Goddeti Madhavi
-
Araku MP: మొదట రైతు బిడ్డ.. తరువాతే ఎంపీ!
సాక్షి, కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.. రైతు కుటుంబానికి చెందిన ఆమె జీవనశైలి చాలా సాధారణంగా ఉంటుంది. ఎంపీ కాకముందు కూడా ఆమె తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో పాల్గొనేవారు. ఇప్పుడు కూడా ఆమె తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడుకి వ్యవసాయ పనుల్లో సాయపడేవారు. వరి పంట చేతికందొచ్చిన వేళ ఆమె భర్త శివప్రసాద్‌తో కలిసి శుక్రవారం పొలం పనుల్లో పాల్గొన్నారు. నూర్చిన ధాన్యాన్ని వారే నేరుగా బస్తాల్లోకి వేశారు. ఎంపీ మాట్లాడుతూ చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ఇష్టమన్నారు. ఆమెతోపాటు వ్యవసాయ పనుల్లో ఎంపీ తల్లి చెల్లయమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చదవండి: (విధుల్లో ఉన్నప్పుడు రూ.1000 చేతిలో ఉంచుకోవచ్చు) -
కాఫీ బోర్డుకు రూ.1,510 కోట్లు మంజూరు చేయండి
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కేంద్ర కాఫీబోర్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం ఆమె కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఫైనాన్స్ కమిటీ సూచన మేరకు కేటాయించాల్సిన రూ.1,510 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేసి, కేంద్ర కాఫీ బోర్డును బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ మాధవి తెలిపారు. కాఫీ రైతులకు మేలు కలిగేలా కాఫీబోర్డులో ఖాళీగా ఉన్న 152 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరానని వివరించారు. -
ఆకాంక్ష జిల్లాల జాబితాలో మన్యం, అల్లూరి జిల్లాలు
కొయ్యూరు: మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఆకాంక్ష జిల్లాల జాబితాలో చేరాయని అరకు ఎంపీ మాధవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి అందించిన లేఖ మేరకు నీతి అయోగ్ నిర్వహించిన సమావేశంలో ఆకాంక్ష జిల్లాల జాబితాలో వాటిని చేర్చారన్నారు. రెండు జిల్లాలు వెనుకబడి ఉన్నందున అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక చేరిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర సౌకర్యాలు అందుతాయన్నారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. అరకు ఎంపీ మాధవి బుధవారం ఢిల్లీ నిర్వహించిన విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. (క్లిక్ చేయండి: మెట్ట భూములకు పాతాళగంగ) -
కాఫీ బోర్డు సభ్యురాలిగా ఎంపీ మాధవి
సాక్షి, న్యూఢిల్లీ: కాఫీ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును పునర్నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్‌దండే, కాఫీ పండించే వారి విభాగంలో విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్తపాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్‌రావు, ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీశాంత్‌లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది. -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ మహిళా ఎంపీలు
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. అంతకుముందు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన వారిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, నందిగామ సురేష్ సహా పలువురు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. చదవండి: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్ -
జోరువానలోనూ కలెక్టర్, ఎంపీ పర్యటన
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒకవైపు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం పడుతున్నా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు మండలంలోని కిత్తాబు గ్రామాన్ని సందర్శించారు. మంత్రి, కలెక్టర్ సోమవారం నాడు గానుగుల వరకు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి కిత్తాబు గ్రామానికి చేరుకున్నారు. జడివానలో తడుచుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రి, అధికారులను చూసి గిరిజనులు అమితమైన ఆనందానికి లోనయ్యారు. గ్రామంలో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్ని ఓపికగా విన్న కలెక్టర్, మంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్ కోచ్
సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు. దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్ సుందరీకరణ చేపడతామని వాల్తేర్ డివిజన్ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఆర్వీ నగర్‌కు రానున్న కాఫీ పరిశోధన స్థానం
కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్వీనగర్లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది. గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్.వి.నగర్లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను ఈ విభాగం సమకూరుస్తోంది. మావోయిస్టులు పేల్చేయడంతో.. ఆర్వీనగర్లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగు కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. శాస్త్రవేత్తల సహకారం అవసరం ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్‌పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్వీ నగర్‌కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం -
బ్రిటిష్ సైన్యానికి పట్టుబడిన చోటే.. 18 అడుగుల అల్లూరి విగ్రహం..
ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు.. వారంతా విప్లవ యోధులుగా మారతారు.. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది.. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది.. మేజర్ గుడాల్‌తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆ వీరుడు అన్నట్టుగానే అతని మరణం తరువాత దేశంలో స్వాతంత్య్ర పోరాటం నిప్పుకణమై మండింది. లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు. సీతారామరాజును కొయ్యూరు మండలం మంపలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోనే ఆ యోధుడి అధ్యాయం ముగిసింది. అందుకు గుర్తుగా అదే చోట 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆ బృహత్ కార్యక్రమానికి ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. కొయ్యూరు: అది మే నెల ఏడవ తేదీ.. 1924వ సంవత్సరం. ఉదయం ఎనిమిది గంటలకు మంపలో ఉన్న కొలనులో సీతారామరాజు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం మేజర్ గుడాల్ నేతృత్వంలో చుట్టుముట్టింది. ఆయనే అల్లూరి అని నిర్ధారించుకునేందుకు గుడాల్ ఓ పరీక్ష పెట్టాడు. మరిగే పాలను ఇచ్చినా రామరాజు గటగటా తాగుతారని తెలిసి వేడి పాలను తీసుకువచ్చి తాగించారు. ఆయన ఆ పాలను నీళ్లు మాదిరిగా తాగడంతో అతనే సీతారామరాజని తేలింది. అప్పుడు అల్లూరిని మంపకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలేనికి తీసుకువచ్చారు. అక్కడ అతడిని మంచానికి కట్టి మేజర్ గుడాల్ కాల్చి చంపారు. రామరాజు చనిపోయే ముందు పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు. అక్కడ నుంచి అతని పార్థివ దేహాన్ని కృష్ణాదేవిపేటకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేశారు. అల్లూరి మరణించి 98 సంవత్సరాలు కావస్తోంది. జాతీయ అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో మంపలో ఆయన పట్టుబడిన కొలను మధ్యలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అల్లూరికి కుడి ఎడమ భుజాలుగా నిలిచిన గాం గంటన్నదొర, మల్లుదొరతోపాటు మరికొందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దీని శంకుస్థాపనకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలను ఆహ్వానించారు. వేధింపులతో విప్లవానికి నాంది: నాడు రంపుల, చింతపల్లి ఘాట్రోడ్ల నిర్మాణ సమయంలో కూలి విషయంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులను వేధించడాన్ని సీతారామరాజు స్వయంగా చూశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై అతను సాయుధ పోరాటం మొదలు పెట్టారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లపై రామరాజు ధైర్యంగా దాడులు చేశారు. పోలీసు రికార్డుల్లో ఆయన పట్టుకువెళ్లిన ఆయుధాలను కూడా నమోదు చేశారు. అతనితో కలిసి పోరాటం చేసిన వారిలో మల్లుదొర, గంటన్నదొరతో పాటు అగ్గిరాజు, యర్రయ్య కూడా కీలకంగా వ్యవహరించారు. మొత్తం 212 మంది ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వందలాదిమంది పోలీసులను నియమించినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. మంపకు సమీపంలో ఉర్లకొండ వద్ద ఉన్న గృహంలో సీతారామరాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేశారు. ఆ గుహ నుంచి చూస్తే మంప, రేవళ్లు రహదారుల నుంచి ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గుహ వైపు వచ్చినా తెలిసిపోతుంది. దీంతో దానినే రాజు స్థావరంగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను సేకరించిన మేజర్ గుడాల్ మంపలో అల్లూరిని పట్టుకునేందుకు పథకం రచించారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసేది ఈ కొలనులోనే.. కొలను చుట్టూ ఇనుప కంచె పెట్టాలి సీతారామరాజు స్మారక ప్రదేశంలో ప్రస్తుతం కొలను వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయాలి. లేకుంటే పశువులు వచ్చి పాడు చేసే అవకాశం ఉంది. అదే విధంగా స్మారక ప్రాంతంలో మంచి మొక్కలను నాటాలి. గోడలపై సీతారామరాజు జీవిత చరిత్రను చిత్రాల రూపంలో వేయాలి. ఇలా చేస్తే సందర్శకులకు చారిత్రక విషయాలు తెలుస్తాయి. మంచి పర్యాటక ప్రదేశమవుతుంది. – ఇంగువ త్రినాథ్ పడాల్, మంప, సర్పంచ్ అల్లూరి జిల్లాతో నిజమైన నివాళి మన్యం వీరుడు అల్లూరిని పట్టుకున్న మంప, అతడిని కాల్చి చంపిన రాజేంద్రపాలెంతోపాటు కృష్ణాదేవిపేటలో ఉన్న సమాధుల ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మంపకు సమీపంలో ఉన్న ఉర్లకొండ గుహ ఒకప్పుడు అల్లూరి స్థావరంగా ఉండేది. దానిని వెలుగులోకి తీసుకురావాలి. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అల్లూరి పేరు పెట్టడం నిజమైన నివాళి. – పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
మనసున మనసై.. ఇది అరకు ఎంపీ లవ్‌స్టోరీ
ప్రేమంటే.. సూర్యునిలా ఉదయించి.. అస్తమించేది కాదు. కళ్లల్లో ఉదయిస్తుంది.. కనుమూసినా తోడుంటుంది.. ప్రేమ వేదంలాంటిది. చదవగలిగితే.. పరిపూర్ణతనిస్తుంది.. ప్రేమంటే అమ్మ పాలంత స్వచ్ఛత.. నాన్న మమకారమంత బాధ్యత. అందుకే.. ప్రేమలోతులో మునిగాక.. పైకి తేలడం అంత సులభం కాదంటారు చాలా మంది. ఆరాధన భావమో.. ఆకర్షణ స్వభావమో.. నచ్చిన మనసు ఎదురు పడితే.. చూపు భావం పలికిస్తుంది.. మౌనం భాషను కనిపెడుతుంది. మెచ్చిన నెచ్చెలి మనసు దోచే మాట చెప్పాలంటే ముహూర్తం చూసుకునే హృదయాలెన్నో ఉన్నాయి. అలాంటి వారందరికీ నేడు పండగ రోజు. ప్రేమ లోకంలో విహరిస్తున్న హృదయాలు చెట్టపట్టాలేసుకొని వలపు పాటలు పాడుకునే పండగే ప్రేమికుల దినోత్సవం. ఈ రోజు యువజంటలు కొత్త సంబరాలు చేసుకుంటాయి. ప్రేమ వివాహం చేసుకుని విజయవంతంగా జీవనం సాగిస్తున్న జంటలు.. తన అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకుంటాయి. –సాక్షి, విశాఖపట్నం సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): స్నేహ బంధం.. ప్రేమగా అంకురించింది. పెద్దలు కాదన్న.. వారి ప్రేమ ఔననిపించి వివాహ బంధంతో ఒక్కటి చేసింది. అరకు ఎంపీ మాధవి, ఆమె భర్త శివప్రసాద్ లవ్‌స్టోరీ ఇది. 16 ఏళ్లు స్నేహితులుగా ఉన్న వీరు ఇంటర్ నుంచి కలసి చదువుకున్నారు. నవోదయ స్కూల్లో 10 తరగతి వరకు చదువుకున్న ఎంపీ మాధవి.. ఇంటర్ నుంచి బయట చదువుకున్నారు. అక్కడే ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా వీరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వీరి స్నేహం మరింత బలపడింది. అంతవరకు స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమికులుగా మారారు. తర్వాత వీరి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. రెండు వైపులా మొదట్లో వ్యతిరేకించినా.. నమ్మకమైన ప్రేమ ఇరుకుటుంబాలను అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన కె. శివప్రసాద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019 అక్టోబర్ 17న శరభన్నపాలెంలో వీరి వివాహం జరిగింది. వివాహానికి ముందు ఒకరి ఇష్టాన్ని.. ఒకరు పంచుకుంటూ.. చివరి వరకు కలిసే జీవిస్తాం ప్రేమ ఎంతో గొప్పది. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకుని.. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ప్రేమ జీవితకాలం చిగురిస్తూనే ఉంటుంది. మేమిద్దరం కలిసి చదివాం. ఇద్దరి ఇష్టాలను ఒక్కటిగా మలచుకున్నాం. మా ప్రేమను పెద్దలకు వివరించాం. వారు అంగీకరించారు. రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా.. కలిసే బతుకుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఉంటాం. –ఎంపీ మాధవి, శివప్రసాద్ దంపతులు ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు! ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇద్దరూ ఉన్నత విద్యావంతులే.. ఒకే బ్యాచ్‌లో విద్యాశాఖలో అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే స్నేహితులయ్యారు. వారి మధ్య స్నేహం ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చింది. కులాలు వేరైనా వారే వీరిని ఒక్కటి చేశారు. ఇదీ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, మధ్యాహ్న భోజనం పథకం రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతుల కథ. డీఈవో చంద్రకళ మాటల్లో ఈ కథ విందాం. 2008 గ్రూప్–1 బ్యాచ్‌లో సుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ ర్యాంకర్. అదే బ్యాచ్‌లో నేను కూడా మంచి ర్యాంక్ సాధించాను. ఇద్దరం డిప్యూటీ డీఈవోలుగా ఉద్యోగాల్లో చేరాం. డీఈవో చంద్రకళ, మిడ్ డే మీల్ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతులు తెలంగాణ జిల్లాలో చెరో చోట ఉద్యోగాలు చేశాం. ఆ సమయంలో ఉద్యోగ రీత్యా శిక్షణ కార్యక్రమాలు, విధి నిర్వహణలో భాగంగా తరచూ కలుస్తుండటంతో.. స్నేహితులయ్యాం. ఈ విషయం ఇద్దరి ఇంట్లోనూ తెలుసు. ఆయన ఓ సందర్భంలో నా తల్లిదండ్రులతో సరదాగా పెళ్లి ప్రస్తావన లేవనెత్తారు. ఈ విషయం నా తల్లిదండ్రులు ఆయన కుటుంబ సభ్యులకు చెరవేశారు. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నేనూ ఒకే చెప్పాను. అలా మా ఇద్దరికీ 2009లో వివాహం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మా స్వగ్రామం. ఆయనది కడప జిల్లా. మాకు ఇద్దరు కుమారులు. ఒకే బ్యాచ్, ఒకే కేడర్ ఉద్యోగాలు కావడంతో మా మధ్య ఏర్పడిన స్నేహం.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంగా మారిందని ఆమె వివరించారు. -
MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే!
సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): వరి నూర్పిడి అనంతరం రాశిగా పోసిన ధాన్యాన్ని బస్తాలోకి ఎత్తుతోంది ఎవరో గమనించారా? ఇంకెవరు.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. సహజంగానే ఆమె ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా సాదాసీదాగా ఉంటారు. శరభన్నపాలెంలో శుక్రవారం వారి పొలంలో వరి నూర్పిడి చేశారు. ఆ పనుల్లో ఎంపీతో పాటు, ఆమె భర్త శివప్రసాద్‌లు పాలుపంచుకున్నారు. చదవండి: (ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్) -
కృష్ణ జలాల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతాం : గొడ్డేటి మాధవి
-
తిరుపతి, రేణిగుంట మీదుగా 45 ప్రత్యేక రైళ్లు
సాక్షి , న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తిరుపతి, రేణిగుంటలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలిపేలా 45 ప్రత్యేక రైళ్లు (డైలీ, నాన్‌డైలీ) నడపుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇవి కాకుండా తిరుమల, తిరుపతి దర్శనానికి ఐఆర్సీటీసీ రైలు, రోడ్డు, విమానాల ద్వారా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, విుథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రతిపాదన లేదు దేశవ్యాప్తంగా ఎక్కడా కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఎక్కడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 13, తెలంగాణలో 30 డిజిటల్ విలేజ్ పథకంలో భాగంగా ఏపీలో 13, తెలంగాణలో 30 గ్రామాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,28,899 ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి 3,60,325 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసం రూ.89,377 కోట్ల పెట్టుబడిలో కేంద్ర వాటా రూ.30,731 కోట్లుగా ఉందని, అందులో ఇప్పటి వరకు కేంద్ర వాటా రూ.9,311 కోట్లు విడుదల చేశామని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉడాన్‌లో సాగర్, ప్రకాశం బ్యారేజీలు ఉడాన్ పథకంలో భాగంగా వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
స్ట్రాబెర్రీ సాగుతో ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి
సాక్షి,అమరావతి: స్ట్రాబెర్రీ సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉన్నందున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంకు ఆమె స్ట్రాబెర్రీ పండ్లను బహూకరించారు. చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో గిరిజనులు ఎక్కువగా స్ట్రాబెర్రీ సాగుచేస్తున్నారని, దీనిని మరింత ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
పొలం పనుల్లో అరకు ఎంపీ మాధవి
సాక్షి, అరకు : పార్లమెంటు సభ్యురాలు అయినప్పటికీ తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో మంగళవారం దుక్కి దున్ని విత్తనాలు జల్లి పనులు చేపట్టారు. తన స్వగ్రామం శరభన్నపాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న పరిమిత వ్యవసాయ భూమిలో పొలం పని చేశారు. తొలి దశ నుంచి తన తండ్రి ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం అలవాటు అని ఎంపీ మాధవి పేర్కొన్నారు. -
వైభవంగా అరకు ఉత్సవాలు
-
‘అరకు.. ప్రకృతి ప్రసాదించిన వరం’
సాక్షి, విశాఖపట్నం: అరకు ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆంధ్రప్రదేశ్‌లో అరుకు ఉండటం మన అదృష్టమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అరకు ఉత్సవాలను మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, టూరిజం ఎండీ ప్రవీణ కుమార్, పాడేరు ఐడీడీఏ పీవో బాలాజీ, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అవంతి శ్రీనివాస్ సాంప్రదాయ ఉత్పత్తులు, ఆహార వంటకాల స్టాల్స్‌ను ప్రారంభించారు. (ముగిసిన సీఎం జగన్, ముకేష్ అంబానీ భేటీ) ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అరకు అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. డాక్టర్లు రాని పాడేరుకు ఏకంగా మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గిరిజనులు గొప్పగా దీవించాలన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కావాలనుకుంటే త్వరలో విశాఖలోనే అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను సమ్మక్క-సారక్క ఉత్సవాల తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనులు దేవతగా భావించే కొండలను కాపాడుతూ బాక్సైట్ తవ్వకాల అనుమతులను సీఎం జగన్ రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గిరిజనులే పునాదులాన్నారు. పులకింతల అరకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక అభివృద్ధికి తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అరకు ఉత్సవాలు గిరిజన సంస్కృతికి ఇచ్చే ప్రోత్సాహకమని ఆమె తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భాగ్యలక్ష్మి కొనియాడారు. బాక్సైట్ తవ్వకాల జీవో 97 రద్దు, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని ఆమె తెలిపారు. కుదరకపోయినా ఓ కప్పు అరకు ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ మాట్లాడుతూ.. అరకు ఉత్సవాలతో మన్యానికి అందం వచ్చిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. అరకు పరిసరాల్లో ఉన్న ఎన్నో జలపాతాలను అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ప్రెగ్నెన్సీ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఆంధ్రా ఊటి అరకు -
29 నుంచి ‘అరకు ఉత్సవ్’
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ‘అరకు ఉత్సవ్–2020’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ వ్యవహరిస్తారన్నారు. ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, డిపార్ట్మెంట్కు సంబంధించిన స్టాల్స్ 10 వంతున ఉంటాయన్నారు. అడ్వంచర్‌కు సంబంధించి పారామోటరింగ్ డే ట్రిప్, ఏటీవీ బైక్ రైడ్, రాప్లింగ్, జిప్ సైక్లింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్ తదితర క్రీడలు ఉంటాయన్నారు. ఏపీ ఐటీడీఏ బృందాలచే ట్రైబల్ ఫోక్ డాన్స్‌లు, క్లాసికల్ డ్యాన్స్‌లు, మ్యూజికల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాటితో పాటు గ్రామీణ క్రీడలైన కోకో, కబడ్డీ, విలువిద్య, వాలీబాల్, రంగోలి పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి, మెమొంటోలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జేసీ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చైనా నుంచి క్షేమంగా ఇంటికి..) -
సీఎం రాకతో రిసెప్షన్లో సందడి
అన్నా.. ఎలా ఉన్నారు, అమ్మా.. అంతా ఓకే కదా.. అంటూ ఆద్యంతం ఉత్సాహంగా అందరినీ పేరుపేరునా పలకరించడంతో వారంతా ఆనందంతో పులకించిపోయారు. అలా పలకరించిన నేత.. సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడమే వారి ఆనందానికి కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలనే కాదు.. కార్యకర్తలను కూడా ఆత్మీయంగా, ఎంతో ఆదరంగా ఒక్కొక్కరినీ పేరు పెట్టి పిలిచిన అధినేతను చూసి సంబరపడ్డారు. ఈనెల 17న వివాహం చేసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్‌లను ఆశీర్వదించేందుకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి విచ్చేశారు. ఎయిర్‌పోర్టులోనూ, వివాహ రిసెప్షన్ వేదిక వద్ద.. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం ఆత్మీయంగా పలకరించారు. కేకే రాజు ది గ్రేట్.. అంటూ ఉత్తర నియోజకవర్గ అభ్యర్ధి కేకే రాజును, గౌరమ్మా ఎలా ఉన్నావంటూ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరిని, గురువులన్నా ఎలా ఉన్నావ్.. అంటూ కోలా గురువులును.. ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ప్రేమగా పలకరించారు. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి రాకతో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ విమాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు సాయంత్రం 6.43 గంటలకు చేరుకున్నారు. వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ను ఆశీర్వదించారు. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. మాధవి, శివప్రసాద్ దంపతులు ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేశారు. వివాహానికి హాజరైన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు డా.భీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, పార్టీ నేతలు అక్కరమాని విజయనిర్మల, పరిక్షిత్ రాజు, కుంభా రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, సతీష్‌వర్మ, సుధాకర్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించిన దాడి సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు భేటీ అయ్యారు. మంగళవారం నగరానికి వచ్చిన సీఎంతో కారులో ప్రయాణిస్తూ జిల్లా సమస్యలపై మాట్లాడారు. విశాఖ నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు ఎంవీపీ కాలనీ వరకు విస్తరించిందని వివరించారు. దాని నియంత్రణపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడి చెప్పిన సమస్యలపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే కలెక్టర్ వినయ్‌చంద్‌తో మాట్లాడారు. తక్షణమే నగర కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం పథకాల అమలుపై సీఎం జగన్.. దాడి వీరభద్రరావుని ఆరాతీశారు. ముఖ్యమంత్రిని సత్కరించి అభివాదం చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ దీనిపై దాడి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనీ, తన రాజకీయ అనుభవంలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పారు. గతంలో కొన్ని వర్గాల ప్రజలకే మేలు జరిగేదనీ, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలూ జీవితాంతం చెప్పుకునేలా పథకాలు అమలు చేస్తున్నారనీ.. ప్రజలందరి నుంచీ మంచి స్పందన వస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించగా.. లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో అన్నదాతల్లో ఎనలేని సంతోషం కనిపిస్తోందనీ దాడి చెప్పారు. -
ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్లో సీఎం జగన్
-
ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్లో సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మాధవి, శివప్రసాద్ దంపతులను సీఎం ఆశీర్వదించారు. సాయిప్రియా రిసార్ట్స్‌లో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. రిసెప్షన్ వేడుకలో బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా, ఎంపీ మాధవి, శివప్రసాద్ వివాహం కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోని మాధవి స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున (3.15 గంటలకు) జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి : ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం) పాతికేళ్ల వయసులోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్ చంద్రదేవ్‌ని ఓడించారు. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే దేముడు. కాగా, కుసిరెడ్డి శివప్రసాద్.. మాధవి చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. (చదవండి : ఒప్పించారు ఒక్కటయ్యారు) ముఖ్యమంత్రికి అభినందనలు.. ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌ను చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ కలిశారు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆమె అభినందించారు. కాగా, షిరీన్ విశాఖ టీడీపీ నగరాధ్యక్షుడు ఎస్.ఏ. రెహమాన్ భార్య కావడం గమనార్హం. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో ఆయన చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలుసుకుంటారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుని, సాయిప్రియా రిసార్ట్స్‌లో అరకు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్లొననున్న సీఎం జగన్ రేపు ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారు. పోలీస్ త్యాగధనులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. -
ఘనంగా ఎంపీ మాధవి వివాహం
-
ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం
సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఎంపీ మాధవి స్వగృహంలో గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) జరిగిన ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి మాధవి తండ్రి, మాజీ ఎమ్మెల్యే దేముడు అభిమానులు శరభన్నపాలెం తరలి వచ్చారు. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజంతా సందడి వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. (చదవండి: ఒప్పించారు ఒక్కటయ్యారు) -
మాధవి పరిణయ సందడి
గొలుగొండ, కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్‌తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు.