Kurnool Crime News
-
దారుణం: ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు
సాక్షి, బనగానపల్లె(కర్నూల్): పెంచిన మమకారాన్ని మరచి, ఆస్తి కోసం తల్లినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణం బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో గురువారం వెలుగు చూసింది. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు..నార్పరెడ్డిగారి పుల్లమ్మ(58)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఈమె భర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పుల్లమ్మ పెంచి, పోషించి..వివాహం చేసింది. వృద్ధాప్యంలో కుమారుడు ప్రసాద్ రెడ్డి వద్ద ఉంటోంది. తల్లి పేరున ఉన్న పొలంలో మూడు ఎకరాలను ఇటీవల ప్రసాద్ రెడ్డి ఎకరా రూ.35 లక్షల చొప్పున విక్రయించాడు. వచ్చిన డబ్బుతో నిత్యం మద్యం తాగేవాడు. ఆస్తంతా తన పేరున రాయాలని తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. ప్రసాద్ రెడ్డి భార్య అపర్ణ కాన్పుకోసం ఇటీవల పుట్టినిల్లు అయిన అవుకు మండలం మెట్టుపల్లెకు వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తలుపు వేసి తల్లి పుల్లమ్మను దారుణంగా కత్తితో పొడిచాడు. తల్లి మృతి చెందడంతో ఇంటికి తలుపు వేసి పరారయ్యాడు. ప్రసాదరెడ్డి కోసం గురువారం బనగానపల్లె నుంచి మిట్టపల్లెకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటి తలుపు తట్టి చూడగా.. పుల్లమ్మ రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగు పొరుగు వారికి తెలియజేయగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేష్ కుమార్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రసాదరెడ్డి తనకు ఏమీ తెలియనట్లు ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆయనను ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. -
అనుమానిస్తున్నాడని భర్తను గొడ్డలితో నరికింది
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): తాళికట్టిన భర్తనే భార్య కడతేర్చింది. గాఢ నిద్ర లో ఉన్న అతడిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హతమార్చింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోర్లగుట్ట గ్రామానికి చెందిన రామదాసు, సుంకులమ్మ కుమారుడు వడ్డె చిన్న ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన నరసింహుడు, లక్ష్మిదేవి కూతురు ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్ ఉన్నారు. పాలీస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వడ్డె ఆంజనేయులు తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కాగా ఈ విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సీఐ కేశవరెడ్డి, ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: మహిళల భద్రత మా బాధ్యత) -
పొలానికి వెళ్లి.. శవమైంది
గోనెగండ్ల: పొలానికి వెళ్లిన ఓ యువతి ఇంటికి చేరకుండానే శవమైంది. కంపచెట్లలో విగతజీవిగా పడి ఉండటం చూసి, సోదరులు, తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఉసేన్‌సాహెబ్, బేగంబీలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. అందులో భాగంగా సోమవారం కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అయితే కాస్త ముందుగా బయలుదేరిన చిన్న కూతురు హజరాబీ(23) ఇంటికి చేరలేదు. కంగారు పడిన సోదరులు దగ్గరి బంధువు ఉదూద్బాషాతో కలిసి పొలానికి వెళ్లి గాలించారు. కాస్త దూరంలో కంప చెట్లలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న కర్నూలు డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్, కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి, గోనెగండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డి మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లి విచారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతురాలి సోదరుడు దూద్‌వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. -
నెల క్రితం వివాహం.. వధువు మృతి
కర్నూలు,ఆదోని రూరల్: మండల పరిధిలోని గణేకల్ గ్రామానికి చెందిన నవ వధువు జయలక్ష్మి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద ఎల్లప్ప కూతురు జయలక్ష్మిని కౌతాళం మండలం మల్లనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మన్నతో నెల క్రితం వివాహం జరిపించారు. జయలక్ష్మి కడుపునొప్పి తాళలేక శనివారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యులు రెఫర్ చేయగా అక్కడ కోలుకోలేక మృతిచెందిందని ఎస్ఐ వివరించారు. -
‘తుంగబద్రంత్త' విషాదం
కర్నూలు, మంత్రాలయం రూరల్: భార్యాభర్త, ముగ్గురు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. విధి చూసి ఓర్వలేకపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కుటుంబ యజమానిని ఒంటరి చేస్తూ.. భార్యను, ముగ్గురు పిల్లలను తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన మంత్రాలయానికి సమీపంలోని తుంగభద్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ఉదయం ఎమ్మిగనూరులోని సోదరి జయమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా మంత్రాలయం శివారులో బైక్ అదుపు తప్పి ఇనుప దిమ్మెను ఢీకొన్న ఘటనలో గురుస్వామి కుమారుడు మహేష్(4) అక్కడికక్కడే మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన భార్య నాగవేణి (26), కుమార్తెలు మౌనిక(7), శైలజ (3) కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక కొన్ని గంటల తేడాతో చనిపోయారు. స్వల్పగాయాలతో బయటపడిన గురుస్వామి ఒంటరిగా మిగిలాడు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న అతను రోదించిన తీరు పలువురిని కలచివేసింది. మృతదేహాలను ఆదివారం కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. బైక్ అదుపుతప్పి వేగంగా నల్లవాగు బ్రిడ్జిపైఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టడమే ఈ ఘోరానికి కారణమని వారు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎస్పీతో పాటు మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు వేణుగోపాల్రాజ్, బాబు తదితరులు ఉన్నారు. -
లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..
పత్తికొండ రూరల్: కుమార్తె పెళ్లికి లగ్నపత్రిక రాయించేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో ఎదురొచ్చి కాటువేసింది. పత్తికొండ మండలం అటికెలగుండు బ్రిడ్జి సమీపంలో సోమవారం ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన వీరేశప్ప (50)తన రెండో కుమార్తెకు దేవనకొండ మండల వాసితో వివాహం నిశ్చయించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో అర్చకుడిని కలిసి లగ్నపత్రిక రాయించాలని బంధువు మహాలింగను వెంటబెట్టుకుని బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో అటికెలగుండు బ్రిడ్జి సమీపంలోని మలుపు వద్ద బోర్‌వెల్స్ లారీ ఎదురొచ్చి బైక్‌ను ఢీకొంది.ఈ ఘటనలో వీరేశప్ప అక్కడికక్కడే మృతిచెందగా మహాలింగకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గుర్రప్ప తెలిపారు. కాగా మృతుడు వీరేశప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. అతని మరణ విషయం తెలియగానే వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. -
మరదలిని చంపిన బావ
నందికొట్కూరు: సొంత తమ్ముడి భార్య, మరదలు అని కూడా చూడకుండా గొడ్డలితో నరికి చంపాడు ఓ వ్యక్తి. మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ జయశేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ(35)తో చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై గొడ్డలితో మెడపై విచక్షణా రహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యపై కత్తితో దాడి: తానూ ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ: భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. పట్టణంలోని ఎస్వీ నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు సీఐ సుబ్రమణ్యం తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.. ఎస్వీ నగర్లో అల్లూరి కిరణ్, సుబ్బమ్మ దంపతులు నివసిస్తున్నారు. సుబ్బమ్మ పుట్టినిల్లు కూడా ఇదే నగర్ కావడంతో రోజూ తల్లిదండ్రుల మాటలు విని.. తనతో గొడవ పడుతుందని భర్త అల్లూరి కిరణ్ క్షణికావేశానికి లోనై భార్యపై కత్తితో దాడి చేశాడు. తానూ కత్తితో ఎడమ చేతికి కోసుకున్నాడు. సుబ్బమ్మ కేకలు వేస్తూ బయటికి రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరినీ ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రేషన్ బియ్యం మాఫియా డాన్ అరెస్ట్
కోవెలకుంట్ల: కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు గాకుండా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మాఫియా డాన్‌ను ఎట్టకేలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ లో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు విలేకరు లకు వెల్లడించారు.బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు అలియాస్ డాన్ శ్రీను రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్‌బియ్యాన్ని పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో కోవెలకుంట్లకు చెందిన స్వామిరెడ్డి, బనగానపల్లెకు చెందిన ఉసేన్‌బాషా లారీలో నుంచి మరో లారీలోకి రేషన్ బియ్యాన్ని మార్పిడి చేస్తుండగా కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 250ప్యాకెట్ల(125 క్వింటాళ్లు) రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి వివరాలు ఆరా తీయగా బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలించేందుకు మార్పిడి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిద్దరితోపాటు శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండలం బెలూంకు చెందిన చిన్న ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోనిందితుడు చిన్న ప్రసాదు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మిగిలిన ముగ్గురిని కోవిడ్ పరీక్షల అనంతరం బనగానపల్లె మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. -
భార్య గర్భిణి అని కూడా చూడకుండా..
