jajula srinivas goud
-
సమగ్ర కులగణనకు సై!
సాక్షి, హైదరాబాద్: సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయాల్లో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్ర కులగణనకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సమగ్ర కులగణనకు సంబంధించిన జీఓ ఎంఎస్ 26ను జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. నిర్వహణకు రూ.150 కోట్లు...: ఈ సర్వే చేపట్టేందుకు కనీసంగా రూ.150కోట్లు బడ్జెట్ అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సర్వే ఖర్చు కోసం నిధులను 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ఈమేరకు తాజా ఉత్తర్వుల్లో బడ్జెట్ అంశాన్ని పొందుపర్చింది. సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉత్తర్వుల్లో వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తారు. జీఓ విడుదల హర్షణీయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమగ్ర కులగణన జీఓ విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలను సేకరింంచేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం. రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా. దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్ పేరు పెడుతున్నాం. -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
బీసీల మహాధర్నాతో హోరెత్తిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంతో జంతర్‌మంతర్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీ కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుండి 50%కి పెంచాలన్న డిమాండ్లపై పార్లమెంట్లో రోజూ పోరాడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను బీసీ ప్రధానినని చెప్పుకొంటున్నా.. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఐక్యంగా ముందుకు సాగితే కేంద్రం దిగిరాక తప్పదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. ధర్నాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతి కుమార్ యాదవ్ సమన్వయం చేయగా.. ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే, మాజీ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), హన్సరాజ్ (ఢిల్లీ) రాజేష్ షైనీ (హరియాణా), విక్రమ్ సాహా మాట్లాడారు. -
ధరలు వంద శాతం పెరిగితే, మెస్ చార్జీలు 25% పెంపా?
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులపై సీఎం కేసీఆర్ కలగజేసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసరాల ధరలు 100 శాతం పెరిగితే, మెస్‌చార్జీలు 25 శాతం మాత్రమే పెంచుతామనడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల మెస్ చార్జీలను 25 శాతం మేర పెంచాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశం నిర్ణయించడం హర్షణీయమైనప్పటికీ, ఈ నిర్ణయం గుడ్డిలో మెల్ల లాగా మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. పెరిగిన -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: జాజుల
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బండి స్వామి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ గౌడ్లను నియమించారు. అనంతరం జాజుల మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించకుండా పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. ఆర్టీసీలో చాలాకాలంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం జరిగే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధాన మంత్రికి మెయిల్ ద్వారా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 2021–22 బడ్జెట్ మొత్తం రూ. 39 లక్షల కోట్లు ఉండగా బీసీలకు కేవలం రూ. 2015 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా బీసీ గురుకుల పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ తదితర కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ, రాష్ట్ర నాయకుడు రాపర్తి సంతోష్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. -
చైర్మన్ శ్రావణిని అవమానించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణిని రాజకీయంగా వేధించి, అవమానపరిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఒక మహిళ మీడియా సమక్షంలో తనను వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం బాధాకరమని, మహిళా చైర్మన్‌ను రాజకీయంగా అణచివేయడమంటే మొత్తం బీసీ సమాజాన్ని అణచివేయడమే అవుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ మహిళలు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల హైదరాబాద్‌లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి వేధింపులు తాళలేకి కన్నీరు పెట్టుకుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు బీసీలను కించపర్చడం కొత్తేం కాదన్నారు. గతంలో బీసీ లేదు గోసిలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారని, రిజర్వేషన్లు ఎత్తేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారని జాజుల తెలిపారు. మరో వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే దేనికీ పనికిరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిపై సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. -
విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్ 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి భవన్లు నిర్మించుకోవడానికి నిధులు ఉంటాయిగానీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి భవనాలు నిర్మించడానికి నిధుల కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. చదువుకోసం, సామాజిక న్యాయసాధన కోసం తలపెట్టిన బీసీ విద్యార్థుల పోరుయాత్ర ముగింపు సభ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో జరిగింది. డిసెంబర్ 2న పాలమూరులో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను జ్ఞాన తెలంగాణ చేయకుండా గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ విద్యను వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బడులు మూసి, బార్లు తెరుస్తున్న కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బకాయిపడ్డ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఓటు మనదే.. సీఎం సీటు మనదే.. అని నినాదమిచ్చారు. ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకోసం రాజకీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు బర్లు, గొర్లు కాదు, బడులు కావాలె
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్షిప్లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్ర’
ఖైరతాబాద్ (హైదరాబాద్): బీసీ జనగణనపై పార్లమెంట్లో తీర్మానించకపోతే అమరావతి నుంచి హైదరాబాద్ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని ఒక హోటల్లో తెలంగాణ, ఏపీకి చెందిన బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో అన్ని వర్గాలకు.. వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు. ఈ విషయాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్రతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు శంకర్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర
మన్సూరాబాద్: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. -
బీసీలకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ పెడతా: జాజుల
మునుగోడు: త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రానున్న 2023 ఎన్నికల ముందు బీసీల పార్టీ పెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బీసీల ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లు, మరో 30 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారని, అందువల్ల బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీలకు టికెట్ ఇస్తే గెలవరని చెబుతున్నారని, మంత్రి పదవులు చేసిన అభ్యర్థులను ఓడించిన చరిత్ర బీసీలకు ఉందని జాజుల గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రాకు చెందిన నెల్లూరు ఆడబిడ్డకు ఎలా ఇస్తారని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలా తయారైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీల పార్టీ పెట్టి తాను మునుగోడు నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీసీల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరం కోసం పోరాడుతానని జాజుల వెల్లడించారు. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలని ఆయన కోరారు. -
ఢిల్లీ కేంద్రంగా బీసీలు ఉద్యమించాలి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యం సాధించాలని, బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, ఆగస్టు 7న ఢిల్లీలో తలపెట్టిన ‘ఓబీసీ జాతీయ మహాసభ’లో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి సారి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఆగస్టు 7న ఢిల్లీలో తలకోటోర్ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను శుక్రవారం మంత్రుల నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంపు డిమాండ్లపై బీసీలంతా ఐక్యంగా పోరాడాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభ: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. -
భూ బకాసురులను వదిలి గుడిసెల మీదా దాడి చేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు. -
విశ్వకర్మలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి జాజుల శ్రీనివాస్‌గౌడ్
పంజగుట్ట: విశ్వకర్మలపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్యని, ఆయన విశ్వ కర్మలకు బహి రంగ క్షమాపణ చెప్పా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి త్యాగం, ప్రొఫెసర్ జయశంకర్ ఆలో చనా విధానం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని గుర్తుం చుకోవాలని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ కుల, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భాష, యాష పేరుతో అణగారిన వర్గాల వారిని కించపరచడం కేసీఆర్, కేటీఆర్‌లకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. సంఘం నేతలు పున్నమాచారి, రాజేశం మాట్లాడుతూ ఆందోళన చేసిన విశ్వకర్మలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, ఓయూ జేఏసీ దరువు అంజన్న, రంగాచారి, బైరాగి మోహన్, మన్నారం నాగరాజు, ఇందిర, రవీంద్రాచారి, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభకు ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం లేదని, రెండు మూడు కులాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండా ప్రకాశ్ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్...డి.శ్రీనివాస్ స్థానంలో బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సగంమంది బీసీలకు అవకాశం కల్పించారని కొనియాడారు. -
బీసీ క్రీమీలేయర్ రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు క్రీమీలేయర్‌ను విధించి, రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలుకాకుండా అడ్డుకుంటున్నారని, తక్షణమే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని అఖిల భారత బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. అఖిల భారత బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, ఓబీసీ పార్లమెంటు సభ్యుల ఫోరం మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ తైవాడే, బీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కరుణానిధి, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ సహా పలువురు పాల్గొని ప్రసంగించారు. దేశంలో వెంటనే బీసీ జనగణన చేపట్టాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి బీసీల సంక్షేమానికి కనీసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని వక్తలు కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టులో కనీసం లక్షమందితో ఢిల్లీ్లలో బీసీల మహాప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. సమావేశానికి దానకర్ణచారి, పాండు మల్లేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
రాజ్యాంగ పరిరక్షణలోనే మహిళా సాధికారత
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్): రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలోనే మహిళాసాధికారత ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– మహిళాహక్కులు, సాధికారత’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీతక్క మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరి హక్కులు, దేశ అస్తిత్వం గురించి చెప్పిన మహానీయుడని, ఆయన రాసిన రాజ్యాంగం ఈ సమాజం ఉన్నంతవరకు ఉండాలని అన్నా రు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, ఆదేశిక సూత్రా లను పటిష్టంగా అమలు చేస్తామని చెప్పాల్సిందిపోయి ఏకంగా దానినే మార్చాలనడం బాధాకరమన్నారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలనే మాటల వెనుక కుట్ర దాగి ఉంద ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ప్రశ్నించేహక్కు లేకుండా చేయడానికే రాజ్యాంగమార్పు అనే వాదనకు తెరతీశారని విమర్శించారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధ పాల న చేయడానికి సిద్ధంగా లేరని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, కేసీఆర్‌ను’అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యురాలు ఇందిరాశోభన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మి, రచయిత్రి దాసోజు లలిత, మాలమహానాడు మహిళా అ«ధ్యక్షురాలు గీతాంజలి, మాదిగ మíహిళా సాధికారత నాయకురాలు జె.పి.లత, బీసీ మహిళానేత భాగ్యలక్ష్మి, డాక్టర్ జరీనా సుల్తానా, గడ్డి పద్మావతి, టీడీపీ నాయకురాలు జోత్సా్న, ఐద్వా నాయకురాలు అరుణజ్యోతి, డాక్టర్ రత్నమాల, ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ నాయకురాలు చంద్రముఖి, బహుజన సోషలిçస్టు పార్టీ నాయకులు టి.ప్రదీప్ పాల్గొన్నారు. -
సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: జాజుల
కవాడిగూడ: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, అదే రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం అవివేకమ న్నారు. రాజ్యాం గాన్ని మార్చాలని సీఎం చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమాన పరిచారని, దీనికి నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పెంచాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమాన్ని తెచ్చే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, ఇప్పటికే అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని విమర్శించారు.గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
జీవో 317ను రద్దు చేయాలి
పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్‌ను కోరారు. జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన, బిహార్ వాసి అయిన సీఎస్ సోమేష్ కుమార్‌కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ
పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌తో డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.