Department of Medical Health
-
AP: ఆరోగ్య సురక్ష రెండోదశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. చేయి పట్టి నడిపిస్తూ.. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది. రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు జేఏఎస్–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు. ప్రజల వద్దకే వైద్యం జేఏఎస్–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
త్వరలో పేదలకు ఎయిర్ అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్/ గన్‌ఫౌండ్రి: రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా రోగులను హెలికాప్టర్ ద్వారా దవాఖానాకు తరలిస్తామన్నారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. అలాగే 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు పరీక్ష పూర్తయిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1,931 ఎంపీహెచ్ఏ (ఫిమేల్ (దరఖాస్తు దశ) పోస్టులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మూడో ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగానికి రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఒక్కొక్కరి వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని తెలిపారు. తద్వారా దేశంలో మూడో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి అవయవ మార్పిడులు చేసుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులు మారబోతున్నాయని చెప్పారు. ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ త్వరలో రెండో స్థానానికి చేరనున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర అంటూ కొత్త ఫార్మాసిస్టులకు ఆయన స్వాగతం పలికారు. -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదవాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం, ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌ను సవరించారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే సీట్లు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేవి. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉండే సీట్లన్నీ కన్వీనర్ కోటా సీట్లే కాగా, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయాల్సి ఉంటుంది. పాత కాలేజీల్లోనే అన్ రిజర్వుడు కోటా తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతోపాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8,340కి పెరిగాయి. అప్పటి 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి)అందుబాటులో ఉండేవి. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. వీటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం దక్కించుకునేందుకు అవకాశం ఉండటంతో ఆ మేరకు తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోయేవారు. తాజాగా ఈ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు అన్ రిజర్వుడు వర్తించకుండా చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తాయి. గతేడాది నుంచి బీ కేటగిరీలో 85 శాతం తెలంగాణకే... ఇప్పటికే ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా చేయడం (లోకల్ రిజర్వ్) వల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. తాజా నిర్ణయంతో ప్రతి ఏటా మొత్తం 1,820 సీట్లు అదనంగా లభించనున్నాయి. 1,820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. కాగా ప్రతి ఏటా కాలేజీల సంఖ్య పెరిగిన కొద్దీ అదనంగా లభించే సీట్లు పెరగనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు యధాతథంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. రాష్ట్ర విద్యార్థుల డాక్టర్ కల సాకారం చేసే నిర్ణయం ప్రభుత్వం ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు తెలంగాణ బిడ్డలను వైద్య విద్యకు చేరువ చేస్తున్నాయి. మొత్తం 1,820 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేలా ప్రభుత్వం చేసింది. రాష్ట్ర విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
నిమ్స్‌లో 2 వేల పడకల భవనం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 2,000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనికోసం సత్వరమే ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడారు. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన భవనం అందుబాటులోకి వస్తే, పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. అంతేగాక, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3,700 పడకలు ఉంటాయన్నారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇదే దేశంలో తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుందని చెప్పారు. సంతాన సాఫల్య కేంద్రం పనుల వేగం పెంచండి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న సంతాన సాఫల్య, అవయవ మార్పిడి కేంద్రాల పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను నిర్దేశించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖానా, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. ఆదర్శప్రాయంగా ఉండాలి ఆసుపత్రికి అందరికంటే ముందుగా వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి రోజూ రెండు గంటలపాటు ఆసుపత్రుల్లో రౌండ్లు వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, త్వరలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల అధిపతులతో సోమవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో మంత్రి రజిని 2023–24 బడ్జెట్ అంచనాలు, వైఎస్సార్ కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌పై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ జిల్లా నోడల్ అధికారులు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. మందులషాపుల్లో మత్తు మందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని ఔషధ నియంత్రణ విభాగాన్ని ఆదేశించారు.‘వైఎస్సార్ కంటివెలుగు’ మూడో దశలో భాగంగా 35,42,151మంది వృద్ధులకు ఆరు నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 146 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాతవాటిలో ఎన్ని ‘మహాప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలన్నారు. వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
ఐటీ కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో విశాఖ ఐటీ డెస్టినీగా అవతరించనుందని, మరిన్ని టెక్ కంపెనీలు ఏర్పాటయ్యేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఇప్పటికే ఐటీ పార్కులు ఏర్పాటు కాగా భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్ రానుందని వివరించారు. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనుసరించగా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, పల్సస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ – 2023ని ప్రారంభించిన అనంతరం మంత్రి విడదల రజిని, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధునిక ఆవిష్కరణలతో పాటు ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. జీ–20 దేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన 300 కంపెనీలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఆర్డీసీ) మధ్య సైన్స్, టెక్నాలజీపై ఎంవోయూ కుదిరింది. సదస్సులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రిటిష్ హై కమిషన్ ఇన్ ఇండియా ప్రగ్యా చతుర్వేది, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏడీసీ అభిజిత్ ఘోష్, ఎన్ఆర్డీసీ సీఎండీ కమడోర్ అమిత్ రస్తోగి, జీ 20 నేషనల్ కోఆర్డినేటర్ డా.నవ సుబ్రహ్మణ్యన్‌తో పాటు సియోల్, టోక్యో, రోమ్, పారిస్, న్యూయార్క్, మెల్బోర్న్, బీజింగ్, లండన్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచం చూపు.. విశాఖ వైపు భవిష్యత్తు టెక్నాలజీని రూపొందించేందుకు గ్లోబల్ టెక్ సమ్మిట్ గేట్ వే లాంటిది. ప్రపంచం చూపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్ర భాగాన ఉన్న విశాఖ వైపే ఉంది. డిజిటల్ భారత్ లక్ష్యమైన సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతతో నడిచే కొత్త భారత్‌ను సృష్టించాలి. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం వంటివి అమలు చేసే దిశగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూప్ సీఈవో డిజిటల్ హెల్త్‌లో రికార్డు డిజిటల్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ నాంది పలికింది. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రోజూ 66 వేల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలందిస్తున్నాం. రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆసుపత్రులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. డిజిటల్ హెల్త్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. – విడదల రజిని, వైద్యారోగ్య శాఖ మంత్రి జనం మెచ్చిన గిరిజన ఉత్పత్తులు టెక్నాలజీ ద్వారా అటవీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరుగుతుంది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ప్రవేశపెట్టిన ఈ కామర్స్, ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ఇందుకు నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ, తేనె, పసుపు, చింతపండు వంటి ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ద్వారా ప్రపంచానికి చేరువయ్యాయి. తద్వారా గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కల్పించినట్లైంది. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి -
ఔషధ నియంత్రణ కార్యాలయాలు ప్రారంభం
గుంటూరు (మెడికల్): ఇప్పటివరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు సొంత భవనాలు సమకూరాయి. గుంటూరులో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 12 ఔషధ నియంత్రణ కార్యాలయాలను అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 27 నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తొలివిడతగా రూ.6.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 12 భవనాలను ప్రారంభించామని తెలిపారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు మార్కెట్లో లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జెడ్పీ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా భట్నాగర్, డాక్టర్ రష్మీ వాద్వా, డాక్టర్ అనికేట్ చౌదరి, శ్రీ శుభోధ్ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్ దదిచ్ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి డాక్టర్ దేవి, డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
అతి త్వరలో గడపగడపకు వైద్యం.. అందరూ సిద్ధంగా ఉండాలి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యవిధానాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తొలిసారిగా మంగళవారం గుంటూరులో ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వమే ఇంటింటికి వైద్యసేవలు అందిస్తుందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా 176 మంది మెడికల్ ఆఫీసర్లను, 1,681 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తామని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లు కూడా అన్ని స్థాయిల సిబ్బందికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎంయూ వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ రూపు మార్చిన సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని మరింతగా పెంచారన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తమ ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయన్నారు. వైద్యులు, ఏఎన్ఎంలు వారి ఇళ్లకు సేవలందిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా పొందిన వైద్యంపై రోగులు సంతృప్తి చెందకపోతే వారితో మాట్లాడిన వీడియోలను ఏఎన్ఎంలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, తద్వారా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకునే వీలుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మాతా శిశు మరణాలు దాదాపు సున్నాకు తగ్గాయన్నారు. పీహెచ్‌సీల్లో నెలకు కనీసం పది డెలివరీలు అయినా చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, ఎల్.శివశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హెచ్.ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’
2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి హెల్త్ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్ ప్రొవైడర్ కంప్యూటర్లో ఎంటర్ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్ ప్రొవైడర్ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులకు గురయ్యారు, వాటికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీకు ఏ మందులు బాగా పనిచేస్తాయి? ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయటం వల్ల సకాలంలో సరైన చికిత్స చేసేందుకు వీలవుతోంది అని ఆయన వివరించాడు. – సాక్షి ప్రతినిధి, అమరావతి ఆరోగ్య రంగంలో వినూత్న పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్రం డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్ళి నిర్దిష్ట ఫార్మాట్లో వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8 శాతం పూర్తయింది. హెల్త్ మిషన్‌కు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలోనూ ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రం నుంచి 69,683 హెల్త్ రికార్డులను డిజిటల్ హెల్త్ అకౌంట్స్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మిషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్లు, నియంత్రణాధికారులు, అసొసియేషన్లు, ఎన్జీవోలు, వైద్యులు, మందుల, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, థెరపీ సెంటర్లు, హాస్పిటల్స్, క్లినిక్స్.. అన్నింటినీ అనుసంధానం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటం ముఖ్య ఉద్దేశం. డిజిటల్ హెల్త్ కార్డు ఆధార్ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెలతో ఉన్న డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇది రెఫరల్ సిస్టంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పీహెచ్సీలో ఒక డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి కొన్ని లక్షణాలు కనుక్కుంటారు. దీన్ని సాధారణంగా ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారు. అదే హెల్త్ అకౌంటు ఉంటే.. అందులో వివరాలన్నీ పొందుపరుస్తారు. మరో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. రోగి ఐడీ నంబర్ కంప్యూటర్లో నమోదు చేయగానే వివరాలన్నీ వస్తాయి. టెలి–కన్సల్టేషన్ ద్వారా ఆరోగ్య సేవలను పొందేందుకు సైతం ఇది అనుకూలం. ఇతర వైద్య నిపుణుల సలహా సంప్రదింపులకు, బీమా క్లియరెన్సు, క్లెయిముల పరిష్కారం, అత్యవసర సమయాల్లో పేషెంటును ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తక్షణమే తరలించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరోగ్య డేటా, ల్యాబ్ రిపోర్టులు, చికిత్స వివరాలు, అందించిన ఆరోగ్య సదుపాయాలు, డిశ్చార్జి సమ్మరీలను అకౌంటులో ఎప్పటికప్పుడు జత చేస్తుంటారు. రోగి తన ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచాలని భావిస్తే.. అకౌంటును బ్లాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆస్పత్రుల అనుసంధానమూ ముఖ్యమే ప్రజలందరికీ హెల్త్ ఐడీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, అక్కడ పనిచేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులను కూడా డిజిటల్ మిషన్ పరిధిలోకి తేవాలి. ప్రతి డాక్టరుకూ ప్రత్యేక లాగిన్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా పేషెంట్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేస్తే అతని ఆరోగ్య వివరాలు వస్తాయి. మన రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు డిజిటల్ హెల్త్ మిషన్‌లో చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంతో అనుసంధానమైనట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా రోగికి అత్యంత మెరుగైన, కచ్చితమైన వైద్యం సత్వరమే అందుతుంది. మన ఆరోగ్య విధానం ఇలా.. మన రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. అంటే ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రాథమిక వైద్యం లభిస్తుంది. అక్కడి నుంచి పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కు రెఫర్ చేస్తారు. పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు, అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి.. చివరగా బోధనాసుపత్రికి రెఫరల్ సిస్టం పనిచేస్తుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్, పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌సీలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా బృందం, ఏరియా ఆస్పత్రిలో వీటికి అదనంగా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వంటివి, జిల్లా ఆస్పత్రిలో సుమారు 16 రకాల స్పెషాలిటీ డాక్టర్లు, బోధనాసుపత్రిలో 32 విభాగాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ డేటాలో మనమే నం.1 ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించటం, వాటిని డిజిటలైజ్ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే సాధ్యమైంది. ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల వారికి వైద్యం అందించే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే మన ముఖ్యమంత్రి గ్రామగ్రామానికి హెల్త్ క్లినిక్‌లు తీసుకొచ్చారు. కొత్తగా పీహెచ్‌సీలు, యూపీహెచ్సీలూ నిర్మిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి సంబంధించిన అన్ని దశలనూ పటిష్టపరుస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ హెల్త్ ఐడీలు, రికార్డులు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారానూ క్షేత్రస్థాయిలో అందరి హెల్త్ డేటా సేకరిస్తున్నారు. మనకు సరిపడా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలుగుతున్నాం. ఈ విభాగంలో మనమే ముందున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభినందనలు తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయంలో మన ప్రభుత్వానికి అవార్డులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్స్ టైమ్స్ ప్రకటించిన అవార్డు కూడా ఇలాంటిదే. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్‌ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్‌లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్‌సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్‌ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్‌ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
రూ.16 వేల కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి
తిరుపతి (తుడా): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16 వేల కోట్లు కేటాయించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ శిరీషతో కలిసి ఆమె తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవల గురించి వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, వారి సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఆగస్టు 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. మొత్తం 3 వేల వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానున్నాయన్నారు. ఆస్పత్రులలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలపై విచారణ చేయాలని డీఎంఈని ఆదేశించారు. తీరు మారకుంటే సరెండర్ చేస్తాం రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి రజని స్పందిస్తూ.. సక్రమంగా విధులు నిర్వహించలేనప్పుడు తప్పుకోవచ్చుగా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ‘మీ నిర్లక్ష్యం లేకుంటే ఇంత మంది ఎందుకు ఫిర్యాదు చేస్తారు.. ఇకనైనా తీరు మారకుంటే హెడ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తాం’ అని హెచ్చరించారు. మంత్రి వెంట డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు, డీఎంహెచ్ఓ శ్రీహరి, ఈఈ ధనంజయరెడ్డి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, మెటర్నిటీ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసన్న, సీఎస్ఆర్ఎంఓ ఈబీ దేవి, పార్థసారథి ఉన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో షిఫ్టుల వారీగా బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును షిఫ్టుల వారీగా వేయాలని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులూ, సంస్థల బాధ్యులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 24/7 పనిచేసే ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిలో ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు 3 షిఫ్ట్‌ల ప్రకారం సవరించి, డ్యూటీ రోస్టర్‌ను సంబంధిత హెల్త్ కేర్ ఫెసిలిటీ హెడ్ సిద్ధం చేయాలని సూచించారు. అలర్ట్ మెకానిజం కూడా అభివృద్ధి చేసి సంబంధిత ఉద్యోగులకు ఆబ్సెంట్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు జమ చేయాలని ఆదేశాలిచ్చారు. -
ఆన్లైన్లో వైద్య సిబ్బంది వేతనాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌తోపాటు డైట్, పారిశుద్ధ్య, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సుల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు మాన్యువల్ బిల్లుల విధా నంద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో కొంత ఆలస్యమవుతోంది. బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడం లాంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగు తున్నట్లు గుర్తించారు. దీన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానంలో చెల్లింపులు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ శ్వేత మహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులతో గురువారం బీఆర్కే భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది, హౌస్ సర్జ న్లు, జూనియర్, సీనియర్ రెసిడెంట్ల వేత నాల చెల్లింపులో ఆలస్యం జరగ కూడదని ఆదేశించారు. వైద్యులకు సెల్యూట్.. ఈ భూమిపై ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే వాళ్లు మనకు కనిపించే దేవుళ్లు అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యసిబ్బంది చూపిన తెగువను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ డాక్టర్’అని చెబితే సరిపోదని, వారి త్యాగాలను గౌరవించాలని సూచించారు. -
ఐదు కొత్త వైద్య కళాశాలలకు 3,530 పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో 3,530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్కో వైద్య కళాశాలకు 706 పోస్టులు చొప్పున 3,530 పోస్టులు కొత్తగా సృష్టించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 16 కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.7850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం(2023–24) నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం లలో నూతన వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలో 222, అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో 484 చొప్పున పోస్టులను ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తోంది. ప్రతి మెడికల్ కళాశాల, బోధానాస్పత్రిలో ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, 11 ప్రొఫెస్, 25 అసోసియేట్, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్, 58 సీనియర్ రెసిడెంట్, 18 హెడ్‌నర్సు, 200 స్టాఫ్ నర్స్, ఇతర పారామెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయి. ఐదు వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా అక్కడి జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా వైద్య శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఆస్పత్రిలో ఒక లక్ష చ.అ ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) నిర్మాణానికి ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే విధంగా ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఖర్చు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే 40వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. ఇదే క్రమంలో ఐదు కొత్త వైద్యశాలల కోసం మరో 3530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించడం గమనార్హం. -
YSR Aarogyasri: ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్రమాలు, పొరపాట్లకు ఏమాత్రం తావుండరాదని స్పష్టం చేశారు. జూలై 26 లోగా వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. రిటైర్మెంట్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇకపై వెంటనే భర్తీ చేయాలన్నారు. సంస్కరణల ఫలితాలు సజావుగా అందాలంటే తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించడం తప్పనిసరన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమాల పురోగతి, ఆరోగ్యశ్రీ అమలు తదితరాలపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మొదటి రెఫరల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్ ఆరోగ్యశ్రీ ద్వారా సులభంగా చికిత్స పొందేలా రెఫరల్ విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదటి రెఫరల్ పాయింట్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా విలేజ్ క్లినిక్‌లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవలు, ఏ జబ్బుకు ఏ ఆస్పత్రికి రెఫర్ చేయాలి? ఎలా రెఫర్ చేయాలి? తదితర వివరాలతో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ), ఏఎన్ఎంలకు బుక్లెట్లు అందజేయాలన్నారు. రోగి సంతకంతో కన్సెంట్, కన్ఫర్మేషన్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేలా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేప్పుడు సంబంధిత రోగికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ జబ్బుకు చికిత్స అందించాం? చికిత్సకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? తదితర వివరాలను తెలియచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు డబ్బులేమైనా డిమాండ్ చేశారా? వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఆరా తీసి సేవల పట్ల రోగి సంతృప్తిగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు డిశ్చార్జి సమయంలో రోగి సంతకంతో సమ్మతి(కన్సెంట్), నిర్ధారణ (కన్ఫర్మేషన్) పత్రం తీసుకోవాలన్నారు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆస్పత్రులు వాటిని అప్లోడ్ చేయాలన్నారు. వర్చువల్ ఖాతా ద్వారా చెల్లింపు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా ఆస్పత్రికి వెళ్లకుండా రోగి పేరిట వర్చువల్ ఖాతాను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రోగి సమ్మతి తీసుకుని ఈ ఖాతాకు తొలుత నేరుగా డబ్బులు జమ చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రికి డబ్బులు బదిలీ చేయాలని నిర్దేశించారు. లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక వర్చువల్ అకౌంట్ ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాలో డబ్బులు నేరుగా రోగి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో జమ చేస్తున్న పద్ధతినే కొనసాగించాలన్నారు. పథకం కింద సేవలు అందించడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫిర్యాదులుంటే ఏ నెంబరుకు ఫోన్ చేయాలన్న విషయం ప్రతి రోగికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా లేఖలు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లేఖలు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ లేఖను వలంటీర్, ఏఎన్ఎంలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేసి ఆరోగ్యంపై ఆరా తీయాలని సూచించారు. లేఖలో పథకం ద్వారా లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించిన సాయాన్ని తెలియజేయాలన్నారు. చురుగ్గా ఆరోగ్యమిత్రలు ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్యమిత్రలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. రోగి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జి అయ్యేవరకూ అండగా, తోడుగా నిలవాలన్నారు. ప్రస్తుతం 2,446 చికిత్సలను పథకం కింద ఉచితంగా చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలన్నారు. సేవలు ఉచితంగా అందాలి.. 108, 104, వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రజలకు ఉచితంగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటిద్వారా సేవలు అందించడానికి ఎక్కడా లంచాలు వసూలు చేసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను వాహనాలపై ప్రదర్శించాలన్నారు. ఎక్కడా కొరత ఉండకూడదు 2019 నుంచి వైద్య శాఖలో 40,188 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,132 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో పని చేయడానికి 2,072 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం కాగా భవన నిర్మాణాలు పూర్తి కాగానే భర్తీ చేపడతామన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడా మానవ వనరుల కొరత ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అవసరం అయితే పదవీ విరమణ పొందిన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై పరిశీలన చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎం.టి.కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: కొత్తగా 496 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 496 మందికి కోవిడ్ నిర్ధారణయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,98,621 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 7,90,897 మంది కోలుకోగా మరో 3,613 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28,808 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 342 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం వైరస్ నాలుగో దశ వ్యాప్తికి సూచికనే ప్రచారం జరుగుతున్నా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కట్టడి చర్యలు సమర్థంగా అమలు చేస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో క్రమంగా కేసులు పెరుగుతునప్పటికీ రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పరిస్థితులు లేవంటున్నారు. చదవండి: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే! ఈ నెల నాలుగో తేదీ నుంచి 10వతేదీ మధ్య దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 15,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 13,771, కర్ణాటకలో 2,831, తమిళనాడులో 1,157, తెలంగాణలో 785 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో 128 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇక గత మూడు రోజుల్లో వరుసగా 23, 18, 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేనప్పటికీ ముందస్తు అప్రమత్తత చర్యలను వైద్య శాఖ కొనసాగిస్తోంది. కొనసాగుతున్న 46వ విడత ఫీవర్ సర్వే ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహిస్తూ కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేస్తోంది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సేవలందిస్తున్నారు. తద్వారా వైరస్ బాధితులను ముందే గుర్తించి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 46వ విడత ఫీవర్ సర్వేలో 1.63 కోట్ల ఇళ్లను సిబ్బంది సందర్శిస్తున్నారు. 80.97 శాతం మందికి ప్రికాషన్ డోసు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత జనవరిలో ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ చేపట్టారు. వీరిలో ప్రికాషన్ డోసుకు 49,72,320 మంది అర్హులు కాగా ఇప్పటికే 40,26,135 మందికి టీకాలిచ్చారు. ప్రికాషన్ డోసు తీసుకున్న వారిలో హెల్త్‌కేర్ వర్కర్లు 4,34,710 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 9,96,999 మంది, వృద్ధులు 25,94,426 మంది ఉన్నారు. 99.65 శాతం టీనేజర్లకు డబుల్ డోస్ రాష్ట్రంలో 15 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్లలో 99.65 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా అంతకు మించి 25,33,439 మందికి తొలి డోసు పంపిణీ చేసి జాతీయ స్థాయిలోనే ఏపీ రికార్డు సృష్టించింది. తొలి డోసు తీసుకున్న వారిలో 25,24,553 (99.65 శాతం) మందికి రెండో డోసు టీకా కూడా పూర్తయింది. 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్లో 97.78 శాతం మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మంది ఉండగా ఇప్పటికే వంద శాతం తొలి డోసు పంపిణీ పూర్తయింది. అనంతపురం, నెల్లూరు జిల్లాలు రెండు డోసుల టీకాను వంద శాతం పంపిణీ చేసి తొలి స్థానంలో ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తక్కువగానే ఉంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నాం. టీకా పంపిణీ చేపడుతున్నాం. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నాం. నాలుగో దశ వైరస్ వ్యాప్తి అంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
వైద్య పోస్టుల భర్తీ మెడికల్ బోర్డుకే!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య, వైద్య సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియనంతా ఒక నియామక సంస్థకే అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 2,662 ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక ఏజెన్సీగా టీఎస్పీఎస్సీని ఎంపిక చేసిన ప్రభుత్వం... మరో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల నియామకాల బోర్డుకు అప్పగించింది. అయితే రెండు నియామక సంస్థలకు అప్పగించిన ఉద్యోగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సు పోస్టులు ఒకే కేడర్‌కు చెందినవిగా ఉన్నాయి. ఈ పోస్టులను రెండు ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తే సమయం వృథా, నిర్వహణ భారం కావడంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ప్రతిపాదనలు పంపండి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నియామకాలపై వెద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ ఇటీవల సమావేశమైంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జోన్లు, జిల్లాలవారీగా ఖాళీల ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. -
డెంగీతో ‘జ్వర’భద్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 506 డెంగీ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వానాకాలం ముగుస్తున్న సమయంలో డెంగీ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగీ కేసులు నమోదు కావడం, దీనికితోడు చికెన్ గున్యా బాధితులు సైతం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షం రోజుల్లో మారిన సీను... రాష్ట్రంలో గత రెండు వారాలుగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో డెంగీ ప్రభావం కనిపించనప్పటికీ... ప్రస్తుతం రోజుకు సగటున 10–15 పాజిటివ్ కేసులు నమోద వుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 42, కరీంనగర్ జిల్లాలో 39 కేసులున్నాయి. వరంగల్, సంగా రెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, మేడ్చ ల్, మహబుబాబాద్, కొత్తగుడెం, ఖమ్మం, గద్వాల జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీని సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట దోమకాటే డేంజర్... డెంగీ జ్వరం ఎడిస్ దోమ కాటుతో వస్తుంది. ఎడిస్ దోమ నీరు నిల్వ ఉండే చోట ఉంటుంది. ప్రధానంగా పగటిపూటే కుడుతుంది. ఈ దోమకాటుకు గురైన తర్వాత 103–104 డిగ్రీల మధ్య జ్వరం వస్తుంది. రోగికి జ్వరం తగ్గాక క్రమంగా ప్లేట్లెట్లు తగ్గుతాయి. జ్వరం తగ్గిందని ప్లేట్లెట్ల పరీక్ష చేయిం చుకోకపోతే డెంగీ దొంగదెబ్బ తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్లెట్ల సంఖ్య ఉండాల్సి ఉండగా లక్షన్నరకన్నా దిగు వకు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుం టుంది. దీన్ని సకాలంలో గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల సమక్షంలో చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలకన్నా పడిపోతుంటే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. -
కొత్తగా 145 కరోనా కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 145 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్ప టివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,94,329కు చేరిం ది. ఇందులో 7,89,241 మంది కోలుకోగా, 977 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 15,200 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో 413 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన పా జిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 117 నమోదు కావడం గమనార్హం. -
గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు. -
మళ్లీ కరోనా దడ
సాక్షి, హైదరాబాద్: కరోనా దడ మళ్లీ మొదలైంది. గురువారం ఒక్కరోజే 12,385 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 122 మందికి కరోనా సోకింది. వీరిలో హైదరాబాద్ వారే 94 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.98 శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు 811కు చేరుకున్నాయి. కాగా, థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వేరియంట్లోని సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమైంది. ఏకంగా 2.75 కోట్ల పారాసిటమాల్ మాత్రలను, 17.25 లక్షల ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచింది. అలాగే 1.81 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను, 2.80 కోట్ల లివోసిట్రజిన్ మాత్రలను, 2 కోట్ల డెక్సమెథజోన్ మాత్రలను, 3.14 కోట్ల డాక్సిసైక్లైన్ కేప్సుల్స్ను అందుబాటులో ఉంచినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివా సరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. అవసరమైన వారికి వెంటనే పరీ క్షలు చేసేందుకు 57.47 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున చర్యలు చేపడుతున్నారు. డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఏది కరోనా జ్వరమో, ఏది డెంగీ జ్వరమో తెలుసుకునేందుకు టెస్టులను పెంచనున్నారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్... వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సెకండ్, బూస్టర్ డోస్‌లు వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయిం చింది. 3.06 కోట్ల మందికి రెండో డోస్ వేయగా, బూస్టర్ డోస్ 8.54 లక్షల మందికే వేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్‌లను పెంచాలని నిర్ణయించా రు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 32.27 లక్షల కరోనా డోస్లున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడంలేదు. ఇక నుంచి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. కాగా, తప్పనిసరిగా అధికంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలను గురువారం కోరింది. అంతర్జాతీయ ప్రయాణికుల నిర్దేశిత నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం విమానాశ్రయంలో ఉన్న రాష్ట్ర వైద్య బృందాన్ని ఇటీవల ఉపసంహరిం చుకోవడం విమర్శలకు తావిస్తోంది. వ్యాధి తీవ్రత తక్కువే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.2.12.1, బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్ల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటిలో ఒక ప్రత్యేకమైన ఎల్452ఆర్ జన్యుమార్పు వల్ల వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ వ్యాధి తీవ్రత చాలా తక్కువ. వీటితో కేసులు కొంత పెరగవచ్చు కానీ.. ఫోర్త్వేవ్కు ఇవి కారణం కాబోవు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