Dorasani Movie
-
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
-
అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’
నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్లో రొమాంటిక్ హీరో అరుణ్ అదిత్, ‘దొరసాని’ ఫేమ్ శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విధివిలాసం’. శివదినేశ్ రాహుల్, అయ్యర్ నకరకంటితో పాటు ఎస్కేఎస్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్‌లోని ఓ ఆలయంలో పూజాకార్యక్రమాల అనంతరం ఈ సినిమాను ప్రారంభించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందించగా.. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, సత్య, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన శివాత్మిక.. తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 24 కిస్సెస్ చిత్రంతో అరుణ్ అదిత్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఓ రకంగా చెప్పాలంటే హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి ఇది రెండో సినిమా. మరి ద్వితీయ విఘ్నాన్ని వీరు అధిగమిస్తారో లేదో చూడాలి. చదవండి: దొరసాని’ మూవీ రివ్యూ హృదయాలను గెలుచుకున్న పూజా -
టాక్ బాగున్నా.. కలెక్షన్లు వీక్!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా.. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మికను హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా దొరసాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ బాగానే వినిపించింది. అయితే టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్న టాక్ వినిపిస్తోంది. దొరసానితో పాటు రిలీజ్ అయిన నిను వీడని నీడను నేనే ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌కు చేరువ కాగా దొరసాని కలెక్షన్ల వేటలో బాగా వెనుక పడిందన్న టాక్ వినిపిస్తోంది. వీకెండ్స్‌లోనే పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో వీక్ డేస్‌లో పరిస్థితి మరి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. -
‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!
ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అని పిలిచే విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తమ్ముడి కెరీర్‌ను గాడి పెట్టే పనిలో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ తొలి సినిమాతో మంచి మార్కలు సాధించాడు. సినిమా డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లనే సాధిస్తోంది. అయితే తొలి సినిమాతో ప్రయోగం చేసిన ఆనంద్ రెండో సినిమాగా మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ రెండో సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. భవ్యక్రియేషన్స్ బ్యానర్ కొత్త దర్శకుడితో ఆనంద్ రెండో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు విజయ్ కోసం దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఆనంద్ కోసం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ నిజమైతే ఈ నెలలోనే ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు
‘‘మనకు థియేటర్స్ ఎక్కువైపోయాయి.. ఫీడింగ్ తక్కువైంది. చిన్న సినిమాలకు మంచి రోజులొచ్చాయి. ఎగ్జిబిటర్స్ అందరూ చిన్న సినిమాలవైపే చూస్తున్నారు. పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దొరసాని’. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొయెటిక్, మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాం. 1980లో తెలంగాణ ఎలా ఉంది? గడి సంస్కృతి ఏంటి? అనే విషయాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో అచ్చం తెలంగాణ వాతావరణం కనిపించిందంటున్నారు. పాత కాలాన్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. పౌడర్ డబ్బా కోసమే 4–5 నెలలు తిరిగాం. 14లక్షలు పెట్టి గడిని బాగుచేయించి షూట్ చేశాం. మరో 5 లక్షలు ఆ ఊరి అభివృద్ధి కోసం అందించాం. ఈ చిత్రంతో 60మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. ఓపెనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ మ్యాట్నీ నుంచి కలెక్షన్లు పెరిగాయి. ఇంతకుముందు వచ్చిన తెలుగు గొప్ప ప్రేమకథలు తీసుకుంటే తెలుగు దర్శకులు తీసినవి తక్కువ. ఆనంద్, శివాత్మిక కావాలనుకుంటే మంచి గ్లామర్ ఉన్న సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంలోనే ఆర్టిస్ట్‌గా వాళ్ల నిబద్ధత, నిజాయతీ తెలుస్తోంది. కమర్షియల్ అంశాలు జోడించి ఈ స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు. ప్రేక్షకుల్లో టాక్ బాగుంది. పాజిటివ్ టాక్ని మించిన ప్రమోషన్ ఏంటి? సోషల్ మీడియాలో కవిత్వాలు రాస్తున్నారు. నాలుగు వారాలుగా మంచి సినిమాలు రావడం శుభ పరిణామం. కొత్త సినిమా ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ఆనంద్ దేవరకొండతో మరో సినిమా, మహేంద్రతో ఓ సినిమా చేస్తాం’’ అన్నారు. -
‘దొరసాని’ మూవీ రివ్యూ
-
‘దొరసాని’ మూవీ రివ్యూ
టైటిల్ : దొరసాని జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, కిషోర్ తదితరులు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి నిర్మాత : మధుర శ్రీధర్, యష్ రంగినేని దర్శకత్వం : కె.వీ.ఆర్ మహేంద్ర విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్నారు. గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్‌తో అంచనాలను పెంచేసి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ దొరసాని చిత్రం.. ఆనంద్, శివాత్మికలకు మంచి బ్రేక్ ను ఇచ్చిందా? తొలి ప్రయత్నం లొనే విజయం సాధించి.. వీరిద్దరు మంచి నటులుగా గుర్తింపును తెచ్చుకున్నారా? అన్నది చూద్దాం. కథ అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో గడీల రాజ్యం నడిచేది. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్ వర్మ) కూతురు దొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్)ని రాజు (ఆనంద్ దేవరకొండ) ప్రేమిస్తాడు. గడీ వైపు చూడాలంటే కూడా భయపడే ఊళ్లో.. రాజు మాత్రం ఏకంగా దొరసానిని ప్రేమిస్తాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తూ ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన దొర ఏం చేశాడు? ఈ కథలో కామ్రేడ్ శంకరన్న(కిషోర్)కు ఉన్న సంబంధం ఏంటి? శంకరన్న వీరి ప్రేమకు ఎలాంటి సహాయం చేస్తాడు? రాజు-దొరసానిల ప్రేమ ఫలించి చివరకు ఒక్కటయ్యారా? లేదా అన్నదే మిగతా కథ. నటీనటులు రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ చక్కని నటనను కనబర్చాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ ఉంటే.. ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గుర్తుకు వస్తుంటాడు. అతని గొంతులోనే కాకుండా లుక్స్ పరంగానూ అక్కడక్కడా విజయ్‌లా కనిపిస్తాడు. మొత్తానికి మొదటి ప్రయత్నంగా చేసిన ఈ రాజు పాత్ర ఆనంద్‌కు కలిసి వచ్చేలా ఉంది. ఇక దొరసానిగా నటించిన శివాత్మికకు ఉన్నవి ఐదారు డైలాగ్‌లే అయినా.. లుక్స్‌తో ఆకట్టుకుంది. దొరసానిగా హావభావాలతోనే నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ఇద్దరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. ‘దొరసాని’ని వీరిద్దరే నడిపించారు. దొర పాత్రలో వినయ్ వర్మ, నక్సలైట్‌గా కిషోర్, రాజు స్నేహితులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు. విశ్లేషణ పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి మధ్య ప్రేమ.. ఇలాంటి కథలు మన టాలీవుడ్లో ఎన్నోం చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో ప్రేమ అనేది లేకుండా మనవాళ్లు తెరకెక్కించిన దాఖాలాలు లేవు. ప్రేమే ఇతివృత్తంగా లేదంటే.. ప్రేమను ఓ భాగంగా గానీ చేసి కథ రాసి మనవాళ్లు సినిమాలను తీస్తుంటారు. అయితే ఎన్నోసార్లు చూసిన ప్రేమ కథే అయినా.. తెరకెక్కించడంలో కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. హీరోహీరోయిన్లు తమ నటనతో తెరపై ఫ్రెష్‌నెస్‌ను తీసుకొస్తే అందరూ ఆ కథలో లీనమౌతారు. దొరసాని కూడా అలాంటి కథే. ఈ కథకు తెలంగాణ గడీల నేపథ్యాన్ని, యాసను జోడించడమే దర్శకుడి మొదటి విజయం. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి.. స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లను తీసుకుంటే ఆ పాత్రకు సరైన న్యాయం జరిగేది కాదేమో అని అనిపించేలా ఆ పాత్రలను మలిచాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని కమర్షియల్ బాట పట్టించకుండా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి.. ‘దొరసాని’ని ఓ కళాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే నిదానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందా అన్నది తెలియాలి. ఎక్కడా బోర్ కొట్టించకపోయినా.. తరువాతి సీన్ ఏంటో అన్నది ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది. నిదానంగా సాగుతూ ఉండటంతో.. ప్రేక్షకులు కొంత అసహనానికి ఫీలయ్యే అవకాశం ఉంది. చివరగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించిందే అయినా.. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్. విహారి తన పాటలతో ఆకట్టుకోగా, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సన్నీ కూరపాటి తన కెమెరాతో అప్పటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఎడిటర్ నవీన్ నూలి ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. చక్కటి ఫీల్ ఉన్నా.. నెమ్మదిగా సాగే ఈ ‘దొరసాని’ని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్లస్ పాయింట్స్ నటీనటులు సంగీతం మైనస్ పాయింట్స్ స్లోనెరేషన్ ఊహకందేలా సాగే కథనం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
నాపై నాకు నమ్మకం పెరిగింది
