Future Retail
-
ఫ్యూచర్ రిటైల్‌కు బియానీ రాజీనామా ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. -
ఫ్యూచర్ రిటైల్ చైర్మన్‌గా బియానీ రాజీనామా
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ చైర్మన్, డైరెక్టరు పదవులకు కిశోర్ బియానీ రాజీనామా చేశారు. ‘దురదృష్టకరమైన వ్యాపార పరిస్థితుల ఫలితంగా‘ సంస్థ సీఐఆర్‌పీని ఎదుర్కొనాల్సి వస్తోందంటూ పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) పంపిన రాజీనామా లేఖలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కంపెనీపై అభిరుచితో తాను సంస్థ వృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డానని, కానీ ప్రస్తుత వాస్తవ పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి వస్తోందని బియానీ పేర్కొన్నారు. కంపెనీని ఆర్పీ తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను తప్పుకున్నప్పటికీ రుణదాతలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. భారత్‌లో ఆధునిక రిటైల్ కు ఆద్యుడిగా బియానీ పేరొందారు. బిగ్ బజార్, ఈజీడే, ఫుడ్‌హాల్ వంటి బ్రాండ్స్ కింద ఒక దశలో 430 నగరాల్లో 1,500 అవుట్‌లెట్స్‌ను ఎఫ్ఆర్ఎల్ నిర్వహించింది. అయితే, రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో కంపెనీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ వేసింది. -
ఫ్యూచర్ రిటైల్ రేసులో అంబానీ, అదానీ
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూప్‌లు సహా 13 కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేసిన కంపెనీల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్), అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్.. ఫ్లెమింగో గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్ కూడా ఉన్నాయి. వీటితో పాటు క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్, యునైటెడ్ బయోటెక్, ఎస్ఎన్వీకే హాస్పిటాలిటీ మొదలైన సంస్థలు ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్ రిటైల్ తెలిపింది. దివాలా ప్రక్రియ కింద కంపెనీ నుంచి రూ. 21,060 కోట్ల మేర బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 31 బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. -
ఫ్యూచర్ రిటైల్‌కు బిడ్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ పట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు లభించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబర్ 20నే ముగిసిపోవాలి. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్ బిడ్ల దాఖలు గడువును నవంబర్ 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ నెల 20 నాటికి బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, సవరించిన బిడ్‌ను కూడా తిరిగి సమర్పించొచ్చని తెలియజేసింది. కనీసం రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని, నిర్వహణ ఆస్తులు లేదా పెట్టుబడులు పెట్టేందుకు రూ.250 కోట్లు ఉండాలన్న షరతులను రిజల్యూషన్ ప్రొఫెషనల్ విధించారు. ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి సెప్టెంబర్ 2 నాటికి రూ.21,433 కోట్ల బకాయిల మేరకు క్లెయిమ్‌లు దాఖలు కావడం గమనార్హం. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఫ్యూచర్‌పై దివాలా చర్యలు షురూ!
ముంబై: రుణ ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. రూ.3,495 కోట్ల రుణ డిఫాల్ట్‌ల నేపథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా దివాలా పరిష్కార ప్రక్రియను కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బీఓఐ కుమ్మక్కై ఈ పిటిషన్ దాఖలు చేసిందని అమెజాన్ పేర్కొంది. బ్యాంక్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదిస్తే, ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి తమ న్యాయ పోరాట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ కామర్స్ దిగ్గజం వాదించింది. -
ఆ రూ. 200 కోట్లు... 45 రోజుల్లో కట్టేయండి
Amazon Future Coupons Case, న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ సబ్సిడీ– ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (ఎఫ్సీఎల్సీ) ఒప్పందం విషయంలో అమెజాన్‌కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లోనూ చుక్కెదురైంది. ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వును అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఒప్పందంపై కొన్ని అంశాలను దాచిపెట్టినందుకు దీనిని సస్పెండ్ చేస్తున్నట్లు 2021 డిసెంబర్ 17వ తేదీన అమెజాన్‌కు కాంపిటేషన్ వాచ్డాగ్ రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని అమెజాన్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. అయితే ఇక్కడ ఈ–కామర్స్ దిగ్గజానికి చుక్కెదురైంది. ఈ వివాదంలో సీసీఐ విధించి రూ.200 కోట్ల డిపాజిట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ అమెజాన్‌కు 45 రోజుల సమయం మంజూరు చేసింది. అయితే సెక్షన్ 44, 45 సెక్షన్ల క్రింద విధించిన రూ.కోటి చొప్పన ప్రత్యేక జరిమానాలను రూ.50 లక్షల చొప్పున తగ్గించింది. మరిన్ని వివరాలు... అమెజాన్.కామ్ అనుబంధ సంస్థ అమెజాన్.కామ్ ఎన్వీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఎఎసీ( అమెజాన్) 2019 ఆగస్టులో అన్‌లిస్టెడ్ ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.1,400 కోట్లు. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్ఆర్ఎల్) 9.82 శాతం వాటా (కన్వర్టబుల్బాండ్స్ ద్వారా) ఉంది. ఈ ఒప్పందాన్నే కారణంగా చూపిస్తూ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలుకు సంబంధించి మొదటి హక్కు తమకే ఉంటుందని, 3 నుంచి 10 సంవత్సరాల్లో తాను ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు ఒప్పందం ప్రకారం ఉందని అమెజాన్ వాదిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఎఫ్ఆర్ఎల్ (దీనితో సహా మరో 19 కంపెనీలు) రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర న్యాయపోరాటం చేసింది. అయితే అసలు ఫ్యూచర్స్‌తో ఒప్పంద ప్రతిపాదనను పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఏప్రిల్‌లో ప్రకటించింది. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుతం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌లో దివాలా చర్యలను ఎదుర్కొంటోంది. సీఏఐటీ హర్షం కాగా, అమెజాన్ వాదనలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ వివాద విచారణలో భాగంగా ఉన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాజా అప్పీలేట్ ట్రిబ్యునల్ రూలింగ్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘‘భారత్ ఈ–కామర్స్ అలాగే రిటైల్ వాణిజ్యాన్ని ఎవరైనా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే, ఈ చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాబోవు’’ అని పేర్కొంది. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
ఫ్యూచర్ రిటైల్‌పై బీవోఐ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్‌పై బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ కుమార్ వీ అయ్యర్‌ను ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఐఆర్పీ (మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్/లిక్విడేటర్)గా నియమించాలని ఎన్సీఎల్టీని బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థించింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, సంబంధిత ఇతర సమస్యల కారణం గా ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఎల్‌ఆర్) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తాను పిటిషన్ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వార్తా పత్రికల్లో ఇప్పటికే నోటీసులు.. బీవోఐ గత నెల వార్తా పత్రికలలో ఒక పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఫ్యూచర్ రిటైల్ ఆస్తులపై తన క్లెయిమ్‌ను ప్రకటించింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఆస్తులతో లావాదేవీలు జరపరాదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించింది. 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్ రిటైల్ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్ఆర్వీఎల్లకు బదిలీ అవుతాయి. 20 నుంచి సమావేశాలపై ఉత్కంఠ కాగా, రిలయన్స్‌తో డీల్ ఆమోదం కోసం 2022 ఏప్రిల్ 20–23 తేదీల మధ్య ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు తమ సంబంధిత వాటాదారులు రుణదాతలతో సమావేశాలను నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెజాన్ ఈ సమావేశాల నిర్వహణను తీవ్రంగా తప్పు బడుతుండడమే దీనికి కారణం. -
రిలయన్స్ నీ ఆటలు సాగవ్! చూస్తూ ఊరుకోమంటున్న అమెజాన్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ స్వాధీనం చేసుకున్న స్టోర్లను తిరిగి పొందడానికి అలాగే ఇందుకు సంబంధించి విలువల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ అనూహ్య చర్య తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్‌కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారానంటూ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్‌ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. వివాదానికి కారణమైన ‘అమెజాన్ ఫ్యూచర్ కూపన్స్’ ఒప్పందమే చెల్లదని 2021 డిసెంబర్ కాంపిటేషన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూలింగ్‌తో సమస్య కొత్త మలుపు తిరిగింది. ఇక, ఫ్యూచర్ గ్రూప్‌నకు 1,700 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్–లీజుకు ఇచ్చింది. సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్‌కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్‌లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్‌వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల, సబ్ లీజులను రద్దుచేసి రిలయన్స్ ఆ అవుట్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్చూచర్ తాజా ప్రకటన చేసింది. ఆర్బిట్రేషన్ పునరుద్ధరణపై మార్చి 23న సుప్రీం విచారణ కాగా వివాదంపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ పునఃప్రారంభాన్ని కోరుతూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. ఆర్బిట్రేషన్ విచారణను పునఃప్రారంభించాలని కోరడంతో పాటు, ఆర్బిట్రేషన్‌లో గెలిస్తే ఫ్యూచర్ ఆస్తులు తమ వద్దే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అమెజాన్ కోరింది. -
ఫ్యూచర్ స్టోర్స్ రీబ్రాండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవన యజమానులకు బకాయిలు చెల్లించలేక మూతపడ్డ ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో 250 కేంద్రాలను రిలయన్స్ చేజిక్కించుకుంటోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 వరకు ఔట్లెట్స్ ఉన్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా 1,700లకుపైగా కేంద్రాలు ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ మధ్య లీగల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా బకాయిలు పేరుకుపోవడానికి దారి తీయడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో ఫ్యూచర్ రిటైల్ ఔట్లెట్స్ కాస్తా మూసివేతకు గురవుతున్నాయి. కాగా, రీబ్రాండింగ్‌తో ఎఫ్‌బీబీ స్టోర్లు ట్రెండ్స్ కేంద్రాలుగా మారనున్నాయి. బిగ్ బజార్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లేదా రిలయన్స్ మార్కెట్, ఈజీ డే ఔట్లెట్స్ రిలయన్స్ ఫ్రెష్‌గా పేరు మారనున్నాయి. ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయం సుమారు 30,000 మందికి ఊరట కలిగించనుంది. ‘నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. విక్రేతలు, సరఫరాదార్లు తమ బకాయిలు పొందుతున్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ను రిలయన్స్‌కు లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వీరికి అందలేదు. ఆ బకాయిలను సంస్థ తీర్చింది. అయితే నష్టాలు వస్తున్న ఔట్‌లెట్స్‌ను కంపెనీ తీసుకోవడంతో దివాలా ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే తమ బకాయిలు రాగలవని రుణదాతలు భావిస్తున్నారు’ అని రిలయన్స్ వెల్లడించింది. -
రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) .. స్థల యజమానులకు లీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో దాన్ని గట్టెక్కించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన స్టోర్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. సుమారు 200 స్టోర్స్ కార్యకలాపాలను రిలయన్స్ టేకోవర్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటిల్లో పని చేసే సిబ్బందికి అక్కడే ఉద్యోగ ఆఫర్లు కూడా ఇచ్చిందని వివరించాయి. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసే డీల్‌పై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య న్యాయ వివాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రూ. 24,713 కోట్లకు టేకోవర్ చేసేందుకు రిలయన్స్ రిటైల్ 2020 ఆగస్టులో అంగీకరించింది. ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్, కోర్యో, ఫుడ్‌హాల్, ఈజీడే మొదలైన విభాగాలు వీటిలో ఉన్నాయి. అయితే, ఫ్యూచర్ గ్రూప్ లోని ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలు ఉన్న అమెజాన్ వ్యతిరేకించడంతో ఈ డీల్ నిల్చిపోయింది. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్–అమెజాన్ మధ్య న్యాయపోరాటం సాగుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 28న రెండు పక్షాల వాదనలను విననుంది. స్టోర్స్‌కు రీబ్రాండింగ్.. ఈ క్రమంలో రుణదాతలకు దాదాపు రూ. 3,494 కోట్ల బకాయిలను చెల్లించడంలో ఎఫ్ఆర్ఎల్ విఫలమైంది. మరోవైపు, ఎఫ్ఆర్ఎల్కు స్థలాలను లీజుకు ఇచ్చిన వారు .. తమ బాకీలను రాబట్టుకునేందుకు రిలయన్స్ రిటైల్‌ను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొన్ని స్టోర్ల లీజులను రిలయన్స్ తన అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ పేరిట బదిలీ చేయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్ లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. అలాగే, స్టోర్స్‌కు పేర్లను కూడా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు వివరించాయి. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుత సరఫదారులకు బాకీలను చెల్లించకపోవడంతో .. స్టోర్స్‌లో సింహభాగం ఉత్పత్తులను రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. ఆయా స్టోర్స్ నుంచి బిగ్ బజార్ సైనేజీలు, బ్రాండింగ్‌ను తన సొంత బ్రాండ్‌తో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బజార్ స్టోర్స్‌తో పాటు ఫ్యూచర్‌కు 1,700 అవుట్‌లెట్స్ ఉన్నాయి. డీల్ గడువు పొడిగింపు.. అయితే, ఈ అంశాలను నిర్దిష్టంగా ధృవీకరించకుండా ఫ్యూచర్ రిటైల్.. స్టాక్ ఎక్సే్చంజీలకు వివరణనిచ్చింది. అమెజాన్‌తో వివాదం దరిమిలా తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌తో డీల్‌కు సంబంధించి 2022 ఏప్రిల్ ప్రథమార్ధంలో షేర్హోల్డర్లు, రుణదాతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదిత టేకోవర్ డీల్ గడువును సెప్టెంబర్ 30 వరకూ రిలయన్స్ పొడిగించిందని తెలిపింది. -
రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ‘సమర’ సిద్ధం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్ సిద్ధంగా ఉందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఎఫ్ఆర్ఎల్ నుంచి బిగ్ బజార్ తదితర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగానే ఉందని తెలిపింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు జనవరి 22న రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించింది. రుణదాతలకు జరపాల్సిన చెల్లింపుల కోసం జనవరి 29 డెడ్‌లైన్ లోగా రూ. 3,500 కోట్లు సమకూర్చగలరా లేదా అన్నది తెలియజేయాలంటూ ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు గతంలో రాసిన లేఖపై అమెజాన్ ఈ మేరకు స్పందించింది. 2020 జూన్ 30 నాటి టర్మ్ షీట్ ప్రకారం రూ. 7,000 కోట్లకు ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను (బిగ్ బజార్, ఈజీడే, హెరిటేజ్ మొదలైనవి) కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని సమర క్యాపిటల్ తమకు తెలిపిందని అమెజాన్ పేర్కొంది. ఇందుకోసం ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను మదింపు చేసేందుకు అవసరమైన వివరాలను సమరకు అందించాలని తెలిపింది. అయితే, సమర క్యాపిటల్ ఆ విషయాన్ని నేరుగా ఎఫ్ఆర్ఎల్కు తెలపకుండా అమెజాన్‌తో ఎందుకు చర్చిస్తోందన్న అం శంపై వివరణ ఇవ్వలేదు. సుమారు రూ. 24,713 కోట్లకు బిగ్ బజార్ తదితర వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ చేస్తున్న యత్నాలను ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పరోక్ష వాటాదారైన అమెజాన్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం సాగిస్తోంది. -
అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చిన సీసీఐ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2019లో ఆమోదించిన కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎఫ్‌సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎఫ్‌సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 2019లో అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. "మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాము, తదుపరి చర్యలకు సంబంధించి తగిన సమయంలో వెల్లడిస్తాము" అని చెప్పారు. "చట్టం సెక్షన్ 6(2) కింద అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని తెలియజేయడంలో విఫలమైనందుకు చట్టంలోని సెక్షన్ 43ఎ కింద కమిషన్ జరిమానా విధించడానికి అవకాశం ఉంది. జరిమానా అనేది మొత్తం టర్నోవర్ లేదా ఆస్తులలో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల కమిషన్ అమెజాన్‌పై రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తుంది" అని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్ 200 మిలియన్ డాలర్ల మేర(49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. (చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ) -
ఫ్యూచర్ రిటైల్‌లో ఆర్థిక అవకతవకలు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అమెజాన్ ఆరోపించింది. ఈ మేరకు స్వయంగా ఫ్యూచర్ రిటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఒక లేఖ రాసింది. ఇందుకు సంబంధించి ఆర్ఎఫ్ఎల్, ఇతర ఫ్యూచర్ గ్రూప్ సంస్థల చోటుచేసుకున్న లావాదేవీలపై ‘‘ ‘పూర్తి, స్వతంత్ర పరిశీలన‘ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, అసలు ఇలాంటి లేఖ రాసే ఎటువంటి అర్హతా అమెజాన్‌కు లేదని ఫ్యూచర్ రిటైల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఒక నోటీసును ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం ఈ తరహా ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. లేఖ సారాంశమిది... ఎఫ్ఆర్ఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు అమెజాన్ లేఖ విషయానికి వస్తే, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫ్యూచర్ 7–ఇండియా కన్వీనియన్స్ లిమిటెడ్‌సహా వివిధ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలతో ఎఫ్ఆర్ఎల్ తరచూ ‘‘కీలక లావాదేవీల అవగాహనను’’ చేసుకుంటోంది. సంబంధిత గ్రూప్ సంస్థల్లో కొన్ని తమ వ్యాపారాలకు ప్రధానంగా ఎఫ్ఆర్ఎల్పైనే ఆధారపడుతున్నాయి. ఆయా అంశాల్లో తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఎఫ్ఆర్ఎల్ ఆర్థిక నిర్వహణ విషయంపై ఆడిట్ కమిటీ సభ్యులు (ప్రస్తుత మరియు గత సభ్యులు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఎల్‌ఆర్, గ్రూప్ సంస్థల మధ్య అవగాహనకు సంబంధించిన అంశాలూ ఇందులో ఉన్నాయి. 2019 డిసెంబర్లో 2020 జనవరిలో తగిన ఈక్విటీ, రుణ నిధిని సమకూర్చుకున్నప్పటికీ, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రుణ భారం పెరగడానికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోడానికి స్వతంత్ర నిపుణుల సంస్థతో విచారణ చేయాలని ఆడిట్ కమిటీ కూడా సిఫారసు చేయడం గమనార్హం. ఈ వాస్తవాలను అమెజాన్ స్వతంత్ర డైరెక్టర్ల దృష్టికి ఎందుకు తీసుకువస్తున్నదంటే, వారు వారి చట్టబద్ధమైన, విశ్వసనీయ బాధ్యతలకు అనుగుణంగా పబ్లిక్ షేర్హోల్డర్లు, రుణదాతలు, బ్యాంకర్లు, మూడవ పార్టీ సప్లైయర్లు ప్రయోజనాల కోసం ఈ సమస్యలను వివరంగా విశ్లేషించవచ్చు. దర్యాప్తు చేయవచ్చు. ఫ్యూచర్ ప్రతినిధి ఖండన కాగా, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్ వాటాదారుకానీ, రుణ దారుకానీ కానప్పుడు ఈ లేఖ ఎలా రాస్తుందని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ప్రశ్నించారు. ఎఫ్‌సీపీఎల్ (ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్)లో అమెజాన్ పెట్టుబడికి ఇచ్చిన ఆమోదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ సంస్థ (ఎఫ్‌సీపీఎల్) కాంపిటేటివ్ కమిషన్ ఆప్ ఇండియాలో దరఖాస్తు చేసిందని, దీనికి విరుగుడుగా ముందుజాగ్రత్తగా తప్పుడు ఉద్దేశాలతో అమెజాన్ తాజాగా ఈ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. గత ఒప్పందాల ప్రకారం, ఫ్యూచర్ వ్యాపారాలను తనకే అమ్మాలని స్పష్టం చేసింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. -
అమెజాన్–ఫ్యూచర్స్ వివాదం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్–రిలయన్స్ రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ నుంచి తీసుకున్న అవార్డు (తీర్పు) భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఇది దేశీయంగా అమలు సాధ్యమేనా అన్న అంశాలపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసుకుంది. ‘‘ఈ కేసులో వాదోపవాదనలను విన్నాం. తీర్పును రిజర్వ్ చేస్తున్నాం’’ అని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ 17 (1), 17 (2) సెక్షన్ల కింద సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు చట్ట బద్దతపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు, దీని అమలుపై ఢిల్లీ హైకోర్టు సింగిల్, డివిజనల్ బెంచ్ విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఇప్పుడు ఫ్యూచర్స్ రిటైల్ వాటా రిలయన్స్‌కు విక్రయించడం సమ్మతం కాదని వాదిస్తోంది. -
ఫ్యూచర్, రిలయన్స్ డీల్: మరో కీలక పరిణామం
-
ఫ్యూచర్, రిలయన్స్ డీల్: మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌తో వివాదం విషయంలో అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో ఫ్యూచర్ రిటైల్ ఈ విషయాన్ని తెలిపింది. కేసు వివరాల్లోకి వెళితే... ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసింది. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను (ఫ్యూచర్ రిటైల్) స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్-ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తుది తీర్పుతో ఉత్కంఠ డీల్ విషయంలో ముందుకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై (అమెజాన్ వేసిన అప్పీల్) విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కేసులో తుది తీర్పును ఇచ్చింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్ గ్రూప్ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ తదుపరి విచారణ వరకూ స్టే ఇచ్చింది. తాజాగా ఈ స్టేపై అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్!
న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన రూలింగ్‌పై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్ లేదా అమెజాన్లు ఈ విషయంలో పంపిన ఈ–మెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు. కేసు వివరాల్లోకి వెళితే, ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు సెబీ, సీసీఐ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో జనవరి 26న ఫ్యూచర్ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్నీ ఆశ్రయించింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
ఫ్యూచర్ రిటైల్‌కు ఊరట!
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ఒప్పందానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి నేతృత్వంలోని బెంచ్ అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు అనుకూలంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులకు అదే కోర్టు డివిజినల్ బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక రూలింగ్ ఇస్తూ, ఈ కేసులో పలు అంశాలకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) అప్పీల్ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఆయా అంశాలపై ఫిబ్రవరి 26వ తేదీలోపు తన వైఖరి ఏమిటో తెలియజేయాలని అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. అటు తర్వాత ఈ అంశంపై రోజూవారీ తన విచారణను చేపడతామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఉత్తర్వుల అమలుకు వారం గడువును ఇవ్వాలని, తద్వారా తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలను అన్వేషిస్తామని అమెజాన్ విజ్ఞప్తిని సైతం బెంచ్ త్రోసిపుచ్చింది. కేసు వివరాలు ఇవీ... ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కు కూడా ఎఫ్‌ఆర్‌ఎల్‌లో సాంకేతికంగా వాటాలు సంక్రమించినట్లయింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే.. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు సెబీ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోర్టుల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిశోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ఐఎల్ కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియను వెంటనే నిలుపుచేయాలని కోరింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు సంబంధించి తనకు అనుకూలంగా ఎస్ఐఏసీ ఇచ్చిన మధ్యం తర ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్తో డీల్‌పై యథాథత స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. దీనిపై ఫ్యూచర్ అప్పీల్‌ను విచారించిన డివిజనల్ బెంచ్ తాజాగా ఫ్యూచర్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. -
అమెజాన్‌పై ఆరోపణలు.. రంగంలోకి ఈడీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. కొన్ని మల్టీ–బ్రాండ్స్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలపై అవసరమైన చర్యలు కోరుతూ ఈడీకి ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. విదేశీ మారక నిర్వహణ చట్టంలోని (ఫెమా) వివిధ సెక్షన్ల కింద దర్యాప్తు జరుగుతోంది. ఫ్యూచర్ రిటైల్‌ను నియంత్రించడానికి అమెరికాకు చెందిన అమెజాన్.. ఫ్యూచర్ రిటైల్ యొక్క అన్‌లిస్టెడ్ యూనిట్‌తో చేసుకున్న ఒప్పందాల ద్వారా చేసిన ప్రయత్నం ఫెమా మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఉల్లంఘించాయంటూ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌కు (డీపీఐఐటీ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు చేశాయి. -
ఫ్యూచర్ రిటైల్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్‌కు ఓకే.. కానీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే డీల్‌కు సంబంధించి స్టాక్ ఎక్సే్చంజీలు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పేర్కొన్నాయి. అమెజాన్‌డాట్‌కామ్ ఫిర్యాదులు, ఫ్యూచర్ రిటైల్ స్పందన మొదలైన వివరాలన్నీ కూడా స్కీమ్‌లో భాగమైన షేర్‌హోల్డర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. అలాగే, స్కీమ్ ముసాయిదా సమర్పించే ముందు ఎన్సీఎల్టీకి కూడా తెలియజేయాలని పేర్కొన్నాయి. ఎన్సీఎల్టీకి దాఖలు చేసే పిటిషన్లో స్టాక్ ఎక్సే్చంజీలు, సెబీ సూచనలను కూడా పొందుపర్చాలని తెలిపాయి. మరోవైపు ప్రతిపాది త డీల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌కు లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉండటంతో.. ఈ డీల్ ద్వారా అమెజాన్ కూడా వాటాదారుగా మారింది. ఇక కరోనా సంక్షోభ పరిస్థితుల కారణంగా రిటైల్ విభాగాన్ని రిలయన్స్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది. అమెజాన్ తీరును వ్యతిరేకిస్తూ ఫ్యూచర్ గ్రూప్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదం ప్రస్తు తం ఆర్బిట్రేషన్, న్యాయస్థానాల్లో నలుగుతోంది. -
అమెజాన్ ఏమాత్రం సహాయం చేయలేదు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాల విక్రయ వివాదానికి సంబంధించి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా వాటాదారైన అమెజాన్‌పై ఫ్యూచర్ మరిన్ని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ అమలైన సమయంలో తాము తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ .. అమెజాన్ పైపై మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం సహాయం అందించలేదని ఆరోపించింది. మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో అమెజాన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసమైనదిగా లేదని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లు.. డిసెంబర్ 31న ఈ మేరకు అమెజాన్‌కు లేఖ రాశారు. వాటాల విక్రయం కోసం రిలయన్స్‌తో తాము చర్చలు జరుపుతున్నామని తెలిసినప్పటికీ అమెజాన్ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తీసుకురాకుండా.. ఆ తర్వాత మోకాలడ్డే ప్రయత్నం చేయడం సరికాదని ఫ్యూచర్ గ్రూప్ ఆక్షేపించింది. తోసిపుచ్చిన అమెజాన్: మరోవైపు, ఫ్యూచర్ ఆరోపణలను అమెజాన్ తోసిపుచ్చింది. ఫ్యూచర్ రిటైల్‌కు తాము సహాయం చేసేందుకు ప్రయత్నించలేదన్న ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఎఫ్‌సీపీఎల్‌కు లిస్టెడ్ సంస్థ ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్ఆర్ఎల్) వాటాలు ఉన్నాయి. గతేడాది ఎఫ్‌సీపీఎల్‌లో వాటాలు కొనుగోలు చేయడం వల్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు దఖలు పడ్డాయి. -
రిలయన్స్ డీల్: అమెజాన్‌కు సమన్లు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ రీటైల్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్‌కు సంబంధించి అమెజాన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ మధ్యంతర ఉత్తర్వులతో ఈ ఒప్పందంలో అమెజాన్ జోక్యంపై ఫ్యూచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది. దీనిపై స్పందించాల్సిందిగా అమెజాన్‌ను కోరింది. (అమెజాన్‌కు భారీ ఊరట : రిలయన్స్ డీల్‌కు బ్రేక్) ఒక రోజంతా ఎఫ్ఆర్ఎల్, ఎఫ్‌సిపిఎల్, రిలయన్స్, అమెజాన్ తరఫున రోజువారీ వాదనలు విన్న జస్టిస్ ముక్త గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎల్ దావాపై అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సిపిఎల్), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్) లకు సమన్లు జారీ చేసింది స్టేట్మెంట్లను దాఖలు చేయాలని కోరింది. అమెజాన్ లేవనెత్తిన దావా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా బహిరంగంగా ఉంచుతామని కోర్టు తెలిపింది. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. (రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్) కాగా రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ రీటైల్ డీల్‌ను వ్యతిరేకించిన అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు అక్టోబర్ 25 న అమెజాన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ డీల్‌ను సవాల్ చేస్తూ సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ (ఎస్ఐఏసీ)ని ఆశ్రయించిన అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఎస్ఐఏసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యూచర్, అమెజాన్ గ్రూప్‌ల నుంచి చెరొక సభ్యుడు, తటస్థంగా ఉండే మరో సభ్యుడితో త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఏర్పాటు కావొచ్చని, వివాదంపై 90 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాలు స్వాగతిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీ రిటైల్ మార్కెట్లో ఆధిపత్యం సాధించేందుకు రిలయన్స్‌తో అమెజాన్ పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ఈ వివాదం మరింత ఆజ్యం పోయనుంది. అమెజాన్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఫ్యూచర్ రిటైల్ వంటి భారతీయ భాగస్వామి అవసరం చాలా ఉంది. మరోవైపు, దూకుడుగా దూసుకెడుతున్న రిలయన్స్ రిటైల్‌కి ఫ్యూచర్ రిటైల్ లభిస్తే .. తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది. సత్వరం డీల్ కుదుర్చుకుంటాం: రిలయన్స్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) స్పందించింది. ఒప్పందం ప్రకారం తమకు దఖలు పడ్డ హక్కులను వినియోగించుకుంటామని, మరింత జాప్యం జరగకుండా డీల్ కుదుర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇక, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు ఫ్యూచర్ రిటైల్ సంకేతాలు ఇచ్చింది. వివాదం ఇదీ..: ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ సంస్థకు 7.3% వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49% వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కూ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాలు దక్కాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఇటీవలే కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను ఆర్ఆర్వీఎల్కి విక్రయిస్తున్నట్లు ఆగస్టు 20న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్వీఎల్ వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డీల్‌ను అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ కొనుగోలుకు సంబంధించి తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం పతనం... రిలయన్స్ రిటైల్ – ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి తాత్కాలిక బ్రేక్ పడటంతో ఇంట్రాడేలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10 శాతం నష్టపోయి రూ.78.15 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం క్షీణించి రూ.73.85 వద్ద స్థిరపడింది. ఇక ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ షేర్లు 5 శాతం మేర పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. -
హెరిటేజ్ ‘ఫ్యూచర్’ వాటాల విక్రయం!
సాక్షి, హైదరాబాద్ : డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్.. ఫ్యూచర్ రిటైల్‌లో కంపెనీకి ఉన్న 1,78,47,420 షేర్లతోపాటు ప్రాక్సిస్ హోమర్ రిటైల్‌కు చెందిన 8,92,371 షేర్లను విక్రయించనుంది. ఒకేసారి/పలు దఫాలుగా బహిరంగ మార్కెట్, మర్చంట్ బ్యాంకర్‌ను నియమించడం ద్వారా, ఒకరు లేదా ఎక్కువ మంది కొనుగోలుదార్లకు ఈ వాటాలను అమ్మాలని శుక్రవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీ వైస్ చైర్పర్సన్, ఎండీ ఎన్.భువనేశ్వరికి బోర్డు అధికారాన్ని కట్టబెట్టింది. ఇదిలావుంటే శుక్రవారం హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.95 శాతం తగ్గి రూ.338.25 వద్ద స్థిరపడింది. (హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా?..) ఇదీ నేపథ్యం.. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన రిటైల్, అనుబంధ వ్యాపారాలను 2016 నవంబర్‌లో ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌లో భాగంగా ఫ్యూచర్ రిటైల్‌లో 3.65 శాతం వాటాకు సమానమైన రూ.295 కోట్ల విలువైన 1.78 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఈ వాటాలనే ఇప్పుడు హెరిటేజ్ విక్రయిస్తోంది. కాగా, వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్.. కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయను న్నట్టు ఆగస్టు 29న ప్రకటించిన సంగతి విదితమే. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు.