబీబీఎస్ సీట్లే అందుబాటులో ఉండనున్నాయి. ఎయిమ్స్ పూర్తిగా ఉనికిలోకి వచ్చాక 100 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుతారు. 2019–20 వైద్య విద్య సంవత్సరానికి ఇప్పటికే ఎయిమ్స్ ఎంబీబీఎస్‌కు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు తరగతి గదులు, లైబ్రరీ, హాస్టల్ వసతి ప్రస్తుతమున్న నిమ్స్ భవనాల్లోనే నిర్వహిస్తారు. నిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్‌కు అప్పగించాక దాని అనుబంధంగానే ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. సూపర్ స్పెషాలిటీపైనే ప్రధాన దృష్టి.. రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లోగా నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 750 పడకలతో ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చే అవకాశముంది. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాల్లో ఎయిమ్స్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్కడ ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో పాటు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ సీట్లు వస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల కంటే కూడా సూపర్ స్పెషాలిటీ కోర్సుల పైనే ఎయిమ్స్ దృష్టి పెడుతుందంటున్నారు. పైగా మెడికల్ రంగంలో పరిశోధనలు ప్రోత్సహిస్తారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వివిధ దేశాల్లో జరిగే సెమినార్లకు విద్యార్థులు, ప్రొఫెసర్లు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. స్థానికులకు అవకాశాలు లేనట్టే.. బీబీనగర్ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన ఇతర వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ మేరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తా యి. అన్ని రకాల భర్తీలు కూడా జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. స్థానికులకు ప్రత్యేక కేటాయింపులు ఉండవు. చిన్నపాటి, నాలుగో తరగతి ఉద్యోగుల వరకు మాత్రం స్థానికులు ఉండే అవకాశముంది. కాగా, నిమ్స్ భవనాలను, అక్కడి భూముల ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంద ని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో ప్రస్తుత నిమ్స్ భవనంలో ఎయిమ్స్ ఓపీ సేవలు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి విన్నవించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. -
బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి/ న్యూఢిల్లీ: బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను 45 నెలల్లో నెలకొల్పేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బీబీనగర్ ఎయిమ్స్‌తో పాటు, తమిళనాడులోని మధురైలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బీబీనగర్‌లోని ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అవసరమైన నిధులను ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద సమకూర్చుతారు. 2019–20 విద్యా సంవత్సరంలోనే బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహించేలా ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాల్లో ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ సీట్లు వస్తాయి. దీంతోపాటు 750 పడకలతో ఎయిమ్స్ ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసే 750 పడకల్లో ఎమర్జెన్సీ లేదా ట్రామా బెడ్స్, ఆయుష్ బెడ్స్, ప్రైవేటు పడకలు, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉంటాయి. మెడికల్ కాలేజీ, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి బస, గెస్ట్‌హౌస్, హాస్టళ్లు, రెసిడెన్షియల్ సదుపాయం ఉంటాయి. 3 వేల మంది సిబ్బంది.. బీబీనగర్ ఎయిమ్స్‌లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం పేర్కొన్న ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఉంటారు. ఎయిమ్స్‌కు అవసరమైన భవనాలు, స్థలం అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు సీఎస్ ఎస్కే జోషి గతంలో లేఖ రాశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలు ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. ఒక అంచనా ప్రకారం వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతులతో ఎయిమ్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా, ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం తెలపడంపై వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నరసయ్యగౌడ్, బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాదే మన ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 ఎయిమ్స్‌లలో ఒకేసారి ప్రవేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర బృందం అక్కడికి వచ్చి నిమ్స్ భవనాలు, అదనపు స్థలాలను పరిశీలించింది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ ఎయిమ్స్‌కు కూడా ప్రవేశాలు జరిపేలా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎయిమ్స్ ఏర్పాటు వచ్చే ఏడాదే ఉంటుందని స్పష్టమైంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, బఠిండా, భోపాల్, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, దేవ్‌గఢ్, జోధ్‌పూర్, కల్యాణి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాయ్‌బరేలీ, రిషికేశ్‌ల్లో ఉన్న ఎయిమ్స్‌ల్లోనూ ప్రవేశాలు జరుపుతామని నోటిఫికేషన్లో వెల్లడించారు. మే 25, 26 తేదీల్లో ఎంట్రన్స్ టెస్ట్ అన్ని ఎయిమ్స్‌ల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. జనవరి మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వివరాలు ఎయిమ్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సుకు అర్హులు. అలాగే ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలంటే ప్రవేశ పరీక్షలో సరైన ర్యాంకు రావడంతోపాటు ఇంటర్మీడియెట్‌లోని ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు మొదలైన సన్నాహాలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభు త్వం అక్టోబర్‌లో కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు అప్పట్లో లేఖ రాశారు. నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. అంతేగాక ఎయిమ్స్ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
మొబైల్ ఏటీఎం ప్రారంభం
బీబీనగర్ : మండలంలోని బీబీనగర్, కొండమడుగు, గూడురు గ్రామాల్లో సోమవారం నాబార్డు వారి సౌజన్యంతో, పీఏసీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలు, నగదు అందుబాటులో ఉండే విధంగా మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ బ్రాంచ్ మేనేజర్ ఇందిరాప్రియదర్శిని, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు యువకుల దుర్మరణం
బీబీనగర్ (భువనగిరి) : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెం దారు. ఈ ఘటన మండలంలోని వెంకిర్యాల గ్రా మ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోరి పడమటిసోమవారం గ్రామానికి చెందిన దంతు మల్లేశ్ (26) వెంకిర్యాల గ్రామానికి చెందిన పహిల్వాన్‌పురం యాదయ్య వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం వెంకిర్యాల గ్రామంలోని ఎస్సీలకు చెందిన దశదినకర్మ ఉండడంతో స్నానా లు చేయడానికి ట్యాంకర్‌ను పంపిం చాలని యా దయ్యతో మాట్లాడుకున్నారు. దీంతో యాదయ్య డ్రైవర్ మల్లేశాన్ని ట్రాక్టర్‌కు ట్యాంకర్‌ను వేసుకుని వెంకిర్యాల గ్రామ శివారులోని చె రువు కట్ట వద్ద గల శ్మశాన వాటికకు వెళ్లాలని చెప్పాడు. దీంతో మల్లేశం ట్యాంకర్లో నీటిని నింపుకుని తన మేనల్లుడు ఉప్పట్ల శ్రీరాంలును(18) తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పోలాల్లోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మల్లేశంతో పాటు శ్రీరాములుకు తీవ్ర గా యాలయ్యాయి. వారిని ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. డ్రైవింగ్ నేర్చుకుంటానని వచ్చి.. ట్రాక్టర్ డ్రైవర్ మల్లేశం మేనల్లుడైన శ్రీరాములు పడమటిసోమారంలో నివసిస్తున్నాడు. ఖాళీగా ఉండడంతో తాను కూడా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పడంతో మల్లేశం తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మద్యం సేవించి అజాగ్రత్తగా మల్లేశం ట్రాక్టర్‌ను నడుపడం వల్లే ప్రమాదం చో టు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒకే గ్రా మానికి చెందిన ఇద్దరు మామా అల్లుడులు మృ తిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కృష్ణ తెలిపారు. -
బీబీనగర్ నిమ్స్ ఎందుకు ప్రారంభించలేదు?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రి భవనాలు నిర్మించి ఏడేళ్లవుతున్నా నేటి వరకూ వైద్య సేవలు ఎందుకు ప్రారంభించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రూ.125 కోట్లతో నిర్మించిన ఆ భవనాలు ఎందుకు ఖాళీగా ఉంచారో వివరణివ్వాలని నోటీసులు జారీ చేసింది. జర్నలిస్ట్ కె.నరేందర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. గతంలో మంత్రులు, సీఎం కూడా సర్కారు ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందేవారని.. కానీ ఆస్పత్రుల పరిస్థితి క్షీణించడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. బీబీనగర్‌లో నిమ్స్ భవనాలు నిర్మించినా ప్రారంభించకపోవడాన్ని కాగ్ తప్పుబట్టినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, ఆరోగ్యశ్రీలో అక్రమాలు జరుగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలే చెబుతున్నాయని చెప్పారు. ‘కార్పొరేట్’లో రోగులకు మంచి వైద్యం అందించేందుకు వీలుగా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని వాదించారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ వివరించారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
బీబీనగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం కొండమడుగులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు గమనించకపోవడంతో.. నీటి సంపులో పడి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
బీబీనగర్‌లో డ్రైపోర్టు
- ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే శాఖ సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరప్రాంతం లేని రాష్ట్రాల్లో డ్రైపోర్టులను నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో తెలంగాణలో తొలి డ్రైపోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న బీబీనగర్‌లో దీనిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో కేంద్రం కూడా దీనికి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో సూత్రప్రాయంగానైనా దీని ప్రస్తావన ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రయోజనాలు ఏమిటి..? విదేశాలకు సరుకు ఎగుమతుల్లో నౌకాశ్రయాల పాత్ర కీలకం. తీరప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదం చేస్తాయి. కానీ తీరప్రాంతాలు లేని చోట్ల ఆ వెలితి కనిపిస్తోంది. ఇది పెట్టుబడులపైనా ప్రభావం చూపుతోంది. తీరప్రాంతం లేని చోట్ల ఉత్పత్తులను రోడ్డు మార్గం ద్వారానే తరలించాలి. ఆ ఉత్పత్తులు నౌకాశ్రయాలకు వెళ్లిన తర్వాత కస్టమ్ సంబంధిత తంతు ఇతర పనులు పూర్తి కావటానికి సమయం పడుతోంది. అప్పటి వరకు ఉత్పత్తులు అక్కడే ఉండిపోతున్నాయి. దీంతో కంపెనీలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు లేని చోట్ల డ్రైపోర్టులు నిర్మించి అన్నిరకాల ఎగుమతి తంతులను అక్కడే పూర్తి చేసి రైలు మార్గం ద్వారా నౌకాశ్రయాలకు ఉత్పత్తులు తరలించాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడులను ఆకట్టుకునే క్రమంలో డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కేంద్రంతో చర్చలు జరిపి కనీసం నాలుగైదు చోట్ల డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరింది. ఈ క్రమంలో బీబీనగర్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ డ్రైపోర్టు నిర్మించాలని స్థానిక ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇటీవల రైల్వే శాఖకు ప్రతిపాదించారు. వచ్చే రైల్వే బడ్జెట్లో దీనికి స్థానం కల్పించాలని ఆయన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభును కోరారు. డ్రైపోర్టు ఏర్పాటైతే హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బడా సంస్థలు ముందుకు వస్తాయని, ఇది హైదరాబాద్‌తోపాటు సమీప ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. -
బీబీనగర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
బీబీనగర్(నల్గొండ జిల్లా): బీబీనగర్ మండలం గూడూరులో ఓ యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తిట్టాడనే కారణంతో నరుడి వెంకటేశ్(24) అనే యువకుడు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు సదరు వ్యక్తి ఇంటి మందు శవంతో ధర్నాకు దిగారు. -
ఎవరిదీ.. 'పాపం'
నవమసాలు మోసి పండంటి ఆడ బిడ్డను జన్మనిచ్చిన ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం వచ్చిందా.. లేక ఆడపిల్ల పుటి ్టందనే వివక్షతో వదిలేసిందో తెలియదుకాని పుట్టిన గంటకే ఆ చిన్నారిని శ్మశానికి చేర్చి వెళ్లిపోయింది. సమాదుల మధ్య అమ్మకోసం పరితపించిన పసికందు ఏడుపు విన్న కొందరు మహిళలు అక్కున చేర్చుకొని ప్రాణాలు నిలబెట్టారు. రక్తబంధం విలువలు దిగజార్చేలా చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని వెంకిర్యాల గ్రామంలో వెలుగుచూసింది. - బీబీనగర్ రోజులాగే వెంకిర్యాల గ్రామస్తులు శుక్రవారం ఎవరిపనుల్లో వారున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా రైతులు పొలాలకు, కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వెంకిర్యాల గ్రామం నుంచి రాఘవాపురం వెళ్లే రహదారిపై ఉన్న శ్మశానవాటిక దారిలో పనులకు వెళ్తున్న ఉపాధి కూలీలకు చిన్నారి ఏడుపులు వినిపించాయి. శ్మశానం నుంచి ఏడుపులు రావడంతో ముందుగా భయపడిన వారు తర్వాత ధైర్యంచేసి లోనికి వెళ్లారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో కట్టి సమాధుల వద్ద పడేశారు. చిన్నారి ఊపిరాడక కాళ్లూచేతులు కొట్టుకోవడంతో కవర్ముడి విడిపోయింది. కవరు తెరుచుకోవడంతో పసికందు ఎడువడం వినిపించడం, శ్వాస ఆడడంతో ప్రాణాలతో బయటపడింది. ఏడుపుల శబ్ధం పెరగడంతో బిడ్డకోసం వెతికిన మహిళలకు రక్తంలో తడిసి విలపిస్తున్న చిన్నారి ఎట్టకేలకు కనిపించింది. నివ్వెరపోయిన వారు వెంటనే అక్కున చేర్చుకొని గ్రామంలోకి తీసుకొచ్చారు. స్థానికుల పనేనా? జన్మించిన అరగంట వ్యవధిలోనే ఆడ శిశువును వదిలేసి వెళ్లడంతో ఇది ముమ్మాటికీ స్థానికుల పనేనని అందరూ అనుమానిస్తున్నారు. పడేసిన కాసేపటికే విషయం బయటపడటంతో ఈ దారుణానికి ఒడిగట్టిందెవరని ఆరా తీస్తున్నారు. పసికందును వేసి ఉన్న కవర్లో డెలివరీకి వాడిన బ్లౌస్‌లు ఉండడంపై ఆర్ఎంపీ డాక్టర్లు డెలివరీ చేసి ఉండవచ్చని బీబీనగర్ పీహెచ్సీ వైద్యాధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత పసికందును చేరదీసిన గ్రామ మహిళలు స్థానిక నాయకుల సహకారంతో ఓ పాఠశాలకు చెందిన బస్సులో బీబీనగర్ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వెంటనే వైద్య సిబ్బంది శిశువును శుభ్రం చేసి చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు ఆసుపత్రికి చెరుకొని జరిగిన విషయం తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పీహెచ్‌సీకి చెరుకొని పసికందును నల్లగొండలోని శిశు సంక్షేమ గ ృహానికి తీసుకెళ్లారు. -
ఎయిమ్స్‌గా బీబీనగర్ నిమ్స్
* రూ. 1,000 కోట్లతో అభివృద్ధి * 200 ఎకరాల్లో అభివృద్ధికి నిర్ణయం * రాజధాని, శివారు జిల్లాల రోగులకు వైద్యసేవలు * మొదటి దశలో ఎయిమ్స్, రెండో దశలో స్మార్ట్ హెల్త్‌సిటీ * స్మార్ట్హెల్త్సిటీ కోసం వెయ్యి ఎకరాలు * రైతులు, భూదాన్ భూముల సేకరణ * సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం భువనగిరి: నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్దగల నిమ్స్‌ను ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్)గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మంగళవారం బీబీనగర్ మండలం రంగాపురం వద్దగల నిమ్స్‌ను సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయిలో హెల్త్ టూరిజం, హెల్త్స్మార్ట్ సిటీగా బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు అధికారులతో కలసి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేయడానికి 200 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 160 ఎకరాల భూమి ఉంది. మిగిలిన 40 ఎకరాలను రైతులు, భూదాన్ భూముల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఈ భూమి ప్రతిపాదనలతో కేంద్రానికి నివేదికలు పంపిస్తే ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తారని సీఎం వివరించారు. ఎయిమ్స్ ఏర్పాటైతే సుమారు 1,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రానున్నాయి. నిమ్స్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల రోగులకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అధునాతన రీసెర్చ్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తెలంగాణలో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 10 ప్రాంతాలను ఎంపికచేసి అనువైన స్థలం కోసం సర్వేలు చేపట్టింది. అంతిమంగా బీబీనగర్ నిమ్స్.. ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైందని గుర్తించింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా నిమ్స్‌ను సందర్శించి ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 1,000 ఎకరాలు సేకరించాలి నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చడానికి ప్రస్తుతం 200 ఎకరాలు అవసరం కాగా, అంతర్జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన కేంద్రంగా, స్మార్ట్ హెల్త్‌సిటీగా అభివృద్ధి చేయడానికి మాత్రం 1,000 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇందుకోసం బీబీనగర్ ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో 200 ఎకరాల్లో ఎయిమ్స్‌ను, రెండవ ఫేజ్‌లో 1,000 ఎకరాల్లో స్మార్ట్హెల్త్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ఆరోగ్యశాఖ డెరైక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్ పాల్గొన్నారు. -
రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు
నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరుకు చెందిన రవి అనే యువకుడు శనివారం డెల్టా ప్యాసింజర్ రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పైనున్న కరెంట్ తీగలు తగలటంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రక్తచరిత్రే..
వరంగల్ క్రైం/రఘునాథపల్లి/జనగామ రూరల్ : వీరిని చూస్తే... అమాయకులని అనిపిస్తుంది. కానీ.. వీరి వెనుక పెద్ద రక్త‘చరిత్రే’ ఉంది. జిల్లాతోపాటు రాష్ర్ట్రంలోని పలు ప్రాంతాల్లో నరమేధం సాగించి.. దోపిడీ చేసిన పార్థీ ముఠా సభ్యులు వీరే. వీరికి 31 హత్య కేసుల్లో ప్రమేయముండగా... బీబీనగర్, రఘునాథపల్లి, లింగంపల్లి,సదాశివపేట, పెద్దపల్లి ఘటనల్లో ప్రధాన నిందితులు. గత నెల 24న హైదరాబాద్‌లోని లింగంపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జైలులో ఉన్న నలుగురు నిందితులను రఘునాథపల్లి హత్యాకాండ కేసుపై జనగామ కోర్టుకు హాజరుపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇలాంటి కరుడు గట్టిన నరరూప రాక్షసులు పార్థీ గ్యాంగ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఖాకీలకు చిక్కింది పార్థీ గ్యాంగ్‌లోని ఒక ముఠాకు చెందిన వారే. పార్థీ ముఠాకు సంబంధించిన మరో 8 బృందాలు జిల్లాలో తిరుగుతున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మహారాష్ట్రలోని ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే ప్రాంతాలకు చెందిన ఈ దొంగల ముఠా ఇప్పటివరకు జిల్లాలో ఐదు దొంగతనాలకు పాల్పడింది. దీంతోపాటు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంటలో ఒక్కొక్క దొంగతనానికి పాల్పడ్డారు. వీరు చేసిన ప్రతి దొంగతనంలోనూ హత్యలకు పాల్పడ్డారు. ‘మర్డర్ ఫర్ గెయిల్’ నేరాల కింద పిలువబడే పార్థీ గ్యాంగ్ సభ్యుల వ్యవహార శైలి అత్యంత క్రూరత్వం. వారు సృష్టించిన నరమేధాలే ఇందుకు నిదర్శనం. దొంగతనానికి ఒడిగట్టే ఇంటిలో ఆ రాత్రి భయానక వాతావరణం కల్పించడం... ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అనే తేడా లేకుండా ఇంట్లో ఎవరు ఉన్నా, రాడ్లు, కర్రలతో తలపై కొట్టడం, కత్తులతో కోయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు ఈ ముఠాలోని సభ్యులు గతంలో మూడు సార్లు పోలీసులకు చిక్కారు. ప్రతి ఒక్క దోపిడీలోనూ హత్యలే... ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉండే పార్థీ గ్యాంగ్ సుబేదారి, శాయంపేటలో చేసిన రెండు దొంగతనాల్లో బీభత్సం సృష్టించారు. హన్మకొండ జులైవాడలో జరిగిన సంఘటనలో భార్య, భర్తలను తీవ్రంగా కొట్టడంతో పాటు భార్య గొంతుకోసి సొత్తు దొంగిలించారు. అదేవిధంగా... శాయంపేట, నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన దోపిడీ సంఘటనల్లో కూడా హత్యకు పాల్పడారు. నెక్కొండ సమీపంలోని తండాల్లో మరో రెండు దొంగతనాలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ను హత్యచేసి దోచుకెళ్లారు. నల్లగొండ పోలీసులకు దొరికిన వీరు రాష్ర్టవ్యాప్తంగా పది దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇందులో హైదరాబాద్‌లో నాలుగు కాగా... వరంగల్ రఘునాథపల్లికి చెందినది మరొకటి. గీత వృత్తి చేస్తూ రఘునాథపల్లి మండల కేంద్రంలో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న చెరుకు నర్సింహులు, రేణుక ద ంపతుల కుటుంబం ఈ ముఠా కిరాతకంతో చిన్నాభిన్నమైంది. ఇంట్లో బంగారం, నగదు దోచుకుపోవడంతోపాటు మేల్కొన్న రేణుక కూతురు అకిరనందిని, తల్లి లచ్చమ్మ, అమ్మమ్మ రాధమ్మను రాడ్లతో బాది అతి కిరాతకంగా బలిగొన్నారు. ముక్కుపచ్చలారని రేణుక కుమారుడు హర్షవర్దన్‌పైనా ప్రతాపం చూపించారు. తీవ్ర గాయాల పాలు చేయడంతో ఇప్పటికీ ఆ బాబు ఆరోగ్యం నిలకడగా లేదు. రాత్రి వేళల్లో మాత్రమే దొంగతనాలు ..... పగలు గానీ.. రాత్రి గానీ తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే దొంగతనాలకు ఎంచుకుంటారు దొంగలు. కానీ.. పార్ధీ గ్యాంగ్ కేవలం రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. చూడడానికి పొట్టిగా, నల్లగా ఉండే వీరు చిత్తు కాగితాలు ఏరుకోవడం, పిన్నిసులు అమ్మడం, బిచ్చం ఎత్తుకోవడం వంటివి చేస్తుంటారు. మధ్యాహ్నం వేళల్లోఈ పనిచేస్తూ.. రెక్కీ నిర్వహించి దొంగతనం చేసే ఇంటిని ఎంచుకుంటారు. రాత్రి వేళలో ముఠాగా ఆ ఇంటి పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో వారికి తెలిసే విధంగానే తలుపులు, కిటికీలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. లోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వారిని చావబాది డబ్బులు, బంగారం అపహరిస్తారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లే వీరి అడ్డా. ఎక్కువ మంది ఉన్న సమయంలో ఈ స్టేషన్లకు దగ్గరగా డేరాలు వేసుకుని ఉంటారు. ఎక్కువసార్లు బస్‌స్టేషన్‌లోని డార్మెట్లలో బసచేస్తుంటారు. దొంగతనం చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల లోపు వీరు ఎలాంటి దోపిడీకి పాల్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, రఘునాథపల్లిలో బీభత్సం సృష్టించి పట్టుబడిన పార్థీ ముఠా సభ్యులు షేరియాష్కాడే, సంతోష్ షిండే, తరుణ్బోస్లే, పరమేశ్వర్ బోస్లేను జనగామ కోర్టులో హాజరు పరుస్తున్నారనే సమాచారంతో మండల కేంద్రం లోని పలువురు యువకులు అక్కడికి తరలివెళ్లారు. కిరాతకంగా ముగ్గురిని బలిగొన్న నిందితుల్ని ఉరితీయాలని నినాదాలు చేశారు. నగరంలో స్టూవర్ట్‌పురం దొంగలు నగరంలో పార్థీ గ్యాంగ్‌తో పాటు స్టూవర్ట్‌పురానికి చెందిన దొంగల ముఠా ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ప్రజల దృష్టి మర ల్చి దొంగిలించడం వీరి స్టైల్. బ్యాంకుల వద్ద, డబ్బులు మారే చోట వీరు ఎక్కువగా గమనిస్తుంటారు. ఇటీవల కాలంలో సుబేదారిలోని ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల వద్ద చోరీ చేశారు. వరంగల్ ఎస్బీహెచ్ వద్ద పలు దొంగతనాలకు పాల్పడ్డారు. స్టువర్ట్ ప్రాంతంలోని నగరి, బాపట్ల, ఎదుళ్లపల్లి నుంచి వీరు ఇక్కడకు వచ్చి తిష్టవేశారు. సుమారు 5 గ్యాంగ్‌లు నగరంలో తిరుగుతున్నట్లు, ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
నిమ్స్ అమ్మేందుకు కుట్ర
బీబీనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మించిన నిమ్స్ యూనివర్సిటీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని, ఉద్యమాలు చేపట్టడంతో దానిని అమ్మనివ్వకుండా ఆపగలిగామని తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రాజెక్టులను సీమాంధ్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. షుగర్, ఆల్విన్ పరిశ్రమల అమ్మకాలు జరిపిందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మాదిరిగానే నాలుగేళ్లుగా నిమ్స్ కోసం ఉద్యమం చేయక తప్పడం లేదన్నారు. 2013 జూన్‌లో నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగలేదనడానికి ఈ యూనివర్సిటీయే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ పూర్తయితే బీబీనగర్, భువనగిరిలు అద్భుత వికాస కేంద్రాలుగా మారుతాయన్నారు. తెలంగాణ ప్రాంతం వైద్యరంగంలో పూర్తిగా వెనుకబడిందని, ఇక్కడ మెడికల్ యూనివర్సిటీలను నిర్మించాలని శ్రీకృష్ణ కమిటీయే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిమ్స్‌ను అభివృద్ధి చేయకుండా.. అందుకు సంబంధించిన నిధుల జీఓ అమలు కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. అదే విధంగా సీసీఎంబీ నిర్మాణం, ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ప్రాణహిత-చేవెళ్లకు తరలించేలా నిధులు ఖర్చు చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే తప్ప పరిష్కారం లభించడం లేదన్నారు. పోరాట దిశగా వెళ్తే తప్ప నిమ్స్ పూర్తి కాదన్నారు. వైద్యసేవలు ప్రారంభమయ్యే వరకు ప్రజా సంఘాలు, విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆస్తులను దోచుకున్న ఆంధ్రా పాలకులు ఆంధ్రా పాలకులు తెలంగాణలోని విలువైన భూములను, ఆస్తులను, ఉద్యోగాలను దోచుకొని అన్ని రంగాలలో తీరని అన్యాయం చేశారని కోదండరాం అన్నారు. కమిటీల పేరుతో ఉద్యోగ రంగాలలో అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ముల్కీ రూల్స్ విధానాన్ని రద్దు చేసి ఇక్కడి వేల ఎకరాల విలువైన భూములను ఆంధ్రా పాలకులు స్వాధీన పరుచుకున్నారన్నారు. 610 జీఓ కోసం నిలదీస్తే గ్లిర్‌గ్లానీ కమిటీ వేశారని, కానీ కమిటీకి నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. చివరికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే నిధులు మంజూరు చేశారన్నారు. ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో జరిగిన చేర్పులు, మార్పులను ముఖ్యమంత్రి కిరణ్ కప్పి పెడుతున్నారన్నారు. నిజాం పాలన వల్లే తెలంగాణ వెనుకబడిందని అసెంబ్లీలో ఆంధ్రా పాలకులు బురద చల్లుతున్నారన్నారు. నిజాం సర్కార్ హయాంలో పెట్టిన రూ.2వేల కోట్లు విలువ చేసి చక్కర పరిశ్రమను సీమాంధ్ర ప్రభుత్వం అమ్ముకుందని, అలాగే నిజాం కాలం నాటి విలువైన భూములను ఆంధ్రా పెత్తందారులు కబ్జాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగనివ్వకుండా అడ్డుకొని కాగితాలను తగులబెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌యాదవ్, టీజేఎసీ డివిజన్ కన్వీనర్ పూస శ్రీనివాస్, మండల కన్వీనర్ జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, స్వాతంత్ర సమరయోధులు కొలను శివారెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.