‘‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ తర్వాత మూడేళ్లు ఏ పనీ చేయకుండా ‘దొరసాని’ కథ రాశాను. దాదాపు 42 వెర్షన్స్ రాశాను. ఈ స్టోరీ వరల్డ్‌ను అర్థం చేసుకోవడానికి, బుక్స్ చదవడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. కథకు ఉన్న బలం వల్లే నేడు ‘దొరసాని’ సినిమా విడుదలవుతోంది’’ అని దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ‘దొరసాని’ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.వి.ఆర్. మహేంద్ర మాట్లాడుతూ– ‘‘మాది వరంగల్ జిల్లాలోని జయగిరి. అందరిలాగే ఎన్నో సినిమా కష్టాలు పడ్డాను. నేను చేసిన ‘నిశీధి’ షార్ట్ ఫిల్మ్ చూసి, నా దర్శకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్‌గారు నాకు మెయిల్ చేశారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ‘దొరసాని’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. రెండు గంటల పదిహేను నిమిషాలు మా సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాం. ఆ రోజుల్లో దొర వ్యవస్థ, పరిస్థితులకు ఓ అందమైన ప్రేమకథని జోడించాం. కథ, కథలోని స్వచ్ఛత, నిజాయతీ అందరికీ నచ్చుతుంది. రాజు పాత్రకి ఆనంద్, దొరసాని పాత్రకి శివాత్మిక చక్కగా సరిపోయారు. శివాత్మికలో నిజంగానే దొరసాని ఉంది. ‘నీ తర్వాతి సినిమా నాతోనే చెయ్యాలి’ అని రాజశేఖర్‌గారు ఇప్పటికే చాలాసార్లు నవ్వుతూ అడిగారు. ‘ఓ కథ ఉంటే చెప్పు’ అని విజయ్ దేవరకొండగారు కూడా అడిగారు. ‘దొరసాని’ రిలీజ్ అయ్యాక నా తర్వాతి సినిమా డిసైడ్ అవుతుంది’’ అన్నారు. -
అన్న దొరకడంలేదు.. తమ్ముడు కావాలన్నారు
‘‘మా అన్న (విజయ్ దేవరకొండ) చాలా ఇబ్బందులు చూశాడు. కానీ, తనకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చనే నమ్మకం కలిగింది’’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. డి.సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► అన్న చేసిన ‘అర్జున్ రెడ్డి’ తర్వాత కొంతమంది మా నాన్నకి ఫోన్ చేసి, మీ పెదబాబు డేట్స్ దొరకడం లేదు.. చినబాబు దొరుకుతాడా? అని అడిగారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. వారి మాటలను అప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. అన్నయ్య వ్యాపారాలను సపోర్ట్ చేద్దామని ఉద్యోగం వదిలి ఇండియాకి వచ్చాను. ► నేను అమెరికాకు వెళ్లక ముందు థియేటర్స్ చేశాను. నటనలో అనుభవం ఉంది కానీ కెమెరా ముందు లేదు. ఆ టైమ్‌లో మహేంద్రను కలిశాక నటనపై ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ‘దొరసాని’ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ► 1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. రాజు, దొరసాని మధ్య జరిగిన ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయతీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ► విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఉన్నాడని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దామనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేశాం. ఆ పాత్రలకు సరిపోతాం అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మమ్మల్ని తీసుకున్నారు. ► ఇందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ధనవంతురాలైన దొరసానిని ప్రేమించిన పేదవాడైన రాజు చాలా సహజంగా అనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్, యాంగర్, లిప్‌లాక్‌లు లాంటివి ఏమీ ఉండవు. ► అన్నకు, నాకు సినిమాలంటే చాలా పిచ్చి. నాన్న టీవీ షోలు, సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు. స్కూల్ డేస్ నుంచే అన్న స్టోరీలు రాసేవాడు. తను యాక్టర్ కాకపోతే డైరెక్టర్ అయ్యే వాడేమో బహుశా! ► ‘దొరసాని’ కథను ఓకే చేశాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి మా బాధ్యతను మరింత పెంచారు. ► నా తర్వాతి సినిమా కోసం రెండు కథలు విన్నాను. వాటిల్లో వినోద్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం. నాకు ఏదైనా పాత్ర కరెక్టుగా సరిపోతుందని అన్నయ్యకి అనిపించి, నన్ను చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేస్తా. -
‘మా ప్రేమను మీరూ ఫీల్ అవుతారు’
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొరసాని. మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ని పొందింది. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12న రిలీజ్‌కి రెడీ అవుతున్న సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. దొరసాని గురించి ఇది ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ, రాజు, దొరసాని మద్య జరిగిన ప్రేమకథ. నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయితీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లోకేషన్స్‌లో షూటింగ్ చేసాము. ఆ కథలోని ఆత్మను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసాం. దర్శకుడు మహేంద్ర ఎక్కడా ఫేక్ ఎమోషన్స్‌ని రానీయలేదు. కథను దర్శకుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆ ఆఫర్స్ ని సీరియస్ గా తీసుకోలేదు అన్నయ్య (విజయ్ దేవరకొండ) అర్జున్ రెడ్డి తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు సీరియస్‌గా తీసుకొలేదు. ఇండియాకి అన్నయ్య బిజినెస్‌ని సపోర్ట్ చేద్దామని వచ్చాను. యూఎస్‌కి వెళ్ళకు ముందు థియేటర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందికానీ సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. ఆ టైంలో దర్శకుడు మహేంద్రను కలిశాక సినిమా మీద ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ఆ కథను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్రతీ పాత్ర రియల్‌గా ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, కోదాడ దగ్గరలోని గడిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము. అన్న టెన్షన్ పడ్డాడు సినిమా చూసే ముందు అన్న టెన్షన్ పడ్డాడు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఆనంద పడ్డాడు. సినిమా చూసిన తర్వాత నాకు అన్న ఇచ్చిన ఎనర్జీ కాన్ఫిడెన్స్‌ని పెంచింది. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాము విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒకడు ఉన్నాడు అని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేసాము. ఆ క్యారెక్టర్స్‌కి ఫిట్ అవుతాము అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మేము ప్రాజెక్ట్‌లోకి వచ్చాము. శివాత్మికను అందుకే కలవలేదు ఈ కథలో రాజు, దేవకి పాత్రల మద్య ఎక్కువ చనువు ఉండదు. అందుకే మాకు వర్క్ షాప్‌లు విడివిడిగా నిర్వహించారు. షూటింగ్ లోకేషన్లో కూడా పాత్రల మద్య గ్యాప్‌ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీదకు వస్తుందని ఆ జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అన్న నాకు ధైర్యం ఇచ్చాడు అన్న చాలా స్ట్రగుల్స్ చూసాడు. కానీ అన్నకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు అనే నమ్మకం కలిగింది. కానీ నా ప్రతిభే నన్ను నిలబెడుతుందని నాకు తెలుసు. ఒక బ్రదర్‌గా తన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ స్టార్‌గా కాదు. అన్నతో పోలికలన్నీ సినిమా తర్వాత పోతాయి అని నమ్ముతున్నాను. నా పాత్ర హీరోలాగా ఉండదు ఇందులో నాపాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రాజు చాలా సహాజంగా అనిపిస్తాడు. దొరసానిని ప్రేమించిన రాజు లాగా కనపడతాను. చేసిన పాత్రలు రియల్ లైఫ్ పాత్రలను ప్రతిబింబిస్తే చాలు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నమ్ముతాను. అన్న మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయి ఇంట్లో అందరం ప్రాక్టికల్‌గా ఉంటాము. ఎమోషనల్ టాక్స్ తక్కువ. కానీ అన్న నాగురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే తమ్ముడ్ని చూసుకోవాలని అన్నకు ఉంటుంది. కానీ నా కష్టం నేను పడాలి, నా కథ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్ అయ్యాను. అన్నది పదేళ్ళ ప్రయాణం. అందులో చాలా చూసాడు. అన్నతో పాటు ఒక సారి ఆడిషన్స్‌కి వెళ్ళాను. సెలెక్ట్ అవలేదు ఆ రోజు అన్న ఎంత బాధ పడ్డాడో నేను దగ్గర నుండి చూసాను. నాన్న సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్కషన్స్ ఉండేవి. సినిమా ముందు వచ్చే కామెంట్స్ ని పట్టించుకోను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా నటన మీద వచ్చే విమర్శలను తీసుకుంటాను. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. ఇది స్వచ్చమైన ప్రేమకథ ఇందులో మా ప్రేమకథ స్వచ్చంగా ఉంటుంది. యాక్షన్, యాంగర్ అలాంటివి ఏమీ ఉండవు. లిప్ లాక్‌లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమకథలో చాలా టర్న్స్ ఉంటాయి. మా ప్రేమను మీరు ఫీల్ అవుతారు. దర్శకుడు మహేంద్ర గ్రేట్ స్టోరీ టెల్లర్. మా కథలోని అన్ని క్యారెక్టర్స్ మీద అతనికి పూర్తి క్లారిటీ ఉంది. అతను మంచి దర్శకుడిగా నిలబడతాడు. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు కథను ఓకే చేసాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అంతా కొత్త వాళ్లమే అయినా మాపై పూర్తి నమ్మకం ఉంచారు. మా బాద్యతను మరింత పెంచారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. -
కన్నీరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: ‘చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం తిరుగుతుంటే నా తమ్ముడు ఆనంద్ నన్నూ, కుటుంబాన్ని పోషించాడు’ అంటూ విజయ్ దేవరకొండ గతాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆనంద్ కారణం’ అంటూ విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ ఏడ్వటమే కాదు తన ప్రసంగంతో అక్కడున్న వారంవదరినీ ఏడిపించేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన దొరసాని చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘చిన్నప్పుడు వాడి తరగతి గదిలో కంటే నా క్లాస్‌లోనే ఎక్కువ కూర్చునేవాడు’ అంటూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘ఎంతో కష్టపడి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్నావు. ఎందుకురా వస్తా అంటున్నావు? వచ్చి