కర్నూలు ,ఆళ్లగడ్డ: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలు.. బనగానపల్లె పట్టణానికి చెందిన సుంకన్న, లక్ష్మీదేవి దంపతుల కూతురు సుస్మిత (19). ఈ యువతి చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో తండ్రి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మస్తానమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మారు తల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి సుస్మితను నానా ఇబ్బందులు పెట్టేది. భరించలేక ఆమె పిన్నమ్మ, తాతల దగ్గర ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత మస్తానమ్మ.. భర్తపై ఒత్తిడి చేసి సుస్మితను తన తమ్ముడు ప్రతాప్‌తో పెళ్లి జరిపించింది. చెడు ప్రవర్తన గల మారుతల్లి సుస్మితను కూడా ఆ వైపునకు మలిపేందుకు ప్రయత్నించేది. అందుకు అంగీకరించని ఆ యువతి వారితో కలిసి ఇంట్లో ఉండటం ఇష్టం లేక వేరే కాపురం పెడదామని భర్త ప్రతాప్‌కు వేడుకునేది. దీనిని జీర్ణించుకోలేని మారుతల్లి, అత్తామామలు సుస్మిత గురించి ప్రతాప్‌కు చెడుగా చెప్పేవారు. దీంతో సైకోగా మారిన అతను భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యకు మాయమాటలు చెప్పి తన సొంత ఆటోలో ఎక్కించుకుని నల్లగట్ల –బత్తలూరు మార్గంలోని హైవే వద్దకు తీసుకుపోయాడు. అక్కడ అతి కిరాతకంగా భార్య చేతులు కట్టి నరాలు కోసి పక్కనున్న నీటి కుంటలో పడేసి పారిపోయాడు. ఆదివారం నిందితుడే తమ బంధువులకు పోను చేసి హత్య విషయం చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి మృత దేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెనువెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువులు ఫిర్యాదు మేరకు హతురాలి భర్త ప్రతాప్, బావ భాస్కర్, మారుతల్లి మస్తానమ్మ, అత్తామామలు లక్ష్మీదేవి, వీరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ రమేష్‌కుమార్ తెలిపారు. -
తల్లిని చంపిన కుమారుడి అరెస్ట్
కర్నూలు,ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని లక్ష్మీపేటలో తల్లిని చంపిన కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ పి.రామక్షృష్ణ, ఎన్నికల స్పెషల్ డీఎస్పీ భవ్యకిశోర్‌ల ఆధ్వర్యంలో ముద్దాయిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.రామకృష్ణ మాట్లాడుతూ పట్టణానికి చెందిన బోయ ఉరుకుందమ్మను కుమారుడు బోయ ఆకుల వీరేష్ అత్యంత కిరాతకంగా బండరాయితో మోది హత్య చేశాడన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి మద్యం తాగి వచ్చి, తన కోర్కె తీర్చాలంటూ వీరేష్ ఈ నెల 11న కన్నతల్లితో గొడవ పడ్డాడన్నారు. మందలించిన తండ్రి, సోదరుడిపై దాడికి యత్నించగా అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి తలపై బండ రాయితో మోది హత్య చేశాడన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. సోగనూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ వాసుదేవ్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో టౌన్ సీఐ వి.శ్రీధర్, ఎస్ఐ శ్రీనివాసులు, హెచ్‌సీ సుభాన్, ఖాద్రీ, పీసీలు దశరథరాముడు, సుధాకర్, సమీవుల్లా, రహిమాన్ పాల్గొన్నారు. -
అప్పు ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు
వారిద్దరూ అన్నదమ్ములు. వ్యాపార అవసరాలకు అప్పు కావాలని ఓ వ్యక్తిని సంప్రదించారు. నమ్మకం లేకపోతే పొలం తాకట్టు పెడతామని నమ్మించారు. అంతగా అడుగుతున్నారు కదా అని అతనికి జాలి కలిగింది. పొలం తాకట్టు పెట్టుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత వారి అసలు రూపం బయట పడింది. అప్పు తిరిగి చెల్లించకుండా ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు. నమ్మి రుణం ఇచ్చిన వ్యక్తిపై ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులుమంగళవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆళ్లగడ్డ రూలర్: ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు కుమ్మరి శ్రీనివాసులు ఆచారి హత్య కేసు నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో డీఎస్పీ పోతురాజు వెల్లడించారు. పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన మూరబోయిన చంద్రమౌళి, సోదరుడు మూరబోయిన నాగరాజు తమ వ్యాపారం నిమిత్తం అదే గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాసులు ఆచారి వద్ద పొలం తాకట్టు పెట్టి ఆరు నెలల క్రితం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లలోపు డబ్బు చెల్లిస్తే పొలం వెనక్కి ఇచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. 20 రోజుల క్రితం చంద్రమౌళి మరో రూ.2లక్షలు శ్రీనివాసులు ఆచారి వద్ద అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి అప్పు ఎగ్గొట్టాలనే పన్నాగంతో శ్రీనివాసులు ఆచారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఉయ్యాలవాడకు చెందిన దూదేకుల సుభాన్‌బాషా, అతని తండ్రి దూదేకుల మాబుసుభాని, ఒగరు సుబ్రమణ్యంలతో రూ.2,40,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పు విషయం మాట్లాడదామంటూ ఫోన్.. ఈనెల 1న చంద్రమౌళి, నాగరాజు.. శ్రీనివాసులుఆచారికి ఫోన్ చేశారు. అప్పు విషయం మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావని అడిగారు. తాను ఆళ్లగడ్డకు వెళ్తున్నాని, మళ్లీ మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదే అదునుగా భావించి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్న ముగ్గురిని రప్పించుకుని ఐదుగురు కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అక్కడ శ్రీనివాసులు ఆచారిని కలిశారు. మాట్లాడుకుందామంటూ పాతకందుకూరులోని గోపిరెడ్డి గోడౌన్ సమీపంలోని పంటకాలువ వద్దకు తీసుకెళ్లి పిడబాకులతో పొడిచి హత్య చేశారు. అనంతరం కాలువలో పడేసి వెళ్లారు. కేసును ఛేదించింది ఇలా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే ఉయ్యాలవాడకు చెందిన బడే మస్తాన్ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రమౌళి, నాగరాజు తనకు రూ.20 వేలు ఇచ్చి శ్రీనివాసులు ఆచారిని బెదిరించాలని చెప్పారని, తాను అంగీకరించకపోవడంతో వేరేవారితో కలిసి హత్యకు కుట్ర పన్నారని, ఆ విషయం తనకు తెలియడంతో తనను కూడా హత్య చేసుకు ఇరికిస్తారేమోనని ముందుగానే లొంగిపోతున్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితులపై పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉండగా వలపన్ని అరెస్ట్ చేశారు. కేçసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ సీఐ సుదర్శనప్రసాద్ పాల్గొన్నారు. -
అక్కంపల్లెలో పేలుడు
కర్నూలు, సంజామల: మండలంలోని అక్కంపల్లెలోమంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తికి చెందిన నరేష్‌రెడ్డి అనే కూలీ గాయపడ్డాడు. పాత ఇల్లు తీసేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అక్కంపల్లెకు చెందిన చెంచిరెడ్డి తన పాత ఇంటిని తీసేసి, నూతన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం నలుగురు కూలీలతో పాత ఇంటిని తొలగిస్తుండగా.. గోడకు ఉన్న గూటిలో ఏదో వస్తువు కనిపించింది. దాన్ని కూలీ నరేష్‌రెడ్డి చేత్తో పట్టుకుని పక్కన పడేశాడు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నరేష్‌రెడ్డి చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమి త్తం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, సంజామల ఎస్ఐ ప్రియతంరెడ్డి పే లుడు జరిగిన ఇంటిని పరిశీలించారు. నాటుబాంబు పేలి ఉండొచ్చనే అనుమానంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యకు ఫోన్ చేసి.. ఆత్మహత్య
కర్నూలు ,వెల్దుర్తి: చేనేత కార్మికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్(35) వ్యవసాయం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం కోడుమూరు మండల కేంద్రానికి వలస వెళ్లి కులవృత్తి మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులకు వడ్డీ ఎక్కువై మొత్తం రూ.7లక్షలకు చేరింది. వాటిని తీర్చే మార్గం లేక బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి బంధువులున్న వెల్దుర్తి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి భార్య శ్రీదేవికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆమె బంధువులకు ఫోన్‌చేసి అప్రమత్తం చేసింది. వారు అక్కడికి వెళ్లేలోగా రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే ఎస్ఐ మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహిత ఆత్మ‘హత్య’
కర్నూలు, కృష్ణగిరి: ఆరు రోజుల కిత్రం అదృశ్యమైన మహిళ బుధవారం హంద్రీ కాలువలో శవమై తేలింది. మృతురాలి తలపై గాయం ఉండటంతో భర్తే హత్య చేసి కాలువలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన సుధాకర్‌కు ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(23)కు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఈ నెల 7న సాయంత్రం పొలం వద్దకు నీరు పెట్టేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణమ్మ ఇంటికి రాలేదు. మరుసటి రోజు రామకృష్ణమ్మ అదృశ్యమైనట్లు తల్లి నాగ తిమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు హంద్రీనీవా కాలువ, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా బుధవారం హంద్రీనీవా కాలువలో గుండ్లకొండ పంప్‌హౌస్ వద్ద రామకృష్ణమ్మ శవమై తేలింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ సుధాకర్‌రెడ్డి, కృష్ణగిరి ఎస్ఐ రామాంజనేయరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. డోన్ వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య లక్కసాగరంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులుతెలిపారు. -
కారు గెలుపొందారంటూ టోకరా
కర్నూలు, బొమ్మలసత్రం: కారు గెలుపొందారంటూ ఫోన్‌చేసి రూ. 1.90 లక్షలు దండుకొని గుర్తు తెలియని వ్యక్తి టోకరా వేశాడు. బాధితుడు సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన బాలస్వామి అదే గ్రామంలో ఆర్సీఎం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట కొత్త నంబర్ నుంచి సెల్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ..లాటరీ తగిలిందని, కొత్త కారు మీరు గెలుచుకున్నారని, జీఎస్టీ చెల్లిస్తే కారు మీ ఇంటికి పంపుతామని నమ్మించాడు. నగదు వేసేందుకు అకౌంట్ నంబర్ ఇవ్వటంతో బాలస్వామి..అదులో విడతల వారిగా 1.90 లక్షలు నగదు బదిలీ చేశాడు. నగదు పంపి రెండునెలలు గడిచినా ఇంతవరకూ కారు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాలస్వామి.. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అచ్చం అలాగే..
ఆదోని టౌన్: కర్నూలు మండలం గార్గేయపురంలో జనవరి 4వ తేదీ రాత్రి దొంగలు ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అన్నీ తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి.. రూ.3.55 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. తాజాగా ఆదోని పట్టణంలోనూ అచ్చం అలాగే చోరీలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి.. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు చోట్లా శనివారం రాత్రే చోరీలు జరగడం, అది కూడా వరుస ఇళ్లలో ఒకే తరహాలో చోరీలకు పాల్పడడం యాదృచ్ఛికమా లేక ఒకే ముఠా పనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని పట్టణంలోని పంజ్రాపోల్ వీధిలో శనివారం రాత్రి ఒకే ప్రాంతంలోని ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌లుగా పనిచేస్తున్న మంజునాథ్, సంపత్‌కుమార్, శివకుమార్ పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అదే వరుసలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్న దినసరి కూలీలు వీరేష్, రాఘవేంద్ర కూడా బంధువుల ఊళ్లకు వెళ్లారు. దొంగలు ఈ ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. పెద్దగా ఏమీ దొరకలేదు. చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్లారు. తర్వాత పక్క సందులోని రేష్మా, వినోద్ దంపతుల ఇంట్లో చోరీకి తెగబడ్డారు. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే రేష్మా, వినోద్ శనివారం అనంతపురం జిల్లా గుత్తిలో ప్రార్థనలకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగు చూసింది. తాళం తెగ్గొట్టి, బీరువాను పెకలించి నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్
టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డోన్ : సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్ లాభాల్లో కేఈ ప్రతాప్‌కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్‌లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్‌గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్‌షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలింది గత డిసెంబర్ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్ రెడ్డి, కంబాలపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్ ఖలాల్‌ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది. నిందితులు వీరే 1.వినోద్‌ఖలాల్ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్ గౌడ్ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్ (టీడీపీ)10. రోహిత్ ఖలాల్ (హుబ్లీ) 11.రాకేష్ ఖలాల్ (హుబ్లీ) 12.సునీల్ ఖలాల్ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్ గౌడ్ (టీడీపీ) 25.డీలర్ రాము గౌడ్ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్ (నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్) 27.టీఈ కేశన్న గౌడ్ (మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ) 28.చిట్యాల లోకనాథ్ గౌడ్ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త) 30.కంబాల పాడు కేఈశ్యామ్ (మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్‌గౌడ్ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.) సిండికేట్ ఇష్టారాజ్యం మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్‌శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి. -
తప్పు ఎవరిది..శిక్ష ఎవరికి?
కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త కొద్ది గంటల్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి, మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరచిల్లరగా తిరుగుతుండటంతో భార్య, భర్త మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. పెద్దలు సర్దిచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఐదేళ్లుగా స్వాతి పుట్టినిళ్లు కడివెళ్లలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన నరసింహారెడ్డి రెండ్రోజులు బాగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. లాడ్జీలో ఆత్మహత్య.. బుధవారం సాయత్రం భార్య స్వాతిని అతికిరాతంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి పరారైన నరసింహారెడ్డి ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అద్దెకు తీసుకున్న లాడ్జీ గదికి వెళ్లి పంచెతో ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం లాడ్జీలో నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించిన పక్క గది వారు లాడ్జీ సిబ్బందికి తెలియజేశారు. వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి తలుపు బద్దలకొట్టి చూడగా ఉరికి వేళాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దించి కుటంబ సభ్యులకు తెలియజేశారు. శిక్ష పిల్లలకా? తల్లిదండ్రులు గొడవ పడుతుంటే చిన్నారులు కుమిలిపోయేవారు. ఐదేళ్లుగా అమ్మమ్మ ఊరిలో తల్లితో పాటు ఉంటూ చదువుకునే చిన్నారులకు తండ్రి దూరంగా ఉండేవాడు. అప్పుడప్పుడూ వచ్చే తండ్రిని నాన్నా అని పిలిచేందుకు కూడా భయపడే వారు. ఈ క్రమంలో తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో అనాథలయ్యారు. తప్పు ఎవరిదైనా తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడమనే శిక్ష చిన్నారులకు పడిందని పలువురు కంట తడిపెట్టారు. -
విద్యార్థులే టార్గెట్
కర్నూలు: విద్యార్థులే లక్ష్యంగా కర్నూలు నగరంలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ధూమపానానికి అలవాటు పడిన విద్యార్థులు, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటవ పట్టణ సీఐ దస్తగిరిబాబు నేతృత్వంలో వలపన్ని నలుగురు రవాణా దారులు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేశారు. జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మల్లెపోగు మధు గంజాయిని పొట్లాలుగా కట్టి అదే ప్రాంతంలోని అల్లాబకాష్ దర్గా వెనుక విద్యార్థులకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వెలుగోడు మండలం రాజునగర్ వీధికి చిందిన ఖాదర్‌వలి, పాణ్యం ఏఆర్ కాలనీకి చెందిన మూర్తుజావలి, పగిడ్యాల మండలం వనుములపాడు గ్రామానికి చెందిన కర్నే దామోదర్, బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామానికి చెందిన ఖైరున్‌బీ ముఠాగా ఏర్పడి నల్లమల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి మల్లెపోగు లక్ష్మి, ఆమె తమ్ముడు మధుకు రవాణా చేస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. వీరు కిలో గంజాయి 500 ప్రకారం కొని తులాల ప్రకారం పొట్లాలుగా చుట్టి ఒక్కొక్కటి రూ.20 ప్రకారం విద్యార్థులకు విక్రయాలు జరుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కర్నూలు నగరంలోని ఎల్కూరు విల్లాస్, ప్రధాన పార్కులు, ఇంజినీరింగ్ కాలేజీల వద్ద ఈ వ్యాపారాని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న విద్యార్థులు అందులోని పొగాకు తొలగించి గంజాయి పొడిని నింపుకుని తాగుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రవాణా దారులు కర్నే దామోదర్, ఖాదర్‌వలి, మూర్తుజావలి, ఖైరూన్‌బీలతో పాటు, జొహరాపురానికి చెందిన మల్లెపోగు లక్ష్మి, మల్లెపోగుమ«ధును అరెస్టు చేసిæ వారి వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసురేని కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు సీఐ వెల్లడించారు. -
కుమారుడు పుట్టలేదని ఒకరు.. లాడ్జీలో ఒకరు
కర్నూలు, మిడుతూరు: కుమారుడు పుట్టలేదని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని సుంకేసుల గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గోపీనాథ్ తెలిపిన వివరాల మేరకు.. సుంకేసులకు చెందిన జగదీష్‌కు ఆత్మకూరు మండలం సిద్దపల్లె గ్రామానికి చెందిన సారమ్మతో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుమారుడు పుట్టలేదని సారమ్మ బాధపడుతుండేది. దీనికితోడు ఆమె రుతుక్రమం సమయంలో కడపునొప్పితో ఇబ్బందిపడేది. ఈ రెండు కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి బాల ఏసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్య కర్నూలు(హాస్పిటల్): నగరంలోని లాడ్జీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలకు చెందిన శేఖర్ శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల ఎస్బీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వెంకటేశ్వరమ్మ(34), ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరమ్మ సోమవారం కర్నూలుకు వచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకుంది. మంగళవారం ఆమె గది తెరవకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా ఆమె క్రిమిసంహారక మందు తాగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే చొరబడ్డాడు!
కర్నూలు, నందవరం: ఓ దొంగ పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనం చేసి ఉడాయిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన సోమవారం నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదనుగా తెలంగాణలోని గద్వాలకు చెందిన దొంగ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. రూ.1.30 లక్షల నగదు, 2 తులాల బంగారం దొంగలించాడు. అదే సమయంలో పొలం నుంచి వెంకటేష్ కుమారుడు అశోక్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంట్లో నుంచి దొంగ బయటకు రావడం చూసి అవాక్కయ్యాడు. గ్రామస్తులతో కలిసి వెంబడించి అతన్ని పట్టుకున్నారు. దొంగలించిన నగదు, బంగారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. -
దొంగల హల్చల్
కర్నూలు: కర్నూలు మండలం గార్గేయపురంలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని మరీ చోరీలకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇంటికి తాళం వేసి శబరిమల యాత్రకు వెళ్లాడు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బంగారు గొలుసును తస్కరించారు. సమీపంలోని గాండ్ల వీరయ్య దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. శశిధర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రం తాళాలు పగులగొట్టి.. గదిలోకి ప్రవేశించి సామాన్లన్నీ చిందరవందర చేశారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. మద్దిలేటి అనే గొర్రెల కాపరి ఇంట్లో బంగారు గొలుసు, రూ.30 వేల నగదుఅపహరించారు. భార్య పుట్టింటికి వెళ్లగా.. మద్దిలేటి ఇంటికి తాళం వేసి గొర్రెల మంద దగ్గర కాపలాకు వెళ్లాడు. ఇదే అదనుగా దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టల్ ఉద్యోగి మల్లికార్జున కుటుంబంతో కలిసి గద్వాలలోని కూతురు ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి.. నెక్లెస్, రెండు ఉంగరాలు ఎత్తుకెళ్లారు. కురువ మాధవి ఇంటికి తాళం వేసి తల్లి సామక్క వద్దకు వెళ్లింది. ఉదయం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళం కట్‌చేసి ఉంది. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. జత బంగారు కమ్మలు, దుస్తులు, రూ.25 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే శివ ఇంట్లో బ్రాస్లెట్, ఒక చైన్, రూ.3లక్షల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. మరొకరి ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాలూకా సీఐ ఓబులేసు తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇళ్లన్నీ పరిశీలించారు. అన్నీ తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినందున ప్రొఫెషనల్ దొంగల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. బిహార్ గ్యాంగ్‌గా అనుమానంకర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి వెంకాయపల్లె వరకు బిహార్ ప్రాంతానికి చెందిన కొంతమంది రోడ్లకు ఇరువైపులా స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తూ కొంతకాలంగా స్థానికంగానే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వాళ్లలోని కొంతమంది ఈ చోరీలకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా సేకరించారు. చోరీ జరిగిన ఇళ్లన్నీ ప్రధాన రోడ్డుపక్కనే ఉండడంతో దొంగలు వాహనంలో వచ్చి, తాళాలను కట్టర్లతో కత్తిరించి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దింపి విచారణ చేస్తున్నారు. -
మతిస్థిమితం లేని యువకుడి హల్చల్
కర్నూలు, ఆదోని టౌన్: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఓ యువకుడు శుక్రవారం హల్చల్ చేశాడు. కత్తితో తనను తాను గాయపరుచుకుంటూ, కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. యువకుడి చేతిలో కత్తి చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. కోర్టు పనిమీద అక్కడికి వచ్చిన కొందరు పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. టూ టౌన్ సీఐ అబ్దుల్ గౌస్ తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్ గోరక్‌పూర్ గౌలు బజార్‌కు చెందిన యువకుడు సుభాష్ సోంకార్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రైలులో నుంచి స్థానిక రైల్వే స్టేషన్లో దిగాడు. సమీపంలోని కోర్టు ఆవరణలోకి ప్రవేశించాడు. తన వద్దనున్న కత్తితో చేతులు, గొంతు కోసుకున్నాడు. తనకు బతికేందుకు అర్హత లేదంటూ, తనను గొంతు కోసి చంపాలంటూ స్థానికుల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కోర్టు డ్యూటీపై వచ్చిన పోలీసులు స్థానికుల సాయంతో పట్టుకుని అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది, పోలీసుల సాయంతో యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి వైద్యులు వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు రెఫర్ చేశారు. కాగా జేబులోని ఫోన్‌బుక్ ఆధారంగా గోరక్‌పూర్‌లోని యువకుడి భార్య సుమాంధురి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని సీఐ తెలిపారు. -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
కర్నూలు, డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఉప్పరి రాంబాబు తన ఇంటిలో అండర్‌గ్రౌండ్‌లో బంకర్ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి, ఇతర ప్రదేశాలకు తరలిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు గత నెల 29న సోదాలు చేసి నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంబాబుకు తెలంగాణ రాష్ట్రంలోని అమరవాయికి చెందిన శ్రీనివాసగౌడ్, ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీనివాసరావులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటక నుంచి ముడిసరుకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి స్పిరిట్, క్యారామిల్, మూతలు తదితర ముడి సరుకు తెప్పించి నకిలీ మద్యాన్ని రాంబాబు తయారు చేసేవాడు. వీటి కొనుగోలుకు ఉడుములపాడుకు చెందిన ఈడిగ నాగభూషణం, డోన్ పట్టణానికి చెందిన ఫజల్, ఈడిగ రవి ఆర్థికంగా డబ్బు సమకూర్చేవారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని బనగానపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి, శివ, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మురళీధర్‌గౌడ్, కొత్తపల్లెకు చెందిన రాజశేఖర్ తదితరులతో పాటు మరికొంత మంది ద్వారా విక్రయించేవాడు. రూ.8 లక్షల విలువ చేసే ముడిసరుకు స్వాధీనం నిందితుడి నుంచి పోర్డ్ ఐకాన్ ఏపీ 21ఏఈ 3007 నంబరు కారు, 720 క్వాటర్ బాటిళ్లతో పాటు రాంబాబు ఇంటిలోని బంకర్లో 17 బస్తాల్లో ఉన్న నకిలీ మద్యం బాటిళ్లు, 245 లీటర్ల స్పిరిట్, 4 వేల మ్యాక్‌డోల్ బ్రాంది, 2 వేల ఇంపీరియల్ బ్లూ మద్యం బ్రాండ్ ఖాళీ మూతలు, 10 వేల గోలా క్యాప్స్, క్యారమిల్, ఏస్సేన్, మద్యం మీటర్, 19 ఖాళీ క్యాన్లు, 2 డ్రమ్ములు, 800 ఖాళీ క్వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాంబాబుతో పాటు ఉడుములపాడుకు చెందిన నాగభూషణం, రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ముడి సరుకు రవాణా అసలు సూత్రధారుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీసీ చెప్పారు. సమావేశంలో నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ క్రిష్ణకిషోర్‌రెడ్డి, కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శివశంకర్‌రెడ్డి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐలు శ్రీధర్‌రావు, రమణారెడ్డి, సిబ్బంది లక్ష్మినారాయణ, సుధాకర్‌రెడ్డి, లాలప్ప, శంకర్‌నాయక్, ధనుంజయ ఉన్నారు. -
టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ
కర్నూలు డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు. అండర్‌గ్రౌండ్ కేంద్రంగా.. ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్ గ్రౌండ్లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్‌డోల్ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్ పౌడర్, కెమికల్ ఫ్లేవర్ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. అన్నీ బ్రాండ్లు ఇక్కడే ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్ కలార్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడించలేం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సీఐ శిరీషాదేవి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐ రమణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్ నాయక్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు.