Economy System
-
రాబోయే ఐదేళ్లు భారత్‌కు ఎంతో క్లిషమైంది: జైశంకర్
ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అంటూ కామెంట్స్ చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. అన్నారు. ప్రస్తుతం భారత్ ఇబ్బందికర(కఠిన) పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో అమెరికా ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, జైశంకర్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్ల కాలం భారత్‌కు ఎంతో క్లిషమైనది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?. ఆగ్నేయాసియా.. తూర్పు ఆసియా.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. యుద్ధాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.ప్రస్తుతం ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఒక దేశం వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరోకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉన్నాయి. మరోవైపు.. కోవిడ్ సమస్య కూడా ఇంకా తీరలేదు. పలు దేశాలపై కోవిడ్ ప్రభావం ఇంకా ఉంది. ఇక, వాతావరణ మార్పులపై కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి విపత్తుల కారణంగా ఎన్నో దారుణ పరిస్థితులు జరుగుతున్నాయన్నారు. ఇక, ఏది ఏమైనప్పటికీ తాను మాత్రం ఆవకాశవాదిని అని చెప్పుకొచ్చారు. సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు.మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించకూడదు. ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదు. అందుకే ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోలేను. కానీ, గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా... భారత్ వారితో కలిసి పని చేస్తుందన్నారు. -
వృద్ధిలో భారత్ వేగం.. చైనా నెమ్మది
న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్... ఇండియా గ్రోస్’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆసియా–పసిఫిక్ గ్రోత్ ఇంజిన్... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా. ►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6 శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది. ►ఇక భారత్ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంది. ►భారత్ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. ►ఆసియా–పసిఫిక్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి. ►మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్‌ను దెబ్బతీయవచ్చు. ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది. అధిక ఇన్పుట్ ఖర్చులు కార్పొరేట్ మార్జిన్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది. ►ఆసియా–పరిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి. -
గూగుల్ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం
న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్ దిగ్గజం గూగుల్ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్ట మ్స్, యాప్ స్టోర్స్, యాప్స్ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్.. ట్రీట్మెంట్ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్సీఎల్ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. -
5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్‌లు
హైదరాబాద్: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది. ఈ నెల 27న ఇన్వెస్టర్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్‌లకు సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్ గ్యారంటీ స్టార్టప్‌లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్‌లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ శృతీసింగ్ అభినందించారు. -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు: మోదీ
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒల్పాడ్లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్‌లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు. -
అమెరికాలో ఆర్థిక మాంద్యం రాదు: బైడెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున..ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6%క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
క్రిప్టోలను నిషేధించాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్బీఐ అభిప్రాయం‘ అని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్‌పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా? -
ఎకానమీకి సేవల దన్ను..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ సేవల రంగం ఎకానమీకి మేలో దన్నుగా నిలిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మేలో 58.9గా నమోదయ్యింది. గడచిన 11 సంవత్సరాల్లో సేవల రంగంలో ఈ స్థాయి పటిష్టత నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో సూచీ 57.9 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో పురోగతి సూచీ పటిష్ట స్థాయికి దోహదపడింది. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే పురోగతిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం సేవల సూచీ వృద్ధి బాటన నిలవడం ఇది వరుసగా పదవనెల. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ సేవా రంగంలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. మే నెలలో వ్యాపార కార్యకలాపాలు 11 సంవత్సరాలలో అత్యంత వేగంతో పుంజుకున్నాయి, జూలై 2011 తరువాత కొత్త ఆర్డర్లలో వేగవంతమైన పెరుగుదల ఇదే తొలిసారి’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60%గా ఉంది. తయారీ–సేవలు కలిపినా అదుర్చ్... ఇక సేవలు, తయారీ కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 57.6గా ఉంటే, మేలో 58.3కు ఎగసింది. నవంబర్ తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. భారత్ తయారీ రంగం (పారిశ్రామిక ఉత్పత్తిలో 75%) మే నెల్లో స్థిరంగా ఉంది. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్‌కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
వృద్ధికి ఒమిక్రాన్ ముప్పు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్ వేరియంట్పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు.. మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. రిటైల్ రుణాల విధానాలపై ఆందోళన.. రిటైల్ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది. ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు.. కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది. మొండిబాకీలు పెరుగుతాయ్.. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి
ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్గవర్నెన్స్ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్‌లో బ్యాంకింగ్ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిపైనే.. ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది. సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మక విధానం భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్ ఫైనాన్స్), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది. ఎన్బీఎఫ్సీలు నిలదొక్కుకోగలవు రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది. కోపరేటివ్ బ్యాంకులు విస్తరించాలి కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్ (కోపరేటివ్ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది. ప్రాథమిక నమూనాలోనే డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూ.36,342 కోట్ల మోసాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 2 డిజిటల్ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక మూడు రోజుల పాలసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ దేశ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై ప్రధాన నిర్ణయాలను శుక్రవారం వెలువరించనుంది. అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగా ధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను కొనసాగించే అవకాశాలే అధికమని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా ఎనిమిది ద్వైమాసిక సమావేశంలోనూ ఆర్బీఐ యథాతథ రేటును కొనసాగించినట్లవుతుంది. 2020 మే 22 తర్వాత ఇప్పటి వరకూ రెపో విషయంలో ఆర్బీఐ యథాతథ పరిస్థితినే అను సరిస్తోంది. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లు విసిరినప్పటికీ భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మూడవ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్ సాగు సెపె్టంబర్ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది. ► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది. ► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి. ► ద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం. -
ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్!
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ 2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇందుకు లోబేస్ ప్రధాన కారణమైంది. అయితే ఇదే కాలంలో దేశం మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎకానమీ తగిన సానుకూల ఆర్థిక ఫలితాన్ని సాధించడం కొంతలో కొంత ఊరట. లోబేస్ అంటే..? ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఏప్రిల్–జూన్ కాలాన్ని తీసుకుంటే కరోనా కష్టాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 24.4 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లోబేస్తో పోల్చితే జీడీపీ విలువ తాజా సమీక్షా కాలంలో 20.1 శాతం పెరిగిందన్నమాట. విలువలు ఇలా... 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.26,95,421 కోట్లు (2019–20 తొలి క్వార్టర్‌తో పోల్చితే 24.4 శాతం డౌన్). జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజా సమీక్షా కాలంలో(2021–22 ఏప్రిల్–జూన్) ఈ విలువ రూ.32,38,020 కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే తాజా సమీక్షా నెల్లో విలువ కరోనా ముందు కాలంలో పోల్చితే ఇంకా వెనుకబడి ఉండడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ పరిమాణం రూ.35,66,708 కోట్లు. అప్పటితో పోల్చితే, ఎకానమీ ఇంకా రూ. 3,28,688 కోట్లు వెనుకబడి ఉండడం గమనార్హం. శాతాల్లో చెప్పాలంటే కోవిడ్–19 ముందస్తు కాలంతో పోల్చితే ఇంకా 9.2 శాతం ఎకానమీ వెనుకబడి ఉందన్నమాట. రంగాల వారీగా... ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువ ప్రకారం తాజా సమీక్షా కాలంలో (ఏప్రిల్–జూన్) వివిధ రంగాల వృద్ధి తీరు ఇలా... ► తయారీ: ఈ రంగం ఉత్పత్తి 49.6% ఎగసింది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 36 శాతం క్షీణించింది. ► వ్యవసాయ రంగం: వృద్ధి 3.5% నుంచి 4.5%కి చేరింది. ► నిర్మాణం: 49.5% క్షీణత నుంచి 68.3% వృద్ధికి మళ్లింది. ► మైనింగ్: 18.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 17.2 శాతం క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవలు: ఈ విభాగంలో తాజా సమీక్షా కాలంలో 14.3 శాతం వృద్ధి నమోదుకాగా, 2020 ఇదే కాలంలో 9.9 శాతం క్షీణత నమోదయ్యింది. ► వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవలు: 48.1 శాతం క్షీణత 34.3 శాతం వృద్ధిబాటకు వచ్చింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 2020 ఏప్రిల్–జూన్ మధ్య 5 శాతం క్షీణిస్తే, తాజా సమీక్షా కాలంలో 3.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాలు మైనస్ 10.2% నుంచి 5.8% వృద్ధి బాటలోకి వచ్చాయి. త్రైమాసికం పరంగా 16.9 శాతం పతనం త్రైమాసికం పరంగా చూస్తే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఎకానమీ విలువ 38.96 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలంలో ఈ విలువ రూ.32.38 లక్షల కోట్లు. అంటే త్రైమాసికపరంగా చూసినా ఎకానమీ 16.9% డౌన్లో ఉందన్నమాట. దీనికి ప్రధానంగా ఏప్రిల్–మే నెలల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కోవిడ్–19 సెకండ్‌వేవ్ కారణం. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువలో చూస్తే క్యూ1లో వృద్ధి రేటు (2020 ఇదే కాలంలో పోల్చి) 18.8% పురోగమించింది. అయితే 2020 జనవరి–మార్చి కాలంతో చూస్తే, విలువ 13.3% క్షీణించడం గమనార్హం. 2021–22పై అంచనాలు ఇలా... కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఎకనామీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అయితే లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. కాగా, 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి నమోదవుతుందని మూడీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. కీలక రంగాలు విలువల్లో... ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాల విలువలూ కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్–జూన్ మధ్య తయారీ రంగం ఉత్పత్తి విలువ 5.67 లక్షల కోట్లయితే, ఈ విలువ 2021 ఏప్రిల్–జూన్ మధ్య రూ.5.43 లక్షల కోట్లుగా ఉంది. సేవల రంగం విలువ మాత్రం కోవిడ్ ముందస్తు స్థాయి (రూ.6.64 లక్షల కోట్లు)కి ఇంకా చాలా దూరంలో ఉంది. సమీక్షా కాలంలో ఈ విలువ రూ.4.63 లక్షల కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగం విలువ రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.86 లక్షల కోట్లకు ఎగసింది. దేశ ఎకానమీలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వాటా 15 శాతం చొప్పున ఉండగా, సేవల రంగం విలువ దాదాపు 60 శాతం వరకూ ఉంది. వేగవంతమైన వృద్ధి హోదా తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకున్న దేశాల్లో మొదటి స్థానం హోదాను భారత్ దక్కించుకుంది. 2021 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో చైనా వృద్ధి రేటు 7.9 శాతం. భవిష్యత్ వృద్ధికి బాటలు మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలను ఈ గణాంకాలు అందిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆర్థిక మూలాలు పటిష్టం భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత సంస్కరణలు, చేస్తున్న భారీ మూలధన వ్యయాలు వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఎకానమీలో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి ధోరణి నమోదవుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఎకానమీకి కలిసివస్తుంది. – కేసీ సుబ్రమణ్యం, సీఈఏ పునరుత్తేజం: పారిశ్రామిక రంగం ఎకానమీ కోవిడ్–19 సవాళ్ల నుంచి కోలుకుని పునరుత్తేజం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భారత్ పారిశ్రామిక రంగం పేర్కొంది. సెకండ్‌వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో ఎకానమీ తగిన మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఇండస్ట్రీ చాంబర్–సీఐఐ పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కార్యక్రమాలు వృద్ధికి ఊతం ఇస్తున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కోవిడ్ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
నెల్లూరు (అర్బన్): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానం కూడా మరో కారణమన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు. -
జనధనానికి జవాబుదారీ లేదా?
కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా? కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్‌బర్గ్ తేల్చింది. ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట. గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు! వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్ శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్‌కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్‌సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్‌ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్‌ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
1946 తరువాత ఎన్నడూ లేనంత పతనం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
బడ్జెట్.. డిమాండ్‌ను పెంచాలి
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడంపై రానున్న బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్‌ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. పన్నుల ఉపశమనం అవసరం.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది.