gambling
-
పిల్లల కంటెంట్‌లో అసభ్య యాడ్స్..
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్నెస్కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు. పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు. వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే..
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ సంస్థలకు చెందిన ప్లాట్ఫామ్ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు. ఇలా విదేశీ కంపెనీలు భారత్‌లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. -
కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
కాయ్ రాజా కాయ్.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లు, మనీసర్క్యులేషన్ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమిత్‌పటేల్ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్విల్లే జాగ్వార్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్లైన్లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్‌ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్పట్ల్కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పేకాట కూడా మానసిక జబ్బేనా!
విజయ్ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్. 35 సంవత్సరాల వయసు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా విపరీతంగా పేక ఆడుతున్నాడు. దానివల్ల ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబంలో గొడవలూ వస్తున్నాయి. భార్య ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. విడాకుల వరకూ వచ్చింది. చివరకు భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. విజయ్ బాల్యం నుంచీ అతని తల్లిదండ్రులు వీకెండ్లో సరదాగా పేక ఆడతారని అతనితో మాట్లాడినప్పుడు తెలిసింది. విజయ్, అతని సోదరుడు పెద్దయ్యాక నలుగురూ కలసి ఆడేవారు. అలా పేకాట అలవాటుగా మారింది. అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ క్రికెట్ బెట్టింగ్ కూడా చేసేవారు. సేల్స్ రిప్రజేంటేటివ్గా మారాక ప్రతి నెలా టార్గెట్‌ను అందుకోవడం, కొలీగ్స్‌తో పోటీపడాల్సి రావడంతో విజయ్ జీవితంలోకి ఒత్తిడి చేరింది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి మరింత పెరిగింది. వీటన్నిటినీ తట్టుకోవడానికి అతను పేకాటను ఒక మార్గంగా మార్చుకున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు అందులో కూరుకుపోసాగాడు. చివరకు పేక ఆడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ లేదా కంపల్సివ్ గాంబ్లింగ్ అంటారు. ఇదో మానసిక రుగ్మత. అదొక సంక్లిష్ట పరిస్థితి గాంబ్లింగ్ డిజార్డర్ అనేది జీవ, మానసిక, పర్యావరణ కారకాల కలయికతో ప్రభావితమైన సంక్లిష్ట పరిస్థితి. డోపమైన్, సెరటోనిన్, నోర్ ఎపినెఫ్రిన్ వంటి కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లలో అసాధారణతలు దీనికి కారణం కావచ్చు. జన్యువులు కూడా కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి జూదం ఆడే వాతావరణంలో పెరగడం దానిపట్ల సానుకూల ధోరణికి దోహదపడవచ్చు. విజయ్ విషయంలో అదే జరిగింది విజయ్ జీవితంలోలా అధిక స్థాయి ఒత్తిడి, ప్రధాన జీవన మార్పులు లేదా బాధాకరమైన సంఘటనలు జూదం రుగ్మతలను ప్రేరేపించవచ్చు డిప్రెషన్, యాంగ్జయిటీ లేదా అఈఏఈ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులున్న వ్యక్తులు వారి లక్షణాలను ఎదుర్కోవడానికి జూదానికి అలవాటు పడవచ్చు రిస్క్ తీసుకునే ధోరణి, ఇంపల్సివిటీ, సెన్సేషన్ సీకింగ్ లాంటి వ్యక్తిత్వ లక్షణాలు జూదానికి అలవాటు చేయవచ్చు క్లబ్బులు, కాసినోలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం కూడా కారణమవుతుంది ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా జూదం ఒక దుర్వినియోగమైన కోపింగ్ మెకానిజంగా మారుతుంది అప్పుడప్పుడూ గెలుపొందడం వల్ల వచ్చే ఆనందం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దానికోసం మళ్లీ మళ్లీ ఆడతారు. ఆడకుండా ఉండలేరు గాంబ్లింగ్ డిజార్డర్ ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గురించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు... తమకు కావల్సిన స్థాయి ఎగ్జయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు కాస్తుంటారు. జూదం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదం తగ్గించినప్పుడు లేదా ఆపేసినప్పుడు చిరాకు, అసౌకర్యం, ఉద్రిక్తత.. జూదం వల్ల గతంలో వచ్చిన నష్టాలను మళ్లీ జూదంతోనే భర్తీ చేయాలనే ప్రయత్నం.. జూదం ఆడుతున్నామనే విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యడం.. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేకపోవడం.. జూదం వల్ల వచ్చే నష్టాల నుంచి బయటపడేందుకు అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం.. జూదం రుణాలను చెల్లించడానికి మోసం, దొంగతనం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం.. ఆర్థిక, మానసిక, వైవాహిక సమస్యలు వచ్చినా జూదం కొనసాగించడం.. సీబీటీతో తప్పించుకోవచ్చు.. జూదం వ్యసనం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ నేర్చుకోవడం అవసరం. వాస్తవిక బడ్జెట్ వేసుకోవడానికి, జూదం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికి ఆర్థిక సలహాదారుతో కలసి ప్రణాళిక రూపొందించుకోవాలి. గాంబ్లర్స్ అనానిమస్, సపోర్ట్ గ్రూపుల్లో చేరడం ద్వారా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు · ఒత్తిడిని తప్పించుకోవడానికి జూదం వైపు వెళ్లకుండా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం, హాబీస్ లాంటి ప్రత్యామ్నాయ కోపింగ్ మెకానిజమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి ·గుర్తించడం, అభ్యాసం చేయడం, జూదాన్ని ఆశ్రయించకుండా ఒత్తిడిని జయించడానికి సహాయపడుతుంది జూదానికి సంబంధించిన అహేతుక ఆలోచనలు, నమ్మకాలను గుర్తించడానికి, సవాలు చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది కోపింగ్ స్ట్రాటజీస్‌ను అభివృద్ధి చేయడంలో, కోరికలను నియంత్రించుకోవడానికి సీబీటీ సహాయపడుతుంది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునర్నిర్మించడం, కుటుంబ మద్దతును పొందడానికి ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది · జూదం వల్ల వచ్చే మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు సహాయపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com (చదవండి: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?) -
బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం ! తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి. కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు . తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు" గణగణ మోగుతుంటాయి . " ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డప్‌లు ఇస్తూ బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం. ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ? నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు . ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు. ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది. ముందుగా ఒక పెగ్గు మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది . "నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది. బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు. బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది. బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది . 25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్. చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని.. తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి. వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?
Mahadev Gambling App Sourabh Chandrakar: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈడీ దాడుల్లో రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్‌పూర్, భోపాల్, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన 39 ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ 15 మందిని అరెస్టు చేయడంతో మహాదేవ్ బుక్ యాప్ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నసౌరభ్ చంద్రకర్ ఈ స్కాంలో కీలకం. మహాదేవ్ ఆన్లైన్ బుకింగ్ పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఇతర ఆటల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్‌లో సహ ప్రమోటర్‌గా ఉన్న రవి ఉప్పల్ కలిసి బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను FPI మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో దుబాయ్‌లో ఈ ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు రూ. 5,000 కోట్ల వరకు కూడబెట్టారు. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) రూ. 200 కోట్ల స్టార్-స్టడెడ్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరభ్ దుబాయ్‌లోని అతిపెద్ద నగరంలో, అత్యంత విలాసవంతంగా వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్‌పూర్ నుండి తన బంధువులను, సినీ తారలను ప్రైవేట్ జెట్ల ద్వారా తరలించాడు. అంతేకాదువెడ్డింగ్ ప్లానర్‌కు రూ.120 కోట్లు చెల్లించాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ ప్రదర్శనలు ఇచ్చారంటే పెళ్లి ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును డెలివరీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో యోగేష్ భాపట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ కోసం రూ.42 కోట్లు అందాయి. భోపాల్‌కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్ చంద్రకర్ బంధువులు, బాలీవుడ్ ప్రముఖులను దుబాయ్‌కు పంపడానికి టిక్కెట్లు ఏర్పాటు చేసిందని, అయితే కోల్‌కతాకు చెందిన వికాస్ చప్పరియా ద్వారా అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ ఆరోపించింది. (ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!) @GoI_MeitY @NewsG2G @Cybercellindia Today Lotus365 Again With New Advertisement on Big Front Page Government Banned Betting websitehttps://t.co/luYqv9u3oh Banned Aftet They Update Domain To . in Then Smartly Changed The Domain To https://t.co/QXi0XQGCGL After Banned pic.twitter.com/k7cTplhNrG — Sunny Sunny (@SunnySu19623409) April 7, 2023 ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అతిఫ్ అస్లాం, విశాల్ దద్లానీ, రహత్ ఫతే అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, సన్నీ లియోన్, క్రిసీ ఖర్బండా, ఎల్లి అవ్రామ్, నుష్రత్ భరుచ్చా, భారతీ సింగ్, క్రుషా అభిషేక్,భాగ్యశ్రీ వంటి తారలు హాజరయ్యారని ఈడీ గుర్తించింది. వీరందరినుంచి సమన్లు జారీ చేసి, వారి స్టేట్మెంట్లు తీసుకోవాలని ఈడీ చూస్తోంది.సెప్టెంబర్ 18, 2022న జరిగిన మూడవ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో సంజయ్ దత్, కపిల్ శర్మ, అఫ్తాబ్ శివదాసాని, సుఖ్విందర్ సింగ్, సోఫీ చౌదరి, డైసీ షా, ఊర్వసాహి రౌతేలా, నర్గీస్ ఫక్రీ, నేహా శర్మ తదితరులు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో ఈ నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ ఆరోపణల ప్రకారం వీరు మహాదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ గొడుగు కింద సిండికేట్ అయ్యారు. ముఖ్యంగా ఇన్‌యాక్టివ్ లేదా సెమీ-యాక్టివ్ ఖాతాలను గుర్తించి వారికి స్వల్పమొత్తంలో ఎరవేసి, ఆ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీలు చేశారని దీంతోనే వీటిని ట్రాక్ చేయడం కష్ట మైందని దర్యాప్తు ఏజెన్సీ చెప్పింది. జ్యూస్ అమ్ముకునే చంద్రకర్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్ మొదట్లో జ్యూస్ అమ్మేవాడు. మరోవైపు రవి ఉప్పల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానిక బుకీలుగా ప్రారంభమై, చాలా తక్కువ సమయంలోనే చంద్రకర్, రవి ఇద్దరూ దుబాయ్‌కి వెళ్లి 2018లో ఈ యాప్‌ను ప్రారంభించారు. త్వరితగతిన డబ్బులిస్తామంటూ విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరులను ప్రలోభపెట్టారు. ఇది సక్సెస్ కావడంతో అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రిటీల ద్వారా మహదేవ్ బుక్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించింది.అలా కోట్లకు పడగలెత్తిన చంద్రకర్, FairPlay, Reddy Anna, Lotus365 వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. దీంతోపాటు, 'బేట్భాయ్' అంబానీ బుక్' పేరుతో కొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించాడు. ఈ ఇద్దరు కింగ్పిన్లపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్సిఎన్) జారీ చేసే యోచనలో ఉందిఈడీ. దీని నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నిందితులకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. -
గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు..
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్లైన్లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్‌పూర్‌కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్‌లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది. ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ. ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం.. -
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సంచలన విషయాలు
-
చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్ పోలీసులు వేగవంతం చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు. చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్‌ను చేధించారు థాయ్ పోలీసులు. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ డీసీసీబీ చైర్మన్.. బీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు ఇసుక వ్యాపారి సాగర్, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం వీఆర్ఏ వాసు సైతం అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్‌లాండ్ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు. అయితే.. అనుమతి లేకుండా థాయ్‌లాండ్ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్సాగర్ అనే ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. క్యాసినోకు ఫైనాన్స్ చేసిన వినోద్‌రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్ మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్ ఓనర్‌ను కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. ఆమె సహకారం.. భారీగా వసూళ్లు అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్ పట్టాయా హోటల్‌ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్ కెల్వెల్కర్ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్ అనే థాయ్ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఇల్లీగల్ మైగ్రేంట్ వర్కర్స్‌ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. పట్టాయాలో గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్ పోలీసులు.. అక్కడి సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు హోటల్లో కన్వెన్షన్ హాల్‌ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్‌జాక్ టేబుల్స్ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్ రికార్డింగ్ కనెక్ట్ చేశాడని థాయ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్‌తోపాటు నేపాల్లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు -
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. పటాయలో 90 మంది భారతీయులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నటు తెలుస్తోంది. పటాయలో ఓ హోటల్లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న థాయ్ పోలీసులు.. దాడులు నిర్వహించారు. థాయ్‌లాండ్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ అయిన వాళ్లలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్, భారతీయ నగదును థాయ్‌లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్ట్ అయిన వాళ్లలో మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. గేమ్స్ ఆడేందుకు పెద్ద ఎత్తున్న భారతీయులను చికోటి థాయ్‌లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్లో థాయ్‌లాండ్ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇదీ చదవండి: ఆఫ్టర్ 55 ఇయర్స్ వాళ్లంతా.. -
గాంబ్లింగ్ తప్ప మరోటి కాదు, క్రిప్టోపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు. క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. -
హైవేపై కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడిన జనం!
సాంటియాగో: రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే ఎవరైనా వద్దనుకుంటారా? మరో ఆలోచన లేకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటిది కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే.. ఎవరైనా ఊరుకుంటారా? ఎంత పని ఉన్నా.. వాటిని పట్టుకునేందుకే ఎగబడతారు. చిలీ దేశంలో కూడా అలాగే జరిగింది. హైవేపై నోట్ల వర్షం కురవటంతో జనం ఎగబడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పట్టించుకోలేదు. అయితే, ఈ కరెన్సీ నోట్లు వర్షం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్యాంబ్లింగ్ హాల్లో రాబరి చేసి వెళ్తుండగా నోట్ల కట్టలు ఇలా రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. పుడహుయెల్లోని క్యాసినోపై శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ హాల్లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు కారులో పరారవుతుండగా.. వారిని పోలీసులు వెంబడించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లినట్లు మీడియా పేర్కొంది. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్ హాల్లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh — ANews (@anews) October 21, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
ఆన్లైన్లో జూదమా?.. జర జాగ్రత్త..!
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా ఇటీవల 3,800 మందికి పైగా డబ్బు పోగొట్టుకున్నారని, రికార్డు కాని కేసులు మరిన్ని ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కిల్స్ ఆధారంగా నడిచే గేమ్స్ ద్వారా ఈ గ్యాబ్లింగ్ జరుగుతుంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక జనాదరణ పొందిన వాటిలో ఆన్లైన్ జూదం ఒకటి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో 1.10 బిలియన్ల మంది అంటే జనాభాలో 79 శాతం మందికి మొబైల్ సదుపాయం ఉంటే వారిలో 42 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. వీరిలో 92.8 శాతం మంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అవి, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, టాబ్లెట్లు, హ్యాండ్‌హెల్డ్ డివైస్, మీడియా స్ట్రీమింగ్ పరికరాలతో పాటు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల ద్వారా జరుగుతుంటుంది. చట్టబద్ధమేనా!? పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్–1867 ఆధారంగా, భారతదేశంలో అన్నిరకాల జూదం చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ)పై పందెం వేయడం చట్టవిరుద్ధం. చట్టబద్ధతను అర్థం చేసుకోవాలంటే.. బెట్టింగ్ జరిగే రెండు రకాల గేమ్‌ల గురించి మనం మరింత అర్థం చేసుకోవాలి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇవి అదృష్ట ఆధారిత గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ గేమ్‌ల కోసం పందెం వేయడానికి ముందస్తు జ్ఞానం లేదా అవగాహన అవసరం లేదు. నైపుణ్యం గల గేమ్స్ ఇవి ఎంపిక కంటే విశ్లేషణాత్మక నిర్ణయం తీసుకోవడం, తార్కిక ఆలోచన, సామర్థ్యం అవసరమయ్యే గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం. మిగతా ప్రాంతాల్లో ఇవి చట్టవిరుద్ధం అయినప్పటికీ మోసగాళ్లు ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు.. (ఎ) కరేబియన్ – కురాకై గేమింగ్ (బి) మెడిటరేనియన్ నుండి మాల్టా గేమింగ్ అథారిటీ (సి) యుకె గ్యాంబ్లింగ్ కమిషన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుండి లైసెన్స్‌లను పొందినవి. ఇవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. వీటి సమాచారం మనకు కనపడనంత చిన్నగా రాసి ఉంటుంది. సాధారణంగా ఫుటర్‌లో వీటిని లిస్ట్ చేసిన దేశాలలో మాత్రమే ప్లే చేయవచ్చని పేర్కొని ఉంటుంది. కానీ, అన్ని దేశాల్లోకి ఈ గేమ్స్ ద్వారా మోసగాళ్లు చొరబడటానికి ఆన్లైన్లో పొంచి ఉంటున్నారు. మన దేశంలో .. ప్రస్తుత ట్రెండ్లకు సరిపోయే విధంగా చట్టపరంగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ (గ్యాంబ్లింగ్ యాక్ట్)తో రావడానికి పౌరసంఘాలు, సాంకేతిక సంస్థలు, సైబర్ పోలీసులు, సైబర్ లాయర్ల నుండి మరిన్ని చర్చలు అవసరం. యాపిల్, గూగుల్‌లో గ్యాంబ్లింగ్ యాప్‌లు అనుమతించని జాబితాలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మినహాయించబడ్డాయి. ఈ యాప్‌లు వెబ్సైట్ల నుండి (APK,DMZఫైల్ల ద్వారా) మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి కాదని గుర్తించాలి. గ్యాంబ్లింగ్ యాప్స్ నిర్వహణ దశ 01: ముందుగా, మీరు ఒక సూచన ద్వారా ఈ యాప్‌లో చేరుతారు. దశ 02: మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. యాప్ నిర్వాహకులు బ్రిటీష్ పేర్లతో ఉన్న మహిళలు, విదేశీ వ్యక్తుల ఫోటోలతో ఉంటాయి. ్ఖఓ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాటిని ఆపరేట్ చేస్తారు. దశ 03: పందెంలో పాల్గొనబోతున్నందుకు మీరు మీ రోజువారీ లాభంలో 40 శాతం కమీషన్‌గా చెల్లించాలని కోరుతారు. దశ 04: కమీషన్‌ను బదిలీ చేయకుండా ఉండటానికి సబార్డినేట్ అనే కొత్తవ్యక్తిని పరిచయం చేస్తారు. దశ 05: మీరు యాప్‌లో చేరిన తేదీ నుండి 5 రోజుల తర్వాత ప్రతి రిఫరల్ వ్యక్తి రూ.3000 సంపాదించినట్టు చూపుతారు. దశ 06: ఒకే రోజున 3 రెఫరల్స్ ఉన్నట్లయితే, వారు చేరిన 5 రోజుల తర్వాత ఒకరికి రూ.3000 తోపాటు అదనంగా మరో రూ.5000 ఇస్తారు. ఇది ఒక ఎక్కువ మొత్తం కోసం వేసే ఎర అని గుర్తుపెట్టుకోవాలి. దశ 07: 7–10 రోజుల తర్వాత ఫస్ట్æ విత్‌డ్రావల్ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.10,000 పందెం పూర్తయిన తర్వాతే తీసుకోవాలి.. దశ 08: ఒకసారి విత్‌డ్రాకు అర్హత పొందితే, 68 గంటల్లో నగదు మొత్తం మన బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. దశ 09: 20–30 రోజులకు ఒకసారి ఎక్కువ మొత్తం జమ అయ్యే రోజు ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ 10,000 ఖాతాలో అన్ని సమయాల్లో ఉండేలా మనం మరింత డబ్బు చేర్చాలి. దశ 10: సాధారణంగా రోజుకు రూ. 800. ఎక్కువ వాటాలు ఉన్న రోజున, అది రూ.1500 నుండి రూ.2000 దాటుతుంది. దశ 11: మోసగాళ్లు ఎక్కువ లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు. ఆపై వారు ఒక రోజులో సూపర్ హై షేర్ని సృష్టిస్తారు. దీంతో ప్రజలు తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నష్టాలను నివారించడానికి Sరు.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దశ 12: ప్రజలు బ్యాలెన్స్‌లను కొనసాగించగలిగినప్పటికీ, వారు కొత్తగా పెట్టుబడి పెట్టిన మొత్తం పందెంలో పాల్గొననందున వారు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దశ 13: చాలా మంది వ్యక్తులు డబ్బును పోగొట్టుకోవడం చూసినప్పుడు, నమ్మకాన్ని పొందడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే నష్టపరిహార ప్రణాళికను అందిస్తారు. దశ 14: అందరూ నిద్రపోతున్న చోట అర్ధరాత్రి పందెం వేస్తే, అందరూ మేల్కొనే సమయానికి మన ఖాతాలో ఏమీ మిగిలి ఉండదు. చివరి వ్యక్తి మొత్తం డబ్బును పోగొట్టుకునే వరకు పందెం కొనసాగుతుంది. దశ 15: చెల్లింపు/రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ను క్లోజ్ చేస్తారు. విత్‌డ్రాæవిధానం రద్దయ్యి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌ను క్లోజ్ చేస్తారు. చదవండి:Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే.. -
బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌పై కేంద్రం కన్నెర్ర
Online Betting Ads: మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో బెట్టింగ్ తరహా యాడ్స్ ను ప్రసారం చేయడం నిలిపివేయాలని యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టీ వార్నింగ్ ఇచ్చింది. మనదేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. 2025 నాటికి మార్కెట్ ఎంతంటే! ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్,ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో 4.5 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలకు భారీ నష్టం చేకూరనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జీవితమే ఒక జూదం
ప్రపంచంలో అతికొద్దిమంది అదృష్టవంతులకు తప్ప జీవితం నల్లేరుపై బండినడక కాదు. అలాగని అదృష్టం అందరికీ దక్కేది కాదు. అందుకే అదృష్టం కోసం మనుషులు అర్రులు చాస్తారు. స్వయంకృషి ఉంటే, అదృష్టం దానంతట అదే తరుముకుంటూ మరీ వస్తుందని ఎందరు మహానుభావులు ఎన్ని సూక్తులు వల్లించినా జనాభాలో అత్యధికులు అదృష్టాన్నే నమ్ముకుంటారు. . అదృష్టాన్ని నమ్ముకోవడం సామాన్య మానవుల సహజసిద్ధమైన బలహీనత. ఈ బలహీనతను కనిపెట్టిన ప్రాజ్ఞులు అదృష్టయంత్రాలు, తాయెత్తులు తదితర వస్తుజాలాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం కద్దు. వాళ్లను మించిన నిపుణులు ద్యూతశాలలను నిర్వహిస్తుంటారు. అదృష్టంపై మనుషులకు నమ్మకం అనాది నుంచే ఉంది. నాణేలు వాడుకలోకి రాకముందు నుంచే బొమ్మా బొరుసు ఆట ఉండేది. నాణేలు లేనికాలంలో జనాలు తమ అదృష్టాన్ని తేల్చుకునేందుకు ఆల్చిప్పలతో బొమ్మా బొరుసు ఆడేవారు. చేతి ఎముకలతో తయారు చేసిన పాచికలతో రకరకాల ద్యూతక్రీడలు ఆడేవారు. జూదం ఎరుగని నాగరికతలేవీ ప్రపంచంలో లేవు. జూదంలో అన్నీ పోగొట్టుకుని అడవులపాలైన ధర్మరాజు ఉదంతం మహాభారతం ద్వారా మనందరికీ తెలుసు. అంతకుముందు నల మహారాజు కూడా జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. ‘కన్యాశుల్కం’లో గురజాడ ‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అని కరటక శాస్త్రి ద్వారా అనిపించడంలో వ్యంగ్యం ధ్వనిస్తుంది గానీ, వేదాల్లో జూదం ప్రస్తావన ఉందనేది అక్షరసత్యం. ఋగ్వేదంలోని ‘ద్యూతసూక్తం’ ఇందుకు నిదర్శనం. అంతమాత్రాన జూదాన్ని నెత్తికెత్తుకోలేదు మనవాళ్లు. సప్తవ్యసనాల జాబితాలో చేర్చారు. ‘ద్యూతంహీనామ పురుషస్య అసింహాసనం రాజ్యం’ అంటూ జూదరిని సింహాసనం లేని రాజ్యంతో అభివర్ణించాడు ‘మృచ్ఛకటికం’ నాటకంలో శూద్రకుడు. జూదంలో మాయోపాయాలు మామూలే! ‘నీకునౌ నీకునౌ నంచు నెమకి నెమకి/ ముగుదలగు వారి భ్రమియించి మోసపుచ్చు/ పశ్యతోహరు డత్యంత పాపబుద్ధి/ పట్టణములో దగుల్పరి పందెగాడు’– ‘క్రీడాభిరామం’లోని ఈ వర్ణనను చూస్తే, జూదంలో పందెగాళ్ల మోసకారితనం ఈనాటిది కాదని అర్థమవుతుంది. ద్యూతక్రీడలో పాచికలు చాలా పురాతనకాలం నుంచి వాడుకలో ఉంటే, పేకముక్కలు ఆ తర్వాత వచ్చి చేరాయి. పేకాటకు మూలాలు చైనాలో ఉన్నాయి. టాంగ్ రాజుల హయాంలో కులీనులు కాలక్షేపం కోసం పేకాట ఆడేవారని తొమ్మిదో శతాబ్దినాటి చైనా సాహిత్యం ద్వారా తెలుస్తోంది. పద్నాలుగో శతాబ్ది నాటికి పేకాట యూరోప్‌కు పాకింది. పద్నాలుగో శతాబ్ది చివరినాటికి యూరోపియన్ రాచరిక చిహ్నాలను ప్రతిబింబించే పేకముక్కలను రూపొందించుకున్నారు. అప్పట్లో పేకదస్తాలో యాభయ్యారు ముక్కలు ఉండేవి. పదిహేనో శతాబ్ది చివరినాళ్లలో యాభైరెండు ముక్కల ‘ఫ్రెంచ్ సూటెడ్’ పేకముక్కలు రూపొందాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ‘ప్రామాణిక’ పేకముక్కలు ఇవే! బ్రిటిష్‌కాలంలో పేకాట మనదేశం నలుచెరగులా వ్యాప్తిలోకి వచ్చింది. పేకాట ప్రస్తావన ఆనాటి సాహిత్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. ‘చతుర్ముఖ పారాయణం’, ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ వంటి జాతీయాలు పేకాట వ్యాప్తి తర్వాత వాడుకలోకి వచ్చినవే! తొలినాళ్లలో పెద్దమనుషుల కాలక్షేపంగా మొదలైన పేకాట, అనతికాలంలోనే సామాన్యులనూ సోకింది. ఓడిపోతున్న కొద్దీ రెట్టించిన పట్టుదలతో ఆడటం పేకాటరాయుళ్ల ప్రథమ లక్షణం. ‘నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా/ నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు/ ఇక పెయిరయ్యే అవకాశం లేదు/ ఇప్పటికయినా మిడిల్‌డ్రాప్ పడెయ్యి’ అంటారు ‘మిడిల్‌డ్రాప్’ కవితలో వెల్చేరు నారాయణరావు. ఇలాంటి హితోక్తులు ద్యూతోద్రేకులను నిరుత్సాహపరచలేవు. ఉన్నదంతా ఊడ్చుకుపోతేగానీ వాళ్లకు తత్త్వం తలకెక్కదు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆటలో కలిసొచ్చే ముక్కలు చేతిలో ఉన్నప్పుడు పేకాటరాయుళ్ల హుషారు మామూలుగా ఉండదు. సాక్షాత్తు వైకుంఠమే తమ అరచేతిలో ఇమిడిపోయిందనేంతగా పరవశులవుతారు. అలాంటి సందర్భాల్లోనే కొందరికి ఆశుకవిత్వం కూడా తన్నుకొస్తుంది. ‘కన్యాశుల్కం’లోని పేకాట సన్నివేశంలో ఆట రంజుగా సాగుతున్నప్పుడు పూజారి గవరయ్యకి ఇలాగే ఆశుకవిత్వం తన్నుకొచ్చి, ‘రాణా, డైమను రాణీ?/ రాణా యిస్పేటు రాణి, రాణా, కళావ/ర్రాణా ఆఠీన్రాణీ?/ రాణియనన్మధురవాణె, రాజుల రాణీ’ అంటూ పేకాట పరిభాషలోనే మధురవాణిని పొగుడుతూ పద్యం చెబుతాడు. చేతిలో పేకముక్కలుంటే చాలు, ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదనంతగా ఉంటుంది పేకాటరాయుళ్ల తన్మయావస్థ. ‘చెలువకు ప్లేయింకార్డుకు/ గల భేదం బేమొ చెప్పగలవా సుదతీ?/ చెలికన్న కార్డునందే/ వలపధికంబని తలంపవచ్చు మదవతీ!’ అంటూ పేకాటరాయుడి అభిరుచి తీవ్రతను ‘కర్ణానందదాయిని’లో జి.బాలాజీదాసు వర్ణించారు. ప్రపంచంలోని మిగిలిన అంశాల మాదిరిగానే ద్యూతక్రీడలు కూడా కాలంతో పాటే పరిణామం చెందుతూ వస్తున్నాయి. ఆల్చిప్పలతో మొదలైన ద్యూతక్రీడలిప్పుడు ఆన్‌లైన్‌కు చేరుకున్నాయి. డబ్బు చేతులు మారే జూదాలనే జనాలు పట్టించుకుంటారు గానీ, నిజానికి ఈ మాయాప్రపంచంలో జీవితమే ఒక జూదం. బతుకు పోరులో గెలుపు కోసం ఎవరి పాచికలు వాళ్లు వేస్తూనే ఉంటారు. అదృష్టం ఎప్పుడైనా తమ తలుపు తట్టకపోదా అనే ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. -
భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
పేకాటలో హైదరాబాద్‌ను శాసిస్తున్న అరవింద్!
హైదరాబాద్: క్యాసినో, పోకర్, పేకాట, తీన్‌పత్తా.. దీన్ని అడ్డంపెట్టుకుని బేగంపేటను అడ్డాగా చేసుకుని హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి. ప్రతి పండుగతో పాటు ముఖ్యమైన రోజుల్లో పేకాట నిర్వహిస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగిస్తున్నాడు. ఒకవేళ పేకాటలో ఎవరైనా పట్టుబడితే విడిపించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి జూదానికి ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో భాగస్వామ్యులైన వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు తీసుకెళతాడు. అక్కడ కూడా కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్న అరవింద్.. భారీ స్థాయిలో వెనకేసుకుంటున్నాడు. ఇటీవల బేగంపేటలో 150మందికి అరవింద్ ఆహ్వానం పంపగా, అందులో 85 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్.. పలువురిని అరెస్ట్ చేసింది. పేకాట, క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతాడు. అదే సమయంలో లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. ఇది చాలాకాలంగా స్వేచ్ఛగా సాగుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ అగర్వాల్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలపగా, ఐదుగురి మాత్రమే అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీని వెనక చాలా మంది ఉండగా ఐదుగురిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. -
పేకాట కేసు: ముగిసిన సుమన్ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు సుమన్‌ను విచారించిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా పోలీసుల విచారణంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుమన్‌పై క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.. చాలా కాలంగా సుమన్ క్యాసినో, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో సుమన్ చౌదరిపై పలు కేసులు నమోదైనట్లు, ఎంట్రీ ఫీజు, కమీషన్ల రూపంలో లక్షల రూపాల వసూళ్లు చేసినట్లు తేలింది. సుమన్‌కు రాజకీయ నేతలు, రియల్టర్స్‌తో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. క్రికెట్ బెట్టింగ్‌కు సైతం పలువురు నిందితులు పాల్పడినట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ కోణంలో సైతం పోలీసులు విచారించారు. మరోసారి కూడా సుమన్ చౌదరిని పోలీస్ కస్టడికి కోరే అవకాశం ఉంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట కాగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. -
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పోలీసులు మరో వివాదానికి తెరలేపారు. టీడీపీ నేతలతో కలిసి ఓ కానిస్టేబుల్ సాగిస్తున్న గ్యాంబ్లింగ్ దందాను దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మీ ఇష్టం.. ఏమన్నా రాసుకోండి’ అంటూ విలేకరులపైనే ఖాకీ నైజాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థం మార్చేసేలా సాక్షాత్తూ డీఎస్పీ ఎదుటే ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఏం జరిగింది? ఈ నెల 20న తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో రైస్ మిల్లు వద్ద గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పట్టుబడిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు శరత్‌కుమార్‌తో పాటు మరో పది మంది ఉన్నారు. వీరిలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడు కూడా ఉండటం విశేషం. అయితే తాడిపత్రి పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.50 వేలు స్వా«దీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నా...పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడిపై చర్యలు తీసుకున్నారు. వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులిచ్చారు. మీ ఇష్టం ఏమన్నా అనుకోండి.. ఆదివారం తాడిపత్రి పోలీసులు తెలంగాణ మద్యం స్వాదీనం చేసుకోగా, డీఎస్పీ చైతన్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పేకాటలో దొరికిన కానిస్టేబుల్ అంశాన్ని విలేకరులు లేవనెత్తడంతో సీఐ ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. విషయాన్ని దాటవేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ ఉన్నందునే పేర్లు బహిర్గతం చేయలేదా? అని విలేకరులు ప్రశ్నించగా... సీఐ సహనం కోల్పోయారు. అది ఒక చిన్న పెట్టీ కేసు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి లోతుగా వెళ్లకండి. కాదంటే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండని సమాధానమిచ్చారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్ ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం..
పామిడి(అనంతపురం జిల్లా): జూదానికి డబ్బు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కన్నతండ్రి.. సొంత కుమారుడిపైనే హత్యాయత్నం చేసిన ఘటన పామిడిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వి.గంగాధర్ తెలిపిన మేరకు.. పామిడిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఖాజామొయిద్దీన్, నూరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్దకుమారుడు జావేద్ వలి (24) ఆటో డ్రైవర్‌గానూ, రెండో కుమారుడు చాంద్‌బాషా టైలర్‌గానూ స్థిరపడ్డారు. జులాయిగా తిరిగే ఖాజామొయిద్దీన్ పేకాట, మట్కా వంటి జూదాలకు బానిసయ్యాడు. శనివారం సాయంత్రం పేకాట ఆడేందుకు తనకు రూ.లక్ష కావాలని భార్యతో పాటు కుమారుడు జావేద్‌తో ఘర్షణ పడ్డాడు. వారు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆదివారం తెల్లవారుజాము 1 గంట ప్రాంతంలో మిద్దెపై నిద్రపోతున్న జావేద్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి, క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం తరలించారు. 80శాతం కాలిన గాయాలతో సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం