inter examinations
-
విజయవంతంగా ఇంటర్ పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023–24కు రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 మంది హాజరు కాగా, 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఆన్లైన్ విధానంతో తొలగిపోయిన ఇబ్బందులు.. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ నమోదు నుంచి పరీక్ష కేంద్రాల వరకు అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. విద్యార్థులకు తలెత్తే సమస్యల పరిష్కారానికి ఆయా కళాశాలల్లోనే చర్యలు తీసుకుంది. గతంలో పరీక్ష ఫీజును చలాన్ రూపంలో చెల్లిస్తే, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. ఈ ఏడాది ఆన్లైన్ విధానంతో గత ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అలాగే ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే మార్కులను బోర్డు వెబ్సైట్లో నమోదు చేశారు. మార్కుల విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో నమోదు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. ప్రధాన పరీక్షలు జరిగిన 1,559 సెంటర్లలో ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 వేల కెమెరాలను వినియోగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోర్డు కార్యాలయం నుంచి పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకో అధికారిని కమిషనర్ సౌరబ్ గౌర్ నియమించారు. కేంద్రాల నుంచి పరీక్ష పత్రాలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలుకానున్నా యి. మార్చి 19 వరకూ జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది హాజరవుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రెండో ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కూడా నిర్వహించారు. ఈసారి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ఇంటర్ బోర్డ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయి అధికారులను మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారు. 1,521 పరీక్ష కేంద్రాలు... ఇంటర్ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను, ప్రభుత్వ ఆ«దీనంలో ఉండే 407 కాలేజీలను, 880 ప్రైవేటు కాలేజీలను పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేశారు. 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు. 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించారు. రంగంలోకి అన్ని విభాగాలు.. ► పరీక్షలు రాసే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రం వద్ద ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఒక నర్సును అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు ఆదేశించారు. ► ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తెరుస్తారు. విద్యార్థులకు బోర్డ్ సూచనలు.. ► విద్యార్థులు ్టtsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై ప్రిన్సిపల్స్ సంతకాలు ఉండాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్లు ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్ బోర్డ్ దృష్టికి తేవాలి. ► పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు ఒక్క నిమి షం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్ష కేంద్రంలో పావుగంట ముందే ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలను 9 గంటల లోపు చూసుకుని, తప్పులుంటే ఇని్వజిలేటర్ దృష్టికి తేవాలి. ► మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్ వస్తువులు, ప్రింటెండ్ మెటీరియల్స్ కేంద్రాల్లోకి అనుమతించరు. కౌన్సెలింగ్ కోసం టోల్ ఫ్రీ... పరీక్షల ఫోబియో వెంటాడుతూ ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఇంటర్ బోర్డ్ ‘టెలీ మానస్’పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040–24655027 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈసారి ప్రశ్న పత్రాల్లో తప్పులు రావు: ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శ్రుతి ఓజా ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శ్రుతి ఓజా సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతీ కేంద్రాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈసారి ఎక్కడా ప్రశ్న పత్రాల్లో తప్పులు రాబోవని హామీ ఇచ్చారు. సమావేశంలో ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదాభాయ్ పాల్గొన్నారు. -
ఇంటర్ హాల్‌టికెట్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్‌టికెట్లను ఆయన విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరవుతున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోందని, ఇప్పటికే పనులు పూర్తయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను చూసి ప్రైవేట్ యాజమాన్యాలు ఆశ్చర్యపోతాయన్నారు. ప్రభుత్వ యాప్‌లపై అవగాహన పెంచాలి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్’ వంటి యాప్స్ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేసి వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ, ఎఫ్ఎల్ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్ఎఫ్ఈ, శామో, టోఫెల్ నిర్వహణ తదితర విభాగాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు. విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్ మెసేజ్‌గా అనువాదం చేసుకోవచ్చన్నారు. ఫార్మెటివ్ సమ్మేటివ్ పరీక్షల మార్కులను డిజీ లాకర్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజమాన్య పాఠశాలలను ఎస్సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఈ నెల 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును అధ్యయనం చేస్తాయన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను బుధవారం నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్‌ను జోడించారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలోకి ఫోన్లను అనుమతించరు. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్ ఫోన్‌ను మాత్రమే వినియోగించనున్నారు. ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే ఉపయోగపడుతుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు సాధ్యపడదు. పైగా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షలకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. దీంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారం ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు సెంటర్లలో హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండేళ్లు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. -
మేలో ఎంసెట్?
సాక్షి, హైదరాబాద్ః ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జేఎన్టీయూహెచ్కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్ కన్వీనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది. టెన్త్‌పై మరోసారి సమీక్ష గతేడాది ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎంసెట్ ప్రశ్న పత్రాం కూర్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్న తాధికారులు చర్చించారు. ఇదే క్రమంలో పదవ తరగతి పరీక్షలపైనా ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలు స్తోంది. మార్చితో ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇదే నెల ఆఖరు వారంలో లేదా ఏప్రిల్ మొదటి వా రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో మార్పులు, చేర్పులు చేయాలా అనే అంశంపై త్వరలో అధికారులు మరో దఫా సమీక్షించే వీలుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16న (గురువారం) ప్రారంభం అవుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో.. తెలంగాణలో మొత్తం 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20-25 పరీక్ష కేంద్రాలకు కలిపి ఒక అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. -
AP Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 22వ తేదీ (బుధవారం) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. 10.01 లక్షల మంది విద్యార్థులు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి పరీక్షలను.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. -
బోర్డు మెటీరియల్ భేష్! కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు అక్కడి నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో బోర్డు ఇచ్చిన స్టడీ మెటీరియల్ విశ్వసనీయతను చాటుకుంది. ఇందులోంచే ఎక్కువ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే రావడం విశేషం. ఈసారి చాయిస్ ఎక్కువ ఇవ్వడంతో సమాధానం తెలియని ప్రశ్నలను చాయిస్ కింద వదిలేసే అవకాశం ఉంది. అయితే చాయిస్లోని ప్రశ్నలు కూడా మెటీరియల్ నుంచే ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యంగా ఇంటర్ తరగతులు మొదలయ్యాయి. దీంతో మారుమూల గ్రామాల విద్యార్థులు సరిగా పాఠాలు వినలేకపోయారు. అయితే వారిలో చాలా మంది బోర్డు మెటీరియల్‌ను అనుసరించడంతో పరీక్షలను తేలికగా రాయగలిగారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ► ఇంటర్ ఫస్టియర్ బోటనీ పేపర్లో సెక్షన్–ఏ నుంచి ఇచ్చిన 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14 ప్రశ్నలకు, సెక్షన్–సీలో 4 ప్రశ్నలూ మెటీరియల్లోనివే కావడం విశేషం. ► ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పేపర్లో సెక్షన్–ఏలో ఇచ్చిన ఏడు ప్రశ్నలూ బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. సెక్షన్–బీలో 18 ప్రశ్నలకు 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 21 ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే వచ్చాయి. ► గణితం పేపర్లో సెక్షన్–ఏలో 15 ప్రశ్నలకు 11, సెక్షన్–బీలో 12 ప్రశ్నలకు 6, సెక్షన్–సీలో 10కి ఆరు ప్రశ్నలు మెటీరియల్లోనివే. ► ఇంటర్ సెకండియర్ బోటనీ పేపర్ సెక్షన్–ఏలో ఇచ్చిన 15కు 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14కు 14 ప్రశ్నలు, సెక్షన్–సీలో ఇచ్చిన 4 ప్రశ్నలూ మెటీరియల్ నుంచే రావడం విశేషం. ► పొలిటికల్ సైన్స్ పేపర్లోని సెక్షన్–ఏలో ఏడుకు ఏడు, సెక్షన్–బీలో 18కి 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 19 ఇందులోంచే అడిగారు. ► సెకండియర్ గణితంలో సెక్షన్–ఏలో 15ప్రశ్నల కు 13, సెక్షన్–బీలో 12కు 6, సెక్షన్–సీలో పదికి 9 ప్రశ్నలు బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. భయం పోయింది.. కరోనా వల్ల క్లాసులు రెగ్యులర్‌గా జరగకపోవడంతో పరీక్షలంటే కొంత భయం ఉండేది. నెల నుంచి బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. బోటనీ పేపర్లో ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వచ్చాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం కలిగింది. – వైద్యం అమర్త్య శాండిల్య, (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) మెటీరియల్‌పై దృష్టి పెట్టండి.. ప్రతి విద్యార్థికీ ఇది కీలక సమయం. ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వస్తున్నాయి. మున్ముందు రాసే పేపర్లు కూడా ఇదే రీతిలో ఉండే వీలుంది. ఎక్కువ సమయం బోర్డ్ స్టడీ మెటీరియల్‌పై దృష్టి పెట్టండి. – ఉడిత్యాల రమణారావు (రీడర్, ఇంటర్ బోర్డ్) నూరు శాతం ఉపయోగపడాలనే.. కరోనా వల్ల జరిగిన విద్యా సంవత్సర నష్టం విద్యార్థుల పై పడకూడదనే బేసిక్ స్టడీ మెటీరియల్ అందించాం. ఇది 100% విద్యార్థులకు ఉపయోగపడాలన్న కోణంలోనే రూపొందించాం. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు మెటీరియల్ దోహదపడాలన్నదే మా లక్ష్యం. మున్ముందు కూడా ఇదే రీతిలో స్టడీ మెటీరియల్ మేలు చేస్తుంది. – సయ్యద్ ఒమర్ జలీల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) 75కు 70 మార్కులు గ్యారంటీ.. నెల నుంచి ఇంటర్ బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. ఎక్కువ ప్రశ్నలు అందులోంచే రావడంతో మ్యాథమెటిక్స్‌లో 75కు 70 మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. – టి. నిఖిత, ఇంటర్ సెకండియర్ విద్యార్థిని (వంగూర్, నాగర్‌కర్నూల్) -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీ సర్కారు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందాలంటే ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా అధికారులతో సమావేశమైన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ అంశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇంటర్ మార్క్స్(కచ్చితంగా ఇన్ని మార్కులు ఉండాలనే) నిబంధన ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: Afghanistan Crisis: భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు -
పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆరోగ్య భద్రతతోపాటు విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియెట్ పరీక్షలపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని 12వ తరగతి పరీక్షలపై కేంద్రం రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షలపై చర్చ మొదలైంది. సీబీఎస్ఈ పరీక్షలపై ప్రధాని నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ విద్యార్థుల ఆసక్తితోపాటు వారి భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని విద్యాశాఖ భావిస్తోంది. పలుమార్లు సమీక్షలు టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ పలుమార్లు వివిధ సంఘాలు, ఇతరులతో నిర్వహించిన సమావేశాల్లో ఎక్కువ మంది కరోనా పరిస్థితులు సద్దుమణిగితే పరీక్షల నిర్వహణే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై అధికారులతో పలుదఫాలు సమీక్షలు జరిపారు. గత నెలలో నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలను విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా వాయిదా వేయడంతో పాటు జూన్ 7 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు కూడా వాయిదా వేయాలని ఆదేశించారు. వైరస్ తగ్గుముఖం పట్టాక విద్యార్ధుల ఆసక్తిని అనుసరించి పరీక్షలు నిర్వహించేలా కేంద్రం ఒక ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్రంలో కూడా దీన్ని అనుసరించి కోవిడ్ కేసులు తగ్గాక ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలను బోర్డు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వతేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్స్‌కు 3,58,474 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేంద్రానికి రాష్ట్రం లేఖ సీబీఎస్ఈ పరీక్షలపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రం అభిప్రాయాలను వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోవిడ్ తగ్గుముఖం పట్టాక పరీక్షల నిర్వహణ మంచిదని పేర్కొన్నారు. దీనిపై లిఖిత పూర్వకంగా లేఖ ద్వారా అభిప్రాయాలను కేంద్రానికి పంపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ నిర్వహించామని, థియరీ పరీక్షలకూ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు 8 రోజుల్లో పరీక్షలు పూర్తవుతాయని, 5 లేదా ఆరు పేపర్లు మాత్రమే రాసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. కోవిడ్ కేసుల కారణంగా పరీక్షలు వాయిదా వేశామని, తదుపరి కొత్త షెడ్యూల్‌ను 15 రోజులు ముందు విద్యార్థులకు తెలియచేస్తామన్నారు. మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 40 రోజుల సమయం అవసరమవుతుందన్నారు. 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ కేసులు తగ్గాక ఆగస్టులో 10+2 (ఇంటర్మీడియెట్) పరీక్షలు నిర్వహించవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు వీలుగా సిబ్బంది కోసం అదనంగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరారు. సీబీఎస్ఈ బోర్డు తన పరిధిలోని పరీక్షలపై నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పరీక్షలపై ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూలైలో పరిస్థితులను మదింపు చేసుకొని ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. -
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం అని తెలిపారు. ఇందుకు సంబంధించి తర్వలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. పరీక్షలు రద్దయ్యాయని అడ్మిషన్లు చేసే ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా పనిచేసే కాలేజీలపై చర్యలు తప్పవని మంత్రి తెలిపారు. చదవండి: ఉజ్వల భవిష్యత్తు కోసమే పరీక్షలు -
జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. జూన్ నెలాఖరుకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిర్వ హించిన వర్చువల్ సమావేశంలో ప్రభుత్వం వెల్ల డించింది. అయితే జూన్ నెలాఖరుకు కరోనా అదు పులోకి వస్తుందో లేదోనన్న భావన అధికారుల్లో నెలకొంది. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్లు తెలిసింది. దీనిపై వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం మాత్రం జూన్‌లో పరీక్షల నిర్వహణ వైపు మొగ్గు చూపుతుందా? జూలైలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తుందా? అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. సగం ప్రశ్నలకే జవాబులు రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రశ్న పత్రాలను కూడా ముద్రించింది. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. తర్వాత వీలైనప్పుడు నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పుడు జూలైలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు ఇప్పటికే ముద్రించిన ప్రశ్న పత్రాలనే వినియోగించాలని భావిస్తోంది. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రశ్న పత్రంలో ముద్రించిన ప్రశ్నల్లో అన్నింటికీ కాకుండా సగం చాయిస్ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్థులు సమాధానాలు రాసిన సగం ప్రశ్నలకు వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆప్షన్‌గానే ఫస్టియర్ పరీక్షలు.. జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్‌గానే నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ 45 శాతం కనీస మార్కులతో పాస్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. -
ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రం సిద్ధం: మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఉజ్వల భవిష్యత్తు కోసమే పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌తోపాటు మంత్రులు స్మృతి ఇరానీ, సంజయ్ ధోత్రే, ప్రకాష్ జవదేకర్, గోవా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పలు అంశాలను వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేపట్టాం. పరీక్షల నిర్వహణలో ఒక విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఏదైనా ఆదేశాలు వస్తాయని భావించాం. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్‌తోపాటు ప్రతి చోటా ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. విద్యా రంగం ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ బోధన, ఉపాధ్యాయులకు శిక్షణతోపాటు సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ల కోటాను కేంద్రం పెంచాలి’ అని మంత్రి సురేష్ పేర్కొన్నారు. నీట్, జేఈఈ సెప్టెంబర్‌లో నిర్వహించాలి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి సురేష్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఇంటర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నా రెండు నెలల సమయం కావాలి. పరీక్షల నిర్వహణ అనంతరం మూల్యాంకనం, ఫలితాల విడుదలకు మరో 15 రోజులు అవసరం. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఇప్పటికే నిర్వహించాం. ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులు తమ దగ్గరలోని సెంటర్లో రాసేందుకు వీలుగా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తున్నాం. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేలా యాప్ రూపొందించాం. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర బోర్డు ద్వారా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ముందుకు వెళ్తాం. జేఈఈ, నీట్ లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా సెప్టెంబర్‌లో నిర్వహిస్తే మంచిది. అదే సమయంలో రాష్ట్రంలోని ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తాం’ అని చెప్పారు. పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ ప్రతిపాదనలు పరీక్షల నిర్వహణపై సమావేశంలో సీబీఎస్ఈ కొన్ని ప్రతిపాదనలను చేసింది. పరీక్షలను యథాతథంగా మూడు గంటల పాటు ముఖ్యమైన పేపర్ల మేరకు నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన. పరీక్షల సమయాన్ని సగానికి తగ్గించి అందుకు అనుగుణంగా ప్రశ్నపత్రాల్లో, ప్రశ్నల్లో మార్పులు చేయడం, వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వడం, పరీక్షలను ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే నిర్వహించి అక్కడే మూల్యాంకనం చేసి ఫలితాలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను ఈనెల 25వ తేదీలోగా పంపాక వాటిని అనుసరించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ప్రతిపాదించారు. -
ఇంటర్ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మన విద్యార్థులు వెనుకబడకూడదనే.. ’కోవిడ్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే రూపొందించిన విషయం తెలిసిందే. కానీ 10వ తరగతి, 11, 12వ తరగతి (ఇంటర్) పరీక్షలకు సంబంధించి దేశమంతా వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం, ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివే విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ, ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షలకు కూడా ఇంటర్లో కనీసం నిర్దిష్ట శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. పిల్లల కెరీర్ పరంగా చూసినా, ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే పై చదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ మన విద్యార్థులు వెనకబడకుండా చూడాలనే బాధ్యతతో పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది. పూర్తిగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక పిల్లల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి ఇక మిగిలిన పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది. పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం. అయితే దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, దీన్ని పరిగణలోకి తీసుకుంటూ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటిస్తుంది. ఇదే విషయాన్ని రేపు హైకోర్టుకు కూడా తెలియజేస్తాం. ఇంటింటా చదువుల విప్లవం.. ఇంటింటా చదువుల విప్లవంతో ఈతరం విద్యార్థులు ప్రపంచంలో గొప్పగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 23 నెలలుగా ఎంత తాపత్రయపడుతోందో ప్రతి కుటుంబానికీ తెలుసు. జగనన్న అమ్మ ఒడి, నాడు –నేడు, ఇంగ్లీష్ మీడియం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ లాంటి అనేక పథకాలను తెచ్చి కోవిడ్ సమయంలో కూడా వెనుకంజ వేయకుండా అమలు చేస్తోంది. నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి కుటుంబం స్థితిగతులను గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎంత బాధ్యత, మమకారం ఉంటుందో రాష్ట్రంలో పిల్లల పట్ల మనందరి ప్రభుత్వానికీ అంతే బాధ్యత, మమకారం ఉంది. వారి భవిష్యత్తును గొప్పగా నిర్మించేందుకు ఇక మీదట కూడా ఆలోచనా చేస్తాం’. నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు. పరీక్షల తేదీలను ప్రకటించిన అనంతరం బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కళాశాలలకు హాజరు కావాలని సూచించారు. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. చదవండి: స్టాలిన్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు -
నాడు–నేడు మనబడి పనుల్లో పూర్తి నాణ్యత పాటించాలి
-
విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాడు–నేడు (పాఠశాల విద్యాశాఖ)పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్న అధికారులు, ఆ వివరాలను ప్రజెంటేషన్‌లో చూపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్ వేయండి. నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్లో నాడు ఆ స్కూల్ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది’’ అన్నారు. ‘‘స్కూళ్లలో పెయింటింగ్ పనులు, స్మార్ట్ టీవీలు, వాల్ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి .పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు.అలాగే మే, జూన్ నెలల్లో పూర్తిగా పనులు నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్ సందర్శించాలి. అన్నీ నోట్ చేయాలి. క్వాలిటీ ఆడిట్ పూర్తి కావాలి. టాయిలెట్ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి’’ అని తెలిపారు. ‘‘ఇంగ్లిష్ మీడియమ్‌లో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పగలుగుతారు.పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలి.ఈసారి కిట్లలో ఇంగ్లిష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి.జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు–నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ: సీఎం కాగా, ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. ఎందుకు అన్నది చెప్పాలి: ‘‘ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దాంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి’’ అన్నారు. పరీక్షలతో కలిగే ప్రయోజనం: ‘‘పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి.. పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా. కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. మంచి చేయాలనే: ‘‘విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలి. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాము’’ అన్నారు. టీచర్లు గుర్తించాలి: ‘‘విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి’ అని సీఎం జగన్ సూచించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ -
ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
-
ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు అనివార్యమని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం విజయవాడలో మంత్రి.. ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదని, కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని అనవసర రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసిన అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. వచ్చే నెల 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద నిఘా ఉంటుందని, ప్రతీ రోజు తాను కూడా పరీక్షల తీరును సమీక్షిస్తానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: తలరాత మార్చేది చదువులే ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసమే.. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆదివారాలు సహా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ చెప్పారు. ‘సాక్షి’తో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. కోవిడ్ దృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రోటోకాల్‌ను అనుసరించి పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి చేసినట్టు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ.. కోవిడ్ తీవ్రత ఉండి కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల చివరి విడతలో పరీక్షలు నిర్వహిస్తాం. మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా పరీక్షలు జరుగుతాయి. కోవిడ్–19 దృష్ట్యా ప్రోటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లోకి భౌతిక దూరం పాటిస్తూ ప్రవేశించాలి. ప్రాక్టికల్ పరీక్షలకు బ్యాచ్‌కు 20 మంది చొప్పున ఉంటారు. అంతమంది పట్టే వీలులేని చోట భౌతిక దూరం ఉండేలా 10 మందిని మాత్రమే అనుమతిస్తాం. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేస్తాం. గతంతో పోలిస్తే ఈసారి 42 కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేశాం. గతంలో 905 కేంద్రాలుండగా.. ఈసారి 947 ఏర్పాటు చేశాం. విద్యార్థులు, సిబ్బందికి పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నాం. ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో విడుదల చేస్తాం. తమ ఫోన్లకు వచ్చే ఓటీపీ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు ఆన్లైన్ ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయిస్తారు. ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేయడానికి వీల్లేదు. జిల్లాల పరిధిలోనే టాస్క్‌ఫోర్స్ నిఘా కరోనా వల్ల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను గతంలో మాదిరిగా ఇతర జిల్లాల నుంచి నియమించడం లేదు. ఆయా జిల్లాల సిబ్బందితోనే టాస్క్‌ఫోర్స్‌లు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. అక్రమాలపై ఫిర్యాదులు వస్తే సీసీ కెమెరాలు పరిశీలించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. పరీక్షల సమాధాన పత్రాలు, అవార్డుల లిస్టులు పరీక్ష ఫలితాలు వెలువడే వరకు భద్రపర్చాలని ఆదేశించాం. ఒకరి రికార్డులను వేరొకరు మళ్లీ వినియోగించే వీలు లేకుండా వాటిపై ప్రత్యేక ముద్రలు వేయిస్తున్నాం. ప్రైవేట్ కాలేజీల్లోని ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ప్రభుత్వ సిబ్బందినే చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా నియమిస్తున్నాం. ఇతర సిబ్బంది ఎవరినీ లోపలకు అనుమతించం. చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప మిగతా వారెవరూ పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా కాలేజీల ప్రిన్సిపాల్స్ సంతకాలతో ప్రమేయం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి ఈ పరీక్షలకు ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్ నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరు కానున్నారు. జేఈఈ, నీట్ సహా అనేక జాతీయ ప్రవేశ పరీక్షలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలతో ముడిపడి ఉన్నందున విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ప్రాక్టికల్, ఇతర పరీక్షలను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కనుక పరీక్షలను ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. అవాంఛనీయ పరిస్థితులకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు పూర్తి సహకారం అందించాలి. -
ప్రాక్టికల్స్ బదులు ప్రాజెక్ట్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు, థియరీ పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో సగం మందితో ఆఫ్‌లైన్, మిగతావారికి ఆన్లైన్లో బోధన సాగేలా బోర్డు అన్ని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పలు కాలేజీలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ నిలిపేసి ఫీజుల వసూలుకు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తుండడంతో.. అలా కుదరదని, రెండు రకాల బోధన కొనసాగించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. అయితే కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం బోర్డు తర్జనభర్జనలు పడుతోంది. ప్రాక్టికల్స్ స్థానంలో అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి ప్రాక్టికల్స్ నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రాక్టికల్స్‌కు కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులందరినీ జంబ్లింగ్ విధానంలో ఆయా కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు అనుమతిస్తారు. కోవిడ్ వల్ల విద్యార్థులు ఆయాకేంద్రాలకు చేరుకోవడం ఒక ఇబ్బంది అయితే ల్యాబ్ రూములు చిన్నవిగా ఉన్నందున అక్కడ అందరూ గుమిగూడి ప్రయోగాలు నిర్వహించడం కూడా సరికాదని బోర్డు భావిస్తోంది. ఈ ప్రాక్టికల్స్‌కు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో రోజూ మార్చే విధానం అమలు చేస్తున్నారు. వైరస్ నేపథ్యంలో ఈ విధానం అనవసర సమస్యలకు దారితీసే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు బదులు అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులను ఇచ్చి ఎవరికివారే వాటిని పూర్తిచేసి సమర్పించేలా చేయాలని ఆలోచిస్తున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులకే థియరీ పరీక్షలు కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరాంతంలో నిర్వహించాల్సిన థియరీ పరీక్షల్లో కొన్ని మార్పులు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టలేదు. ఆన్లైన్ ప్రవేశాలపై చాలాకాలం కిందటే ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. జూనియర్ కాలేజీల్లోని సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సీబీఎస్ఈ మాదిరి 40కి పరిమితం చేస్తూ ప్రభుత్వం జీవో 23 ఇచ్చింది. వీటిపై కొన్ని కాలేజీలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆ జీవో అమలు, ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టనందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగాల్సిన థియరీ పరీక్షలను ఈ విద్యాసంవత్సరం వరకు సెకండియర్ విద్యార్థులకే పరిమితం చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరం తరగతులు జరుగుతున్న సమయంలోనే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వరకు పాతపద్ధతిలోనే ప్రవేశాలు జీవో 23ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ముందుకు సాగలేదు. దీనిపై ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్లాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పై కోర్టుకు వెళ్లి, తరువాత ప్రవేశాలు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమైనందున ఈ విద్యాసంవత్సరం వరకు ఫస్టియర్ ప్రవేశాలను గతంలో మాదిరి ఆఫ్‌లైన్‌లో పూర్తిచేయడం మంచిదని బోర్డు భావిస్తోంది. ఆన్లైన్ ప్రవేశాలపై ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బోర్డు ఆదేశాలు జారీచేయడంతో పాటు దానికి విస్తృత ప్రచారం కూడా కల్పించారు. అన్ని కాలేజీల వసతి ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆన్లైన్లో ఫొటోలు, ఇతర పత్రాలను కూడా అప్లోడ్ చేయించారు. అయినా కొంతమంది ప్రచారం చేయలేదని, ఆన్లైన్ ప్రవేశాలపై జీవో ఇవ్వలేదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ప్రవేశాలు నిలిచిపోయాయి. వాస్తవానికి బోర్డు స్వయం ప్రతిపత్తి ఉన్నది కనుక జీవోలతో సంబంధం లేకుండానే తన కార్యకలాపాలను సాగించే అవకాశముంది. అయినా ఆ కారణాలనే చూపుతూ న్యాయస్థానం ఆన్లైన్ ప్రవేశాలను నిలిపేసినందున ప్రస్తుతానికి పాత విధానంలోనే వాటిని పూర్తిచేయాలని బోర్డు భావిస్తోంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలకు బదులు ప్రాజెక్టు వర్కులు ఇవ్వాలని, థియరీ పరీక్షలు సెకండియర్ విద్యార్థులకే నిర్వహించాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఫస్టియర్ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసిన తరువాత పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలను నివేదించాం. ప్రభుత్వ ఆమోదానంతరం చర్యలు చేపడతాం. ఫస్టియర్ ప్రవేశాలపైనా ప్రభుత్వ సూచనలను అనుసరించి ముందుకు వెళ్తాం. – రామకృష్ణ, బోర్డు కార్యదర్శి -
నిమిషం లేటు.. మారిన ఫేటు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకాగా, రేపటినుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:45లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఉరుకులు పరుగులతో 8గంటలకే సెంటర్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే నిమిషం నిబంధన, ఇతర కారణాల వల్ల పలుచోట్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు వెన్నెల రాజేశ్వరి అనే విద్యార్థినిని పోలీసులు పరీక్ష రాయటానికి అనుమతివ్వలేదు. పెద్దపల్లి : జిల్లాలోని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో మరో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ లేకుండా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు అక్కడినుంచి వెనుతిరగాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి : రామన్న పేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కాలేజీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సెంటర్ దగ్గరకు ఆలస్యంగా రావటంతో పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. వారిలో ఐదుగురిది రామన్నపేట గవర్నమెంట్ కాలేజ్, ఒకరిది నలంద కాలేజ్‌గా గుర్తించారు. నిజామాబాద్ : జిల్లాలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష మిస్ అయ్యారు. వారిలో నిజామాబాద్‌కు చెందిన గణేష్ అనే విద్యార్థి సెంటర్ పేరు సేమ్ ఉండటంతో కన్ఫ్యూజన్కు గురై మరో సెంటర్‌కు వచ్చాడు. దీంతో అధికారులు అతడ్ని బయటకుపంపించేశారు. అదేవిధంగా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అనిత 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించలేదు. -
మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు
-
ఏజే కళాశాలలో అంతా ఫెయిల్..
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ ఫలితాల సాధనలో కృష్ణా జిల్లా అగ్రగామిగా నిలిచినా.. మచిలీపట్నంలోని కొన్ని కళాశాలల ఫలితాలు మాత్రం దయనీయంగా వచ్చాయి. మచిలీపట్నంలోని ఏజే (ఆంధ్రజాతీయ) కళాశాల నుంచి 11 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇక్కడి విద్యార్థులంతా ఫెయిలయ్యారు. జిల్లాలో 22 ఎయిడెడ్ కళాశాలలు ఉండగా, ఇక్కడి విద్యార్థులు సాధించిన ఫలితాల మేరకు ర్యాంకులను ఇంటర్మీడియెట్ అధికారులు ప్రకటించారు. ఏజే కళాశాల నుంచి 11 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరుకాగా ఒక్కరు కూడా పాస్‌కాకపోవటంతో ఈ కళాశాలకు సున్నా వేశారు. దీంతో ఫలితాల్లో అట్టడుగున నిలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. అదే విధంగా హిందూ ఎయిడెడ్ కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపుల నుంచి 65 మంది పరీక్షలు రాయగా, ఇందులో ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపు నుంచి 21 మందికి ముగ్గురు పాసయ్యారు. సీఈసీ గ్రూపు నుంచి 44 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న ఆయా కళాశాలల్లో ఇంత అధ్వానంగా ఫలితాలు రావటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.