Indian Space Research Organization
-
‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ టెస్టు సక్సెస్
చెన్నై: భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు పడింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్‌కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్‌యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్‌యాన్–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్‌యాన్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెపె్టన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. -
తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్
న్యూఢిల్లీ: సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్‌ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్‌ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్‌ఎక్స్‌ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
మన ఆస్ట్రోశాట్ గ్రేట్!
అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్ టెలిస్కోప్ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఆర్బీలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారి తీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకన్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ జీఆర్బీల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. ఈ పేలుళ్లను లోతుగా అధ్యయనం చేయగలిగితే విశ్వచాలనాన్ని నియంత్రించే మౌలిక భౌతిక నియమాలను మరింతగా అర్థం చేసుకునే ఆస్కారముంటుంది. దుమ్ము రేపుతున్న ఆస్ట్రోశాట్ 2015 సెపె్టంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన తొలి మల్టీ వేవ్ లెంగ్త్ అంతరిక్ష టెలిస్కోపే ఆస్ట్రోశాట్. నాటినుంచి భారత అంతరిక్ష పరిశోధనలకు మూలస్తంభంగా నిలిచింది. ఇది గరిష్టంగా ఐదేళ్ల పాటు పని చేస్తుందని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తూ ఇస్రో సామర్థ్యానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది. అంతరిక్షంలో సంభవించే అరుదైన దృగ్విషయాలైన గామా పేలుళ్లను ఆస్ట్రోశాట్ ఇట్టే ఒడిసిపడుతూ పలు అంతర్జాతీయ పరిశోధనలకు ఆలంబనగా నిలిచింది. అదిప్పటిదాకా ఏకంగా 600 జీఆర్బీలను గుర్తించడం నిజంగా గొప్ప విషయమేనని నాసా సైంటిస్టులు అంటున్నారు. ఆస్ట్రోశాట్‌లోని కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ (సీజెడ్‌టీఐ)దే ఈ ఘనతలో ప్రధాన పాత్ర అని ఐఐటీ బాంబే పరిశోధకులు వివరించారు. హై ఎనర్జీ, వైడ్ ఫీల్డ్ ఇమేజింగ్ సీజెడ్‌టీఐ ప్రత్యేకత. త్వరలో తెరపైకి ‘దక్ష’... ఆస్ట్రోశాట్ సాధిస్తున్న ఘనతలు నిజంగా సాటిలేనివని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ వరుణ్ భలేరావ్ అన్నారు. ఈ స్ఫూర్తితో అంతరక్ష రంగంలో ఇస్రో కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అత్యాధునిక జీఆర్బీ టెలిస్కోప్ దక్షను తయారు చేయనున్నట్టు వెల్లడించారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్‌లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని జీఆర్బీ టెలిస్కోప్ల్లోకెల్లా దక్ష అత్యంత అధునాతనంగా ఉండనుందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్’కు చేరుకుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్1కు క్లీన్‌రూంలో పరీక్షల అనంతరం రాకెట్ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్రేంజ్ పాయింట్ 1(ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
గగన్‌యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ పరీక్షలు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గగన్‌యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం (జీఎంపీఎ‹)తో మరో రెండు హాట్ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్‌ఎంపీఎస్)ను బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, వలియామల, తిరువనంతపురంలలో డిజైన్ చేసి, అభివృద్ధి పరిచారు. ఈ తరహాలో మొదటి హాట్ టెస్ట్‌ను ఈనెల 19న నిర్వహించారు. పేజ్–2 టెస్ట్ సిరీస్‌లో రెండు, మూడు హాట్ టెస్ట్‌లను బుధవారం చేపట్టి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. 723.6 సెకెండ్ల పాటు సాగిన ప్రారంభ హాట్టెస్ట్ ఆర్బిటల్ మాడ్యూల్ ఇంజెక్షన్, 100 ఎన్ థ్రస్ట్‌లు లిక్విడ్ అపోజిమోటార్ (ఎల్ఏఎం) ఇంజిన్ల కాలిబ్రేషన్ బర్న్‌ను ప్రదర్శించారు. నాన్ అపరేషన్ ఇంజిన్‌ను గుర్తించి, వేరు చేయడానికి కాలిబరేషన్ బర్న్ అవసరమైంది. లామ్ ఇంజిన్ల రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లు ఊహించిన విధంగా పనిచేయడంతో ఈ పరీక్షలు విజయవంతమై’నట్లు ఇస్రో ప్రకటించింది. -
మరో ‘వాణిజ్య సవాలు’కు... ఇస్రో సన్నద్ధం
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల పరంపరలో మరో ముందడుగు. సింగపూర్‌కు చెందిన సమాచార ఉపగ్రహం సింథటిక్ అపర్చర్ రాడార్ (డీఎస్–ఎస్ఏఆర్)తో పాటు మరో 6 బుల్లి ఉపగ్రహాలను సంస్థ పీఎస్ఎల్వీ–సి56 ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. జూలై 30న ఉదయం శ్రీహరికోటలో మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎస్ఏఆర్ను సింగపూర్ ప్రభుత్వ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింగపూర్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఇది పూర్తి వాణిజ్య ప్రయోగమని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సోమవారం పేర్కొన్నారు. ► తొలుత జూలై 26న తలపెట్టిన ఈ ప్రయోగం 30కి వాయిదా పడింది. ► 360 కిలోల ఎస్ఏఆర్తో పాటు మొత్తం ఏడు ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్ ఈక్విటోరియల్ ఆర్బిట్ (ఎన్ఈఓ–నియో) కక్ష్యలోకి పీఎస్ఎల్వీ–సి56 ప్రవేశపెట్టనుంది. ► మిగతా ఆరు ఉపగ్రహాలు వెలోక్స్–ఏఎం (23 కిలోలు), ఆర్కేడ్, స్కూబ్–2, న్యూలియోన్, గలాసియా–2, ఆర్బి–12 స్ట్రైడర్. -
Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?
జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ? చంద్రుడి గుట్టు విప్పేందుకే... ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి? ► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు. ► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. దక్షిణ ధ్రువంపై దిగాలని... ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. ► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు. ► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. ► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని అమర్చారు. ► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. ► రోవర్లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. ► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి. -
వన్‌వెబ్ మరోసారి ప్రయోగం
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్స్ రంగ కంపెనీ వన్‌వెబ్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో (ఇస్రో) కలిసి 36 ఉపగ్రహాలను మార్చి 26న ప్రయోగించనుంది. భూమికి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) వీటిని పంపుతారు. జూలై–ఆగస్ట్ నాటికి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధమని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఫిబ్రవరిలో వెల్లడించారు. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి కంపెనీకి లైసెన్స్ దక్కింది. అయితే ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉంది. ‘శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవి నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. వన్‌వెబ్ ఇప్పటికే 17సార్లు ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది మూడవ పర్యాయం ప్రయోగిస్తోంది. మొదటి తరం లో ఎర్త్ ఆరిŠబ్ట్ (లియో) కూటమిని పూర్తి చేసి 2023లో కంపెనీ అంతర్జాతీయంగా కవరేజీని ప్రారంభించేందుకు ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది. కంపెనీ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి’ అని వన్‌వెబ్ తెలిపింది. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
అంతరిక్ష రంగంలో తెలుగు తేజం
భారత అంతరిక్ష రంగంలో నవశకం ఆరంభం కాబోతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్ రాకెట్ సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే..భవిష్యత్‌లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే శ్రీహరికోట నుంచి మూడు పేలోడ్లతో కూడిన ఈ ప్రైవేట్ రాకెట్ రోదసి బాట పట్టనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో స్కైరూట్ ఏరో స్పేస్ స్టార్టప్ సంస్థ తయారు చేసిన రాకెట్ ఈ నెల 16 లేదా 18న రోదసిలోకి దూసుకుపోనుంది. రాకెట్ రూపకర్తల్లో విశాఖకు చెందిన నాగభరత్ దాకా (33) ఒకరు కాగా.. మరొకరు హైదరాబాద్‌కు చెందిన చందన్ పవన్‌కుమార్. వీరిద్దరూ స్కైరూట్ ఏరో స్పేస్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. వ్యవస్థాపకులలో ఒకరిగా.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా వ్యవహరిస్తున్న నాగభరత్ విశాఖలోనే విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన విక్రమ్–ఎస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతూ చరిత్ర సృష్టించబోతోంది. భీమిలిలో బీజం విశాఖ శివారు భీమిలిలోని అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (అనిట్స్) ఫౌండర్ ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన డాక్టర్ రఘురామిరెడ్డి కుమారుడు నాగభరత్. 1999 నుంచి 2001 వరకూ రుషి వ్యాలీ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన 2001 నుంచి 2005 వరకు నగరంలోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూరి చేసుకొని 2012 అక్టోబర్ నుంచి 2015 మే వరకూ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఇంజినీర్ (ఎస్సీ)గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2018 ఆగస్ట్‌లో తోటి శాస్త్రవేత్త పవన్‌కుమార్ చందనతో కలిసి స్కైరూట్ ఏరో స్పేస్ అనే స్టార్టప్ సంస్థను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. చిన్న చిన్న రాకెట్స్ మోడల్స్‌ను తయారు చేస్తూ వాటిపై పరిశోధనలు వేగవంతం చేశారు. రెండేళ్ల నుంచి పరిశోధనలు ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేందుకు ఇస్రోకు మాత్రమే అనుమతులు ఉండేవి. అయితే, రెండేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కూడా అడుగు పెట్టేందుకు ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి నాగభరత్, పవన్‌కుమార్ కలిసి దేశ అంతరిక్షంలోకి అడుగుపెట్టే మొదటి ప్రైవేట్ రాకెట్ తమదే కావాలన్న లక్ష్యంతో పరిశోధనలు ప్రారంభించారు. అనేక సంస్థల నుంచి పోటీ ఎదురైనా.. వాణిజ్య అవసరాలు తీర్చేలా స్నేహితులిద్దరూ ముందుగా రాకెట్ తయారు చేసి రికార్డు సృష్టించారు. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కు నివాళిగా తొలి ప్రైవేట్ రాకెట్‌కు విక్రమ్–ఎస్ (శరభి) అని నామకరణం చేశారు. తొలుత ఈ ప్రైవేట్ రాకెట్‌ను ఈ నెల 15న ప్రారంభించాలని భావించగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 16 లేదా 18వ తేదీన ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్‌స్ట్రేషన్ మాత్రమే. ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు. తొలి ప్రైవేట్ రాకెట్ కావడంతో ఈ ఆపరేషన్‌కు ‘ప్రారంభ్ మిషన్’ గా నామకరణం చేశారు. విక్రమ్ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నారు. -
ISRO: జూన్‌లో చంద్రయాన్ 3
న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్ మాట్లాడారు. ‘ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు. -
మంగళ్యాన్ కథ ముగిసింది
బెంగళూరు: అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. -
సూర్యుడిపై ఇస్రో గురి: ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మీడియాకు వెల్లడించారు. మరో ఘనత దిశగా.. బెంగళూరులోని యు.ఆర్.రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, చంద్రయాన్–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1(ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసేందుకు.. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య–ఎల్1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. తొలి మూడు దశలు విజయవంతం ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది. అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్ రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగమంతా సక్సెస్ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్, కె.శివన్ తదితరులు విచ్చేసి, ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు. ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది. -
నేడే నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్ ప్రయోగంపై శనివారం ‘షార్’లో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు వచ్చింది. 7 గంటల కౌంట్‌డౌన్ 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు. -
పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగానికి రంగం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మొదలైంది. సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ–53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ టాప్ ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
ఒకే ప్రపంచం.. ఒకే సౌర గ్రిడ్
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. ద్వీపాలకు భారత్ అండ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు. -
జీఎస్ఎల్వీ–ఎఫ్10కు నేటి నుంచి కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం ఉదయం 5.43 గంటలకు సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ–ఎఫ్ 10 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని కోసం బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇస్రో చైర్మన్ శివన్ నేతృత్వంలో షార్‌లో మిషన్ సంసిద్ధత సమావేశం జరిగింది. అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. రాకెట్‌లోని రెండో దశలో భాగంగా ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే చేపట్టనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం ఉదయం 5.43కు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్)–03తో జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. -
ఈవోఎస్–01 ఉపగ్రహానికి విచ్చుకున్న యాంటెన్నా
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 7న పీఎస్ఎల్వీ సీ–49 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–01) ఉపగ్రహానికి మంగళవారం సాయంత్రం రేడియల్ రిబ్ యాంటెన్నా విజయవంతంగా విచ్చుకున్నట్టు ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. వ్యవసాయం, అటవీ, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాంటెన్నా ఉపగ్రహ సమాచారాన్ని అందించేందుకు కీలక భూమిక పోషిస్తుంది. ఉపగ్రహ సేవలు బుధవారం నుంచే అందుబాటులోకి వస్తాయని ఇస్రో ప్రకటించింది. -
పీఎస్ఎల్వీ సీ49 సూపర్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ప్రయోగం విజయవంతమైంది. ముందుగా నిర్ణయించిన కాలం ప్రకారం మధ్యాహ్నం 3:02 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా 3:11 గంటలకు ప్రయోగించారు. ఏకంగా 10 ఉపగ్రహాలు ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు 630 కిలోల బరువు కలిగిన పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్త ధ్రువకక్ష్యలోకి (సన్ సింక్రనస్ ఆర్బిట్) విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ అవసరాల నిమిత్తం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్–2, లక్జెంబర్గ్‌కు చెందిన కేఎస్ఎం–1ఏ, కేఎస్ఎం–1బీ, కేఎస్ఎం–1సీ, కేఎస్ఎం–1డీ, అమెరికాకు చెందిన లిమూర్ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిరీ్ణత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) ఉపగ్రహాన్ని మన దేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది. అద్భుతమైన ప్రయోగం: ఇస్రో చైర్మన్ ఇదొక అద్భుతమైన ప్రయోగమని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ అన్నారు. 10 ఉపగ్రహాలను ముందుగా అనుకున్న ప్రకారమే విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఈఓఎస్–01 కక్ష్యలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే సోలార్ ప్యానల్స్ కూడా విజయవంతంగా విచ్చుకున్నామని తెలిపారు. కోవిడ్–19 పరిస్థితులను అ«ధిగమించి విజయం సాధించామన్నారు. రాకెట్ అనుసంధానం చేసేటపుడు కభౌతిక దూరాన్ని పాటించినట్లు చెప్పారు. అభినందనల వెల్లువ పీఎస్ఎల్వీ–సీ49 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు, ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రధాని మోదీ అభినందించారు. 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో వ్యవసాయం, అటవీ, విపత్తుల నిర్వహణకు ఈఓఎస్–01 ఉపగ్రహం ఎంతో తోడ్పడుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
చకచకా ‘చంద్రయాన్–2’ ఏర్పాట్లు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ పనులను పూర్తిచేశారు. శనివారం పేజ్–3 లెవెల్–1 తనిఖీలను నిర్వహించారు. అదేవిధంగా శాటిలైట్ బిల్డింగ్‌లో ఆర్బిటర్ మిషన్ మీద ల్యాండర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. చంద్రయాన్–2 మిషన్‌ను రాకెట్ శిఖర భాగంలో అమర్చేందుకు హీట్‌షీల్డ్ క్లోజ్ చేసి, ఆ భాగాన్ని శాటిలైట్ బిల్డింగ్ నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌కు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయాన తరలించి రాకెట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత రాకెట్లో అన్ని తనిఖీలు నిర్వహించి ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రయోగానికి గడువు మరో 15 రోజులే ఉండడంతో సెలవు దినాలను కూడా చూడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి నూతన డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పర్యవేక్షణలో అనుసంధానం పనులు జరుగుతాయి. జూలై 15న చంద్రయాన్–2 భూకక్ష్య నుంచి బయలుదేరి 3.50 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న చంద్రుడిపైకి చేరుతుంది. అదేరోజున ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని ల్యాండర్‌ను చంద్రుడిపై దించుతుంది. చంద్రుడిపై ల్యాండర్ దిగాక అందులో అమర్చిన రోవర్ బయటకొచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈ లోపు ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారానే చంద్రయాన్–2.. 640 టన్నులు బరువు కలిగిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షం వైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–2 ఉపగ్రహంలో 2.3 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్, 1.4 టన్నులు బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27 కిలోలు బరువు కలిగిన రోవర్ (ప్రజ్ఞాన్) అనే ఇండియన్ పేలోడ్స్‌తోపాటు అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన అనేక పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. వీటితోపాటు ఆర్బిటర్‌లో 8 పేలోడ్స్, ల్యాండర్, రోవర్లో మూడేసి పేలోడ్స్‌ను పంపుతున్నారు. ఆర్బిటర్‌లో పంపే పేలోడ్స్ ఇవి.. - టెరియన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2) - చంద్రయాన్–2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సీఎల్ఏఎస్ఎస్) - సోలార్ ఎక్స్‌రే మానిటర్ (ఎక్స్ఎస్ఎం) - ఆర్బిటర్ హైరిజుల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) - ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్) - చంద్రయాన్–2 అట్మాస్ఫియరిక్ కాంపోజిషనల్ ఎక్స్‌ప్లోరల్ 2 (సీహెచ్ఏసీఈ) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ (డీఎఫ్‌ఆర్‌ఎస్) ఎక్స్పరిమెంట్ ల్యాండర్ (విక్రమ్)లో పేలోడ్స్ ఇవి.. - రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ (ఆర్ఎఎంబీఏ) - చంద్రయాన్–2 సర్ఫేస్ థెర్మో–ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) - ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) - రోవర్ (ప్రజ్ఞాన్)లో పేలోడ్స్ ఇవి.. - అల్ఫా ఫర్టికల్స్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ (ఏఎప్ఎక్స్ఎస్) - లేజర్ ఇన్డ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎన్ఐబీఎస్) - లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (ఎల్ఆర్ఏ)