Kodada
-
కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు
సాక్షి,సూర్యాపేటజిల్లా: కోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: బాలికపై సామూహిక లైంగికదాడి -
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్ మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్ చేసి మెసేజ్‌ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నాకు పొలిటికల్ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం. -
కోదాడలో వరద బీభత్సం..
-
సింగపూర్‌లో కోదాడకు చెందిన పవన్ దుర్మరణం
సింగపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారంసాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన పవన్ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న పవన్ అకాలం మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీకి బీఆర్ఎస్ బ్రేక్.. కోదాడలో ఉత్కంఠ పోరు?
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్ అయిన కోదాడలో ఏపీ రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో టిల్లర్ల ఓటు బ్యాంక్ ప్రభావం ఉన్న నియోజకవర్గం ఇది. ఏపీ, తెలంగాణకు ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాలు కలిసిన వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడ తెలంగాణవాదం తక్కువే. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచారు. కానీ ఫస్ట్‌టైం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు... కాంగ్రెస్, టీడీపీ కంచుకోటలకు బీఆర్ఎస్ బ్రేక్: నిజానికి కోదాడ నియోజకవర్గం మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా సైకిల్ దిగి కారెక్కారు. దాంతో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లింది. దాంతో మల్లయ్య యాదవ్ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు : ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉన్నట్లు కనిపించినా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకే మరోసారి టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్తమ్ పద్మావతీ పోటీ చేయనున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో రెండు పదవులు అంశం తెరపైకి వస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి నూకల పద్మారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ నియోజవర్గం నుంచి వెళ్తున్నా మోతే లాంటి ప్రాంతాలకు చివరి భూములకు నీరు అందడం లేదని అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఇక కోదాడలో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురికావడం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ కబ్జాలను అడ్డుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్తు టాక్ నడుస్తోంది. మరోవైపు దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం కూడా పెను దుమారాన్ని లేపింది. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ ప్రధానంగా రైతులు, వ్యాపారంపైనే అధికంగా ఆధారపడి ఉంటారు. రైసు మిల్లులు కూడా అధికంగా ఉంటాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో సెటిలర్స్ కూడా ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నిర్ణాయాత్మక పాత్రను పోషిస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి 32427 ఓట్లు, రెడ్డి 24365, గౌడ 22673 , లంబాడా19988, యాదవ్ కులస్తులు -16473, మల 11673, కమ్మ 11628, ముదిరాజ్ 9961, పెరిక 9384, ముస్లీం 8 వేలు భౌగోళిక పరిస్థితులు.. ఆలయాలు : కోదాడ మండలం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా నిత్యం భక్తులు వస్తుంటారు. అనంతగిరి మండలం గొండ్రియల రామాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మునగాల మండలం రేపాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బరకత్ గూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం. నదులు : ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. -
ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ
సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో వారు ఒప్పందం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. -
సుప్రీం కోర్టులో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చుక్కెదురు
సాక్షి, సూర్యపేట: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో ఆయనపై కేసు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో పాటు మూడేళ్ల పాటు హై కోర్టుకు హాజరు కాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేయగా దీని విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తన వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మల్లయ్య యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
వచ్చేవి కాంగ్రెస్ ప్రభుత్వాలే..
కోదాడ: అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాబోతున్నాయని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. ప్రజలను అక్కున చేర్చుకొని ముందుకుపోవడానికి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ‘గడప గడపకు కాంగ్రెస్’కార్యక్రమంలో, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకు రాహూల్‌గాంధీ సందేశం తీసుకెళ్లాలని, దీనిలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడపకు పార్టీని తీసుకెళ్లాలి బీజేపీ నుంచి దేశాన్ని కాపాడటానికి రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని మండిపడ్డారు. దేశాన్ని అదానీకి దోచిపెట్టారని, అదానీ చేసిన ఆర్థిక కుంభకోణంలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. ఆయన వెంట ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, బోస్‌రాజు, నిరంజన్, పటేల్ రమేష్‌రెడ్డి తదితరులున్నారు. దామోదర్‌రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్‌రెడ్డి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో సాక్షాత్తు మాణిక్‌రావు ఠాక్రే ఎదుటే సూర్యాపేట నియోజకవర్గ నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యాపేట కాంగ్రెస్ కంచుకోట అని, నేడు దానికి బీటలు వారడానికి కారణం ఎవరో చెప్పాలని, తమను కనీసం సమావేశానికి ఆహ్వానించలేదని రమేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దామోదర్‌రెడ్డి కల్పించుకొని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి అంత ప్రా«ధాన్యమివ్వాల్సిన అవసరం లేదనడంతో గొడవ మొదలైంది. దీంతో ఠాక్రే, ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్యాపేట: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని పార్లమెంటులో చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. దేశాన్ని బీజేపీ ఛిన్నాభిన్నం చేయబోతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్ జోడో యత్ర చేపడుతున్నట్లు చెప్పారు. చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. -
తెలంగాణలో కమలం మిషన్ 90.. అభ్యర్థులున్న నియోజకవర్గాలెన్ని?
మిషన్ 90 అంటూ ఊదరగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్నారు. ఢిల్లీ పెద్దల రాకపోకలు ఊపందుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రధాని, హోం మంత్రి రాబోతున్నారు. మరి ఆ పార్టీకి అనేక జిల్లాల్లో అభ్యర్థులే దొరకడంలేదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏదో ఈపాటికే అర్థం అయ్యే ఉంటుంది? కమలానికి పక్క పార్టీ నుంచి వచ్చే నాయకులే దిక్కా? ఎన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారు? ఈ ఏడాది ఆఖరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి రావడానికి కమలం పార్టీ ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కూడా అందుకు సిద్ధం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే సమయంలో చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక కమలం పార్టీ తీవ్ర వడిదుడుకులు ఎదుర్కొంటోంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం కౌన్సిలర్లుగా గెలిచే సత్తా ఉన్న నేతలు కూడా ఆ పార్టీలో కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అలాంటి నియోజవర్గాల్లో కోదాడ ఒకటి. ఇక్కడ బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కేడర్ ఉన్నా నడిపించే నాయకత్వం లేకపోవడంతో చతికిల పడుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుంచి ఈ సీటులో ఎవరు పోటీ చేస్తారు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. కోదాడ లైన్లో ఎవరెవరు? ప్రస్తుతం కోదాడ బీజేపీలో కనగాల నారాయణ, నూనె సులోచన, సంపత్, వేలంగి రాజు లాంటి నేతలు ఉన్నారు. కానీ వీరిలో ఎవరికీ కనీసం రెండు వేల ఓట్లు కూడా సాధించే సత్తా లేదనేది కాదనలేని వాస్తవం. గతంలో ఓసారి పోటీ చేసిన నూనె సులోచనకు వచ్చిన ఓట్లే అందుకు ఉదాహరణగా చొప్పొచ్చు. 2009 లో కోదాడ నుంచి పోటీ చేసిన ఆమెకు వచ్చిన ఓట్లు 1810 మాత్రమే. మరి ఇలాంటి నేతలను పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటం అంటే నాటు పడవతో సముద్రంలో ప్రయాణించినట్లే అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు టాక్. అందుకే సొంత పార్టీ నేతలను నమ్ముకుని నట్టేట మునిగే కంటే..ఇతర పార్టీల్లో ప్రజల్లో పట్టున్న నేతలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్లోని వర్గ విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేపై గత కొంతకాలంగా అసంతృప్తితో నిరసన గళం వినిపిస్తున్న ఇద్దరు ముగ్గురు నేతలను టార్గెట్ గా చేసుకుని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కోదాడ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న నేతతో పాటు కోదాడ పట్టణానికే చెందిన మరో కీలక నేతను కూడా బీజేపీ టచ్ చేసినట్లు కోదాడలో టాక్ నడుస్తోంది. వారు కూడా ఆలోచించుకుని చెప్తామని అన్నారట. చదవండి: (మాకు నమ్మకం లేదయ్యా.. నాకు నువ్వు, నీకు నేను అంతే!) అమెరికా నుంచి తీసుకురావాల్సిందే..! ఇదే సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఓ ఎన్నారైని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరంగా చేసినట్లు తెలుస్తోంది. ప్రయత్నిస్తున్న వారిలో ఎవరు పార్టీలో చేరకున్నా.. ప్లాన్ బీని అమలు చేసేందుకు కూడా కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న కీసర శ్రీకళా రెడ్డిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పథకం రచించిందట. ఆమె నియోజకవర్గానికే చెందిన నేత కావడం.. అందులోనూ మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కూతురు కావడంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో రంగంలోకి దించేందుకు ఇప్పటికే శ్రీకళతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. మెట్టినింట్లో రాజకీయంగా నిరూపించుకున్న ఆమె పుట్టినింట్లో నిరూపించుకోవడంతో పాటు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో కోదాడకు వచ్చేందుకు ఒప్పుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసమే ఆపసోపాలు పడుతోంది. చూద్దాం.. కోదాడలో బరిలో కమలం పార్టీ ఎవరిని దించుతుందో..? - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!
కోదాడ (సూర్యాపేట): ఇంటర్ ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రాల బండిల్ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు. గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది. దీంతో బల్క్ సెంటర్ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్‌కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
కోదాడ మహిళకు సూపర్ ఉమెన్ ఇన్ సర్వీస్ అవార్డు
వాషింగ్టన్: కరోనా సమయంలో చేసిన సేవకు గాను కోదాడ మండలానికి చెందిన చింతా నవ్య స్మృతికి అమెరికాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ " ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి ఆధ్వర్యం లో "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని, 500 డాలర్ల రివార్డ్‌ను అందచేశారు. చింతా నవ్య స్మృతి అమెరికాలో ని "మేరీల్యాండ్ "లో ప్రాంతంలో నివసిస్తూ.. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా మెడికల్ హెల్ప్, డాక్టర్స్ సంప్రదింపులు, బ్లడ్ ప్లాస్మా డొనేషన్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ , పీపీఈ కిట్ల డిస్ట్రిబ్యూషన్ పలు గ్రామాలకు అందచేయడం లో కోఆర్డినేట్ చేశారు. అంతేకాకుండా కాన్సర్ హాస్పిటల్స్ లో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలకి తన వంతు సహాయంగా దాతలతో కలిసి కాలేజీలకు ఫీజులను చెల్లించారు. ఫీస్లు కాలేజీ కి కట్టడానికి దాతలతో కలిసి సహాయం చేయగలిగారు. చింతా నవ్య స్మృతి సామాజిక కార్యక్రమంలో తన సేవలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. -
రూ. 6 లక్షలు: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు!
కోదాడ రూరల్: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇంటిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి ఆదివారం తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి హైదరాబాద్‌లోని కొంపెల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే కాంక్రీట్ సిమెంట్ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి. ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్ ఉన్నాయి. దీనికి రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అనంతరాంరెడ్డి తెలిపారు. ఆదివారం ట్రాలీ లారీ సాయంతో దీన్ని గ్రామానికి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో ఏడెనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఏర్పాటు చేసుకున్నాడు. -
అమెరికాలో కోదాడ వాసి రవికుమార్ మృతి
వాషింగ్టన్: అమెరికాలో కోదాడ వాసి సిరిపురపు రవికుమార్(26) మృతి చెందాడు. బోటు షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. కోదాడకు చెందిన శ్రీనివాస్- పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్ మూడేళ్లుగా అమెరికాలోని సిగ్నా ఇన్సూరెన్స్‌లో పని చేస్తున్నాడు. కాగా వీకెండ్ కావడంతో రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ మేరకు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రవికుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
స్వాతంత్ర సమరయోధుడి కన్నుమూత
కోదాడ రూరల్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు (87) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. రామలక్ష్మీపురం సింహయ్యగా పిలిపించుకునే కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు అప్పట్లోనే ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసి కొన్నాళ్లు హిందు పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని గణపరం రామలక్ష్మీపురంలో జన్మించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లి వచ్చారు. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగా సమీప బంధువు. విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు విరేపల్లి లక్ష్మీనారాయణరావు, వేనేపల్లి చందర్రావు, ఉత్తమ్ పద్మావతి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు కొండపల్లి వాసుదేవరావు, కొండపల్లి మురళీధర్‌రావు, విద్యాత్తవేత్తలు మంత్రిపగఢ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తమ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
గాంధీ బయోపిక్: అతిధి పాత్రలో కోదాడ వాసి
సాక్షి, కోదాడ: ‘న్యూయార్క్’ చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇతి వృత్తం.. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్ మెకానిజం, ఇన్సి్టయిన్ రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్ స్పెల్ ఆఫ్ బుక్ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్ అయింది. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా చూసే అవకాశం కల్పించారు. చిత్రంలో కోదాడ వాసులు... ఈ చిత్రంలో గాంధీజీ చిన్ననాటి మిత్రుడిగా కోదాడకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన కొండపల్లి రాధాకృష్ణ కుమారుడు కొండపల్లి అనీష్ నటించాడు. అదేవిధంగా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ లేడీతో కలిసి రైలులో ప్రయాణించిన వ్యక్తిగా అతిథి పాత్రలో కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామచందర్‌రావు నటించారు. కాగా గాంధీ వివిధ వయస్సు పాత్రలను అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారు శ్రీనివాసరావు సనా పతి, రాజేష్రాజ్గోపాల్, తేజ్ కొండేటి, దీపక్ భీమ్రాశెట్టి నటించారు. కాగా కస్తూర్బా గాంధీగా అమెరికాకు చెందిన లారెంజో పల్లాడినో, మమాడివ్ శిశి, సరితా నవాలీ, కామ్యరాయసం నటించారు. కాగా... అమెరికాలో స్థిరపడిన కోదాడ వాసి అయిన భరద్వాజ్ వి .కొమరగిరి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం.. గాంధీజీ జయంతి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన చిత్ర సంస్థ అమెరికాతో పాటు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు రామ్ అల్లాడి తెలిపారు. ఈ చిత్రానికి రామ్ దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణిమా దిగ్వీతో పాటు మరికొందరు అమెరికన్స్ సహకారంతో నిర్మించారు. కాగా దర్శకుడు వరంగల్ వాసి.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన గతంలో వరంగల్‌లోని పలు దేవాలయాలు, ఓరుగల్లు కోట తదితర చారిత్రాత్మక ఇతి వృత్తాలపై డాక్యుమెంటరీలు తీసి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్నారు. -
ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!
కోదాడ : ఆంధ్రాలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’) -
లాక్డౌన్ : అంబులెన్స్ డ్రైవర్ల కొత్త దందా
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజారవాణా మొత్తం బంద్ అయింది. అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలను తప్ప వేటిని రోడ్లపైకి అనుమతించడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణికులను తరలిస్తున్నారు. కోదాడ దగ్గర ఈ దందా బయటపడింది. పెషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు వెయ్యి రూపాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంబులెన్స్ కావడంతో ప్రతి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను తీసి పంపించారు. కానీ కోదాడ వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్లు డబ్బులు తీసుకొని ప్రయాణికులను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పోలీసులు రామపురం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన మూడు అంబులెన్స్‌ను తనిఖీలు చేయగా ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో కొత్త దందా షురూ అయ్యింది. అంబులెన్స్‌లో ప్రయాణికుల తరలింపు ఘటన వెలుగులోకి రావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇకపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. హైవే రోడ్లపై ఇకపై చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
దొంగచాటుగా ప్రయాణికుల తరలింపు
-
బీమా సొమ్ము కోసం సొంత అన్న కొడుకే..
సాక్షి, మునగాల(కోదాడ) : గత నెల 24న జాతీయ రహదారిపై మండలంలోని ఇందిరానగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన మండలంలోని తాడువాయికి చెందిన ముంజల సైదులు (30) కేసు మిస్టరీని మునగాల పోలీసులు ఛేదించారు. మునగాల సీఐ శివశంకర్ గౌడ్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడువాయి గ్రామానికి చెందిన ముంజల సైదులు గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి అన్న ముంజల వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. మృతుడి అన్న కొడుకు రమేష్ ఒంటిరిగా ఉంటే తన బాబాయి సైదులు పేరుమీద కొన్ని రోజులు క్రితం రెండు లారీలు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. దీంతో పాటు రూ.50 లక్షల ఇన్సూ్రెన్స్ కూడా చేయించాడు. కొన్ని రోజుల తర్వాత లారీలు నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో వారు లారీలను తీసుకెళ్లారు. దాంతో తన బాబాయి ప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని పథకం వేశాడు. తన స్నేహితులైన గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబును సంప్రదించి చెరో రూ.ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. గతనెల 24న సైదులును గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి తీసుకొవచ్చి మార్గమధ్యలో మద్యం తాగించారు. అనంతరం జాతీయ రహదారిపై ఇందిరానగర్ శివారులో గల పార్కింగ్ స్థలం (ట్రక్ లే అవుట్) వద్ద బొలోరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అదే రోజు మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. కాగా గతంలో కూడా ఒకసారి సైదులును హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.... ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంటరిగా ఉండే సైదులు పేరు మీద రూ.50 లక్షల బీమా ఎందుకు చేయించారని ఆరా తీశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సంఘటన వెనుక మృతుడి అన్న కొడుకు రమేష్ హస్తం ఉంటుందని అనుమానించి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పాడు. బీమా సొమ్ము కోసమే రమేష్ హత్య చేసినట్లు సీఐ వివరించారు. దీంతో రమేష్‌తో పాటు స్నేహితులు మహేష్, శోభన్‌బాబులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శుక్రవారం కోదాడ కోర్డులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మునగాల ఎస్ఐ కె.సత్యనారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.