ఏం చేస్తావ్? అని అడిగితే నా రౌడీ(విజయ్ బట్టల వ్యాపారం)ని చూసుకుంటానన్నాడు. సరేలే అని ఒప్పుకున్నా.. కానీ తర్వాత నటన అంటే ఇష్టం ఉందంటూ సినిమాల్లోకి వస్తానన్నాడు. తను సినిమాల్లోకి రావటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అందుకే వద్దని వారించాను. అయినా వినకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తనతో మాట్లాడటమే మానేశా. ఒక నటుడిగా స్క్రిప్ట్ దగ్గరి నుంచీ, సినిమా విడుదలయేంతవరకు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వాడికి తెలియాలి. అందుకే దొరసాని చిత్రాన్ని ప్రమోట్ చేయనని చెప్పాను. తనంతట తాను అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నాకిష్టం లేకపోయినా వాడికి దూరంగా ఉన్నా... ఇప్పుడు ఆనంద్ తన సినిమా వ్యవహారాలను చూసుకోగలడనే నమ్మకం కుదిరింది’ అంటూ విజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ‘దొరసాని షూటింగ్ సమయంలో నేను డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నా. ఇంతవరకు దొరసాని సినిమా గురించి మేము మాట్లాడుకుంది లేదు. దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను అతిథిగా పిలిచారు. అయితే సినిమా చూశాకే వస్తానన్నాను. కానీ సినిమా చూసిన తర్వాత తమ్ముడిని చూసి గర్వంగా ఫీలవుతున్నానంటూ ఆనంద్‌పై ప్రశంసలు కురింపించారు. తాను కూడా మొదటి చిత్రంలో ఇంతబాగా చేయలేనేమోనంటూ చిత్ర యూనిట్‌కు విజయ్ అభినందనలు తెలిపారు. దొరసాని టీంను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సమయంలో ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా వస్తాయి. రెండింటిని సమానంగా స్వీకరించగలగాలన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ఒక వింత ప్రపంచం. ప్రేక్షకులు మిమ్మల్ని ఆరాధిస్తారు, కొన్ని సార్లు ద్వేషిస్తారు. వాళ్లు ఏమైనా చేయగలరు. మీ పని మీరు సరిగా చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కథానాయిక రాజశేఖర్ కూతురు శివాత్మికను, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డిని అభినందించారు. ఇప్పటికే అంచనాలు పెంచేసిన దొరసాని చిత్రం జులై 12న విడుదల కానుంది. -
‘దొరసాని’ ప్రీ రిలీజ్ వేడుక
-
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ మాత్రం తమ్ముడు నటిస్తున్న సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీజర్, ట్రైలర్లపై కూడా స్పందించలేదు. అయితే ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకలో ఒకేసారి తన అనుభూతులన్నింటిని పంచుకునేందుకే ఇప్పటి వరకు విజయ్ స్పందించలేదని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విజయ్, ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న దొరసాని సినిమాతో రాజశేఖర్ జీవితల చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాదీ అక్కదీ ఒకటే కల
‘‘వారం రోజుల నుంచి మా ఇంట్లో సెలబ్రేషన్ మూడ్ నడుస్తోంది. డాడీ (రాజశేఖర్) ‘కల్కి’ రిలీజ్ అయిన 15 రోజులకే నా సినిమా (దొరసాని) రిలీజ్ అవుతోంది. ఇది ప్లాన్ చేసింది కాదు. కానీ ఈ మూమెంట్‌ని అందరం కలసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కొంచెం టెన్షన్ కూడా పడుతున్నాం (నవ్వుతూ)’’ అని శివాత్మిక రాజశేఖర్ అన్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితారాజశేఖర్ తనయ శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. కెవీ మహేంద్ర దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా శివాత్మిక చెప్పిన విశేషాలు. ► నేను చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగాను. షూటింగ్ స్పాట్లోనే ఎక్కువరోజులు గడిపాను. చిన్నపటి నుంచి సినిమాలే ప్రపంచం. నాన్న సినిమాల షూటింగ్స్‌కి వెళ్లడం, స్క్రిప్ట్స్ చూడటం ఇలా అన్నీ చూస్తూ పెరిగిన నా మీద సినిమా ప్రభావం చాలా ఉంది. ► ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తి చేసి కొంచెం బ్రేక్ తీసుకుని డ్రామా క్లాసులకో, డ్యాన్స్ ఏదైనా నేర్చుకుందాం అనో ప్లాన్ చేశాను. ఆ సమయంలో ‘దొరసాని’ కథ నా దగ్గరకు వచ్చింది. ‘మధుర’ శ్రీధర్ అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని చూస్తున్నారు. ఆ సమయంలో కథ వినమన్నారు. మహేంద్రగారు నాలుగు గంటలు కథ చెప్పారు. చాలా గొప్పగా రాసుకున్నారు. కథ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆడిషన్ తీసుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిన తర్వాతే నన్ను ఎంపిక చేశారు. ► తెలంగాణ ప్రాంతంలో జరిగిన పీరియాడికల్ మూవీ ఇది. ఒక దొరసానికి, రాజు అనే మామూలు కుర్రాడికి ప్రేమ ఎలా ఏర్పడింది? ఆ కాలంలో జరిగే ఇష్యూలను ఇందులో చూపించాం. మహేంద్రగారికి ప్రతీది ఆయన రాసుకున్నట్టుగానే ఉండాలి. సినిమాలో నా ఫస్ట్ సీన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం. అది బ్యాక్ షాట్. కెమెరా నా వెనక ఉంటుంది. యాక్టింగ్ నా బ్లడ్‌లోనే ఉంది. సింగిల్ టేక్‌లో చేసి పడేస్తా (నవ్వుతూ) అనుకున్నాను. సెట్లోకి వెళ్లగానే ఫ్రీజ్ అయిపోయా. ఆ సీన్‌ని కూడా నాలుగైదు సార్లు చేయించారు మహేంద్రగారు. దొరసాని ఫోన్ అలా ఎత్తాలి, బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా ఇలానే ఉండాలి అన్నారు. ► ఆడిషన్ జరిగిన తర్వాత ఫస్ట్ సెలెక్ట్ అయింది ఆనందే. తను చాలా మంచి యాక్టర్. సెట్లో మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ‘దొరసాని’ లో నా పాత్ర చాలా తక్కువ మాట్లాడుతుంది. సినిమా మొత్తం మీద 12 డైలాగ్స్ కూడా ఉండవేమో? అన్నీ కళ్లతోనే వ్యక్తపరచాలి. కొన్ని సీన్లలో చాలా స్ట్రయిన్గా అనిపించింది. నా బెస్ట్ అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను. ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ► ‘మీ అమ్మలానే ఉన్నావు’ అని చాలామంది అన్నారు. ఈ సినిమాలో నా పాత్రకు లుక్స్‌పరంగా చాలా రిఫరెన్స్‌లు అమ్మ నుంచే తీసుకున్నాను. అమ్మ యంగ్‌గా ఉన్నప్పుడు ఎలాంటి జ్యూయలరీ వేసుకున్నారు అవన్నీ చూశాను. కానీ ఫర్ఫార్మెన్స్ని మాత్రం రిఫరెన్స్‌గా తీసుకోలేదు. మనకంటూ ఒరిజినాలిటీ ఉండదని నా ఫీలింగ్. అమ్మానాన్న కూడా అలా చెయ్ ఇలా చెయ్ అని చెప్పలేదు కానీ ‘చేసే పాత్రలో పూర్తిగా నిమగ్నం అయి చెయ్యి’ అని చెప్పారు. ► ‘కల్కి’ సినిమాకు నేను, అక్క కో–ప్రొడ్యూసర్స్‌గా చేశాం. ఇద్దరం చాలా కష్టపడ్డాం. నేను ‘దొరసాని’కి, ‘కల్కి’కి షిఫ్ట్ అవుతూ వర్క్ చేశాను. అక్క ఫోకస్ అంతా ఈ సినిమా మీదే. సెట్లో మేం ఇలా పని చేయడం చూసే ‘చిరంజీవి సినిమాలు చరణ్ ఎలా నిర్మిస్తున్నారో, నా సినిమాలు మా అమ్మాయిలు నిర్మిస్తున్నారు’ అని ‘కల్కి’ ఈవెంట్లో నాన్నగారు అన్నారు. మా కష్టాన్ని చూసి గర్వంతో అన్న మాటలవి. చిన్నప్పుడు.. నాకు అబ్బాయిలు ఉండుంటే ఇలా ఉండేది అలా ఉండేది అని మమ్మల్ని సరదాగా ఏడిపించేవారు. కానీ ఇప్పుడు ఆయన చాలా గర్వంగా ఉన్నారు. ► ఇంట్లో డాడీ స్క్రిప్ట్స్ అన్నీ చదివి, నరేట్ చేస్తుండేదాన్ని. అలా స్క్రిప్ట్స్ చదవడం అలవాటయింది. ఇప్పుడు మేం సినిమాలు చేస్తున్నాం అని డాడీ సినిమాలు తగ్గించనవసరం లేదు. ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మమ్మీ సినిమా చూశారు. తనకు చాలా నచ్చింది. డాడీ మాత్రం ట్రైలర్, టీజర్స్ చూశారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ► ఆఫర్స్ ఉన్నాయి కానీ నెక్ట్స్ సినిమా ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదు. నా వయసుకి తగ్గ పాత్రలు, నాకు సూట్ అయ్యేవి చేయాలనుకుంటున్నాను. డాడీకి సీక్రెట్స్ దాచడం రాదు! డాడీకి సీక్రెట్స్ మెయింటెయిన్ చేయడమే రాదు. బాగా వీక్. మేం అక్కకి బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే ఆయన వెళ్లి అక్కకే ‘నీ బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పేస్తారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలసి నటించాలనే ఆలోచన ఉంది. అది ఇంకా ఐడియా స్టేజ్‌లోనే ఉంది. అప్పుడే బయటకు చెప్పేశారు (నవ్వుతూ). పదేళ్ల వయసు నుంచే అక్కా, నేను ఎలాంటి సినిమాలు చేయాలో అని మాట్లాడుకునేవాళ్లం. ఏదైనా సినిమా చూస్తే నీకు అలాంటి పాత్రలు సూట్ అవుతాయి అని నాకు చెబుతుంది. నేను తనకు ఏదైనా చెబుతాను. నాదీ, అక్కదీ ఒకటే కల. హీరోయిన్ అవాలని. ఫేవరెట్స్ లేరు ‘మాకు మీ ఇద్దరూ ఇష్టమే. ఇద్దరిలో ఫేవరెట్స్ ఎవరూ లేరు’ అని చెబుతారు మమ్మీడాడీ. అది నిజమే అనుకుంటున్నాను (నవ్వుతూ). మేం నలుగురం ఫ్రెండ్స్‌లా ఉంటాం. మా ఫ్రెండ్స్ కూడా మమ్మీడాడీకి క్లోజ్. మా ఫ్రెండ్స్ కూడా ఏదైనా మాట్లాడాలంటే మా కంటే వాళ్లతోనే ఎక్కువ డిస్కస్ చేస్తారు. -
‘దొరసాని’ కోసం ఎదురు చూశాను
ఆనంద్ దేవరకొండ, శివాత్మికలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. ఈ చిత్రం జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ఈ మూవీ ప్రత్యేకమైన ముద్రను వేసింది. కేవీఆర్ మహేంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియాతో హీరోయిన్ శివాత్మిక ముచ్చటించారు. ‘షూటింగ్స్ అనేవి నా ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితంలో బాగమయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కువగా షూటింగ్‌లోనే టైం స్పెండ్ చేసే దానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువవుతోంది. ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్‌ను నన్ను, ఆనంద్‌ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎదురు చూశాను. నేనే అని తెలిశాక చాలా ఎగ్జైట్ అయ్యాను’ అంటూ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చారు. -
తెలుగు సినిమా తీరు మారింది
‘‘సినిమా రచన వేరు, దర్శకత్వం వేరు. ఈ రెండూ ఒకరే చేయడంతో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయతీ నిండిన కథలే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా జీవితారాజశేఖర్‌ల కుమార్తె శివాత్మిక హీరోయిన్గా పరిచయమవుతోన్న చిత్రం ‘దొరసాని’. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మధుర ’ ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిషీధి’ అనే షార్ట్ ఫిల్మ్‌తో శ్యామ్ బెనగల్ నుండి ప్రశంసలు పొందాడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచి ఏంటో ‘దొరసాని’ ట్రైలర్ చెబుతోంది. ఈ కథలో అంతా నిజాయతీనే కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ విన్నప్పడు నాకు కలిగిన ఫీల్‌ని తెరమీదకు వందశాతం తెచ్చాడు మహేంద్ర. ఎడిటర్ నవీన్ నూలి మినహా దాదాపుగా అందరూ కొత్త వాళ్లతోనే ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ఏ ఎమోషన్ ఫేక్‌గా అనిపించదు. ఇందులో ఒక వాస్తవికత, స్వచ్ఛత ఉంది. 1980దశకాల్లో నడిచే ప్రేమ కథ ఇది’’ అన్నారు కె.వి.ఆర్ మహేంద్ర. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు కొత్త వాళ్లు చేశారనిపించడం లేదు. సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే ఇలాంటి కథలు తప్పకుండా ఆలోచనలో మార్పును తెస్తాయి’’ అన్నారు నిర్మాత దొరస్వామి రాజు. ‘‘మా ఇంట్లో అంతా సినిమా వాతావరణమే. నా కుటుంబం నాకు ఒక పెద్ద ఫ్యామిలీ (సినిమా ఇండస్ట్రీ, అభిమానులు)ని ఇచ్చింది అని ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది’’ అన్నారు శివాత్మిక. ‘‘అమెరికాలో ఉద్యోగం చేసేవాణ్ణి. ‘పెళ్ళి చూపులు’ ట్రైలర్ లాంచ్ రోజు ఆఫీస్‌కి వెళ్లకుండా రూమ్‌లో ఉన్నా. ట్రైలర్ లాంచ్‌లో విజయ్ మాట్లాడేది చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. అన్నయ్యను సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి’’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. ‘‘చాలా మంచి ప్రేమకథ ఇది. శివాత్మిక, ఆనంద్‌లకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవిత. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
‘దొరసాని’ ట్రైలర్ విడుదల
-
‘దొరసాని’లో నిజాయితీ ఆకట్టుకుంటుంది : సుకుమార్
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ వెండితెరకు పరిచయమవుతూ చేస్తున్న చిత్రమే దొరసాని. టీజర్‌తోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసిన దొరసాని.. పాటలతో మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్.. అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ట్రైలన్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘నిషీధి అనే షార్ట్ ఫిల్మ్ చేసి శ్యాంబెనగల్ నుండి ప్రశంసలు పొందారు దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచేంటో ట్రైలర్ చెబుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయితీ నిండిన కథలే ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు. దొరసానిలో పాటలు రోజూ వింటున్నాను. ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే ’ పాట నన్ను హంట్ చేస్తుంది. గోరెటి వెంకన్న సాహిత్యానికి నేను పెద్ద అభిమానిని. దొరసాని లో అంతా నిజాయితీనే కనిపిస్తుంది. శివాత్మిక పర్ఫెక్ట్ తెలంగాణ అమ్మాయిలా కనపడుతుంది. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. విజయ దేవరకొండలో కనిపించిన నిజాయితీ.. వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాటల్లో కూడా కనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కొరుకుంటున్నాన’ని అన్నారు. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా రాబోతోన్న దొరసాని చిత్రం గురించి అందరికీ తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ‘దొరసాని’పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. విజయ్ దేవరకొండ తమ్మునిగా వెండితెరకు ఆనంద్ ఎంట్రీ ఇస్తుండగా.. రాజశేఖర్ కూతురు శివాత్మిక టాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదో స్వచ్చమైన ప్రేమ కథ అని టీజర్‌తో చెప్పేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో తన ప్రేమకు గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలను చూపించారు. తెలిసిన కథే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సంగీతం, డైలాగ్‌లు, హీరోహీరోయిన్ల నటన ఈ చిత్రానికి పాజిటివ్‌గా మారనుంది. ముఖ్యంగా మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్‌లోని.. ‘ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే’., ‘నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే’లాంటి డైలాగ్‌లు.. ‘కదిలించావు నన్నే గుండెను మీటి.. కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి’, ‘దొరసాని.. నిన్ను చూడని నిశిరాతిరి నేనొక రాలిన నక్షత్రం.. నీ ఊసులే లేని మలిసంధ్యలో నేనో కరిగిన మేఘం’ లాంటి గోడపై రాసిన కొటేషన్స్ ఈ ప్రేమకథలోని లోతును తెలిపేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించారు. యష్ రంగినేని, మధుర శ్రీదర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని కెవీఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
అచ్చమైన ప్రేమకథ....
తెలంగాణ ప్రాంతంలో 80వ దశకంలో జరిగిన స్వచ్ఛమైన ప్రేమకథగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దొరసాని’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లు హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మించారు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 12న సినిమాని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ‘‘శివాత్మిక, ఆనంద్ అద్భుతంగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ‘దొరసాని’ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఆ మధ్య విడుదల చేసిన ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే...’ బాగా హిట్టయింది. ఈ చిత్రంలోని మరో పాట ‘కలవరమై..’ను సోమవారం విడుదల చేస్తాం. ఈ పాటకు కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. కల్మషం లేని ప్రేమకథ మా ‘దొరసాని’’ అంటున్నారు దర్శక–నిర్మాతలు. ప్రశాంత్. ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. -
‘దొరసాని’ రెండో సినిమా రెడీ!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరోయిన్ శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తో కలిసి దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు శివాత్మిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి సినిమా దొరసాని రిలీజ్ కాకుండానే శివాత్మిక మరో మూవీకి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలో రాజ్‌దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్, రెండో సినిమాలో శివాత్మిక హీరోయిన్గా నటించనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను మేఘాంశ్ తొలి చిత్ర నిర్మాత ఎమ్ఎల్వీ సత్యనారాయణ నిర్మించనున్నారు. -
నింగిలోన పాలపుంత.. ‘దొరసాని’
అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించికున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంతో జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా విడుదలైన దొరసాని టీజర్.. సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. గడీలో ఉన్న దొరసానికి, పేద కుటుంబంలో పుట్టిన రాజుకు మధ్య జరిగే కథాంశంగా ‘దొరసాని’ని తెరకెక్కించారు. ఈ కథకు తెలంగాణ నేపథ్యాన్ని తీసుకోవడంతో తెరపై కొత్త అనుభూతి కలిగేలా ఉంది. ఈ మూవీ నుంచి నింగిలోన పాలపుంత అనే పాటను రేపు (జూన్ 10) ఉదయం 9.10గంటలకు విడుదల చేయనున్నారు. Experience the world of Raju & Dorasaani #NingilonaPaalapuntha lyrical song, Tomorrow @ 9:10AM@ananddeverkonda @ShivathmikaR @madhurasreedhar @YashBigBen @SureshProdns @kvrmahendra @DheeMogilineni @vrsiddareddy @prashanthvihari @GskMedia_PR@anuragkulkarni_ @MadhuraAudio pic.twitter.com/Bgj5yBGkeQ — BARaju (@baraju_SuperHit) June 9, 2019 -
వైరల్ అవుతున్న ‘దొరసాని’ టీజర్
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక జంటగా రాబోతోన్న దొరసాని టీజర్ గురువారం విడుదలైంది. పాత కథే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ప్రేమ కథను గడీల కాలంలోకి తీసుకెళ్లి తెలంగాణ ఫ్లేవర్‌ను కలపడంతో ఈ టీజర్‌కు కొత్త లుక్ వచ్చింది. దీనికి తోడు ఆనంద్, శివాత్మిక తమ పాత్రల్లో కనిపించిన తీరు.. అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ టీజర్ 1మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. -
దొరసాని గుర్తుండిపోయే ప్రేమకథ
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘దొరసాని’. ఇంకో విశేషం రాజశేఖర్–జీవితా దంపతుల కుమార్తె శివాత్మిక ఇందులో కథానాయికగా నటించడం. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు సహ–నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన డి. సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘టీజర్లో విజువల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా కథ రెడీ అవుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అందరూ బాగా శ్రమించారు. హీరో హీరోయిన్ల పాత్రలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. దొరసాని గుర్తుండిపోయే కథ అవుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘నాలుగేళ్ల క్రితం మొదలైన ‘దొరసాని’తో నా జర్నీ ఇంతవరకు రావడానికి కారణం సురేష్‌బాబు, ‘మధుర’ శ్రీధర్‌గార్లు. పదికాలాలు గుర్తుండిపోయే ప్రేమకథగా దొరసాని నిలిచిపోతుంది’’ అన్నారు మహేంద్ర. ప్రముఖ దర్శకులు, మార్గదర్శకులు డి. రామానాయుడు జయంతి రోజున దొరసాని టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. మహేంద్ర క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. -
‘కాదు.. మీరు నా దొరసాని’
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ‘దొరసాని’ అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచీ ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో.. మీ పేరు అని శివాత్మిక అని అడిగితే ‘రాజు’ అని చెప్పి.. ‘మీరు దొరసాని’ అని మన హీరో అనడం.. వెంటనే శివాత్మిక ‘కాదు దేవికా’ అని అనడం.. వెంటనే ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్ ఆనడం ఆకట్టుకుంది. ఆనంద్ డైలాగ్ డెలివరీలో కూడా విజయ్ మాడ్యులేషన్ కనబడటం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు.